Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబద్ధం - మంద బలంతో అధికారంలో ఉన్నప్పుడు మనం వింటున్నది, చూస్తున్నది అబద్దమా? నిజమా? అని తేల్చుకోలేక సతమతమౌతున్నాం. అబద్ధాలు విస్తృతంగా వ్యాపింపజేస్తున్న ఈ కాలంలో వాస్తవాల్ని గుర్తించడం సామాన్యుడికి కష్టమవుతూ ఉంది. పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండీ అన్నీ కలుషితమై పోతున్నప్పుడు శుభ్రమైన గాలి, ఆహారం సంపాదించుకోవడం తలకు మించిన భారమే కదా? ప్రజలు నైతికతకు కట్టుబడి ఉన్నప్పుడు పై వాటిని కాలుష్యాలకు దూరంగా ఉంచు కోవచ్చు. ప్రజలే అనైతికతతో కలుషితమై పోయినప్పుడు.. గాలి, నీరు, ఆహారమే కాదు, వారు ఎన్నుకునే నాయకులు కూడా ఆ స్థాయిలోనే అలాగే ఉంటారు. అందువల్ల రాజకీయ నాయకులు చెప్పే మాటలు, చేసే చేతలు అన్నీ కలుషితమయ్యే ఉంటున్నాయి. స్వచ్ఛత, నిజాయితీ, నిబద్ధతా లోపించినప్పుడు అధికారంలో కొనసాగడానికి నాయకులు ఇక అబద్దాలనే ఆశ్రయిస్తున్నారు. యోగ గురించి, ఆధ్యాత్మికత గురించి ఉపన్యాసాలిస్తూ జనాన్ని శాశ్వతంగా సమాధిలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం.
'ప్రధానమంత్రి ఆవాస్ యోజన' పథకంలో ఇరవైనాలుగు లక్షల మందికి పక్కా ఇండ్లు లభించాయని, ఒక ఇంగ్లీషు జాతీయ వార్తా పత్రికలో పూర్తి పేజీ ప్రకటన వెలువడింది. అందులో ఒకవైపు లక్ష్మి అనే మహిళ ఫొటో మరో వైపు ప్రధాని మోడీ ఫొటో ప్రచురించారు. అది చూసి, విషయం నిర్థారించుకుందామని ఒక మహిళా వీడియో జర్నలిస్ట్ ఆ లక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళ్ళింది. లక్ష్మి అనే ఆ మహిళ చిన్న గుడిసెలో నెలకు ఐదు వందలు అద్దె చెల్లిస్తూ ఉంటోంది. గంగా ఒడ్డున బాబూ ఘాట్‌లో పదిరోజులు పనికి వెళ్ళానని... అప్పుడు తన ఫొటో ఎవరు తీశారో, ఎప్పుడు తీశారో తనకు తెలియదని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన ఆ ప్రభుత్వ ప్రకటన ఒక పెద్ద అబద్దమని - ఆ శ్రామిక మహిళ స్పష్టం చేసింది. దేశ నాయకులు, ప్రభుత్వం తాము భ్రమల్లో బతుకుతూ దేశ ప్రజలను భ్రమల్లో ముంచాలని ఎలా ప్రయత్నిస్తున్నారో ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది.
ఇలాంటి అసత్య ప్రకటనలకు లెక్కలేదు కాని, ఉదాహరణకు రెండు, మూడు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. పశ్చిమ బెంగాల్‌లోని ఎత్తయిన భవనాల ఫొటోలు చూపి, ఆ అభివృద్ధి ఉత్తర ప్రదేశ్‌లో జరిగినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ ముఖ్యమంత్రి ఫొటోతో సహా-టముకు వేసుకుంది. ఆ ప్రభుత్వ ప్రకటన హిందీ, ఇంగ్లీషు జాతీయ దిన పత్రికలో వచ్చింది. బీజేపీ అసత్య ప్రచారాలకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఒక మంచి ఉదాహరణ. మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఫొటోని పెట్టుకుని దాన్ని ఉత్తరప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన కొత్త ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. ఆవు - ఆక్సీజన్, ఆవు మూత్రం - ఆవుపేడల గుణగణాల్ని ప్రమోట్ చేయడానికే తెగ ఆయాస పడిపోతున్న ఈ ప్రభుత్వానికి అంత 'విజన్' ఉంటుందా? దేశ ప్రజల దురాశ గానీ...
దేశ వ్యాప్తంగా పవిత్రులయిన అగ్రవర్ణం వారు ఎక్కడైనా ఆవుల్ని మేపుతూ కనిపించారా? వాటి పాలన పోషణల బాధ్యత తీసుకున్నారా? ఆవుల పటాలు ఇళ్ళలో పెట్టుకుని, కుంకుమ జల్లినందువల్ల వారిని 'గోరక్షకులు' - అని అనాలా? పశుపోషణ సమాజంలో ఇతర వర్గాల వారు చేస్తున్నారు. వారే గోరక్షకులు, వారే పశురక్షకులు. మనుషుల మలమూత్రాల్ని శుభ్రం చేేసి, మొత్తం సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేవాళ్ళను అంటారని వాళ్ళని ముద్ర వేశారు. ఆవుమూత్రం తాగుతూ, దాని పేడతినే వాడు పవిత్రుడయి పొయ్యాడా? భవ్య భారతం అంటే ఇదేనా? జై శ్రీరామ్ - అంటూ నినాదాలు చేస్తూ ముస్లింలను చంపేయడం, దళితులు గుళ్ళలోకి వస్తే తన్ని తగిలేయడం, బహిరంగంగా కత్తులు తళతళలాడిస్తూ దాడులు చేయడం హిందూత్వ కాదా? ధార్మిక హింస అని ఎందుకు అనకూడదు? అని ప్రజల్లో అధిక సంఖ్యాకులు ప్రశ్నిస్తున్నారు. ''ఐసిస్-బోకోహరమ్ల వంటి తీవ్ర వాదులకూ వీరికీ తేడా ఏమిటీ?'' అని ప్రతిపక్షంలో ఉన్న దేశ నాయకులు ప్రశ్నిస్తుంటే.. అధికారంలో ఉండి కూడా సమాధానం చెప్పే బాధ్యత లేదా? సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడే వారికి కనీస సంస్కారమైనా ఉండాలి కదా? ''అంబేద్కర్, పెరియార్‌లను అనుసరించే వారు అంతర్జాతీయ తీవ్రవాదులు'' అని అన్నాడు పతంజలి రామ్‌దేవ్. ఎందుకు అలా అనగలిగాడూ అంటే తన వెనక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న ధీమానే కదా? అలాంటి వాణ్ణి వెంటనే శిక్షించకపోవడం వల్ల - అంబేద్కర్, పెరియార్లకు వచ్చిన నష్టం లేదు. వారి ఆలోచనా ధోరణిని బలపరుస్తున్న అశేష జన వాహినికి నష్టం లేదు. ప్రజల దృష్టిలో విలువ తగ్గించుకున్న ప్రభుత్వానికే నష్టం! ఇకపోతే సందర్భం వచ్చింది గనుక, ఇక్కడ మరొక విశేషం చెప్పుకోవాలి. అదేమంటే అర్థశాస్త్రంలో నొబెల్ పురస్కారానికి ఈసారి మన దేశం నుండి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఆయన ప్రతిపాదించిన సిద్దాంతం గూర్చి తెలుసుకుంటే నోబెల్ కాస్తా గోల్మాల్ అవుతుంది. ఆయన ఏం ప్రతిపాదించారంటే.. 'గోమూత్రం - గోవు పేడ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను తప్పక పటిష్ట పరుస్తాయని' సిద్ధాంతీకరించారు!
''భవిష్యత్తులో మనవజాతి నశించి పోవడమంటూ జరిగితే అది అణుబాంబుల వల్లనో, అంటురోగాల వల్లనో కాదు, నైతిక విలువల పతనం వల్ల మాత్రమే!'' అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఇది తేలికగా తీసిపారెయ్యాల్సిన విషయం కాదు. ఎవరికి వారు, వారి వారి నైతికతను బేరీజు వేసుకోవాల్సిన తరుణం. ప్రస్థుత ప్రభుత్వ పెద్దల నైతికత గురించి దేశ ప్రజలకు తెలిసిందే! 'నువ్వు చరిత్రను సృష్టించలేనప్పుడు అధికార బలంతో చరిత్రను మార్చేరు' అనేది నేటి ప్రభుత్వ విధానం. అందుకే చూడండి... విద్యాలయాల్లో పుస్తకాలు, సిలబస్‌లు మారుస్తున్నారు. వారు నమ్మిన చరిత్రను దేశం మీద రుద్దుతున్నారు. ఏకంగా మూఢత్వానికి రహదారులు వేస్తున్నారు. నటుడు నసిరుద్దీన్ షా (ముస్లిం) శివాజిగా నటించడం, నటుడు ఓంపురి (హిందు) ఔరంగజేబుగా నటించడం ఈ దేశంలో జరిగింది. సామాన్య ప్రజలలో ఆ కలయిక, ఆ సుహృద్భావం ఆ అలారు బలారు అలాగే ఉంది. మత విద్వేషాలు లేకుండా గౌరవభావంతో మెలిగేవారు. అప్పుడు పార్లమెంట్లో పువ్వు గుర్తు సభ్యులు ఇద్దరే ఉండేవారు. ఇప్పుడు వారి మందబలం పెరిగింది. ఫలితంగా, మతాల మధ్య అడ్డుగోడలు లేపి జనాన్ని విడదీస్తున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలు మునిగిపోతున్నా వారికి ఏం పట్టడం లేదు. హాలివుడ్ సినిమా 'టైటానిక్' చాలా మంది చూసే ఉంటారు. అందులో టైటానిక్ అనే పేరుగల నౌక సముద్రంలో మునిగిపోతుంటే, కొందరు సంగీతంలో తేలిపోతూ ఉంటారు. దేశం అన్ని రకాలుగా కృంగిపోతున్నా, పువ్వుగుర్తు దేశభక్తులు తమ గొప్పదనానికి తామే పొంగిపోతున్నారు.
మతాలలో ఉన్న అసంబద్ధత గూర్చి, అబద్దాల గూర్చి ఎన్నెన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని చూద్దాం! భర్త లేకుండా మేరీ మగబిడ్డకు ఎలా జన్మనిచ్చింది? ఏసు మగవాడయితే అతనిలోని 'వై' క్రోమోజోమ్ ఎవరిది? సరే, అది అలా ఉండనిచ్చి విష్ణువు సంగతి చూద్దాం. తొలుత విష్ణు స్త్రీగా ఉన్నప్పుడు ఆ అందానికి శివుడు ఆకర్షితుడై పరవశించి శారీరకంగా కలుస్తాడు. ఫలితంగా గర్భం దాల్చిన విష్ణు బ్రహ్మకు జన్మనిస్తాడు. (శ్రీవాయు మహాపురాణం, పూర్వార్థ. పేజీ.229) దేవుడి పటాలలోకూడా ఈ విషయం కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువు పవళించి ఉంటాడు. అతని బొడ్డు నుండి ఒక కమలం పువ్వు కాడ పైకి ఆకాశంలోకి దూసుకు వెళ్తుంది. ఆ పువ్వులో బ్రహ్మకూర్చుని ఉంటాడు. విష్ణు బొడ్డులోంచి బ్రహ్మపుట్టినట్టుగా చిత్రించి ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఎవరిదీ బాధ్యత లేదు.. ఇలాంటి అబద్దాలను సమర్దిస్తూ జనాన్ని ఇంకా ఇంకా మూర్ఖులుగా తయారు చేస్తున్న ప్రస్థుత ప్రభుత్వాన్ని - బాలివుడ్ సినిమా నటుడు, అటల్ బిహారీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన బీజేపీ నాయకుడు శతృఘ్ను సిన్హానే ఇలా అన్నారు.. ''రాముని పేరు చెప్పి వీధుల్లో బిచ్చగాళ్ళు కూడా ఆడుక్కుంటారు. దమ్ముంటే చేసిన పనులు చూపి ఓట్లు అడగండి! అయోధ్య రామాలయం పేరు చెప్పి కాదు'' అని విమర్శలు గుప్పిస్తే ఎవరూ నోరెత్తలేదు. అదే మాట ప్రతిపక్షంలోని వారంటే దాన్ని పెద్ద రచ్చ చేసేవారు. పైన చైనాలో కింద శ్రీలంకలో ఇటు పాకిస్థాన్‌లో, దానిపైన అరబ్ దేశాల్లో, అటుపక్క యూరోప్ దేశాల్లో, ఉత్తర దక్షిణ అమెరికాల్లో అంతటా మన పువ్వు గుర్తు పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక దేశభక్తుడు అన్నాడు. అతను అలా ఎందుకన్నాడబ్బా అని ఆలోచిస్తే ఒక విషయం తడుతుంది. ఒకే దేశం కాబట్టి ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆలోచనా ధోరణి ఉండాలని మన నాయకులు అంటున్నారు కదా! ఇదీ అలాంటిదే.. ఒకే ప్రపంచం కాబట్టి ఒకే ప్రభుత్వం ఉండాలని ఎందుకు అనుకోకూడదూ? ఒకే ప్రభుత్వం - ఒకే మతం / ఒకే మతం - ఒకే నాయకుడు / ఒకే నాయకుడు - ఒకటే మన్కి బాత్ / ఒకటే మన్కి బాత్ - ప్రపంచానికంతటికీ ఒక్క చారు చాలు!!
''భారత్‌ను అమెరికా రెండు వందల ఏండ్లు పరిపాలించింది. అలాంటి దేశం ఇప్పుడు కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది'' అని అన్నాడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్. ''ప్రతి ఒక్క భారతీయుణ్ణి మోడీ కాపాడుతున్నాడు'' అని కూడా అన్నాడు. ఇది 2021 మార్చి 22 నాటి మాట. ''తల్లి యశోదా కృష్ణుడితో రాసలీలలాడేది'' అని అన్నాడు జగ్గీ వాసుదేవ్. ఇతణ్ణి ఒక మానసిక రోగి అని అనకుండా ఎవరైనా ఉండగలరా? తనకు తానే జగద్గురువునని డప్పు వాయించుకోగానే సరిపోదు. 'వీడి మెదడు కాస్త నడి సెంటర్లోనే ఉంది' అని జనాలకు అనిపించాలి. అటు రాజకీయ నాయకులు, ఇటు ఆధ్యాత్మిక గురువులు ఎంత అసంగతంగా, ఎంత అసంబద్ధంగా ఎన్నెన్ని అబద్దాలు మాట్లాడుతున్నారో సామాన్య ప్రజలు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మాట్లాడేది కల్పిత పాత్రల గురించి అయినా, వాస్తవ పరిస్థితుల గురించి అయినా అందులో నిజమెంత? అనేది ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులను గమనించే.. జర్మన్ సోషలిస్ట్ రాజకీయవేత్త, రచయిత, వక్త అయిన ఆగస్ట్ బాబెల్ ఇలా అన్నారు.. ''ప్రజలు - వాస్తవమైన ఆనందమేమిటో గ్రహించిన రోజున, ఆ ఆనందాన్ని పొందడం సాధ్యమేనని తెలుసుకున్న రోజున మతం అదృశ్యమవుతుంది! అయితే పాలక వర్గాలు తమ ప్రయోజనాల రీత్యా - ప్రజలు ఆ విషయం తెలుసుకోకుండా అడ్డుపడుతుంటారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఉపయోగిస్తుంటారు!'' ఇదెప్పుడూ? వంద ఇరవై యేండ్ల క్రితం చెప్పిన మాట! మనిషి ఒక వైపు వైజ్ఞానికంగా ఎదుగుతూ ఉంటే.. మరొక వైపు నైతికంగా పతనమవుతున్నాడు. అందుకే అబద్దానికీ నిజానికీ నిరంతరం భీకర పోరాటం జరుగుతూ ఉంది. అందుకే, ఆలోచనల్లో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు