Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శంగా కేరళ ఎలా నిలవగలిగింది ?
కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటుంది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినప్పుడే దీనికి పునాదులు పడ్డాయి. అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థను క్రమబద్దీకరించి, గ్రామ స్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని అందించడానికి, మారుమూల ప్రాంత ప్రజలకు కూడా వైద్య సేవలను గ్యారంటీ చేయడానికి ఆ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో మెరుగైన ఆరోగ్య వ్యవస్థ రూపొందింది. ఆ కృషిని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయి. తొలిరోజుల్లో వేసిన ఆ పునాది, అనంతరం జరిగిన కృషి కరోనా సమయంలో కేరళకు కొండంత అండగా నిలిచాయి.
కేరళలో ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంటుంది ?
వైద్యారోగ్య రంగానికి దేశంలో మరెక్కడా లేనంతగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాం. ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అందులో జనాభా ప్రాతిపదికన వైద్యులు, సిబ్బందిని నియమిస్తాం. వారంతా తమకు నిర్దేశించిన ప్రాంతంలోని ప్రజల ఇండ్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. పరిస్థితిని బట్టి కమ్యూనిటీ హెల్త్‌కేర్ సెంటర్, తాలుకా, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల వరకు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్షిత నీరు, పౌష్టికాహారం, స్వచ్ఛమైన గాలి, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకమైనవి. ఇందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం అనేక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతాయి. స్థానిక సంస్థలు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. ప్రజారోగ్యంపై అవగాహనా కార్యక్రమాలు నిరంతరం ఉద్యమంలా సాగుతాయి. వీటిలో కుడుంబశ్రీ (డ్వ్రాక్రా తరహా) మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. వీరి ద్వారా పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇలా ప్రజా భాగస్వామ్యం, ప్రభుత్వరంగం కేరళ ఆరోగ్య వ్యవస్థలో కీలకంగా ఉంటాయి
కరోనా సమయంలో అనుసరించిన ప్రత్యేక వ్యూహం ఏమిటి ?
కరోనా కట్టడికి ఐసిఎమ్ఆర్ కన్నా ముందే ఎల్డీఎఫ్ ప్రభుత్వం స్పందించి స్పష్టమైన వ్యూహ రచన చేసింది. 2020 జనవరిలో మొట్టమొదటి కేసు నమోదు కాగానే అన్ని చోట్లా వైద్యులను, ఆసుపత్రులను చేశాం. భౌతిక దూరం, మాస్క్, శానిటైజర్ల వినియోగంపై క్షేత్ర స్థాయిలో ప్రత్యేక క్యాంపెయినింగ్ నిర్వహించాం. ఆసుపత్రి సామర్థ్యానికి మించి రోగులు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. కరోనా ముమ్మరంగా ఉన్న సమయంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్టు గుర్తించాం. మిగిలిన రాష్ట్రాల్లో 120మందిలో ఒకరిని మాత్రమే గుర్తించగలిగారు. మొదటి విడతలోగానీ, రెండో దశలోగానీ ఆక్సిజన్ కొరత వల్లగానీ, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లగానీ, మందుల కొరత వల్లగానీ, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్లగానీ కేరళలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుసరించిన ప్రణాళిక ఎంతగానో దోహదపడింది.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ?
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి అదుపులో ఉంది. ఇటీవల ఐసిఎంఆర్ చేసిన పరిశీలనలో కేరళలో కేవలం 42శాతం మంది మాత్రమే కరోనా బారినపడ్డారని తేలింది. ఇప్పటివరకు మొదటి డోస్ వ్యాక్సిన్ 96శాతం, రెండో డోసు 63శాతం మందికి వేశాం. దీంతో, కేసుల సంఖ్యతోపాటు తీవ్రత కూడా తగ్గుతోంది. ఐసియు అవసరం చాలా తక్కువగానే ఉంది. మా సమీక్షల్లో అధికారులతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తాం. దీనివల్ల క్షేత్ర స్థాయి వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి.
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
దీనిపై కూడా దృష్టి సారించాం. ఒమిక్రాన్ ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉన్న దేశాలను హైరిస్క్ కేటగీరిగా గుర్తించాం. ఆ దేశాలనుంచి వచ్చినవారికి ఎయిర్‌పోర్టులోనే ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేసి, తొమ్మిది రోజులపాటు ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు అన్నింటిలోనూ హెల్త్‌వర్కర్లను ప్రత్యేకంగా నియమించాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని అదుపు చేస్తున్నాం. కోవిడ్ టెస్ట్ చేయకుండా ఉండడం అనేది దాదాపు మా రాష్ట్రంలో లేదు. ఇప్పటికీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను క్వారంటైన్లో ఉంచుతున్నాం. వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం.
మీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లేంటి?
మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే జనసాంద్రత చాలా ఎక్కువ. దేశ జనసాంద్రత 464 కాగా... కేరళలో 860 ఉంది. అందువల్ల అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం సాధారణంగానే ఉంటుంది. మారుతున్న జీవనశైలి వల్ల బి.పి, సుగర్ వంటి కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాం. ఈ వ్యాధుల నివారణకు ముందస్తు అవగాహన కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం.
ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మీ అభిప్రాయం ఏమిటి?
కేంద్రం లోని పాలక పార్టీలు ప్రజారోగ్య వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా విస్మరించింది. బడ్జెట్ కేటాయింపులు తగినంతగా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. రక్షిత తాగునీరు, పౌష్టికాహారం, స్వచ్ఛమైన గాలి, పరిసరాల పరిశుభ్రత కల్పించడం లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు. జనాభాకు తగ్గట్టు ప్రభుత్వాసుపత్రులు లేవు. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది నియామకం అంతంతమాత్రంగా ఉంటోంది. కేరళలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వైద్యారోగ్య సేవలన్నీ గ్రామ స్థాయిలోనే అందుతాయి. రోగులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇటువంటి సేవలందించాలంటే రాజకీయంగా ఎంతో చిత్తశుద్ధి అవసరం. ప్రజలను విస్మరించి, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలు అవలంభించిన చోట కేరళ తరహా వైద్యారోగ్యం ఎప్పటికీ అందుబాటు లోకి రాదు.
మీరు జర్నలిస్టుగా పని చేశారు. ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ రెండింటిలో మీ అనుభవమేమిటి?
మీడియా అనేది సమాజంలో నాలుగవ స్తంభం. ప్రజాస్వామ్య మనుగడకు శక్తివంతమైన ఆయుధం. జర్నలిస్టుగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు వెలికితీయడం, న్యాయం దొరికేటట్టు చేయడం ప్రధాన బాధ్యత. కానీ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్నందున జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చిన సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కీలక కర్తవ్యాన్ని స్వీకరిస్తున్నాను. జర్నలిస్టుగా పని చేసిన కాలంలోని అనుభవాలు మంత్రి బాధ్యతలకు ఎంతో ఉపకరిస్తున్నాయి.
ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ పాత్రను క్షేత్ర స్థాయికి విస్తరించడం, ప్రజలను భాగస్వామ్యం చేయడంతోనే మెరుగైన ఆరోగ్య వ్యవస్థ సాధ్యమవుతుందంటున్న కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జితో ఇంటర్వ్యూ వివరాలు..