Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని యుద్ధాలకి ఆ తక్షణ సందర్భాన్ని మించిన ప్రాధాన్యత ఉంటుంది. ఆ సంగతి ఆ పోరాటంలో పాల్గొన్నవారికి పూర్తిగా అవగతం కాకపోవచ్చు. అటువంటిదే ప్లాసీ యుద్ధం. నిజానికి దానిని ఒక యుద్ధం అని కూడా అనలేం. అందులో ఒకవైపు సైన్యాలకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని అవతలి పక్షం లంచం ఇచ్చి తనపైకి సైన్యాన్ని నడిపించకుండా చూడమని లోబరుచుకుంది. అయినప్పటికీ ఆ ప్లాసీ అడవుల్లో జరిగిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఒక నూతన శకానికి తెరతీశాయి.
రైతు ఉద్యమానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధం కూడా అదే కోవకు చెందుతుంది. పోరాడుతున్న రైతాంగం ప్రదర్శించిన అసాధారణమైన పట్టుదల ముందు నిలవలేక మోడీ ప్రభుత్వం దిగి వచ్చిందన్నది అందరికీ కనిపించే విషయమే. కాని ఇంకోవిధంగా చూసినప్పుడు అది నయా ఉదారవాదానికి తగిలిన ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. చిన్నరైతు వ్యవసాయాన్ని లొంగదీసుకుని కార్పొరేట్ శక్తులు వ్యవసాయం మీద ఆధిపత్యం సాధించాలనుకున్న నయా ఉదారవాద ఎజండా ఆ మూడు వ్యవసాయ చట్టాల ద్వారా సాధించాలని పాలకులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది.
పైన ప్రస్తావించిన రెండు దృక్కోణాలూ సరైనవే. అయితే ఈ రెండింటికీ మించి మూడో కోణం కూడా ఉంది. ఆ వైపు నుండి చూస్తే రైతు ఉద్యమ విజయానికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇది ప్రజల దృష్టిని అంతగా ఆకట్టుకోవడం లేదు. మౌలికంగానే ఈ రైతు విజయం సామ్రాజ్యవాదానికి ఎదురుదెబ్బ. అందువల్లనే పశ్చిమ దేశాల మీడియా మోడీ దిగివచ్చినందుకు తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే ఆ విమర్శలకు అంతగా మనం ఆశ్చర్యపడనవసరం లేదు.
సామ్రాజ్యవాదం ఈ భూగోళంమీద ఉత్పత్తి అయే ఆహారాన్నంతటినీ, ముడిసరుకులనన్నింటినీ, సహజ వనరులనన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అందుకే బొగ్గు, ముడి చమురు తదితర శిలాజ ఇంధన వనరులను అదుపు చేయడానికి చూస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో మొత్తం భూ వినియోగపు తీరును కూడా అదుపు చేయాలనుకుంటుంది. సమశీతోష్ణ, ఉష్ణ భూమండలాలు ఎక్కువగా ఈ మూడో ప్రపంచ దేశాల్లోనే ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో అన్ని రకాల పంటలూ పండినట్టు ఈ సంపన్న పశ్చిమ దేశాల్లో పండవు.
వలసవాదం ప్రపంచవ్యాప్తంగా భూ వినియోగాన్ని సంపన్నదేశాలకు లాభసాటిగా ఉండేలా అదుపు చేయడానికి దోహదం చేసింది. ఇండియాలో వలసవాదం ఈ పనిని మరీ అడ్డగోలుగా చేసింది. వలసపాలకులు విధించిన భూ శిస్తులను నిర్ణీత గడువులోపుగా రైతులు చెల్లించాల్పివచ్చేది. లేకపోతే ఆ రైతుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది. అందుచేత రైతులు వ్యాపారులదగ్గర అప్పులు చేసి శిస్తు చెల్లించేవారు. అలా అప్పు ఇచ్చిన వ్యాపారి ఏ పంట పండించాలని కోరితే రైతు ఆ పంటనే పండించాల్సివచ్చేది. అదికూడా ముందస్తుగా అంగీకరించిన రేటుకే అమ్మవలసివచ్చేది. ఆ వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా సంపన్న దేశాలలో ఏ యే పంటలకు బాగా గిరాకీ ఉంటుందో ఆ పంటలనే పండించాలని రైతులకు ఆదేశించేవారు. ఇక నల్లమందు విషయంలోనైతే నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీయే, రైతులకు అడ్వాన్సులిచ్చి ఆ పంటను పండించమని చెప్పేది.
ఆ విధంగా నీలిమందు, నల్లమందు, పత్తి వంటి పంటలను పండించేలా భూవినియోగాన్ని సంపన్నదేశాలు నియంత్రించేవి. అంతకుముందెన్నడూ పండించి ఎరుగని ఆ పంటలను పండించడం కోసం రైతులు ఆహార పంటలకు బదులు ఆ పంటలను సాగుచేయాల్సివచ్చేది. ఆ పంటలను వలస ప్రభుత్వం రైతులనుండి కొనడానికి కావలసిన ధనం రైతులిచ్చిన శిస్తులనుండే పోగుబడేది. అంటే రైతులు ఒకవిధంగా ఆ వ్యవసాయ ఉత్పత్తులను సంపన్నదేశాలకు ఉచితంగా ఇచ్చినట్టే. ఇలా సామ్రాజ్యవాద దేశాలు తమ వలసలనుండి చేజిక్కించుకున్న వ్యవసాయ సరుకులలో తమ తమ స్వంత అవసరాలకు పోను మిగిలినవాటిని ఆ యా దేశాలతో ఉన్న వ్యాపార లోటును పూడ్చుకోడానికి ఉపయోగించేవారు. ఇండియాలో బలవంతంగా పండించిన నల్లమందు చైనాకు ఎగుమతి చేసి ఆ దేశంతో బ్రిటన్కు ఉండే వ్యాపారలోటును భర్తీ చేసుకునేవారు. ఆనాటి నీలిమందు రైతులను ఎంత నిర్దాక్షిణ్యంగా దోచుకునేవారో మనకు అద్దంపడుతుంది నీల్దర్పణ్ అనే బెంగాలీ నాటకం. 19వ శతాబ్దంలో దీనబంధు మిత్రా రాసిన ఆ నాటక ప్రదర్శనను తిలకిస్తున్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కోపం పట్టలేక, తన చెప్పుల్ని ఆ నాటకంలో వ్యాపారి వేషం పోషించిన నటుడిపై విసిరివేశారట!
ఆ విధంగా ఖచ్చితంగా భూమిశిస్తు రైతులనుండి వసూలు చేయడం, ఆ శిస్తును చెల్లించడం కోసం రైతులు వ్యాపారులవద్దకు అప్పులకోసం పోయేటట్టు చూడడం, తమకు కావలసిన పంటలను పండించేలా వ్యాపారుల ద్వారా రైతులపై వత్తిడి తేవడం, రైతులిచ్చిన శిస్తు సొమ్ము నుండే ఆ పంటలను కొనివేయడం అనే విధానం ఇప్పుడు సంపన్నదేశాల దగ్గర లేదు. పైగా వలసవాదం అంతరించాక ఏర్పడిన ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు వ్యవసాయంలో ప్రభుత్వజోక్యాన్ని చిన్నరైతులకు అనుకూలంగా పెంచాయి. దాని వలన సంపన్న దేశాల అవసరాలతో నిమిత్తం లేకుండా ఇక్కడ వ్యవసాయం సాగుతోంది.
ఇప్పుడు ఆ సంపన్న దేశాలకు ఆహారధాన్యాలు అవసరం లేదు. తమకు కావలసిన వేరే ఇతర పంటలను ఇక్కడి రైతులు పండించేలా చేయడం ఆ దేశాలకు సాధ్యం కావడంలేదు. ఇక్కడ ప్రభుత్వం ముందే ప్రకటించిన ధరలకు రైతులు పండించిన ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తోంది. ఈ దేశపు శ్రామిక ప్రజల ఆదాయాలను కుదించివేసి, తద్వారా వారు ఆహారధాన్యాలను కొనుగోలు చేయగల శక్తిని దెబ్బ తీసేలా నయా ఉదారవాద విధానం పొదుపు చర్యల పేరుతో ప్రయత్నించింది. దానివలన శ్రామిక ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి. అయితే ఆహారధాన్యాల నిల్వలు పేరుకుపోయాయి తప్ప రైతులు వేరే పంటలకు మరలడం లేదు. అందుచేత ఆహార ధాన్యాలకు మద్దత్తు నిచ్చే వ్యవస్థను మొత్తంగా మారిస్తేనే తప్ప సంపన్న దేశాలు కోరుకునే విధంగా ఇక్కడి భూవినియోగంలోమార్పు రాదు.
మితిమీరిన దేశభక్తిని ప్రదర్శిస్తూనే మోడీ ప్రభుత్వం ఆ సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలను నెరవేర్చడానికిపూనుకుంది. అందుకే ఆ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడానికే ఆ చట్టాలు తోడ్పడతాయి. అప్పుడే సంపన్న దేశాలు కోరుకునే విధంగా ఇక్కడి భూ వినియోగాన్ని మార్చడం కుదురుతుంది. కార్పొరేట్ల గుప్పెట్లో చిక్కాక రైతులు ఆ కార్పొరేట్ల డిమాండ్ల మేరకు మాత్రమే పంటలను పండించాల్సి ఉంటుంది. అందుకే సామ్రాజ్యవాద శక్తులు ఈ చట్టాలకు అనుకూలంగా చేయగలిగిన ప్రయత్నాలన్నింటినీ చేశాయి. తమకు అనుకూలంగా వ్యవహరించే మేథావులను, తమకు బాకాలుగా ఉంటున్న మీడియాను రంగంలోకి దింపాయి. పంటలకు ప్రభుత్వ మద్దతు ఉండే వ్యవస్థ లేకుండావుంటేనే రైతులకు ప్రయోజనకరమని తెగ ప్రచారం చేశాయి. కాని ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.
రైతులు దృఢంగా నిలిచి ఆ మూడు నల్ల చట్టాలనూ వ్యతిరేకించడంతో మోడీ ప్రభుత్వం లొంగక తప్పలేదు. ఐతే కేవలం ఆ మూడు చట్టాలనూ వెనక్కి తీసుకున్నంతమాత్రాన సమస్య పరిష్కారం కాబోదు. తమ పంటలకు కనీస మద్దత్తు ధరను గ్యారంటీ చేసే చట్టపరమైన ఏర్పాటు జరిగి తీరాల్సిందేనని రైతులు అందుకే పట్టుబడుతున్నారు. ఈ చట్టాలు రద్దు కావడానికే పరిమితం అయితే ప్రభుత్వం ముందే నిర్దేశించిన కొన్ని మార్కెట్ యార్డుల్లో ఆహారధాన్యాల కొనుగోలును ప్రభుత్వ ప్రతినిధులు పర్యవేక్షించడం మాత్రమే జరుగుతుంది. రైతులు పండించిన పంటకు పెట్టిన పెట్టుబడితోబాటు కొంత కనీస లాభం ఆ రైతులకు దక్కేలా గ్యారంటీ చేయాలంటే కనీస మద్దత్తు ధర వ్యవస్థ చట్టబద్ధం కావలసిందే.
కేవలం కొన్ని మార్కెట్ యార్డులలో మాత్రమే పరిమితంగా కొనుగోలు చేయడం బదులు ఇతర కేంద్రాలలోనూ అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాం కదా, కనీస మద్దతు ధర కూడా ప్రకటిస్తున్నాం కదా అని ప్రభుత్వం అంటోంది. (అప్పుడిక ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండదు) ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించినా, ఆ ధరకే కొనుగోళ్ళు జరిగితీరాలని నిర్దేశించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న పద్ధతిలోనే, ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఎంపిక చేసిన కేంద్రాలలో మాత్రమే కొనుగోళ్ళు జరగాలన్నా (మూడు నల్ల చట్టాలూ రద్దయ్యాక) అందరికీ కనీస మద్దతు ధర లభించదు. అందుచేత కనీసమద్దతు ధరను అందరికీ దక్కేట్టు గ్యారంటీ చేసే ఒక చట్టపరమైన వ్యవస్థ ఉనికిలోకి రావాలి. అందుకే రైతులు కనీసమద్దత్తుధరపై చట్టాన్ని తేవాలని పట్టుబడుతున్నారు. అటువంటి చట్టమే వస్తే ఆతర్వాత ప్రభుత్వం తనకు తోచినప్పుడల్లా కొనుగోలు బాధ్యతనుండి తప్పుకోలేదు.
ఇది వెంటనే ఆచరణరూపం దాల్చాలి. ఈ బీజేపీ ప్రభుత్వపు మోసకారితనం బాగా తెలిసినదే. ఇప్పుడు ఈ నల్ల చట్టాల విషయంలో వెనక్కి పోయినా మళ్ళీ మరొక రూపంలో వాటిని ముందుకు తెచ్చి అమలుకు పూనుకోవచ్చు.
అటువంటి కుట్రపూరితమైన వ్యవహారాన్ని సాగనివ్వనంతకాలమూ రైతులు కీలకమైన యుద్ధంలో గెలిచినట్టే. మన ఉష్ణ మండలాల్లో భూవినియోగాన్ని సామ్రాజ్యవాదులు అదుపు చేయకుండా నిరోధించడమే ఆ యుద్ధం లక్ష్యం. ఈ విజయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి.
ప్రజలు సంఘటితమై ఉద్యమించకుండా నిరోధించడానికి నయా ఉదారవాదం ఆ ప్రజల్ని చిన్న చిన్న ముక్కలుగా, ఒకరితో మరొకరికి సంబంధం లేని రీతిలో చీలగొడుతుంది. మీడియాను, మేథావులను వాడుకుని ప్రజా ఉద్యమాలకు మద్దతు రాకుండా జాగ్రత్త పడుతుంది. ప్రస్తుత శకంలో ప్రజలు నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఆ వ్యతిరేకత దీర్ఘకాలం సాగే సమ్మెలు, ఘెరావ్లు వంటి ప్రత్యక్ష కార్యాచరణ రూపంలో కాక ప్రత్యామ్నాయ రాజకీయ కూటములను ఏర్పాటు చేసి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఎక్కువగా సాగింది. లాటిన్ అమెరికాలో ఈ విధంగానే జరిగింది. ఆ క్రమంలో నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చాలా ఎక్కువ చిక్కుల్ని ఎదుర్కొన్నాయి. విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, సామ్రాజ్యవాద దేశాల ఆంక్షలు వంటివి వాటిలో కొన్ని. కొన్ని ప్రభుత్వాలు ఆ వత్తిళ్ళకు తట్టుకోలేక నయా ఉదారవాదానికి లొంగిపోయాయి కూడా. ఈ సందర్భంలో ఇండియాలో సాగుతున్న రైతు ఉద్యమం ఒక విలక్షణమైన ప్రత్యేకతను కనపరిచింది. బీజేపీని రానున్న ఎన్నికలో ఓడించేందుకు పని చేస్తామన్న రాజకీయ హెచ్చరికను చేస్తూనే, మరోవైపు ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టింది. నయా ఉదారవాద శకంలో ఇది చాలా అరుదైన ధోరణి.
ఇక రెండో ప్రత్యేకత: రైతుల ప్రత్యక్ష కార్యాచరణ సుదీర్ఘకాలంపాటు సాగడం. సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో వారు శిబిరాలను నిర్వహించారు. ఇంతటి అద్భుతమైన ఘనకార్యాన్ని వారేవిధంగా సాధించగలిగారో భవిష్యత్తులో పరిశోధకులు ఎటూ మనకు తెలియజెప్తారు. కాని ఇప్పుడు వారి ఘనకార్యం సాధించిన విజయానికి మనం పండగ చేసుకోవాల్సిందే.
ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)