Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నా హజారే నడిపించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారు తామే మితవాద హిందూ మతతత్వ శక్తుల పెరుగుదలకు బాట వేశామనే వాస్తవాన్ని అంగీకరించి తీరాలని స్వరాజ్య అభియాన్ పార్టీ వ్యవస్థాపకుడు యోగీంద్ర యాదవ్ అన్నారు. 'కనుక అన్నా హజారే ఉద్యమ నాయకులు, మద్దతుదారులు (ప్రధాన మంత్రి) మోడీ ఎదుగుదలకు బాధ్యత పంచుకుంటారా?' అని తాను రాసిన ఒక శీర్షికలో ఆయన ప్రశ్నించారు. 'రాజకీయాలలో మీరు తెలిసి చేసిన దానికి మాత్రమే బాధ్యత తీసుకుంటామంటే కుదరదు. అందులో పాల్గొన్న నాలాంటి వాళ్లం కూడా ఇలా జరగడానికి బాధ్యులమని ఒప్పుకోక తప్పదు' అని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇంతకు ముందు ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల కార్యకర్త ప్రశాంత భూషణ్ నుంచి కూడా ఇలాంటి మాటలే విన్నాం. ఆ ఉద్యమం తనను పక్కదోవ పట్టించిందని ఆయనన్నారు. అన్నా ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దన్నుగా ఉండి నడిపించాయని, ఆ సంగతి తనకు తెలిసివుంటే దాని నుంచి దూరంగా ఉండిపోయేవాడినని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ ఆలస్యంగా జరిగే ఇలాంటి జ్ఞానోదయాలు పరిస్థితిని వెంటనే మార్చజాలవు. భారతీయ మితవాద శక్తుల నాయకత్వంలో 'మెజారిటీవాద రాజకీయాలు ప్రజాస్వామ్యం రూప నిర్మాణాన్నే మార్చేస్తున్నాయని' గతంలో ప్రొఫెసర్ జోయా హసన్ ఒక ఉపన్యాసంలో చెప్పిన మాట అర్థం ఇదే. అయినాసరే, కొంతమంది విద్యావంతులైన భారతీయులు-న్యాయం, సమ్మిళిత రాజకీయాలు కోరుకునే వారూ, రాజ్యాంగానికి నిస్సందేహంగా రాజ్యాంగ బద్దులైన వారు కూడా- 'అన్నానే ఇండియా, ఇండియానే అన్నా' నినాదంతో ఎందుకు సమ్మోహితులైపోయారు? హిందూత్వశక్తులు వత్తాసునిచ్చిన ఉద్యమంలో ఎందుకు పాలుపంచుకున్నారు? ఈ ఉద్యమంలో అంతర్గర్భితంగా ఉన్న సమస్యల గురించి చెప్పిన విజ్ఞుల మాట ఎందుకు వినిపించుకోలేదు?
మీడియా ఆకాశానికెత్తిన అన్నా విప్లవం మోతలో వారెలా కొట్టుకుపోయారు? ఈ రెండవ మహాత్ముని మరాఠా జాతి దురభిమానం ఆనవాళ్లను ఎలా మర్చిపోయారు? 2002 మత మారణకాండపై ఆయన మౌనయోగాన్ని ఎందుకు విస్మరించారు? అలాగే అన్నా బృందంలో కీలకసభ్యులైన యువత రిజర్వేషన్ వ్యతిరేక వేదికలో భాగస్వాములనే పరమ సత్యాన్ని ఎందుకు పట్టించుకోలేదు?
పార్లమెంటుకన్నా పౌర సమాజానికి పైచేయి ఉండాలంటూ అన్నా ఉద్యమం చేస్తున్న ప్రచారం వాస్తవంలో సంఫ్‌ుపరివార్ కోరుకుంటున్నట్టు రాజ్యాంగాన్ని తిరగదోడడమేనని ప్రముఖ జర్నలిస్టు రాజేష్ రామచంద్రన్ హెచ్చరించారు. అన్నా హడావుడిని ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నదా అని ప్రశ్నించారు మరో సీనియర్ జర్నలిస్టు ఇఫ్తికర్ జిలాని తెహల్కా పత్రికలో.
ఈ ఉద్యమం కొంతమంది ప్రవక్తలకు బీజోపవాసన చేస్తున్నదని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ కూడా గుర్తించారు. ప్రజా సమూహమనే సమిష్టి శక్తి స్థానాన్ని ఒక వ్యక్తికి ఇస్తున్నదని ఆయన రాశారు. ప్రజల పాత్ర కేవలం ఒక వ్యక్తి చర్యలకు మద్దతు పలకడం, జేజేలు కొట్టడం తప్ప ప్రజలకు మరే పాత్ర లేకుండా చేసే స్థితికి ఇది దారి తీస్తుందని పేర్కొన్నారు. అలా జరగడం అంటే ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమన్నారు. వీరారాధనలో ప్రమాదాలను గురించి ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ స్పష్టంగా హెచ్చరించడమే గాక బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన దానికి ఇది ఎలా పూర్తి వ్యతిరేకమో కూడా తులనాత్మక పరిశీలన చేశారు. 'మతంలో భక్తి లేదా వీరారాధన మోక్షానికి మార్గం కావచ్చునేమో గాని రాజకీయాలలో మాత్రం అదే భక్తి లేదా వీరారాధన అధోగతికి బాటగా ఉత్తరోత్తరా నియంతత్వానికి దారితీస్తుంది' అని ఆయన వక్కాణించారు.
ఇలాంటి హెచ్చరికలు, ముందస్తు సంకేతాలు చాలా కనిపించాయి గానీ ఇవేవీ కూడా ఆ ఉద్యమ మద్దతుదారుల ఎజెండా గురించిన ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి తీసుకురాలేక పోయాయి. నిజానికి రాజ్యాంగ స్తోత్రాలు ఆలపిస్తూనే ఆ ఉద్యమ గీతోపదేశం మాత్రం 'పార్లమెంటుపై అన్నా ఆధిక్యత' అనే ఇతివృత్తంగా పరిణమించింది. ఉదాహరణకు వారు చెప్పిన రీతిలో లోక్‌పాల్ బిల్లు ఆమోదించే సందర్భంలో ఇదే కనిపించింది.
రేపు మనం మళ్లీ ఇలాంటి దుస్థితినే ఎదుర్కొనకుండా ఉండాలంటే ఈ హెచ్చరికల నుంచి ఇప్పుడైనా పాఠాలు తీసుకోవడం అవసరం, లేకపోతే మరో నవీకృత మహాత్ముడు అవతరించి భారత రాజకీయాలలో పోగుపడిన మాలిన్యాలను ప్రక్షాళన చేసేందుకోసం ప్రజలను తన వెంటే నడవమని శాసించవచ్చు. ప్రజా జీవితంలో అవినీతి నిర్మూలన కోసం స్వతంత్ర భారతంలో మొదలైన ఉద్యమాలలో అన్నా ఉద్యమం మొదటిదేమీ కాదు. డెబ్బయ్యవ దశకం మధ్య కాలంలో బీహార్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగిన సుప్రసిద్ధ పోరాటంలో యువత పెద్దఎత్తున పాలుపంచుకున్నారు. అనేక కాంగ్రెసేతర శక్తుల కలగూరగంప లాంటి ఆ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు భారతీయ జనసంఫ్‌ు కూడా పాల్గొన్నది.
ఆ ఉద్యమం తర్వాత తర్వాత అత్యవసర పరిస్థితి విధింపునకు దారితీసింది. కేంద్రంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్/జనసంఫ్‌ు ఇందులో కీలకపాత్ర వహించాయి. ఎనభయ్యవ దశకం చివరి భాగంలో వి.పి. సింగ్ నాయకత్వాన మరో ఉద్యమం నడిచింది. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండిన ఆయన బోఫోర్స్ ఒప్పందంలో లొసుగులపై కేంద్రీకరించి ప్రచారం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో సహా కాంగ్రెసేతర శక్తులు దాన్ని బలపర్చాయి. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఆయా వ్యక్తులపై లేదా తాము ముందుకు తెచ్చిన అక్రమాలపై కేంద్రీకరించాయి. ప్రజలు చట్టబద్దమైన దోపిడీగా భావించే అవినీతికి మూలమైన వ్యవస్థాగత కారణాలను ఈ ఉద్యమాలు ఎప్పుడూ దాటేస్తూనే వచ్చాయి. అవినీతి అనేది వ్యవస్థలో ఏ విధంగా భాగమవుతుందో ప్రభుత్వాల ఆర్థిక విధానాల నుంచే ప్రవహిస్తుందో తెలుసుకోవడానికి అవెప్పుడూ ప్రయత్నించలేదు.
అయితే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో ఉమ్మడి లక్ష్యం అదొక్కటే కాదు. భారత రాజకీయాలలో మితవాద హిందూ మతతత్వ మితవాద శక్తులకు పవిత్రత ఆపాదించడానికి ఇవి దోహదం చేశాయి. దానికి మరింత ఆమోదయోగ్యత కల్పించాయి. జే.పీ. ఉద్యమంలో పాల్గొనడం ద్వారా ఆర్ఎస్ఎస్కు స్వతంత్ర భారత జాతీయ రాజకీయాలలో తొలిసారిగా ఆమోద ముద్ర లభించింది. వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొనలేదన్న విమర్శ అప్పటి వరకూ దానిపై ఉండేది. ఆర్ఎస్ఎస్ సృష్టించిన వాతావరణమే గాంధీజీ హత్యకు దారితీసిందని అప్పటి హౌం మంత్రి సర్దార్ పటేల్ ఖండించారు.
రక్షణ కొనుగోళ్లలో అవినీతికి వ్యతిరేకంగా వి.పి.సింగ్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు క్రియాశీలంగా పాల్గొనడం మరో మైలురాయి వంటిది. దేశంలోని రాజకీయ క్రీడాకారులుగా హిందూత్వ కూటమిని విస్తృతంగా ఆమోదించడానికి అది కారణమైంది. అన్నా ఉద్యమ కాలంలోనూ అనేక హిందూత్వ దురభిమాన సంస్థలు పునరుజ్జీవం పొందాయి. హింసాకాండలో మత కలహాలలో అప్పటి వరకూ అవి తమను తాము సమర్థించుకోవడానికి సతమతమయ్యే స్థితిలో ఉండేవి. ఇంకా దారుణమేమంటే వాటిలో కొన్నిటిపై విచారణ కూడా జరుగుతున్న స్థితి. ఈ హిందూత్వ కేసుల సెగ పైస్థాయిలో ఉన్న నేతలను కూడా తాకే పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో అవినీతి వ్యతిరేక పోరాటం వచ్చింది. 2009లో ఓటమిపాలై నీరసపడిన ఈ సంస్థలు, బీజేపీలకు ఊపు రావడానికి అది కారణమైంది. అంతకన్నా ముఖ్యమైంది ఆ ఉద్యమం కాంగ్రెస్‌ను మరింత అప్రతిష్టపాలు చేసి ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలంగా పునర్ నిర్వచించుకునే వీలు కల్పించింది. మరో మాటల్లో చెప్పాలంటే 2014 తర్వాత ఆమోదయోగ్యత పొందిన అనేక మెజారిటీవాద శక్తులకు అన్నా ఉద్యమ కాలంలో మరింత ఊతం లభించింది.
ఉదాహరణకు ఈ ఉద్యమ మద్దతుదారులు, ప్రజలు కోరుకున్నదే ప్రజాస్వామ్యం అన్న భావం విస్తృతంగా తీసుకొచ్చారు. ఈ దృక్పథం పైకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది గాని వాస్తవానికి సమస్యాత్మకమైంది. ప్రజల్లో మెజార్టీ ఏది కోరితే అదే జరగాలన్న వాదనకు ఇది దారితీస్తుంది. మెజార్టీ ప్రజలు మైనార్టీని తొక్కిపారేసే పరిస్థితులకు కూడా ఇది దారితీయొచ్చు. అప్పుడు దేశం మెజార్టీ వాద ప్రజాస్వామ్యంలోకి పయనిస్తుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలు మితవాద శక్తుల మార్గాన్ని సుగమం చేయడమనేది ఇండియాకే ప్రత్యేకమైన లక్షణమేమీ కాదు. బోల్సానారో నాయకత్వంలోని బ్రెజిల్ మరో ఉదాహరణ. బ్రెజిల్ వర్కర్స్ పార్టీ సామాజిక న్యాయవిధానాల కోసం జరిగిన పోరాటాలను బలపర్చింది. అయితే బ్రెజిల్ పోలీసులు 'ఆపరేషన్ కార్ వాష్' పేరిట దర్యాప్తులు ప్రారంభించడంతో అది ఇరకాటంలో పడింది. ఉన్నత మధ్యతరగతి నాయకత్వంలో కార్పొరేట్ మీడియా కుమ్మక్కుతో పరిశుభ్రమైన రాజకీయాల పేరిట మొదలైన ఈ ఉద్యమం జైర్ బోల్సనారో అనే పచ్చి మితవాద రాజకీయవేత్తకు పట్టం కట్టింది. అదే సమయంలో ప్రజాదరణ గల మాజీ అధ్యక్షుడు బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నాయకుడైన లూయిజ్ ఇంక్‌లో లూలా జైలు పాలైనాడు.
భారత దేశంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేకతకు సంకేతంగా ఉండే బ్రెజిల్లో జడ్జి సెరిగో మోరో అవినీతి వ్యతిరేక ఉద్యమ తారగా పైకి వచ్చాడు. ఆయన లావాజాటో కేసు విచారించిన న్యాయమూర్తి. తర్వాత కాలంలో ఆయన దర్యాప్తులో పాక్షికంగా వ్యవహరించాడనీ, 2018 ఎన్నికలలో బ్రెజిల్ వర్కర్స్ పార్టీ గెలవకుండా అడ్డుకున్నాడని వెల్లడైంది. లూలా కేసు విచారణలో సెర్జియో మారో పక్షపాతం చూపినట్టు బ్రెజిల్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు లూలా జైలు నుంచి బయిటకు వచ్చారు. బోల్సనారో అవినీతి ఆరోపణలు ఎదుర్కొం టున్నాడు. బహుశా లూలా నాయకత్వంలోనే వర్కర్స్ పార్టీ విజయం సాధించవచ్చునని సర్వేలు చెబుతున్నాయి. బ్రెజిల్ పీడకల నుంచి బహుశా బయిటపడవచ్చు. కాని భారతదేశంలో ప్రజాస్వామ్య కాంతులు ఎప్పుడు వచ్చేది జోస్యం చెప్పడం కష్టం.
వ్యాసకర్త : స్వతంత్ర పాత్రికేయుడు.
- సుభాష్ ఘటాడే