Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ''డిసెంబర్ 6''న డా.అంబేద్కర్ 65 వర్థంతి జరుపుకున్నాం. ఆయనను స్మరించుకోవడమంటే ఆయన జీవితాంతం పోరాడిన కుల నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి అంకితం కావడమే. భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధి కులం. దేశంలోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. వేల కులాలున్న ఈ సమాజంలో ఏకులమూ ఇంకో కులంతో సమానం కాదు. దాదాపు 30కోట్ల జనాభా అమానుషమైన అంటరానితనం, కులవివక్షలతో తరతరాలుగా అణచివేయబడుతున్నారు. కులం కొందరికి వరమైతే ఎందరికో శాపం.
నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో ఎంత కిందికి పోతే అంత పేదరికం, అవమానాలు, వేదింపులు, బాధలు, చీదరింపులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలుండటం సహజం. ఎంతపైకి పోతే అంత సంపదలు, గౌరవాలు, మర్యాదలు, హౌదాలుండటం కూడా సహజమే. కులబాధితులే సమాజంలో 80శాతంపైగా ఉంటారు. కులముండటం వీరికి నరక ప్రాయం. వీరు సహజంగానే కులాధిపత్యం పోవాలనుకుంటారు. కుల సమాజమే ఉండాలనుకోరు. ఆధిపత్య కుల నేపథ్యమున్న 20శాతం మందికిది స్వర్గప్రాయం. కుల సమాజంతో తమకెలాంటి నష్టం లేకపోగా, ఎంతో సౌకర్యంగా ఉంది కాబట్టి కొనసాగాలని కోరుకుంటారు. అందుకోసం అన్ని అవకాశాలను ఉపయోగిస్తారు. దీనికతీతంగా ఉండేవారు చాలా పరిమితంగానే ఉంటారు. భారతీయ సమాజాన్ని లోతుగా, జాగ్రత్తగా పరిశీలిస్తే స్థూలంగా అర్ధమయ్యేదిదే. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జాతులు, మతాలు ఉన్నాయి కానీ కులాలు లేవు.
ప్రపంచం లోనే అత్యధిక పేదలు మన దేశంలోనే ఉండటానికీ, నిరక్షరాస్యులు మన దేశంలోనే ఎక్కువగా ఉండటానికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వెనుకబడటానికీ కుల వ్యవస్థ ఒక కారణం. భారతీయ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చుతుంది కులం. శాశ్వత సామాజిక హౌదాలను ఏర్పాటు చేస్తుంది. అత్యంత సంపన్నులంతా అగ్ర కులాల నుండే ఉండేలా, దాదాపు పేదలంతా శూద్ర, అతిశూద్ర కులాల నుండే ఉండేలా ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తుంది.
కుల వ్యవస్థ రక్షణకు సృష్టించబడ్డ మనుధర్మశాస్త్రం 7వ స్మృతి 248వ శ్లోకం కూడా స్పష్టంగా చెపుతున్నదిదే. అందుకే అత్యంత ఉన్నత చదువులు, ఉన్నత శ్రేణి ఉద్యోగాలు స్వల్ప జనాభా ఉన్న అగ్రకులాలకే ఉండటం మనం గమనించవచ్చు. రాజకీయాల్లో, ప్రభుత్వ కీలక పదవుల్లో, న్యాయస్థానాల్లోని ప్రధాన న్యాయ మూర్తుల్లో అత్యధికులు అగ్రకులాలే ఉంటారు. ఎందుకో జాగ్రత్తగా పరిశీలిస్తే కుల వ్యవస్థ ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. శూద్రులకు చదువులు గౌరవాలు ఉండరాదని నిషేదించిన దాని ఫలితమే ఇది.
గత రెండువేల సంవత్సరాల పైగా భారతీయ సమాజాన్ని అంధకారం, అజ్ఞానంలో ఉంచటంలో కూడా కులవ్యవస్థ పాత్ర ఎంతో ఉంది. శ్రమ చేసే వారికి చదువు లేకుండా చేసింది కులం. చదువును తమ గుత్త సొత్తుగా మార్చుకున్న ఆధిపత్య కులాల వారికి శారీరక శ్రమ లేకపోవడం మన దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి ముందుకు పోలేక పోవడానికి కారణమయింది.
మనుషుల మద్య ఐక్యతా, సాన్నిహిత్యం లేకుండా చేస్తుంది కులం. వ్యక్తిగత ఘర్షణలను కులగుంపుల ఘర్షణలుగా మారుస్తుంది కులం. ప్రేమించడాన్ని సహించదు కులం. ద్వేషించడాన్నే ప్రేమిస్తుంది కులం. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు సహితం మళ్లీ మన దేశానికొచ్చి, తమ కులమెక్కడుందో వెతుక్కొని, తమ స్వంత కులంలోనే పెళ్లి చేసుకుంటున్నారంటే కులమెంత ఘనీభవించిందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా అమానుష కుల వ్యవస్థను లోతుగా పరిశీలించిన మహనీయులు ఏమన్నారో కూడా గమనించడం అవసరం.
''మనుషులందరూ పీల్చే గాలి ఒక్కటే, నిలబడే నేల ఒక్కటే, తాగే నీరు ఒక్కటే, తినే తిండి ఒక్కటే... అలాంటప్పుడు ఈ కుల భేదాలు, అంటరానితనం ఎందుకు? అవి ప్రకృతి ప్రసాదించినవి కావు. మానవులు తమకు తాముగా గీసుకున్న విభజన రేఖలు. మనుషుల్లో నాటుకుపోయిన విషభావాలు.'' - బుద్దుడు
''చిన్న చిన్న సామాజిక సముదాయాల కులతేడాలతో కలుషితమైన భారతీయ సమాజంలో ఉన్నది ప్రత్యేక ఫ్యూడలిజం''-మార్క్స్ (న్యూయార్క్ ట్రిబ్యూన్, వ్యాసాలు 1853)
''ఇండియాకి సంబంధించి కులం సాధరణ మైందని చెప్పే ఏ విశ్లేషణనైనా తిరస్కరించాల్సి ఉంటుంది.'' - డిడి కోశాంబి.
''కుల నిర్మూలన అనేది దళిత కులాల సమస్య అనుకోవడం పొరబాటు. సమాజంలో ఒక కులం బలంగా ఉండి మిగతా కులాలు చదువు, అధికారం, సంపద లేక నిస్తేజంగా ఉండటమంటే మొత్తం సమాజం నిస్తేజంగా ఉన్నట్లే. ఒక చెయ్యి మాత్రం పనిచేసి మరొక చెయ్యి కుంటిది అయిపోయిన మనిషి ఎలాగో, ఒక కులం బలంగానూ మరొక కులం ఏ అవకాశాలు లేకుండా ఉన్న సమాజం కూడా అంతే. అందువల్ల కుల వ్యవస్థ అనేది మొత్తం సమాజం యొక్క సమస్య''
- రామ్ మనోహర్ లోహియా
''పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టు కుంటాం.. కానీ సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?'' ఈ మాటలు షహీద్ భగత్‌సింగ్ రాసిన 'అఛూత్ కా సవాల్' (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలోనివి.
పంజాబ్ నుంచి వెలువడే 'కిర్తీ' అనే పత్రికలో 'విద్రోహి' (తిరుగుబాటుదారు) అనే కలం పేరుతో భగత్ సింగ్ వ్యాసం రాశారు. ''మన దేశంలో ఉన్నంత దుర్భర పరిస్థితులు మరే దేశంలోనూ లేవు'' అంటూ ఆయన వ్యాసం మొదలువుతుంది. ''ఇక్కడ చిత్ర విచిత్రమైన సమస్యలున్నాయి. వీటిలో ముఖ్యమైంది అంటరానితనం. సమస్యేంటంటే, 30 కోట్ల జనాభా (తొంభై యేండ్ల క్రితం) ఉన్న దేశంలో 6కోట్ల మందిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నారు. వారిని ముట్టుకుంటే చాలు అధర్మం జరిగిపోతుందని చెబుతారు. వాళ్లు గుడిలో అడుగుపెడితే దేవుళ్లకు కోపం వస్తుందంటారు. వారు బావి నుంచి నీటిని తోడితే బావి అపవిత్రమై పోతుందంటారు. ఇరవైయ్యవ శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇలా కొనసాగుతోందంటే వినడానికే సిగ్గుగా ఉంది'' అంటాడు భగత్‌సింగ్.
మార్క్సిస్టుపార్టీ నాయకులు నంబూద్రిపాద్ 1979లో తన ''కుల సమస్య-అవగావహన''లో ఈ విధంగా చెప్పారు... ''భారత దేశాన్ని ఆధునిక లౌకిక మార్గంలో నిర్మించాలంటే కుల ఆధారిత హిందూ సమాజానికి, దాని సంస్కృతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉంది. భారతదేశ దీర్ఘకాలిక నాగరికత, సంస్కృతి, కులాల వారి వ్యవస్థగా చీలిపోయిన సమాజపు కోటను ధ్వంసం చేయకుంటే, సోషలిజం మాట ఎలా ఉన్నా లౌకిక ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడలేం. ఇంకా చెప్పాలంటే కుల వ్యవస్థ గల సమాజానికి వ్యతిరేకమైన పోరాటం నుండి ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం జరిగే పోరాటాన్ని విడదీయలేం.''
సీపీఐ నేత చండ్రరాజేశ్వరరావు 1992లో విజయవాడలో జరిగిన సదస్సుకు రాసిన వ్యాసంలో.. ''కులవ్యవస్థ, అంటరానితనం విచిత్రమైనవి. ఇవి ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎస్సీ, బీసీ ప్రజలను నీచంగా చూడటం, వారిమీద దౌర్జన్యాలు జరపడం వేల సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్నది. భారత దేశ సర్వతో ముఖాభివృద్ధికి ఆటంకంగా ఉన్న కులవ్యవస్థను తొలగించాల్సిన అవసరం నేడు మన ముందుకు వచ్చింది'' అంటారు.
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ప్రతి కులమూ పై కులం కంటే తక్కువగా, అపవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది. ప్రతి కులమూ క్రింది కులం కంటే గొప్పదిగా పవిత్రమైనదిగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా అసంఖ్యాకమైన శ్రామికవర్గం కులాలుగా చీలికలు పేలికలై ఉన్నది.. వివిధ కులాల్లోని ఒకరితో, మరొకరికి సంబంధాలే ఏర్పడని పరిస్థితుల్లో దేశముంది. ఇలాంటి పరిస్థితుల్లో పీడితులంతా ఐక్యం కాలేకపోతున్నారు. తరతరాలుగా తమను తొక్కిపెడుతున్న, పీడిస్తున్న వారి మీద తిరుగు బాటు చేయలేకపోవడానికి కారణం కుల వ్యవస్థే. కుల వ్యవస్థ స్తంభించిపోయిన అసమానతల వ్యవస్థ. అణగారినజనమంతా చీలిపోయి తమలో తామే ఘర్షించుకునే వ్యవస్థ. ప్రపంచ మంతా శ్రమ విభజన జరిగితే, మన దేశంలో శ్రమ విభజనతో పాటు కుల విభజన కూడా జరిగిందన్న డా. అంబేద్కర్ మాటలు ఈ సందర్భంగా గమనంలో ఉండాలి.
భారతీయ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చుతున్న కుల వ్యవస్థ మానవతకు గొడ్డలి పెట్టు. మానవుల వైయుక్తిక ప్రతిభ కుల వ్యవస్థ ఫలితంగా నశిస్తుంది. అందుకే కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో చెప్పారు.
మెజారిటీ ప్రజలను దోపిడీ చేయడానికి పుట్టిన కులం, మనుధర్మ శాస్త్రంతో వ్యవస్థీకరించబడింది. భూస్వామ్య పెత్తందారీ విధానాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలతో వర్ధిల్లుతున్నది. మనుషుల భావాల్లో దాక్కున్న సంకుచిత, అమానుష కుల భావాలను ఒక పెద్ద సాంస్కృతిక విప్లవం ద్వారా పిండి... సామాజిక చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఊపిరి పోయాల్సిన తరుణం ఇది. కుల నిర్మూలన తక్షణవసరంగా సమాజం ముందు నిలిచింది. ఆ లక్ష్య సాధనకై పోరాడటమే డాక్టర్ అంబేద్కర్‌కు నిజమైన నివాళి.
- జి. రాములు
సెల్:9490098006