Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన, యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ
అని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అంటే ఒక మనిషి ఎలాంటి ఊరిలో ఉండాలంటే అక్కడ వైద్యుడు ఉండాలి, అప్పిచ్చువాడు ఉండాలి, ఎప్పుడూ పారే ఏరు ఉండాలి, మంచి స్నేహితుడు ఉండాలి అలా లేని ఊరిలో ఉండవద్దు అని చెప్పాడు. తమాషా ఏమిటంటే ఇప్పుడు మనుషులకే కాదు ప్రభుత్వాలకూ ఆ సూత్రాలు సరిపోతాయి. అన్ని ప్రభుత్వాలకు అప్పిచ్చువాడు కావాలి, కరోనా కాలం కాబట్టి వైద్యుడు కావాలి, ఇక శత్రువులు ఎక్కువవుతున్నారు రాజకీయాల్లో అన్న కారణం పట్టుకొని మిత్రులు కావాలి. అలా ఆ పద్యాన్ని ఉపయోగించుకుంటున్నారు నాయకులు. ఏరు మాత్రం మన ఊర్లలోకే వచ్చేస్తోంది. అది ప్రత్యేకత. మానవులు తాము నివసించే గ్రహాన్ని చేజేతులా తామే చెడగొట్టుకోవడం కొసమెరుపు.
ఇక విషయంలోకి వస్తే, ''కొట్టువాడు, తిట్టువాడు?!, తాగుడుకు పైసలడుగువాడు, కయ్యాలు పెట్టుకొనువాడు...'' అంటూ కొత్తగా పద్యం రాసుకోవాలి మనం. నేటి భర్తలు కొందరు ఇలాంటి కోవకు చెందుతారు. అసలుకొట్టే అధికారం ఆ భరించే భర్తకు ఎవరిచ్చారు? ఇక్కడ భరించే అంటే భర్త భరిస్తున్నాడు అని కాదు భార్యే భర్తని భరిస్తోంది అని కూడా అర్థం చేసుకోవాలి. ఈ భరించడం, కొట్టడం గురించి కొంత చెప్పుకోవాలి. చిన్నప్పుడు మా సారు ముందురోజు చెప్పిన పాఠంలో ప్రశ్నలు వేసే వాడు. చెప్పని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు అలాగే నిలబడాలి. చెప్పేస్తే కూచోవచ్చు. అలా నిలబడిన వాళ్ళని బెత్తంతో చేతి మీద కొట్టి పోయేవాడు. సారు కాబట్టి కొట్టినా తప్పు లేదని, అది ఆమోదయోగ్యాంగా మారింది. ఇంట్లో అమ్మా నాన్న కూడా అంతే, కొట్టినా తప్పు లేదు అని తరువాత తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మన బాగు కోరేవారు కాబట్టి. మనల్ని భరించేవాళ్ళు. ఆదరించేవాళ్ళు, జీవితంలో మనల్ని పైకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నవాళ్లు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే రెండూ నేరాలేనన్న సంగతి మరువరాదు. ఇక ఈ మధ్య ఓ వార్త, అదీ ఓ సర్వే చేశారట దాని గురించి. అదేమంటే భర్త భార్యను కొట్టవచ్చునట. అలా చెప్పింది ఎక్కువ భాగం స్త్రీలేననీ ఒక్కో రాష్ట్రంలో ఎంత శాతం మంది ఆ అభిప్రాయాన్ని సమర్థించారో కూడా ఇచ్చారు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఎవరు ఎవరిని కొట్టొచ్చు అన్న ప్రశ్న వెంటనే వచ్చింది. పైన చెప్పుకున్నట్టు టీచర్ విద్యార్థిని కొట్టొచ్చు. చాలా మంది ఒప్పుకుంటారు. తలిదండ్రులు పిల్లల్ని కొట్టొచ్చు. ఇదీ కొంతమంది ఒప్పుకుంటారు. కానీ ఆ రెండు ఉదాహరణల్లో వయసు తేడా, పాత్రల తేడా ఉంది కదా! మరి భర్త భార్యని కొట్టవచ్చు అన్న మాట ఎంత అన్యాయమైంది? ఇద్దరూ దాదాపు ఒకే వయసు వాళ్ళు, లేదా కొద్దిగా అటూ ఇటూ ఉండొచ్చు. ఇద్దరూ ఇంట్లో పని చేస్తారు. ఇద్దరూ బయట ఎదో ఒక ఉద్యోగమో, పనో చేస్తారు. ఇద్దరూ ఇంట్లో పనులు చూసుకుంటారు. ఇద్దరూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారు. ఆ లెక్కన ఇద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకోవచ్చునా అన్న సర్వే చేయాలి కానీ భర్త భార్యని కొట్టవచ్చునా అన్న సర్వే ఏమిటి అన్యాయంగా అని చాలా మందిమి అనుకుంటాము. లెక్క ప్రకారం భర్తని భార్య కొట్టవచ్చునా అన్న సర్వే చేయాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే. అప్పుడే న్యాయంగా ఉంటుంది. ఈ మాటన్నందుకు నన్ను కొట్టడానికి కొంతమంది సిద్ధం కావచ్చు, ఏమిటి ఈ మాటలు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కాదని ఇలా మాట్లాడతాడేమిటి అనుకోవచ్చు. అసలు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న మనల్ని సర్వేలు నాట్ నాట్ బి.సి కాలానికి తీసుకుపోయేలాగ ఉన్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి.
ఈ మధ్య ఒక బృందం తన గానం మొదలుపెట్టింది. అదేమంటే ఆడవాళ్లు ఇల్లు చూసుకోవాలట, మగవాళ్ళు ఉద్యోగాలు చేయాలట. వాళ్లకు ఈ సర్వే చాలా ఆనందాన్ని కలిగించి ఉంటుంది. అప్పుడు ఆర్థికంగా మగవాడి మీదే ఆధార పడతారు కాబట్టి ఇంకా జులుం చేయవచ్చునన్నది దాని వెనక రహస్యం. రెండువేల ఇరవై ఒకటి సంవత్సరం అయిపోయి రెండువేల ఇరవై రెండులోకి అడుగుపెడుతున్నాము. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని గుండమ్మ కథలో ఘంటసాల పాట వచ్చి అరవై సంవత్సరాలు కావస్తోంది, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించారు అని ఆ పాటలో ఉంది. ఆ మరుసటి సంవత్సరమే అంతరిక్షం లోకి సోవియెట్కు చెందిన వాలెంటినా తెరిష్కోవా పోయి వచ్చింది. ఆ తరువాత ఇంకా ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్నో దేశాల్లో రాజకీయ అధికారంలో, ఆర్థిక రంగంలో, విద్య, వైద్య రంగాల్లో ఇలా చెప్పుకుంటూ పొతే అన్నింటిలో మహిళలు ముందంజ వేశారు, వేస్తున్నారు, వేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచీకరణ కాలంలో మహిళలు సంపాదిస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అందుకే ఇంకా వెల్లువలా మహిళలు వచ్చి పని చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ సర్వే చేసిన వారి ఉద్దేశ్యం, మహిళల హక్కులు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడం కోసమే ఉండవచ్చు. కానీ పేపర్లలో రాసిన వార్తలు మాత్రం చాలామందిని గందరగోళానికి గురిచేశాయి. అసలు ఆ సర్వే చేసిన వాళ్ళు మహిళా సంఘాలను ప్రశ్నలు అడిగారా? ఇంకా ఎన్నో అభ్యుదయ సంస్థలు ఉన్నాయి, వారి నుండి సమాచారం, అభిప్రాయాలు సేకరించారా? అంతెందుకు మగవాళ్లు తమ భార్యను కొట్టవచ్చు అన్నప్పుడు కొట్టే వాళ్ళను వదిలిపెట్టి భార్యను బాగా చూసుకునే, సంస్కారంతో మెలిగే పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలేమిటి అన్న విషయాలు కూడా అందులో ఉండాలి కదా! సర్వే చేసాం, దాని రిపోర్టు ఇచ్చాం మా పని అయిపొయింది అన్నట్టు వదిలేస్తే సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్నిచ్చాం అధ్యక్షా అని ప్రశ్నించుకోవలసిన సమయం, సందర్భం ఇది.
అసలు ఒకరిని ఇంకొకరు కొట్టటం ఆటవిక కాలం అలవాటని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆధునిక మానవులు మాటల ద్వారానే సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలని అనుకుంటారు. ఇది మాత్రమే ఆమోదయోగ్యం మనకు.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298