Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాసంగిలో వరి వద్దే వద్దని, 'యాసంగి ధాన్యం కొనం' అని టీఆర్ఎస్ పాలకులు పదే పదే చెబుతున్నారు. 'ప్రతి గింజ కొంటామని' బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. యాసంగి వరి కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రి వర్గ సభ్యులు, కేంద్రం మంత్రులూ బీజేపీ రాష్ట్ర నాయకులు పరస్పర వ్యతిరేక ప్రకటనలతో, తీవ్ర పదజాలంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రైతులను గందరగోళ పరుస్తున్నారు. వరి కొనుగోలు విషయమై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ పార్టీ కపట నాటకాలు ఆడుతూ ఆందోళన చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వివిధ ప్రాజెక్టుల కింద, బోరుబావుల కింద సాగవుతోంది. రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఉన్న భూములన్నీ వరి సాగుకు అనుకూలం. ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లులేని సమయాల్లో ఆరుతడి పంటలకు అవకాశం ఇచ్చినా ప్రత్యామ్నాయ పంటలు ఏనాడూ సాగు చేయలేదు. ఆయకట్టు కింద కొందరు రైతులు తమ భూముల్లో బోరుబావులు వేసుకొని వరినే సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వల్ప సంఖ్యలో కొందరు మినుములు ఇతర పప్పు ధాన్యాలు సాగు చేసినప్పటికీ సాగు ఖర్చులు పోగా ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి రైతులకు అనుభవమే. ఆయకట్టుకింద భూములు చాలా వరకు వరి సాగుకు మినహా ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అనుకూలంగా లేవు. వరి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, మినుములు, కంది పండించినా వాటికి కనీస మద్దతు ధర గ్యారెంటీ లేదు. గత కొద్ది సంవత్సరాల క్రితం రాష్ట్రంలో పలు చోట్ల కంది పండిస్తే మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు విలవిలలాడి పోయారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరుతున్న ప్రభుత్వం, అందుకు సంబంధించి విత్తనాల సరఫరా, మార్కెట్లో కనీస మద్దతు ధర గురించి ఏ విధమైన పక్కా ప్రణాళిక ప్రకటించలేదు. వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనంటున్నది కాబట్టి యాసంగిలో రైతులు వరి పండిస్తే మాకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి తేలికగా చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచి కొనిపిస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనలతో రైతులు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు.
యాసంగి వరి సాగు గురించి బీజేపీ టీఆర్ఎస్ పార్టీల పరస్పర ప్రకటనలు, ఆరోపణలు 'నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించు...' అన్నట్టుగా ఉన్నాయి. ఈ బీజేపీ, టీఆరెస్లు పరస్పర విరుద్ద ప్రకటనల ద్వారా రైతుల సమస్య ప్రభుత్వాలకు సంబంధం లేనిదన్నట్టుగా రాజకీయ విన్యాసాలు చేస్తున్నాయి. ఈ వాగ్వాదం అంతా యాసంగి పంట మీద జరుగుతోంది. అయితే, వానాకాలం పంటకు ఇప్పటికీ కొనుగోలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కానీ వానకాలం వరి అనేక చోట్ల రోడ్లమీద, కల్లాలలో తడిసి ముద్దయి పోయేవరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇదిలా ఉండగా, యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు తాజాగా ఉచిత సలహా ఇవ్వటం విడ్డూరంగా ఉంది. ఆయకట్టు కింద తరి భూముల్లో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా రైతుకు గిట్టుబాటు అవుతాయో ఫామ్ హౌస్ సేద్యం చేస్తున్న కేసీఆర్కు తెలియకపోవడం విచారకరం. ఇప్పటికైనా ముందుగా ప్రకటించిన మేరకు వానకాలం వరి ధాన్యాన్ని (తడిచిన ధాన్యంతో సహా) మొత్తం ఏ సాకులు చూపకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లని నిర్వీర్యం చేసి అంబానీ అదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు రైతుల కష్టాన్ని తాకట్టు పెట్టేందుకు, బీజేపీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో సుమారు 700మంది రైతుల బలిదానాలు జరిగాయి. ఈ పోరాటానికి టీఆర్ఎస్ ఏనాడూ చిత్తశుద్దితో మద్దతు ఇవ్వలేదు. దేశంలో దిగజారిపోయిన తమ పాలనా ప్రతిష్ట, రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీ పాలకులు, తమ దుర్మార్గమైన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. తదనంతర రాజకీయ పరిణామాలలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయితే తాము ముందుగా ప్రకటించినట్టు వానకాలం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యతను మాత్రం పూర్తి చేయలేదు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కావు. బీజేపీ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. వ్యవసాయ రంగ విధానం రెండు పార్టీలకు ప్రభుత్వాలకి సంబంధించిన ఉమ్మడి అంశం అని గుర్తించాలి. గతంలో అనేక సార్లు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుగా నిలబడటం జరిగింది. డిమానిటైజేషన్, జీఎస్టీ మొదలగు చట్టాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం బహిరంగ రహస్యమే. కానీ ఇప్పుడేమో వరి కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం, తీవ్ర ప్రత్యర్ధుల్లా, ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ధర్నాలు చేస్తూ, ఈ రెండు పార్టీలు ద్వంద వైఖరి అవలంభిస్తూ నాటకాలు ఆడుతున్నాయి. వరి కొనుగోలు అంశం నుంచి దృష్టి మల్లించడానికి, రైతాంగాన్ని దగా చేయడానికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం నాటకీయ విమర్శలతో అయోమయం సృష్టి స్తున్నాయి.ఈ విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో వరి సాగు తప్ప మరో మార్గం లేదు. దీన్ని ప్రభుత్వాలే నిషేధించినంత పని చేస్తే, లక్షలాదిమంది ఆయకట్టు రైతుల జీవనం దుర్భరం అయిపోతుంది. వందలాది రైస్ మిల్లులు మూత పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడతారు. బియ్యం ధరలు కొండెక్కుతాయి. స్థూలంగా అధ్యయనం చేస్తే సరైన ప్రత్యామ్నాయం, శాస్త్రీయమైన ప్రణాళిక లేకుండా, వరి సాగును నిషేధించడం వలన లక్షలాది మంది రైతులతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల్లో జీవిస్తున్న శ్రామికుల జీవనం దుర్భరంగా మారిపోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పాలకులు గుర్తించాలి. ఈ సమస్య రైతులకే పరిమితం కాదు. వివిధ వర్గాల, వృత్తుల ప్రజా జీవనాన్ని కుదిపి వేస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి సమస్త ప్రజానీకం మద్దతుగా నిలబడాలి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను, కపట నాటకాలని ఎండగట్టాలి.
- జూలకంటి రంగారెడ్డి