Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు రాజ్యంలో రైతు కాయకష్టం ఇంత చవుకా..? రైతు కష్టార్జితం ఇంత తక్కువా..? మరి మహాకవి శ్రీశ్రీ - 'బలం ధరిత్రకే బలి గావించే కర్షక వీరుల కాయం నిండా, కాలువకట్టే కర్మజలానికి ఘర్మ జలానికి, ధర్మ జలానికి ఖరీదు కట్టే షరాబులేడోరు' అన్నాడు. వాస్తవానికి - కవిత్వానికి ఇంత వ్యత్యాసమా...
అక్కడ మహాకవి శ్రమజీవుల పక్షాన నిలిచాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోరు అన్న విశ్వజనీన సత్యాన్ని శిలాక్షరాలతో లిఖించేలా చేశాడు. ఇక్కడ పాలకులు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంతగా మొసలి కన్నీరు కార్చినా, వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. పాలనా బండారం బయటపడుతూనే ఉంటుంది.
మన భారతదేశంలో ఒక రైతు కుటుంబం సగటు సంపాదన రోజుకు రూ.277లు మాత్రమే. ఈ విషయం గ్రామీణ మదింపు అధ్యయనం (ఎన్.ఎ.ఎస్) తాజాగా తెలిపింది. ఇది కుడి ఎడంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లభించే రోజు కూలి మొత్తంతో సమానంగానే ఉన్నదని, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో నెలకు నాలుగువేల రూపాయలలోపే ఆదాయం గల కోట్లాది మంది రైతుల దయనీయ స్థితిని ఈ నివేదిక కండ్లకు కడుతున్నదని ఓ ప్రముఖ దినపత్రిక వ్యాఖ్యానించింది కూడా...
వ్యవసాయం ఇలా జూదంగా పరిణమించడానికి, గిట్టుబాటు ధర లేకపోవడానికి పాలకుల విధానాలు కారణం కాదా..? అందుకే రైతులు ప్రతి వ్యవసాయ తరుణంలో వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేల సంఖ్యలో ఈ రంగం నుండి నిష్క్రమిస్తున్నారు. గత రెండున్నర దశాబ్దాల కాలంలో దాదాపు నాలుగు లక్షలమంది రైతులు బలవన్మారణాల పాలైనట్టు ఆలిండియా కిసాన్ సభ ఏనాడో తెలిపింది. మరి ఈ పాపం పాలకులది కాదా..?
అయినప్పటికీ అనివార్యంగా మళ్ళీ కొత్తతరం, కొత్తవారు ఆబాల గోపాలం మరల మరల సేద్యానికి చేరువ అవుతూనే ఉన్నారు. ఉంటారు. కారణం వ్యవసాయం మన ప్రధాన జీవన విధానం. తరతరాలుగా కులాలను మతాలను అధిగమిస్తున్న మహౌన్నత శ్రమ (ఉత్పత్తి) సంస్కృతి మనది. ఆదివాసుల నుండి అందరూ ఈ సేద్య సంస్కృతిలో పాల్గొంటూనే ఉంటారు. దీనిని గమనించకుండా మన పాలకులు కేవలం తమ సంకుచిత స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కార్పొరేట్ల వైపు అంగలార్చడం అంటే నేల విడిచి సాము చేయడమే అవుతుంది.
ఇప్పటికీ 60శాతంపైగా భారత ప్రజానీకం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నలభైకోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నది. నిత్యం ప్రవహించే జీవనదులు ఉన్నాయి. యాంత్రీకరణకు లోనుకాని సహజమైన ప్రాకృతిక మానవ వనరులు అపారంగా ఉన్నాయి. అయినా దినదిన గండంగా మారింది రైతుల దుస్థితి.
ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఈ ఆరేండ్లలోనే రైతుల రుణ భారం 58శాతం పెరిగినట్టు కూడా అధికార గణాంకాలు చెపుతున్నాయి. అయినా అనావృష్టి, అధిక వృష్టి, అకాల వర్షాలు, కరువు, చివరకు కరోనా వంటి ప్రకృతి ఉత్పాతాలను సైతం ఎదుర్కొని, ఆరుగాలం ఆలుబిడ్డలతో కష్టపడుతూ ఏటికి ఎదురీదుతూ సేద్యం చేస్తున్నాడు మన రైతు.
ఇటువంటి శ్రమైక జీవి భారత రైతుకు మనం కనీస సముచిత గౌరవం ఇస్తున్నామా? లేదా? అని పాలకులే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఏడాది కాలంగా రాజధాని ఢిల్లీ చుట్టుప్రక్కల సాగిన రైతు ఉద్యమం వెన్నుచరిచి చెపుతున్న సత్యమిదే.
బతికుండగానే రైతును పీక్కుతినే రాబందుల్లాగా మార్కెట్‌ను ఎగదోసే వ్యక్తులకు శక్తులకు స్వస్తిపలకాలని, విధానాలకు విధిగా చెల్లుచీటి రాయాలనే డిమాండ్ తీసుకువచ్చింది. రైతు కేంద్రంగా వ్యవసాయ విధానాలే కాదు, అనుబంధంగానే సమగ్ర జాతీయ విధానాల రూపకల్పన జరగాల్సి ఉన్నదని ఆ ఉద్యమం హెచ్చరిస్తున్నది.
అందుకే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర గల చట్టబద్ధ హక్కు రైతులకు వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా తెగేసి చెప్పింది.
దేశానికి మీ సందేశం - మీకు రైతుల సందేశం అంటూ ధీటుగా జవాబు ఇచ్చింది.. ప్రధాని మోడీ అతని ప్రభుత్వం రైతుల వైపు ఉంటుందా లేక ఇంకా కార్పొరేట్లవైపే ఉంటుందా అని బరిగీసింది. ఇప్పుడు ప్రధాని ఎటువైపు నిలబడతాడు అని లోకం కళ్ళప్పగించి చూస్తున్నది.
రైతు ప్రాకృతికపరమైన నిస్వార్థ శ్రమ చేయడం ఎంత వైశిష్ట్యమో, న్యాయం సాధించేందుకు ప్రాణాలను తెగించైనా రైతు నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమరశీల ఉద్యమాలు చేయడమూ అంతే వైశిష్ట్యమని సరికొత్తగా మరల నిరూపిస్తున్నాడు మన భారత రైతు.
ప్రజాపోరాటాలేవీ అనుభవంలోకి రాని నేటి యువతరానికి ఇదో గొప్ప పాఠం. నానాటికి శిథిలమవుతున్న వ్యవసాయానికే కాక, ప్రజాస్వామ్య పోరాట విలువలకు కూడా కొత్త ఊపిరులు ఊదిందీ ఉద్యమం. కనుకనే అవునన్నా కాదన్నా నేడు మన భారత రైతు అందరికంటే ముందున్నాడు. జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా సంఘీభావాన్ని పొందగలుగుతున్నాడు. ఇక్కడ రైతు అంటే కుల, మత, జాతి, లింగ బేధం లేని కష్టజీవిగానే మనం చూడాలి. విస్పష్ట వైఖరితో లోకానికే పోరుదారి చూపిస్తున్న మన భారత రైతు నేడు నిజంగా విశ్వగురు కాక మరేమిటి?
- కె. శాంతారావు
సెల్: 9959745723