Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబర్ 13, 2006లో ఐక్యరాజ్యసమితి వికలాంగులకు గౌరవం, స్వయం నిర్ణయాధికారం, వివక్షలేని సమాజం, అవకాశాలలో సమానత్వం, వైకల్యం గల వ్యక్తుల హక్కుల పట్ల గౌరవం ఇలా ఏన్నో అంశాలతో తీర్మానం చేసింది. ఇట్టి తీర్మానానికి భారత ప్రభుత్వం అక్టోబర్ 1, 2007న ఆమోదం తెలిపింది. ఆ రోజు నుండి దీనిని అమలు చేయడానికి 2011లో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ద్వారా బారత ప్రభుత్వం వైకల్యం గల వ్యక్తుల కోసం చట్టం చేసింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర బిల్లుతో పాటు ఇది కూడా ఆమోదానికి రావడం జరిగింది. కానీ అప్పుడు ఆమోదానికి ఆలస్యం అయినా మల్లికార్జున కర్గే, సీతారాం ఏచూరి లాంటి ఎంపీల చొరవతో 2016లో ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం అమలులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో ప్రవేశ పెట్టే బడ్జెట్లో లక్ష కోట్లకు 5వేల కోట్లు కేటాయించాలి. అంటే ఈ లెక్క ప్రకారం గత ఎనిమిది బడ్జెట్లలో లెక్క తీసుకుంటే దాదాపు 30వేల కోట్ల పైనే వస్తుంది. ఇందులో ఒకశాతం కుడా కేటాయించలేదు సరికదా, కేటాయించిన నిధుల్లో కూడా శాఖ తీవ్ర జాప్యంతో వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి
ఈ చట్ట ప్రకారం ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. క్యాడర్ స్ట్రెంత్ అనగా ప్రస్తుతం ఒక శాఖలో ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 4శాతం మంది వికలాంగులు ఉండాలి. లేకపోతే సత్వరమే ఎన్ని ఉద్యోగాలు వికలాంగుల కోసం నింపాలో గుర్తించాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలలో 4శాతం ఉండే విధంగా చూసుకోవాలి. కాని ఈ ప్రభుత్వం ఈ విషయం విస్మరించింది. దీనికి తోడు బ్యాక్లాగ్ ఉద్యోగాలను సైతం నింపడంలో అలసత్వం పాటిస్తోంది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఎల్బీనగర్లోని సాగర్‌రింగ్ రోడ్డు వద్ద ఉన్న గవర్నమెంటు వికలాంగుల హౌమ్ హాస్టల్లో బొమ్మకంటి మహేందర్, ఆ తర్వాత హన్మకొండలో గవర్నమెంటు హౌం హాస్టల్లో రాగుల రామ్మోహన్ అనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి ప్రభుత్వ హత్యలు కావా?
అలానే ఈ చట్టం సెక్షన్ 19-2 3 ప్రకారం నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన చెయాలి చేయలేదు. సెక్షన్ 24-30 ప్రకారం సామాజిక భద్రత, ఆరోగ్యం, పునరావాసం, వినోదం అమలు చేయకపోగా, కేసీఆర్ 2014లో అధికారంలోకి వేస్తే వికలాంగులకు హెల్త్ కార్డులు ఇస్తాం అని చెప్పి కూడా మరచిపోయారు. సెక్షన్ 36 ప్రకారం ప్రత్యేక ఎంప్లారుమెంట్ ఎక్సేంజ్‌ను ఎర్పాటు చేయాలి. ఇది ఈ రోజుకి ఊసేలేదు. సెక్షన్ 37ప్రకారం ప్రత్యేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇవి నేటికీ ఒక్క అడుగు కూడా పడకపోను ఉన్న వాటినే ఎత్తి వేస్తున్నారు. సెక్షన్ 38(1) ప్రకారం వైకల్యం గల వ్యక్తులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారు.
సెక్షన్ 37-b ప్రకారం, అన్ని రకాల సంక్షేమ పథకాల్లో 5శాతం, సెక్షన్ 24-1 ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్దిలో 25శాతం అధికంగా ఇవ్వాలి. గతంలో ఈ చట్టం ఆమోదించి కల్యాణలక్ష్మి పథకంలో 25శాతం అధికంగా ఇవ్వాలని ప్రత్యేక అదేశాలు జీఓ ఇచ్చారు. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాల్లో 5శాతం ఇవ్వాలని కూడా అదేశాలు (జీఓ నెం.1 తేదీ:16.1.2018) ఇచ్చారు. కానీ అమలు చేయడంలో మరచిపోయారు.
సెక్షన్ 79(1) ప్రకారం రాష్ట్ర కమిషనర్‌ను నియమించాలి. కానీ అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఊసేలేదు. ఈ చట్టం ప్రకారం మరో 14రకాల వికలాంగులను నేటికీ గుర్తించలేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఐదేండ్లు అయ్యింది. కానీ లక్షల మంది వికలాంగులు కనీసం ఆసరా ఫించన్ కుడా పొందలేక పోతున్నారు. మూడు సంవత్సరాలుగా కొత్త పింఛన్ లేదు అంటే దాదాపు 60శాతం మందికి పైగా ఈ పింఛన్ అవకాశం కొల్పుతున్నారు.
అనేక విషయాలలో వికలాంగులకు దక్కే అవకాశాలను దక్కకుండా చేశారు. అందులో ముఖ్యంగా మోటార్ వెహికల్ ఉన్న ప్రతి వికలాంగుడికి రూ.500ల పెట్రోల్ సబ్సిడీ ఇవ్వాలి, ఇవ్వడంలేదు. ఉపాధి హామీ పథకం కింద వికలాంగులకు 150రోజుల పని కల్పించాలి, కల్పించడం లేదు. మానసిక వికలాంగుల కేంద్రాలు ఏర్పరచాలి. ఏర్పరచక పోను ఆరం ఘార్లో 50ఏండ్లుగా ఉన్న కేంద్రాన్ని మూసివేశారు, టిసిపిసి కేంద్రాలు ఎత్తి వేస్తున్నారు. ఈ మధ్యనే నిమ్స్‌లో కేంద్రాన్ని ఎత్తి వేశారు. ఇక్కడ ట్రై సైకిళ్ళతో పాటు వికలాంగుల పరికరాలు అన్నీ ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ తక్కువ బడ్జెట్లో తయారు చేసుకొనే వాటిని కాస్తా ప్రయివేట్ కంపెనీలో ఎక్కువ రేటుకి కొని వికలాంగుల బడ్జెట్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. వికలాంగులకు 35కేజీల బియ్యం ఇచ్చే అంత్యోదయ కార్డులు కొత్తవి ఇవ్వకుండా ఆపేశారు. ఇలా చెప్పుకుంటే 100రకాల సంక్షేమ అంశాలను తుంగలో తొక్కి వికలాంగుల జీవితాలను దుర్భరం చేసారు. నేటికీ కేసిఆర్ గత 8 ప్రపంచ వికలాంగుల దినోత్సవా లలో ముఖ్యమంత్రి హౌదాలో ఒక్కసారి కూడా హాజరు కాలేదు.
- ముత్తినేని వీరయ్య
సెల్: 9848581806