Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటన్న చర్చ మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రైతాంగ ఉద్యమం ముందు కేంద్రం తలవంచక తప్పని పరిస్థితి ఈ చర్చను వేగవంతం చేసింది. కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం రూపొందుతుందన్న మమత బెనర్జీ ప్రకటన మరింత లోతైన చర్చకు దారితీసింది. కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో బీజేపీ పాలనకు ప్రత్యామ్నాయం సాధ్యమా? అన్న ప్రశ్న ముందుకొచ్చింది. సహజంగానే మమత ప్రకటన కాంగ్రెస్‌కు ఆగ్రహం కలిగించింది. తాము ఏమీ చేయకపోయినా, మోడీ ప్రభుత్వంమీద అసంతృప్తి పెరిగినప్పుడు ప్రజలు కాంగ్రెస్‌వైపే చూస్తారని వారి నమ్మకం. ఇలాంటి మైకంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మమత ప్రకటన పట్ల భగ్గుమనకుండా ఎట్లా ఉండగలరు? ఇక్కడ కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడినవాడే. ఎందుకోగానీ... ఈ మధ్య ఆ ఫ్రంటు ఊసెత్తటం లేదు. మరోవైపు శరత్‌పవార్ కూడా బీజేపీ వ్యతిరేక రాజకీయ సమీకరణల కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఏలాంటి ప్రత్యామ్నాయంలోనూ తాను భాగస్వామి కాజాలనని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ వయస్సులో శరద్‌పవర్ ఏమిచేయగలడని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. అటల్‌బిహారీ వాజ్‌పాయి, పీవీ నర్సింహరావు, శంకర్ దయాళ్శర్మలకు అడ్డురాని వయోభారం శరద్‌పవార్‌కు మాత్రం ఆటంక మవుతుందా? అని సమాధానం చెప్పేవారూ ఉన్నారు.
బీజేపీ నేతలు మాత్రం మోడీని ఎదిరించి నిలువగల రాజకీయశక్తి సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. లోపల గుండె కొట్టుకుంటున్నప్పటికీ బయటికి మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎన్నికల నాటికి మతపరమైన విభజననో, చైనా వ్యతిరేకతనో, పాకిస్థాన్ వ్యతిరేకతనో రెచ్చగొట్టి మోడీ, అమిత్‌షాలు గట్టెక్కించలేకపోతారా అన్నది వారి నమ్మకం. నిజానికి ఆరెస్సెస్ ఆపనిలోనే ఉన్నది. మరోవైపు కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని కోరుకునే ప్రజాస్వామిక వాదుల్లో కూడా కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈడీనీ, సీబీఐనీ ప్రయోగించి నాయకులనూ, పార్టీలనూ లొంగదీసు కోవటంలో ఆరెస్సెస్, బీజేపీలు దిట్టలు. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించగల స్థితిలో ఇతర ప్రాంతీయ పార్టీలు ఉంటాయా? అన్న అనుమానం వీరిని వెన్నాడుతున్నది.
నిజమే... కాంగ్రెస్ నియంతృత్వాన్ని ఎదిరించి, ఇతర వామపక్షేతర పార్టీలు నిలువడానికి మూడు దశాబ్దాలు పట్టింది. అయినా కాంగ్రెస్‌ను 1977లో దేశవ్యాపితంగా మట్టిగరిపించగలిగారు. ఇప్పుడు కేంద్రంలో మోడీ నిరంకుశ పాలనను తట్టుకుని నిలబడటం అంత సులభం కాదన్న భావన ఎంతోకాలం నిలబడలేదు. ఈ ఏడేండ్లలోనే కేంద్రంలో బీజేపీ పాలనకు ఎదురుగాలి తిరిగింది. ఇదే సమయంలో వామపక్షాలు బలహీనపడ్డాయి. బెంగాల్, త్రిపురలో తమ ప్రభుత్వాలను కోల్పోయాయి. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఎర్రజెండా చేయగల్గేదేమీ లేదని బీజేపీ నేతల వాదన. అట్లా వాదించే హక్కు వారికున్నది. అధికారం పట్టు సడలుతున్నదన్న ఆందోళనలో మరింత గట్టిగా వాదించటం సహజం. కాని చరిత్రను అధ్యయనం చేసిన వారికి ప్రస్తుత పరిస్థితి మరోవిధంగా కనబడుతుంది. ఎమర్జెన్సీ కాలంలో వామపక్షం ఐక్యంగా లేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పేరుతో నియంతృత్వపాలన నెలకొల్పడాన్ని సీపీఐ సమర్థించింది. సీపీఐ(ఎం) వ్యతిరేకించింది. జనతాపార్టీకి మద్దతునిచ్చింది. ఇప్పుడు వామపక్షం ఐక్యంగా ఉన్నది. మోడీ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది. ఎమర్జెన్సీ నియంతృత్వ పాలన సమయంలో వామపక్ష కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇప్పుడు మోడీ నియంతృత్వ పాలన సమయంలో కేరళలో సీపీఐ(ఎం) నాయకత్వంలో వామపక్ష, ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం ఉన్నది. చారిత్రాత్మక విజయం సాధించింది. ఆనాడు జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సంపూర్ణ విప్లవం పేరుతో ఉత్తర భారతంలో ప్రజా ఉద్యమం సాగింది. ఇందిర పాలనను సవాలు చేసింది. కానీ 'సంపూర్ణ విప్లవం' నినాదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. ఇప్పుడు ఏడాది కాలంగా రైతాంగ ఉద్యమం నడుస్తున్నది. నిర్దిష్ట నినాదాలతో పాలకులను నిలదీస్తున్నది. మోడీ పాలనను సవాలు చేస్తున్నది. రైతు సంఘాలు, కార్మికసంఘాలు కలిసి నడవటం మరో ప్రత్యేకత. 1975 నాటికి జాతీయ స్థాయిలో కార్మికవర్గ పోరాటం ప్రాథమిక దశలోనే ఉన్నది. కానీ తర్వాత కాలంలో 20జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మెలు జరిగాయి. 2020 నవంబర్ 26 సమ్మెలో కార్మికులు, రైతులు కలిసి నడిచారు. రానున్న ఫిబ్రవరిలో 21వ సార్వత్రిక సమ్మెకు కార్మికవర్గం, రైతాంగం సమైక్యంగా సన్నద్ధమవుతున్నది. అందువల్ల ప్రభుత్వ విధానాలను నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ అడ్డుకోజాలరు. అప్పటికే ఉన్న ప్రతిపక్షాలు, వామపక్షాల బలాబలాలతో కూడా నిమిత్తం లేదు. ప్రజా ఉద్యమం, అసంతృప్తి కీలకపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు జరగబోతున్నదీ అదే! ఈ పరిస్థితుల వల్లనే బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం గురించి చర్చ మొదలైంది.
ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయశక్తిలేని కాలమది. అయినా ప్రజా ఉద్యమమే జనతా పార్టీ రూపంలో ప్రత్యామ్నాయాన్ని సృష్టించింది. ఇప్పుడు మోడీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తి తయారుగాలేని బలహీనత వ్యక్తమవుతున్నది. ప్రజలకు అలాంటి విశ్వాసం కలిగించగల స్థితిలో కాంగ్రెస్ లేదు. విధాన పరంగా గానీ, బలా బలాల పరంగా గానీ, తగిన నాయకత్వం లేని స్థితివల్ల గానీ... ఏవిధంగా చూసినప్పటికీ కాంగ్రెస్ అలాంటి స్థానం కోల్పోయింది. దేశంలో 1970 దశకంలో ఎమర్జెన్సీ పేరుతో పచ్చి నియంతృత్వం అమలు జరిపింది కాంగ్రెస్. అదే కాలంలో పశ్చిమబెంగాల్లో వామపక్ష ఉద్యమం మీద భయానక దాడులు చేసింది. అర్థఫాసిస్టు దమనకాండ సాగించింది. దానికన్నా ముందే కేరళలో అరాచకం సృష్టించి వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో కూడా హత్యారాజకీయాలు నడిపింది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. ఫెడరల్ రాజ్యాంగాన్ని ఖాతరు చేయలేదు. బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా తెగబడింది. అందువల్ల ఇప్పుడు మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటం కాంగ్రెస్ రాజకీయ విధానం కాదు. అలాంటి పోరాటానికి దానికి నైతిక స్థైర్యం కూడా లేదు. మరోవైపు దేశంలో అత్యధిక రాష్ట్రాలలో బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ లేదు. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఓడించగల ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్నాయి. కనీసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విశ్వాసాన్ని ఇవ్వగల నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. జాతీయస్థాయిలో నాయకత్వ శూన్యతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌పార్టీ, రాష్ట్రాల స్థాయిలో చేయగలిగింది పరిమితమే!
కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలలో అవకాశవాదం పెరిగింది. నియంతృత్వానికీ, మతోన్మాదానికీ వ్యతిరేకంగా నికరంగా నిలబడటం కన్నా తమ రాజకీయప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నాయి. తమ ప్రయోజనాలను బట్టి కాంగ్రెస్, బీజేపీలలో ఎవరితో సర్దుబాటుకైనా సిద్ధపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి కూడా వెనుకాడటంలేదు. దీని ఫలితమే ఎన్డీయే, యూపీఏల ఆవిర్భావం. కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ నియంతృత్వ పాలన తట్టుకోలేక, ప్రాంతీయ పార్టీలు క్రమంగా దూరమవుతున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత మూడు దశాబ్దాల పాటు దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్ర పోషించాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడింది. ఆ మూడు దశాబ్దాల కాలంలో పోషించిన పాత్ర కూడా ఇప్పుడు పోషించగల స్థితిలో లేదు. అత్యధిక రాష్ట్రాలలో బీజేపీని ఓడించగల ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు తామే ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్రయత్నించటం సహజం. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీల మధ్య సంప్రదింపులు ఊపందుకుంటున్నాయి. ఈ ప్రయత్నాలలో మమతబెనర్జీ కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. శరద్ పవార్ తన రాజకీయ చాణక్యత ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఏరూపంలో రానున్నదో వేచి చూడాల్సిందే. ఒకటి మాత్రం స్పష్టం. ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నిలబడగల రాజకీయ శక్తి కనిపించని దశలో జైళ్ళలో రూపుదిద్దుకున్నది జనతాపార్టీ. అనేక పార్టీల కలయికతో ఏర్పడింది. ఆనాటికన్నా ప్రాంతీయ పార్టీలు మరింత ముఖ్యపాత్ర పోషిస్తున్న కాలమిది. మోడీ పాలనను తిరస్కరించాలని ప్రజలు నిర్ణయించు కున్నప్పుడు ప్రత్యామ్నాయం రూపొందటం అనివార్యం.
కేంద్రంలో సంకీర్ణ పాలన సాగిన మూడు దశాబ్దాలలో పార్లమెంటరీ రంగంలో వామపక్షాల బలం పెరిగింది. మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్లో ఎప్పుడూ లేనన్ని స్థానాలు వామపక్షాలకొచ్చాయి. వీటి ప్రభావంతో సంకీర్ణ రాజకీయాలలో వామపక్షాలు జాతీయస్థాయిలో కూడా ముఖ్యపాత్ర పోషించాయి. కానీ నేటి పరిస్థితి వేరు. ఈ నేపథ్యంలో మోడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నికల రంగంలో, రాజకీయ శక్తులను కూడగట్టటంలో వామపక్షాల చొరవకు పరిమితులేర్పడ్డాయి. వామపక్షాలకు సంబంధించినంత వరకు అనుక్షణం ప్రజలకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నించాలి. ప్రజలలో స్థానాన్ని బలపర్చుకోవాలి. సొంత ప్రజా పునాది పెంచుకోవాలి. కేంద్రంలో బీజేపీని ఓడించగల స్థితిలో ఎవరున్నా వామపక్షాలు సహకరించడానికి వెనుకాడవు. కానీ, పరిస్థితులు ఇట్లానే ఉన్నంత కాలమే ప్రాంతీయ పార్టీలకు కూడా అవకాశం ఉంటుంది. బీజేపీ, ఆరెస్సెస్‌లు భావోద్వేగాలు రెచ్చగొట్టటం మొదలుపెడితే కాంగ్రెస్‌గానీ, ప్రాంతీయ పార్టీలు గానీ చేయగలిగింది పరిమితమే. లౌకిక విలువల పట్ల ఆయా పార్టీల నాయకత్వాల అవకాశవాదం వల్ల, వారి శ్రేణులు కూడా భావోద్వేగాలకు ప్రభావితమవుతున్నారు. భావోద్వేగాలను అధిగమించి, బీజేపీని ఓడించటం వర్గపోరాటానికే సాధ్యం. ప్రజా ఉద్యమానికే ఆ శక్తి ఉన్నది. ఏడాదిగా సాగుతున్న రైతాంగ పోరాటం, కార్మిక, కర్షక శ్రేణులు కలసి నడుస్తున్న తీరూ నేర్పుతున్న పాఠం ఇదే!
- ఎస్. వీరయ్య