Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబరు చివరి వారంలో ఫేస్బుక్ తన పేరును 'మెటా వర్స్' ప్రాజెక్టులో భాగంగా 'మెటా'గా మార్చుకుంటున్నట్టు ప్రకటించింది. వర్చువల్ రియాలిటి పరికరాలతో, వాస్తవాన్ని పెంచి చూపించే డివైసెస్తో ఇంటర్నెట్తో అనుసంధానించి ఒక నెట్ వర్క్‌ను ప్రారంభించ బోతుంది. జూకర్ బర్గ్ మాటల్లో ''మీరు మెటా వర్స్ అంటే ఇంకొక ఇంటర్నెట్ సాధనం అను కుంటారేమో కాదు. అది అందులోని కంటెంట్‌ను చూపడం కాదు మీరే అందులో ఉంటారు''.
మెటా వర్స్ అనేది పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ సామ్రాజ్యాలను నడుపుతున్న ధనిక కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు అనువైన అడ్డ. మెటా వర్స్ ఎలా పని చేస్తుందో లోతుగా పరిశీలిస్తే మనం శ్వాస పీల్చుకున్నా ఎవరికి వినబడుతుందో అన్న ఆందోళనతో మన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ మెటా ఓ వేలం వెర్రిని సృష్టించి మిగిలిన ప్రపంచమంతా దాని వెంట పరిగెత్తేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో తన ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మార్కెటింగ్ కంపెనీలకు, రాజకీయ పార్టీలకు చేరవేసిందంటూ ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వెలుగులో ఖాతాదారుల గోప్యతను మరింత భద్రపర్చే విధానాలు రూపొందించటానికి బదులు ఫేస్బుక్ మరింతగా బరితెగించిందని ఈ మెటా వర్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇక మన జీవితమే ఒక సేవ
ఈ డిజిటల్ ప్లాట్ ఫారంలు మన జీవితం, మన సాంఘిక జీవితం, మన వినోదం అన్నిటినీ డబ్బుగా మార్చే డిజిటల్ వాతావరంలోకి తెచ్చే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. మెటావర్స్ వెనుక ప్రధాన సూత్రమే మానవ జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని తమ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం. రోజువారీ జీవితాన్ని ప్రపంచ సోషల్ నెట్వర్క్ నుండి డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్లోకి మార్చడం మెటా యొక్క ఉద్దేశ్యం.
ఫేస్బుక్ పట్ల వివిధ సందర్భాల్లో జూకర్బర్గ్ వెల్లడించిన అంశాలు చూస్తే... క్రమేణా మారుతున్న దాని స్వభావం మనకు అర్థమవుతుంది. 2005 జుకర్ బర్గ్ ఫేస్బుక్ అనేది కేవలం ప్రజలు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ఒక ఆన్లైన్ డైరెక్టరీ వంటిదని ప్రకటించాడు. తర్వాతి సంవత్సరాలలో ఫేస్బుక్ అనేది ఒక డిజిటల్ టూల్ లానే కాకుండా ప్రజలకు ఒక కనెక్ట్ సాధనంగా, అనుభవాలను పంచుకునే సాధనంగా, ఒక చోట చేరేందుకు సాధనంగా తయారయింది. 2016లో వచ్చిన రాజకీయ తిరుగుబాట్లను చూసి జూకర్ బర్గ్ ప్రపంచ చరిత్రలో ఫేస్బుక్ అనేది ప్రపంచ ప్రజల ప్రసార సాధనమయింది అని మాట్లాడడం మొదలు పెట్టాడు. 2017 జూన్ 22 మొదటి సారి జరిగిన ఫేస్బుక్ కమ్యునిటీస్ సమ్మిట్‌లో జుకర్ బర్గ్ మారిన ఫేస్బుక్ మిషన్‌ను బయటపెట్టాడు. కనెక్టింగ్ పీపుల్ నుండి గ్లోబల్ కమ్మ్యునిటీ తర్వాత తన ముఖ్యమైన వ్యూహాత్మక అడుగు మెటావర్స్ ప్రాజెక్ట్ అని ఆనాడే చెప్పాడు. అప్పుడు ఆయన మాట్లాడింది ఫేస్బుక్ గ్రూపులకు, 21వ శతాబ్ది మానవ సమూహాలకు డిజిటల్ వ్యవస్థను ఇవ్వడమే అని. ఈ సారి తర్వాతి జెనరేషన్ వ్యవస్థలను ఇంటర్నెట్ ద్వారా మొదలు పెట్టడం. మెటా అంతిమ లక్ష్యం ఇప్పుడు ఉపయోగిస్తున్న సేవ కాదు, మనం నివసిస్తున్న వ్యవస్థే దాని లక్ష్యం
ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మెటా
చేపకు నీళ్ళ లాగ మెటా కూడా సాంకేతిక మీడియం ద్వారా సార్వత్రిక మానవ జీవితంలోకి వ్యాప్తి చెందాలనుకుంటున్నది. ఇక ఇది మనం కోరుకునే కొన్ని విషయాలను మాత్రమే మన ముందుకు తెచ్చే సాధనం కాదు. మనముందు అనేక అవకాశాలు, ప్రత్యామ్నాయాలు కుమ్మరించే కుండగా మారనుంది. వందల వేల సంఘటనలు ఒకే చోట జరిగే విశాలమైన క్రీడాస్థలంగా మారబోతోంది. ఉదాహరణకు మనం గేమ్స్ ఆడాలనుకుంటాం. కంటెంట్ డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటాం. కొన్ని సేవలకు సైన్ అప్ చేస్తాం. వీటన్నిటికీ మన అకౌంట్లోనుండి ఆటోమేటిక్‌గా డబ్బు తీసేసుకుంటారు. మన బ్యాంకు అకౌంట్ ఈ మెటావర్స్ ప్రపంచానికి మన జీతంలో కొంత భాగం కలిపి ఉంచేలా ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్‌గా అది ప్రపంచ కరెన్సీలోకి ట్రాన్ఫర్ అవుతుంది.
ఇటువంటి ఏర్పాటు వలన మనకేమి నష్టం అన్న ప్రశ్న పాఠకులకు తలెత్తవచ్చు. దైనందిన జీవితంలో అవసరాలు తీర్చుకోవటానికి కష్టపడుతూ మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలస్న సామాజిక స్పృహ పొందటానికే ఇప్పుడు సమయం చాలటం లేదు. ఇక మెటావర్స్ మానవుడు సంఘజీవి అన్న వాస్తవాన్నే మన దరిదాపులకు రానీయకుండా చేయగలుగు తుంది. ఆ పరిస్థితుల్లో అటు ప్రభుత్వాలు, ఇటు ఫేస్బుక్ వంటి సాంకేతిక మాధ్యమాలు ప్రజా జీవితాన్ని ఎటు కావాలంటే అటు మళ్లించుకోవటం తేలికవుతుంది. ఇది ప్రజా ప్రాతినిధ్యానికి, ప్రజల భాగస్వామ్యానికి పెనుసవాలుగా మారుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ ఫారాలు తటస్థంగా ఉండే పేరుతో చేసే లావాదేవీలన్నీ ప్రజలను తప్పు దోవ పట్టించేవే అన్న అవగాహన కూడా ఇప్పుడు ఇక పాతబడిపోయింది. మెటావర్స్ రాకతో కంపెనీలు తమ డిజిటల్ ఆర్కిటెక్చర్ కొత్తగా డిజైన్ చేసుకుంటాయి. చాలా క్రియా శీలంగా అడుగు లేస్తాయి. ఇప్పటి డిజిటల్ ప్లాట్ ఫారాలన్నీ దశాబ్దాల తరబడి సోషల్ సైకాలజీలో సాగిన పరిశోధనల నేపథ్యంలో పుట్టుకొచ్చినవే. కానీ ఈ సాంకేతిక సామ్రాజ్యాధి పతులు కొత్త సూత్రాల విస్తృత ప్రపంచాలనేర్పరచి మనల్ని కంపెనీ లాభ దాయకంగా ఉండేలా ప్రవర్తించేలా నలగ్గొట్టుతారు.
మెగా కాపిటలిజం నుండి 'మెటా' క్యాపిటలిజంకు
డిజిటల్ క్యాపిటలిజంలో బాగా లాభాదాయక మైంది కంపెనీలకు ప్రకటనలు ఇవ్వడం. ఇప్పటికీ ఆపిల్ హై ఎండ్ వినియోగదారులకు తన ఉత్పత్తులను అమ్ముకుంటుంది. గూగుల్, ఫేస్బుక్ ఇప్పటికైతే వినియోగదారులకు ఉచిత సర్వీసులను అందజేస్తూ, వినియోగదారుల జీవితాలను పెట్టుబడి నిఘా నీడకు లాక్కెళ్తున్నాయి. దానికి ఏకైక సాధనం సామాజిక మాధ్యమాల్లో ఖాతాదారులు పొందుపర్చుకునే సమాచారం. అది వ్యక్తిగత సమాచారం కావచ్చు, సమీకృత బృందాల సమాచారం కావచ్చు. అంటే పూర్వ విద్యార్ధుల బృందాలు, కంపెనీ సిబ్బంది బృందాలు, లేదా ఒకే రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తుల వేదికల ద్వారా జరిగే చర్చలు, ఇచ్చి పుచ్చుకునే సమాచారం, వ్యక్తీకరించుకునే ఇష్టాయిష్టాలే మెటా కాపిటలిజానికి మూల ధనంగా మారనున్నాయి. ఈ డేటాను వాడుకుంటూనే, దానిని విశ్లేషించి దాన్ని కూడా అమ్ముకుంటారు.
2021మొదటి మూడునెల్లలో ఫేస్బుక్ ఆదాయం 97.2శాతం కేవలం ప్రకటనల ద్వారా వచ్చింది. మెటా వర్స్ ఇంకా విశాలమైన ఆదాయ వనరులను గేమ్స్, ఇతర సర్వీసులు, వర్చువల్ ప్రాపర్టీ మొదలైన వాటి ద్వారా పెంచుకోనుంది. మెటా మొదట తన సర్వీసులను కేవలం సబ్స్క్రిప్షన్ చేసే వారికి అందజేస్తుంది. వర్చువల్ ఆస్తులను అమ్ముతుంది, ఇతర కంపెనీల ప్రవేశానికి రుసుం వసూలు చేస్తుంది. ప్రకటనల కోసం చేసిన డేటాను ఆస్తిగా మార్చుకుంటుంది. అటువంటి వర్చువల్ ఆస్తిని మార్కెట్లో పెట్టి భౌతిక సంపదను పోగేసుకుంటుంది. ఇదీ మన రేపటి జీవితంలో వర్చువాలిటీకి రియాలిటీకి మధ్య ఉన్న గతితర్క వాస్తవికత.
-విఆర్ ప్రజ్వలిత