Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, ప్రజల ప్రయోజనాల కోసం ఎంతైనా ఖర్చు చేయడం తమ ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడ్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉంటున్నాయని, అనేక బహుమతులు అందుకుంటున్నట్లు కూడా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలో లక్ష కోట్లతో బడ్జెట్ పెడితే 2021-22 సంవత్సరానికి తమ బడ్జెట్ 2 లక్షల 30వేలపైబడి పెట్టామని చెప్పారు. అంతటితో ఆగని ముఖ్యమంత్రి రాబోయే నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 5లక్షల కోట్లకు చేరుతుందని ప్రకటించారు. (ఇది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడమే అనుకోండి).
ఇంతటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఎందుకు మూసివేస్తున్నారు? హైదరాబాద్ నగరంలో ఇంతకుముందే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1000బస్‌లు తగ్గించి, ఇప్పుడు మరో 800బస్‌లు వరకు తగ్గించేందుకు ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంఖ్య తగ్గుతోందా? 2019లో జరిగిన సమ్మె ముగిసిన అనంతరం ప్రభుత్వం జరిపిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో తానే ఆర్టీసీకి అంబాసిడర్‌గా ఉండి అభివృద్ధిలోకి తీసుకొచ్చి, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పిన మాటలకు అర్థం ఇదేనా? మన పొరుగు రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో 6500 బస్‌లు నడుస్తూ 2025 నాటికి 12,500 బస్‌లకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే తెలంగాణ ప్రజలకు, అందునా హైదరాబాద్ నగర ప్రజలకు ఆర్టీసీ బస్‌లు అందుబాటులో లేకుండా చేయడం రాష్ట్ర పురోగమనమా? తిరోగమనమా? ప్రభుత్వ పెద్దలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ? : ప్రభుత్వం ఇస్తున్న అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 12,765 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ హోదా పొందలేని గ్రామాలతో కలిపి 20,765 వరకు ఉంటాయి. 2014లో 3,50,03,674 (3.50 కోట్లు) జనాభా వుంది. యుఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ ప్రకారం నేడు 4 కోట్లకు చేరింది. సుమారు 90లక్షల కుటుంబాలు ఉంటాయి. ఆ జనాభాలో 2.14కోట్ల మంది గ్రామీణ జనాభా అయితే, 1.36 కోట్ల మంది నగరాలలో నివాసముంటున్నారు(61శాతం - 39శాతం).
ఆర్టీసీ ఇస్తున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం 9377 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించినట్లు చెప్తున్నారు. అంటే ఇప్పటికీ బస్ సౌకర్యం నోచుకోని గ్రామ పంచాయతీలే 3388 ఉన్నట్లు. పంచాయతీ అర్హత పొందని గ్రామాలను కూడా కలిపి లెక్క వేస్తే 11,388 గ్రామాలకు బస్ సౌకర్యం లేనట్లే భావించాలి. స్వాతంత్య్రం రాకముందు నుండి ప్రజా రవాణా వ్యవస్థ కలిగి ఉన్న తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం సిద్ధించిన 75ఏండ్ల తర్వాత కూడా బస్ సౌకర్యం లేకపోవడం కంటే మరో దారణం ఇంకేమీ ఉండదు.
హైదరాబాద్ నగరంలో 2015లో 87లక్షల మంది ప్రజలు నివసిస్తుంటే, 2020 నాటికి ఆ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. 2025 నాటికి 1.14కోట్లు, 2035 నాటికి 1.5 కోట్లకు చేరుతుందని అంచనా. (యు.ఎన్. యునైటెడ్ పాపులేషన్ లెక్కల ప్రకారం).
2000లో 170 చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో ఉంటే, 2011 లెక్కల ప్రకారం 650 చదరపు కిలో మీటర్లకు చేరింది. 2020లో 7257 చదరపు కి.మీ విస్తరించింది (యుఎన్వరల్డ్ పాపులేషన్). దేశంలోని నగరాలలో 6వదిగాను, ప్రపంచంలో 34వదిగాను ఉన్న నగరం 'మన హైదరాబాద్'. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలు నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి లక్ష జనాభాకి కనీసం 50 నుండి 120 బస్‌లు ఉండాలి (అర్బన్ బస్ టూల్‌కిట్). ఆ లెక్కన మన నగరంలో 5000 నుండి 12,000 బస్‌లు నడపాలి. కానీ 2019లో ఉన్న 3700 బస్‌లు 1000 తగ్గించింది. చాలక ఇప్పుడు మరో 800 తగ్గిస్తున్నారు. అంటే లక్ష జనాభాకి కేవలం 19 బస్‌లు మాత్రమే ఉంటాయి. దీనర్థం ప్రజల ప్రయాణ భారాన్ని వారికి వదిలి వేయడమే. ఇది సమర్థనీయం కాదు.
ఏం చేయాలి : ఆర్టీసీ డిపోలు మూసివేత వెనుక పెద్ద ప్రణాళిక ఉన్నట్లే భావించాల్సి వస్తున్నది. తన కాళ్ళపై తాను నిలబడలేకపోతే మూసివేస్తామని చెప్పి, 63 సంవత్సరాల కార్మికుల శ్రమతో, ప్రజల సహకారంతో సంపాదించుకొన్న 75,000 కోట్ల ఆస్తులను (ఛైర్మన్గారే ప్రకటించారు) ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారా? అని భావించాల్సి వస్తున్నది. అటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంటే తక్షణమే విరమించుకోవాలి. ఆర్టీసీ విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చి సహకారం అందించాలి. అలా ప్రభుత్వం వ్యవహరించేలా ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొని రావాలి. సంవత్సర కాలంగా రైతులు చేస్తున్న ఆందోళన మార్గదర్శకంలో ఆ పోరాటం ఉండాలి. ఆర్టీసీని కాపాడుకోవాలి.
- పుష్పా శ్రీనివాస్