Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టినది యూపీఏ-1 ప్రభుత్వం. అప్పట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదారవాద లాబీ గట్టిగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, ఆ ప్రభుత్వపు మనుగడ వామపక్ష పార్టీల మద్దతు మీద ఆధారపడి ఉంది. వామపక్షాలు గట్టిగా పట్టు పట్టడంతో ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని పరిమితం చేస్తూనే వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100 రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ పరిమితులు వున్నప్పటికీ, ఆ పథకం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాకరించడం కుదరదు. ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కావాలని కోరిన వ్యక్తికి పని చూపించే బాధ్యత ప్రభుత్వానిదే అని నిర్దేశించిన పథకం అది.
యూపీఏ-2 హయాం నుండే ఉపాధి హామీని నీరుగార్చడం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు బడ్జెట్లలో ఈ పథకానికి కేటాయింపు రూ.60,000 కోట్ల దగ్గరే ఉండిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగణంగానైనా కేటాయింపులను పెంచలేదన్నమాట. పెరుగుతూవున్న శ్రమజీవుల సంఖ్య, దానితోబాటు ఉపాధి కావాలనే వారిసంఖ్య పెరుగుతూవున్నా, వ్యవసాయ సంక్షోభం నానాటికీ మరింత తీవ్రమవుతున్నా అందుకు అనుగుణంగా ఈ పథకానికి కేటాయింపులను పెంచలేదు. పార్లమెంటులో ఈ విషయాలను ప్రస్తావించిన ప్రతిసారీ ఉపాధి కోరిన ప్రతీవారికీ ఈ పథకంలో పని కల్పించాలి గనుక బడ్జెట్లో ఎంత కేటాయించామనేది ప్రాధాన్యత లేని అంశమని, ఎంతమంది ఉపాధి కోరితే అంతమందికీ పని కల్పించేలా వాస్తవ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం సమాధానం చెప్తూ ఉండేది.
ఉపాధి కోరేవారి సంఖ్య పెరిగి, దానికనుగుణంగా కేటాయింపులను నిజంగా ప్రభుత్వం పెంచినా, ఆ అదనపు కేటాయింపుల చెల్లింపు కొంత వ్యవధి తీసుకుంటుంది. అందువలన పనులు చేసిన వారికి వేతనాల చెల్లింపు బకాయి పడుతుంది. ఇలా బకాయిలు పేరుకుపోతే, అసలే పేదరికంలో ఉంటూ పూట గడవని వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని అడిగేందుకే వెనకాడతారు. ఆ విధంగా బడ్జెట్లో ముందు తక్కువ కేటాయింపులు చేయడం వలన ఈ పథకం కింద ఉపాధి కోరేవారి సంఖ్య తగ్గుతుంది. అలా తగ్గిపోవడాన్ని చూపించి తాము సరైన మొత్తాన్నే బడ్జెట్లో కేటాయించామని ఆ తర్వాత ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకోవచ్చు. పైగా ఆ తర్వాత సంవత్సరపు బడ్జెట్లో కూడా తక్కువ కేటాయింపు చేయడానికి సాకుగా చూపవచ్చు.
దీనినే శ్రామికులను నిరుత్సాహపరిచే విధానం అని చెప్పవచ్చు. సంపన్న దేశాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఇక తమకు ఏ ఉద్యోగమూ రాదని నిరాశ చెందిన కొందరు నిరుద్యోగులు ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నాలనే మానుకుంటారు. అప్పుడు ప్రభుత్వం నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని చెప్పుకుంటుంది. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో వేతన బకాయిలు రావడం లేదని ఆ పథకం కింద పనులు చేయడానికి వ్యవసాయ కూలీలు విముఖత చూపితే ఉపాధి హామీ పనులు కోరుకునే కూలీల సంఖ్య తగ్గిపోయిందని ప్రభుత్వం చెప్పుకుంటుంది.
మోడీ ప్రభుత్వం వచ్చాక ఉపాధిహామీ పథకానికి తక్కువ కేటాయింపులను చేసే ధోరణి పతాకస్థాయికి చేరుకుంది. ఉపాధి హామీ పథకాన్నే తొలినాళ్ళలో మోడీ వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసే సాహసం చేయలేదు. కానీ అంతకంతకూ తక్కువ కేటాయింపులతో ఆ పథకానికి ఉచ్చు బిగిస్తూ వచ్చాడు. 2019-20లో ఆ పథకం కింద అయిన వాస్తవ ఖర్చు రూ.71,687 కోట్లు. కాని 2020-21లో కేటాయించింది రూ.61,500 కోట్లు మాత్రమే. నిజానికి ఆ సంవత్సరంలో లాక్డౌన్ కారణంగా పట్టణాల్లో పనులు పోయి గ్రామాల బాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారందరూ తల దాచుకునే చోటు గాని చేయడానికి పని గాని లేక అల్లల్లాడిపోయారు. ఎంతో కొంతమేరకు వారిని ఆదుకున్నది ఉపాధి హామీ పథకం మాత్రమే. దాంతో ఉపాధి హామీ పథకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఆ ఏడాది వాస్తవంగా రూ.1,11,500 కోట్లు కేటాయించక తప్పలేదు.
ఆ మరుసటి ఏడాది, అంటే 2021-22లో మళ్ళీ బడ్జెట్ కేటాయింపు కోత పెట్టి రూ.73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడు చేసిన వాస్తవ ఖర్చు కన్నా రూ.38,500 కోట్లు తక్కువ. ఆర్థిక వ్యవస్థ పుంజుకుని పట్టణాల్లో, గ్రామాల్లో ఉద్యోగాల లభ్యత గనుక పెరిగి లాక్‌డౌన్‌కు పూర్వం ఉన్న స్థితికి చేరుకుని ఉంటే ఈ తగ్గింపును మనం అర్ధం చేసుకోవచ్చు. కాని జీడీపీలో పెరుగుదల ఏమాత్రమూ లేదని మనకందరికీ తెలుసు. ఉపాధి అవకాశాలు కొత్తగా వచ్చినవి ఏవీ లేవని కూడా తెలుసు. అంటే ఆ ముందరి ఏడాది ఉపాధి హామీకి ఏ విధంగా ఎక్కువ డిమాండ్ ఉందో, ఈ ఏడాదీ అదే విధంగా కొనసాగుతుంది. మహా అయితే కొద్ది మేరకు తగ్గవచ్చు. అంతే. అటువంటప్పుడు ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపులను ఏకంగా రూ.38,500 కోట్ల మేరకు తగ్గించి 2019-20 నాటి కేటాయింపులనే ఇప్పుడూ చెయ్యడమంటే ఈ పథకానికి ఉచ్చు బిగించడం కాక ఇంకేమిటి?
నవంబరు 25న ప్రభుత్వం మరో రూ.10,000 కోట్లను కేటాయిస్తామని ప్రకటించింది. కాని ఇది ఏ మూలకూ చాలదు. ఇప్పటికే వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించినది మొదటి ఏడు మాసాలకే మొత్తం ఖర్చైపోతుంది. ఏడాది పొడవునా ఈ పథకం అమలు కొనసాగాలంటే హీనపక్షం రూ.30,000 కోట్లు అదనంగా అవసరం ఔతుంది. కాని ప్రభుత్వం అదనంగా కేటాయించింది రూ.10,000 కోట్లే. పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి ఈ పథకం కింద కేటాయింపుల్లో వచ్చిన లోటు (అంటే చెల్లించాల్సిన బకాయిలు) నవంబరు 25 నాటికే రూ.9,888 కోట్లు. (హిందూ పత్రిక వార్త, నవంబరు 26) ఇప్పుడు అదనంగా కేటాయించినది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా పథకాన్ని కొనసాగించడం ఏ విధంగా సాధ్య పడుతుంది? ఇంకా మరో నాలుగు నెలలు గడవాలి కదా.
ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ పిసినారితనం అర్ధం లేనిది మాత్రమే కాదు, వొట్టి తెలివితక్కువతనం కూడా. ప్రభుత్వం ఈ పథకం కింద రూ.100 ఖర్చు చేసిందనుకోండి. అందులో వేతనాలకు రూ.60, మెటీరియల్‌కు రూ.40 పోతాయి. కార్మికులకు అందే వేతనాల్లో 40శాతం, అంటే రూ.24, ఆహారధాన్యాల కొనుగోలు కోసం ఖర్చు చేశారనుకుందాం. ప్రభుత్వం దగ్గరే ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి గనుక ఆ రూ.24 ప్రభుత్వానికి వెనక్కి వచ్చేస్తాయి. అంటే ఈ పథకం కోసం ఖర్చు చేసే ప్రతీ రూ.100లో వాస్తవంగా ప్రభుత్వం రూ.76 మాత్రమే నికరంగా ఖర్చు చేస్తోందన్నమాట.
ఆహార ధాన్యాల కొనుగోలు కోసం చేసే ఖర్చు భారతీయ ఆహార సంస్థకి పోతుంది కదా అని ఎవరైనా అడగవచ్చు. కాని ఆ సంస్థ కూడా ప్రభుత్వం అధీనంలో ఉన్నదే. అందుచేత ఈ పథకం కింద ప్రభుత్వం చేసే ఖర్చులో నాలుగో వంతు ప్రభుత్వానికి వెంటనే తిరిగివచ్చేస్తుంది. అలాగే, మెటీరియల్ కాంపొనెంట్ కింద ఇచ్చే మొత్తంలో కూడా కొంత ఆహార ధాన్యాలను కొనడానికి ఖర్చవుతుంది. ఆ విధంగా ఎఫ్‌సిఐ దగ్గర ఉండే ఆహార ధాన్యాల నిల్వలు తగ్గడమే కాక వాటిని నల్వ చేయడానికి అవసరమయే ఖర్చూ ప్రభుత్వానికి తగ్గిపోతుంది.
ద్రవ్యలోటును పెంచి ఉపాధి హామీ పథకానికి అదనంగా కేటాయించినందు వలన ప్రతికూల ఫలితాలేమీ రావు. అలా ఖర్చు చేసిన మొత్తంలో గణనీయమైన భాగం ఎఫ్‌సీఐ ద్వారా ప్రభుత్వానికి వెనక్కి వచ్చేస్తుంది. అంటే వాస్తవ ద్రవ్యలోటు తక్కువగా ఉంటుంది. నిజానికి ఉపాధి హామీ పథకం కింద చెల్లించే మొత్తం సొమ్మును ఏదో ఒక రూపంలో ఆ లబ్ధిదారులు ఖర్చు చేసేస్తారు. అంతిమంగా ఆ సొమ్ము ప్రభుత్వానికే తిరిగి చేరుతుంది. ఆ విధంగా చూసినప్పుడు వాస్తవ ద్రవ్యలోటు పెరుగుదల సున్నా అవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, దాని ప్రతినిధి ఐఎంఎఫ్ వాస్తవ ద్రవ్యలోటును కాకుండా బడ్జెట్లో చూపించే ద్రవ్యలోటునే పరిగణనలోకి తీసుకుంటాయి. ఎఫ్‌సిఐ ని ప్రభుత్వంలో భాగంగా చూడవు. అది కేవలం వాటి సైద్ధాంతిక దృష్టి కోణానికి అద్దం పడుతుంది.
ఉపాధి హామీ పథకం కింద చేసే ఖర్చు వలన వచ్చే కొనుగోలు శక్తితో ఆ లబ్ధిదారులు ఆహార ధాన్యాలనే గాక ఇతర వినిమయ వస్తువులను కూడా కొంటారు. వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేసేది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు. ఆ పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే ఆ మేరకు ఉపాధి అదనంగా పెరుగుతుంది. నిరుద్యోగం నుండి కోలుకోవడం కూడా మెరుగవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం పెట్టే ఖర్చులో ప్రతీ రూపాయీ ప్రభుత్వం చేసే మరే ఇతర ఖర్చు కన్నా ఎక్కువ ప్రయోజనకరమైనది. కాని ఈ వాస్తవాన్ని చూడలేనంత గా కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం.
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్