Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రంట్లైన్ : వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనను మీరు ఎలా చూస్తారు? ఎన్నికల ఒత్తిడికి లేదా రైతుల ఉద్యమం ఒత్తిడికి ప్రభుత్వం పూర్తిగా తలొగ్గిందని మీరు అనుకుంటున్నారా?
ఏచూరి : ఏడాదికి పైగా శాంతియుతంగా పోరాడుతున్న దేశవ్యాప్త రైతాంగ పోరాటాల ఫలితమే ఈ విజయం. రైతుల ఉడుం పట్టు ముందు మోడీ మంకుపట్టు వీడాల్సి వచ్చింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు సాగించిన విషప్రచారాలను, విచ్ఛిన్నకర కుట్రలను ఈ ఉద్యమం అధిగమించింది. ఈ పోరాటం అన్ని రకాల అణచివేతలను అధిగమించింది. ఢల్లీలోనూ, వివిధ రాష్ట్రాల్లో గడ్డకట్టే చలికాలంలో కూడా ప్రభుత్వాలు రైతాంగంపై నీటి ఫిరంగులతో దాడి చేశాయి. సరిహద్దుల్లో శతృదేశ సైనికులు ప్రవేశించకుండా కందకాలు తవ్వి ముళ్ల కంచెలు, ఇనుప శూలాలతో దారిని నింపినట్లు రైతు నిరసన శిబిరాల చుట్టూ మోడీ ప్రభుత్వం కందకాలు తవ్వి ఇనుప శూలాలు గుచ్చింది. రైతులు ఢల్లీ చేరకుండా ఊహించనలవి కాని అవాంతరాలు సృష్టించింది. లాఠీలతో రైతాంగం తలలు పగలకొట్టింది. అడ్డు అదుపు లేకుండా అరెస్టులుచేసింది. రైతు ఉద్యమ నాయకులపై దేశ ద్రోహం నేరాన్ని మోపింది. రైతులు ఉగ్రవాదులనీ, జాతిద్రోహులనీ, దేశాచ్చి చీల్చే ముఠా అని విమర్శించింది. రైతు ఉద్యమాన్ని కించపర్చటానికి మోడీయే స్వయంగా ఆందోళన జీవులన్న పదాన్ని తెరమీదకు తెచ్చారు. ఇలా ఎన్ని అవరోధాలు సృష్టించినా లక్షల మంది రైతులు ఢల్లీ సరిహద్దులకు చేరారు. ఏడాది పాటు నిరసన శిబిరం నడిచింది. అ ఉద్యమం స్ఫూర్తితో రాష్ట్రాల స్థాయిలో కూడా వివిధ రూపాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు సాగాయి.
ఎన్నికల అవసరాలు, అవి ముందుకు తెచ్చిన ఒత్తిళ్తు కూడా ఈ నిర్ణయానికి నిస్సందేహంగా ఓ కారణం. నిజానికి ప్రభుత్వం నిర్ణయంలో చిత్తశుద్ధి లేదని రైతులు గమనిస్తున్నారు. నికార్సైన ఎన్నికల అవకాశవాద చర్య అని రైతులు గుర్తిస్తున్నారు. అయినా ఈ నిర్ణయం రానున్న ఎన్నికల్లో మోడీ ప్రతిష్ట పెంచేందుకు కానీ, పార్టీని అధికారానికి తెచ్చేందుకు కానీ దోహదం చేసే అవకాశం పరిమితమని భావిస్తున్నాను. రైతులు శాంతియుతంగా సాగిస్తున్న ఉద్యమం, దాని తీవ్రత, ఉద్యమకారుల నిబద్ధత మోడీ ప్రభుత్వం మెడలు వంచింది. ఇది ప్రజాస్వామ్యపు విజయం. ప్రజాస్వామిక హక్కులకు, పౌర హక్కులకు దక్కిన విజయం. ఈ విజయానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాస్వామిక హక్కులపై ఫాసిస్టు శక్తుల దాడి పెచ్చరిల్లుతున్న తరుణంలో సాధించిన విజయం ఇది.
ఫ్రంట్లైన్ : ఈ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ గుత్తాధిపత్యం, పలుకుబడి, ప్రభావానికి లోనైన ప్రభుత్వం ఆమోదించిన చట్టాలని చెపుతున్నారు. వామపక్షాలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాయి. ప్రయివేటు గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాయి. కానీ ఇంతవరకూ పార్లమెంట్ ద్వారా రూపొందిన చట్టాలను ఏ ప్రభుత్వమైనా వెనక్కు తీసుకోలేదు. రైతు ఉద్యమం సాధించిన విజయం భవిష్యత్తులో ప్రజాస్వామిక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని భావిస్తున్నారా? ఈ వాదనలో మెరిట్ ఉంటుందా? ఇతర ప్రజాస్వామిక పోరాటాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఏచూరి : నిస్సందేహంగా. మోడీ ప్రభుత్వం వెనకంజ వేయటం రానున్న కాలంలో ప్రజాతంత్ర ఉద్యమాలకు ఊపిరులూదే పరిణామే అనటంలో సందేహం లేదు. ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలపై కూడా ఈ విజయం ప్రభావం చూపనుంది.
అవును. ఈ వ్యవసాయక చట్టాలు కార్పొరేట్ ప్రయోజనం కోసం వచ్చినవే. దేశీయ కంపెనీలు, విదేశీ కంపెనీలు ఈ చట్టాల ద్వారా లబ్ది పొందనున్నాయి. భారత సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టి మోడీ ప్రభుత్వం ఉధృతంగా అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితమే ఈ చట్టాలు. వ్యవసాయాన్ని మార్కెట్ శక్తుల వశం చేయటం, సేద్యపు పగ్గాలు కార్పొరేట్ శక్తులకు అప్పగించటమే ఈ చట్టాల సారాంశం. నిత్యావసర సరుకుల చట్టంలో తెచ్చిన సవరణ వ్యవసాయోత్పత్తుల అక్రమ నిల్వలకు చట్టబద్ధత కల్పిస్తుంది. కృత్రిమ కొరతలు సృష్టించి ధరలు ఆకాశానికి ఎగిసేలా చేయటానికి ఈ సవరణలు అవకాశం ఇస్తున్నాయి. ఈ పరిస్థితులు పాలకులు సృష్టించే కృత్రిమ కరువుకు కారణం కానున్నాయి. ఆహార భద్రత, ఆకలిగొన్న వారికి ఆహారం అందించటం వంటి మౌలిక కర్తవ్యాలకు ప్రమాదం ఎదురవుతుంది. ప్రపంచ ఆకలి సూచికల్లో భారతదేశపు స్థానం వేగంగా పడిపోతోంది. ఈ చట్టాలు అమలైతే రానున్న కాలంలో ఈ పరిస్థితి మరింత విషమిస్తుంది.
ప్రజోపయోగ సేవలు, ఖనిజవనరులు, ప్రభుత్వరంగం వంటి జాతీయ సంపదలను ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), ఇతర వామపక్షాలు నిరంతర పోరాటాన్ని సాగిస్తూనే ఉంటాయి. ఆయా రంగాల కార్మికులు సమ్మెలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు, ఉద్యమాలు ఉధృతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. సీపీఐ(ఎం), వామపక్షాలు కార్మికవర్గం సాగిస్తున్న ఈ పోరాటాలకు సంఘీభావం వ్యక్తం చేయటమే కాక ప్రత్యక్షంగా ఆ పోరాటాల్లో పాల్గొంటున్నాయి. ఈ పోరాటాలు రానున్న కాలంలో మరింత ఉధృతం కానున్నాయి. బలం పుంజుకోనున్నాయి.
కార్మికవర్గం, వ్యవసాయ కార్మికవర్గం సాగించే పోరాటాలతో తనను తాను మమేకం చేసుకోవటమే సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సాగుతున్న రైతు ప్రతిఘటన ప్రత్యేక లక్షణం. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల మధ్య బలోపేతమవుతున్న ఈ ఐక్యత రానున్న కాలంలో లౌకిక ప్రజా తంత్ర హక్కుల పరిరక్షణ కోసం సాగే ఐక్య ఉద్యమాలకు పునాదులు వేస్తుంది.
ఫ్రంట్లైన్ : వ్యవసాయక చట్టాలు వెనక్కు తీసుకోవటం వలన కేవలం పంజాబ్, హర్యానాల్లోని ధనిక రైతాంగానికి మాత్రమే ఉపయోగమన్న వాదన బలంగా ముందుకొస్తోంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
ఏచూరి : ఈ వాదన ఊహాజనితం. ఉద్దేశ్యపూర్వకంగా సాగుతున్న దుష్ప్రచారంలో ఇది కూడా ఓ భాగం. మార్కెటీకరణ, కార్పొరేటీకరణ కారణంగా రైతాంగం దారుణంగా దెబ్బతిన్నది. దేశంలోని రైతాంగంలో 85శాతం రైతాంగానికి రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి ఉన్నది. వీళ్లంతా చిన్న సన్నకారు రైతులే. తాజా చట్టాలు చిన్నసన్నకారు రైతాంగం చేతుల్లోని భూమిపై కార్పొరేట్ కబ్జాకు మార్గం సుగమమం చేస్తాయి. ఈ చట్టాలు అమలైతే చిన్నసన్నకారు రైతులు తమ స్వంత భూములు కోల్పోయి కూలీలుగా మారతారు.
కనీస మద్దతు ధర కొన్ని రాష్ట్రాల్లోనే కొన్ని పంటలకు మాత్రమే పరిమితమై అమలవుతోంది. అన్ని పంటలు కనీస మద్దతు ధరకు అమ్ముకునేలా రైతాంగానికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలన్న డిమాండ్ వలన యావత్ రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది. అందువల్లనే ఈ నినాదం చుట్టూ ధనిక, మధ్యతరగతి, చిన్నసన్నకారు రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, హిందు, ముస్లిం రైతులు అందరూ ఏకమయ్యారు. చారిత్రక పోరాటం నిర్వహించారు.
తమ అందరి ప్రయోజనాలు ఒక్కటే కావటంతో ఈ ఉద్యమంలోకి అన్ని తరగతులు, వర్గాల రైతులు అడుగు పెట్టారు. తమ భూములు, వ్యవసాయోత్పత్తులు కార్పొరేట్ శక్తుల పాలిటబడకుండా కాపాడుకున్నారు.
ఫ్రంట్లైన్ : వ్యవసాయ చట్టాలు రద్దు చేయటం ఆర్థికాభివృద్ధికి అవరోధం అన్న వాదన వినిపిస్తోంది. ఈ అభిప్రాయంలో ఏమన్నా పస ఉందని భావిస్తున్నారా?
ఏచూరి: ఈ వాదనలో ఏ మాత్రం పసలేదు. నిజానికి ఈ చట్టాల రద్దు వలన పతనమవుతున్న రైతాంగం, గ్రామీణ ప్రాంత వినియోగం కనీసం ఇప్పుడున్న స్థాయిలో యథాతథ స్థితిలో నిలిచి ఉంటుంది. ఆ రకంగా ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు మేలే చేస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం వలన దేశంలో ఆర్థికాభివృద్ధి మందగించింది. దాంతో దేశీయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోతోంది. గిరాకీ లేకపోవటంతో అనేక పరిశ్రమలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి.
కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ సమస్య మరింత దుర్భర స్థితికి చేరింది. సంపన్న వర్గాలకు అనుకూలంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చింది కానీ ఖాళీ కడుపులు నింపేందుకు ప్రయత్నం చేయలేదు. పైగా చమురు ధరలు వంటి అనేక నిత్యావసర ధరలు పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణంలోకి నెట్టింది. వీటన్నింటి ఫలితంగా ప్రజల చేతుల్లో కొనుగోలు చేయటానికి కావల్సిన రొక్కం మిగలకుండా పోయింది. కొనుగోలు సామర్ధ్యం లేకపోవటంతో వారి వినిమయ సామర్ధ్యం కూడా కుదించుకుపోయింది. కొన్ని కొన్ని కుటుంబాలు కనీస నిత్యావసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి నెట్టబడ్డాయి.
వ్యవసాయక చట్టాలు ఇప్పటికే అధోముఖంలో ప్రయాణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మరింత దుర్భరం చేస్తాయి. ఈ చట్టాలు రైతులకు వచ్చే ఆదాయాల కుదింపుకు దారితీస్తాయి. ఆదాయాలు లేనప్పుడు రైతుల వినియోగం కూడా తగ్గిపోతుంది. దేశంలో అతి పెద్ద మార్కెట్ గ్రామీణ భారతమే. ధనిక రైతులు మొదలు సన్నకారు రైతుల వరకూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగం దివాళా తీస్తే ఆర్థిక వ్యవస్థలో నికర గిరాకీ మరింత పడిపోతుంది. ఈ పరిస్థితులు ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని, స్తబ్దతను మరింత ఉధృతం చేయనున్నాయి.
ఫ్రంట్లైన్ : వ్యవసాయక చట్టాల వ్యతిరేక ఉద్యమం దేశంలోని అన్ని రైతు సంఘాలను ఏకం చేసింది. ఈ సంఘీభావం దీర్ఘకాలం కొనసాగుతుందని భావిస్తున్నారా? ఈ నేపథ్యంలో వామపక్షాలు పాత్ర ఎలా ఉండబోతోంది?
ఏచూరి : రైతాంగం ఎదుర్కొంటున్న న్యాయమైన తీవ్రమైన సమస్యలపై పోరాడానికి రైతాంగం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు సిద్దపడుతున్న నేపథ్యంలోనే వీరి మధ్య సంఘీభావం, సంయుక్త కార్యాచరణ సాధ్యమైంది. ఈ సంఘీభావం వ్యవసాయక చట్టాల రద్దుకు మాత్రమే పరిమితం కాలేదు. నవంబరు 22న లక్నోలో జరిగిన రైతు మహాపంచాయత్ని గమనిస్తే ఈ సంఘీభావం రానురాను బలపడుతోందని చెప్పవచ్చు.
ముందే చెప్పినట్లు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల మధ్య పెరుగుతున్న ఈ ఐక్యత ఓ ఉమ్మడి పోరాటానికి తెరతీసింది. ఈ ఉమ్మడి పోరాటంలో రైతాంగ డిమాండ్లతో పాటు కార్మికులు, వ్యవసాయ కార్మికుల డిమాండ్లు కూడా జతకలిశాయి. కార్మిక చట్టాలు, జాతీయ సంపదను గుత్తపెట్టుబడిదారులకు అప్పగించటం, ప్రయివేటీకరణ వంటి అనేక డిమాండ్లను ఈ సంయుక్త కిసాన్ మోర్చ చర్చకు పెట్టింది. ఈ ఉద్యమంలో సుమారు ఏడువందల మంది రైతాంగం అమరులయ్యారంటేనే ఈ ఉద్యమం శక్తి సామర్థ్యాలేమిటో అర్థమవుతుంది. ఈ మరణాల పట్ల మోడీ కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. ఇక ఆయా కుటుంబాలకు నష్టపరిహారం ప్రస్తావనకు తావెక్కడిది? ఈ రెండు సందర్భాలు ప్రభుత్వం వైఖరి ఏమిటో తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల స్వభామే ఆయా విధానాల కారణంగా నష్టపోతున్న వివిధ తరగతులు, వర్గాల మధ్య ఐక్యతను, సంఘీభావాన్ని రానున్న కాలంలో మరింతగా బలోపేతం చేస్తుంది.
- అనువాదం : కొండూరి వీరయ్య
కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో రాజలక్ష్మి ముఖాముఖి
వామపక్ష పార్టీలు, ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిలకడగా, గట్టిగా వ్యతిరేకించాయి. పార్లమెంటులో చట్టాలపై చర్చ సందర్భంగా వామపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు సవరణలు చేశారు. అదేవిధంగా, 2013 భూసేకరణ చట్టంలోని ప్రజానుకూల నిబంధనలకు వామపక్షాల పట్టుదలే కారణమని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వామపక్షాలు వ్యవసాయంతో నహా అనేక రంగాలపై నయా ఉదారవాద సంస్కరణల ప్రభావాన్ని నిరంతరం ప్రజల దృష్టికి తేవటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫ్రంట్లైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వాలు యూ-టర్న్ చేయడం చిత్తశుద్ధి లేనిదని, రాజకీయ అవకాశవాద చర్యగా అభివర్ణించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదా కసీన మద్దతు ధరను చట్టబద్ధం చేయటం వంటివి ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదనను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగు పాఠకుల కోసం....
- సీతారాం ఏచూరి
- రాజలక్ష్మి