Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటన్‌లోని స్కాట్లండ్‌లో ఉన్న గ్లాస్గో నగరం ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలోనే రెండవ అతి ప్రధాన నగరం. క్లైడ్ నదిని ఆనుకుని ఉన్న గ్లాస్గో రేవు బెంగాల్ నుండి జనపనారను తీసుకొచ్చే నావలతో, అమెరికా ఖండం నుండి బానిసల వ్యాపారం ద్వారా సంపాదించిన ధనాన్ని తీసుకొచ్చే నావలతో సందడిగా ఉండేది. ఆ నగరంలోని పాత భవనాలు ఆ సంపదకి సాక్ష్యాలుగా నేటికీ ఉన్నాయి. ఇంకోపక్క 1919లో అక్కడ జరిగిన కార్మికవర్గ తిరుగుబాటు (అప్పుడు పారిన కార్మికుల రక్తంతో క్లైడ్ నది ఎర్రగా మారిందని ఆ తిరుగుబాటును రెడ్ క్లైడ్ అని అంటారు)కు గుర్తుగా జార్జి క్రాస్ వద్ద కార్మికుల సమాధుల రాళ్ళు, వాటితోబాటు భారతీయ జ్యూట్ వర్కర్ల, అమెరికన్ చెరుకు తోటల కార్మికుల జ్ఞాపక చిహ్నాలు కూడా నేటికీ కనిపిస్తాయి. ఆ పాత రేవు ప్రాంతాన్ని మూసివేసి ఆ నేల మీద స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మించారు. అది గాజుతోను, ఉక్కుతోను నిర్మించిన బ్రహ్మాండమైన కోటలా ఉంటుంది. అక్కడే ఇటీవల కాప్-26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం 1994లో ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (యు.ఎన్.ఎఫ్. సి.సి.సి) ఈ సదస్సును నిర్వహించింది.
తరతనాయకులందరూ గ్లాస్గో నగరానికి వచ్చే ముందుగానే ఎప్పుడో కాప్-26 ఎజెండా నిర్థారణ జరిగిపోయింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సు ప్రారంభంలో ప్రసంగిస్తూ ''హెచ్చరికలు గట్టిగా వినబడుతున్నాయి. మన గ్రహం మనతో మాట్లాడుతూ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. అదేమాదిరిగా అన్ని చోట్లా ప్రజలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు'' అన్నారు. అయితే అక్కడికి చేరిన ప్రభుత్వాల నేతలు, వారికి సలహాలిచ్చే బృందాలు, కార్పొరేట్ల ఉన్నతాధికారులు, వారి తరఫున లాబీ చేసేవాళ్ళు పర్యావరణ రక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు పైకి మాట్లాడుతూనే, లోపల మాత్రం యథాతథ స్థితినే కొనసాగిస్తూ, ప్రపంచంలో కాలుష్యానికి ప్రధానంగా కారణభూతమైన సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకున్నారు (చమురు, సహజ వాయువుల వ్యాపారం చేసే సంస్థలు, సంపన్న దేశాల మిలిటరీ). ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న దీవుల్లో నివసిస్తూ ఇప్పుడు అదృశ్యమైపోతున్న మానవ జాతుల గురించి వారికేమీ పట్టలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత ఆధునీకరించి, ప్రజా ధనాన్ని మరింతగా దిగమింగడమెలా అన్నదే వారికి ప్రధానంగా ఉంది. కాని పర్యావరణ పరిరక్షణ కోసం పేద దేశాలకు అందిచవలసిన తోడ్పాటు నిమిత్తం ఏర్పాటు చేసిన గ్రీన్ క్లైమేట్ ఫండ్‌కు కేటాయించడానికి మాత్రం వారివద్ద ధనం లేదు. ఇంకోపక్క కాలుష్యం పెరిగిపోడానికి ప్రధానంగా కారకులుగా ఉండి, కాలం చెల్లిన సాంకేతికతతో వెనకబడిన ఇంధన కంపెనీలను (ఈ కంపెనీలు చైనా వంటి దేశాల నూతన టెక్నాలజీ కంపెనీలతో పోటీ పడలేక చతికిలబడు తున్నాయి) తిరిగి పుంజుకోడానికి పెట్టుబడులు పెట్టే ఒప్పందాలు జరిగిపోయాయి.
''అన్ని చోట్లా ప్రజలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు'' అని గుటెరస్ అన్నప్పటికీ, ఆ ప్రజలు చెపుతున్నది ఏమిటో కాప్-26లో వినపడనేలేదు. ఆ ప్రజలు చెప్పేది వినాలంటే ''హరిత ప్రదేశం'' అనే స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ బైటకు వచ్చి క్లైడ్ నదీ తీరానికి, సెయింట్ జార్జి క్రాస్‌కి మధ్య జరిగిన ''ప్రజా సదస్సు'' వద్దకు రావాలి. ఆ సదస్సును పర్యావరణ రక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రచార బృందాలు నిర్వహించాయి. ఒక డే కేర్ సెంటర్లో, ఒక సాంస్కృతిక కేంద్రంలో, ఒక ట్రేడ్ యూనియన్ కేంద్రంలో, ఒక ఆర్ట్ మ్యూజియంలో చాలా రోజులపాటు వారు వివరంగా చర్చలు, సదస్సులు పర్యావరణానికి సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహించారు. ఏ ఒక్క ప్రభుత్వ నేతా వాటికి హాజరయ్యే ప్రయత్నం చేయలేదు. కనీసం ఐరాస ప్రతినిధులు కూడా హాజరు కాలేదు. గతంలో 2001లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ప్రపంచ సదస్సు సందర్భంగా అధికారిక సదస్సులో పాల్గొనడంతోబాటు ప్రజా సదస్సులో సైతం పాల్గొన్నది ఫైడెల్ కాస్ట్రో ఒక్కరే. ఇక్కడ గ్లాస్గోలో జరిగిన రెండు సదస్సుల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించింది. అధికారిక సదస్సులో ప్రధానంగా కార్పొరేట్ ఎజెండా మీద చర్చ జరిగింది. అదే ప్రజా సదస్సు ప్రపంచ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించింది. కాని ఆ సదస్సు అభిప్రాయాల ప్రభావం విధాన రూపకర్తల మీద చూపిన ప్రభావం నామమాత్రం.
బొగ్గు పైనే దృష్టి
అధికారిక కాప్ సదస్సు తక్కిన కాలుష్య కారక విషవాయువుల సవాలును పక్కనపెట్టి కేవలం బొగ్గు పైనే కేంద్రీకరించింది. చర్చలు విఫలం అవడానికి చైనా, ఇండియాలే ప్రధాన బాధ్యులు అంటూ నింద మోపడానికి పశ్చిమదేశాలు మొదటిరోజు నుండే ప్రయత్నించాయి. ఈ పశ్చిమ దేశాలు ఎక్కువగా చమురును, సహజవాయువును ఇంధన ఉత్పత్తికి వినియోగిస్తాయి. ఆ చమురు, సహజ వాయువు కూడా కర్బన ఉద్గారాలను ఎక్కువగానే విడుదల చేస్తాయి. కాని కేవలం బొగ్గు మీదనే చర్చను నడపడం అంటే ప్రపంచం ముందు ఆసియా దేశాలే పర్యావరణ సమస్య విషయంలో ప్రధాన నేరస్తులు అని చిత్రీకరించడం మాత్రమే. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలను ''మూసివేయాలి'' అన్న తీర్మాన పాఠం ప్రతిపాదనపై చర్చలో ఆఖరి నిమిషంలో భారత ప్రతినిధి భూపేంద్ర యాదవ్ (కేంద్ర పర్యావరణ మంత్రి) జోక్యం చేసుకుని దానిని ''క్రమంగా తగ్గించాలి'' అని మార్చారు. అయితే నిజానికి దీనికి మొదట చొరవ చేసినది చైనా. అమెరికాతో కలిసి చైనా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ''క్రమంగా తగ్గించాలి'' అన్న ప్రతిపాదన చేశారు. నేడు బొగ్గు ఆధారిత విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేస్తున్న మూడు దేశాలు అమెరికా, చైనా, ఇండియా. ''బొగ్గు నిల్వలు అంతరించిపోయేలోపు బొగ్గు వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవాలి'' అని అమెరికా ప్రతినిధి జాన్ కెర్రీ ప్రకటించారు. మొత్తం మీద ఈ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వచ్చింది. అయితే ''మూసివేయాలి'' అన్న తొలి తీర్మాన పాఠాన్ని ఆమోదం కానియ్యకుండా అడ్డుపడింది మాత్రం చైనా, ఇండియాలే అన్న ప్రచారం మాత్రం జరిగిపోయింది.
కాప్-26 లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వ్యూహం ఏమిటి? బొగ్గు వినియోగం మీదనే కేంద్రీకరించి ఇతర భూగర్భ వనరుల వినియోగం (చమురు, సహజవాయువు) గురించి చర్చ జరగకుండా చూడడమే. ప్రపంచంలో కర్బన కాలుష్యానికి ప్రధాన కారక దేశాలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా. తలసరి కర్బన ఉద్గారాల విడుదల ఈ దేశాల్లో ప్రపంచ సగటు కన్నా 300శాతం ఎక్కువ! అమెరికాలోనైతే అది 333శాతం ఎక్కువ. అదే చైనాలో కేవలం 52శాతం మాత్రమే ఎక్కువ. ఇండియాలో 60శాతం ఎక్కువ. మొత్తం కర్బన ఉద్గారాలలో అమెరికా విడుదల చేసే దానిలో చైనా కేవలం 46శాతం మాత్రమే విడుదల చేస్తోంది. ఇండియా 12శాతమే విడుదల చేస్తోంది. ఈ వాస్తవాలేమీ కాప్-26లో చర్చకు రాలేదు. చర్చల వైఫల్యానికి మాత్రం చైనా, ఇండియాలను కారకుల్ని చేశారు.
''చైనా విద్యుత్తు ఇంధన ఉత్పత్తిలో పరివర్తనకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. అదే సమయంలో అందరికీ ఇంకా విద్యుత్తు అందడం లేదని, చాలామందికి ఇంకా చాలినంత విద్యుత్తు అందించలేకపోతున్నామన్న వాస్తవాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. వెంటనే మనం గనుక బొగ్గు వినియోగం నిలిపి వేస్తే గనుక, కోట్లాది జనం విద్యుత్తు లేక అల్లల్లాడిపోతారు'' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. దక్షిణార్థ భూగోళంలో నేటికీ 100 కోట్ల మంది ప్రజలకు విద్యుత్తు అందడం లేదు. ఉత్తరార్థ భూగోళంలో ఆ పరిస్థితి లేదు. అందుకే ''సంపన్న దేశాలు బొగ్గు వినియోగం నిలిపివేయడంలో ముందు అడుగులు వేయాలని, పేద దేశాలలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని సంపన్న దేశాలు ఉదారంగా అందించాలని'' జావో ప్రతిపాదించారు. 10,000 కోట్ల డాలర్లతో గ్రీన్ క్లైమేట్ నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. కాని వాస్తవంగా ఆ దేశాలు ఇచ్చింది నామ మాత్రమే. ఈ నిధికి సంబంధించి కాప్-26లో ఎటువంటి ఒప్పందమూ కుదరనేలేదు.
ప్రమాదపుటంచున..
''మన భూగోళం చాలా బలహీనంగా, ప్రమాదపుటంచుల్లో నేడు ఉన్నది. ఇప్పటికీ మనం పర్యావరణ వినాశనం ముంగిటనే నిలుచుని వున్నాం. ఇప్పుడిక అత్యవసర చర్యలను తీసుకోవలసిందే'' అని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ కాప్-26 సదస్సు ముగింపులో ప్రకటించారు.
''దురాశపై యుద్ధం'' అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అసద్ రహమాన్ ప్రజా సదస్సు నిర్వాహకుల్లో ఒకరు. కాప్-26 సదస్సు అధ్యక్ష వర్గాన్ని ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడారు... ''సంపన్నులు వారి వంతు చేయవలసినది చేయడానికి నిరాకరించారు. పర్యావరణ రక్షణ నిధి గురించి అన్నీ ఒట్టి మాటలే చెప్పారు. కోవిడ్ వలన అతి ఎక్కువగా బాధలు పడిన పేదలవైపు మీరు ముఖం తిప్పి చూడనేలేదు. అత్యంత సంపన్నుల చర్యల ఫలితంగా ఆ పేదలు ఆర్థిక, పర్యావరణ వివక్షతను అనుభవిస్తున్నారు. సంపన్నులు వారి సంతానం గురించి, ఇంకా వారి మనవల గురించి మాత్రమే పట్టించుకుంటూ దక్షిణార్థ భూగోళంలో పిల్లలు చస్తూంటే పట్టించుకోక పోవడం అనైతికం''.
- విజయ ప్రసాద్