Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమీప భవిష్యత్తులో రైతుల ఐక్య ఉద్యమం క్రమంగా బలహీన పడుతుందనే అసత్య ప్రచారాలను వమ్ముచేస్తూ, భారత రైతాంగం నూతన చరిత్రను సృష్టించింది. సంఘటిత రైతు ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగా, కార్మికవర్గం మద్దతును కూడగట్టి, నిరంకుశ బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసింది. అయితే ఈ విజయానికి భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది. ఈ పోరాటంలో 700మందికి పైగా రైతులు అమరులైనారు. లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యుల తీవ్ర నిర్భంధాల మధ్య ఈ విజయం సాధ్యమైంది. రైతులు తమ విలువైన ప్రాణాలను కోల్పోవడంతో బీజేపీ ప్రభుత్వం దోషిగా నిలిచింది. ఈ విజయం దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. తాము అజేయులమని భావించేవారి దుర్భలత్వాన్ని బట్టబయలు చేస్తున్నది.
ప్రపంచ సామ్రాజ్యవాద త్రిమూర్తులైన వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యుటిఓ ఆజ్ఞలతోనే బీజేపీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఆ సంస్థలు ఎంతో కాలంగా, వ్యవసాయ ఆహార సబ్సిడీలపై కోత విధించాలని, ప్రభుత్వ రంగ వాటాలను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నవి. ఈ మూడు చట్టాలతో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, 8గంటల పనిరోజులతో పాటు యూనియన్ ఏర్పాటును నిరాకరించే నాలుగు లేబర్ కోడ్లు కూడా మహమ్మారి కాలంలోనే వచ్చాయి. రైతులు, కార్మికులు, శ్రమజీవులందరూ అక్షరాలా లాక్డౌన్లో ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం ఈ కార్పొరేటు దోపిడీకి గేట్లు తెరిచింది.
ఈ దోపిడీ చట్టాలకు వ్యతిరేకంగా జూన్ 2020న ప్రారంభమైన రైతుల పోరాటం, ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చిన వెంటనే 2020 నవంబరు 26న కేంద్ర కార్మిక సంఘాలు సాధారణ సమ్మెకు పిలుపునివ్వడంతో గుణాత్మక మార్పును సంతరించుకుంది. 26-27 తేదీలలో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్కో ఆర్డినేషన్ కమిటీ నవంబర్ ఢిల్లీఛలో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీకి వెళ్తున్న రైతాంగంపై బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించడమేకాక, జాతీయ రహదారులపై కందకాలు తవ్వడం, బ్యారికేడ్స్కు బదులుగా ముళ్ళ కంచెలు అమర్చటం, వాటర్ కానాన్స్, టియర్ గాస్, లాఠీచార్జి లాంటి అమానుషమైన పద్ధతులను అనుసరించింది. అయినా రైతాంగం ఈ అవరోధాలన్నిటినీ అధిగమిస్తూ 12 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో, తమ నిరసనను తెలియజేస్తున్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేట్ మీడియా రైతాంగానికి వ్యతిరేకంగా హానికరమైన ప్రచారం నిర్వహించింది. రైతాంగాన్ని టెర్రరిస్టులుగా, ఈ పోరాటానికి ఖలిస్తాన్ మద్దతు ఉందని, పాకిస్థాన్, చైనా ఆదేశాలతో నడుస్తుందనే ప్రచారాన్ని చేశారు. కానీ దేశ ప్రజలు ఈప్రచారాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బెదిరింపులు, నిర్బంధాలు ఏవీ వారిని భయపెట్ట లేకపోయాయి. ఉద్యమ శిభిరాలకు ఇంటర్నెట్ను, విద్యుత్తును, నీటిసరఫరాలను నిలిపివేయడం, సంఫ్‌ుపరివార్ గూండాలు దాడులు చేయటం, వెల్లువెత్తే సంఘీభావాన్ని నిలువరించడానికి ముళ్ళకంచెలతో కాంక్రీట్ గోడలను నిర్మించటం, కంచెలు ఏర్పాటు చేయడం, ఇనుప మేకులను నాటడం లాంటి విచ్ఛిన్న చర్యలతో రైతులను అడ్డుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు. ప్రధానమంత్రి నిరసన తెలిపే రైతాంగాన్ని ''ఆందోళన జీవులుగా'' ''పరాన్నభుక్కులు''గా వర్ణిస్తూ అపహాస్యం చేశాడు. ఈ పోరాటాన్ని తక్కువ చేసి చూపుతూ, దేశ వ్యతిరేకమైనదిగా చిత్రిస్తూ అపఖ్యాతిపాలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రైతాంగం అన్ని దాడులను అధిగమించి గొప్ప విజయాన్ని సాధించింది. కానీ ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను, రైతులను అవమానించిన తీరును దేశం ఏనాటికీ మరిచిపోదు.
ఈ పోరాటం చరిత్రాత్మకమైనది. తీవ్రమైన చలిలో, భారీ వర్షాలలో, మండువేసవిలో సుదీర్ఘ కాలం నిర్వహించబడిన ఈ పోరాటంలో వివిధ రంగాలకు చెందిన శ్రామిక ప్రజల మధ్య ఏర్పడిన సంఘీభావం చారిత్రాత్మక మైనది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోకూడా అణచివేతను రైతాంగం ధైర్యంగా ఎదుర్కొన్న విధానం అనేక మంది హదయాలను చూరగొన్నది. అనూహ్యంగా ఇతర శ్రామిక ప్రజల మద్దతుతోపాటు అనేక సంస్థలు కూడా ఈ ఉద్యమానికి సహకారం అందించాయి. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గ్రామాల ప్రజలు, నిరసన తెలిపే ప్రదేశాలలోని ప్రజలకు ఎలాంటి ఆహార కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. కార్మికవర్గం పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఆర్థికంగా, వస్తు రూపంలో బ్లాంకెట్స్, టెంట్లు సమకూర్చి మద్దతునిచ్చారు. రైతులు, వారికి వారే ట్రాక్టర్ ట్రాలీలను తమ గృహాలుగా మార్చుకోవడం, శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం, భారీ లంగార్(సామాజిక ఆహార కేంద్రాలు) లతోపాటు, ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని, తమ అపురూపమైన సంస్థాగత సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. జనవరి 26న దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చారిత్రక మజ్దూర్ కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశ రాజధాని చుట్టు ప్రక్కల వందల వేల ట్రాక్టర్లు, వాహనాలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పెరేడ్లో పాల్గొన్నాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ అమరవీరులకు నివాళులు అర్పించాయి. ఆగస్టు 15, 1947 తరువాత, రైతాంగం నాయకత్వంలో భారత పౌరులు అంత పెద్ద సంఖ్యలో రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకోవడం ఇదే మొదటి సారి. రైతుల భారత్‌బంద్ పిలుపునందుకొని, లక్షలాది మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, సమాజంలోని ఇతర రంగాలకు చెందిన ప్రజానీకం నిరసనలో పాల్గొన్నారు. ఇది వ్యవసాయ ఉద్యమంగా ప్రారంభమై ప్రజా ఉద్యమ రూపం తీసుకున్నది. శ్రమజీవులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు అణగారిన వర్గాలు చురుకైన పాత్రను పోషించారు.
ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం ఈ ఉద్యమం కేవలం పంజాబ్ వరకే పరిమితమైనదని పేర్కొన్నప్పటికీ, అది దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నట్లు మనం గమనించాం. ఢిల్లీ సరిహద్దులలో భారత దేశ నలుమూలల నుండి విస్తృతమైన ప్రాధినిధ్యం ఉంది. రాష్ట్రాల నిర్దిష్ట సమీకరణలతో పాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సామ్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, బెంగాల్, ఒరిస్సా ఇతర రాష్ట్రాలనుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మహమ్మారి సమయంలో కూడా రైతులు, కార్మికులు చట్టాలకు, రైతులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా నిరంతరాయంగా వీధుల్లోకి వచ్చారు. శ్రామిక వర్గాలైన స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, స్త్రీలు, విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఆల్ ఇండియా కిసాన్ సభ, సీఐటీయూ, ఐఏడబ్ల్యూయు ఇతర సామాజిక సంఘాలు ఉద్యమాన్ని విస్తృత పరచటానికి వీరితో కలిసి పని చేశాయి. సమస్యల ఆధారంగా ఎఐకెయస్ సిసి, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో మూడు రైతు వ్యతిరేక బిల్లులు, కనీసమద్దతు ధరకు చట్టపరమైన హామీ, విద్యుత్ చట్టాలకు సంబంధించిన సవరణలను వెనక్కుతీసుకోవడం, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయడం, ఇతర అత్యవసర సమస్యలైన, మహమ్మారితో ప్రభావితమయిన వారికి ఆర్థిక సహాయం, సామూహిక వాక్సినేషన్, దీనితోపాటు పెరుగుతున్న ధరలను నియంత్రించడం, వారి డిమాండ్లలో ఉన్నాయి. కేంద్ర కార్మిక సంఘాలు కూడా రైతుల సమస్యలను, డిమాండ్లను జోడిస్తూ సమన్వయ పరిచాయి. భారత్‌బంద్ లాంటి ఐక్య నిరసనలు, అన్ని కార్మిక సంఘాలు, వామపక్షాల నుండి అనేక ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రైల్ రోకో లాంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయంతో, రైతు కార్మిక సంఘాల ఐక్యపోరాటం ద్వారా ఉద్యమం విస్తృతం కావడం సాధ్యమైంది. ఆల్ ఇండియా కిసాన్ సభ, ఇతర రైతు వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి అలాంటి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రధాన భూమిక నిర్వహించింది. ఎఐకెయస్, ఎఐఎడబ్లు, సిఐటియు అన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ నిర్లక్ష్యానికి, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రెండు వారాలు ప్రచారం నిర్వహించాయి.
ఈమధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంయుక్త కిసాన్ మోర్చా ''రైతు వ్యతిరేక బీజేపీకి ఓటు వేయరాదనే'' నిర్ణయం తీసుకున్నది. కార్పొరేట్ దోపిడీని అనుమతిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి, రాజకీయ ఓటమి కూడా ముఖ్యమైనదని భావించి ఇలాంటి నిర్ణయానికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారు ఆశించినట్టుగానే ఆ ఎన్నికల ఫలితాలు బీజేపీని పరాభవాన్ని రుచిచూపాయి. సెప్టెంబర్ 5, 2021న లక్షలాది మంది హాజరైన అతి పెద్ద కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్, మిషన్ పంజాబ్, మిషన్ ఉత్తరాఖండ్, మిషన్ యుపి, రాబోయే ఎన్నికలలో ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాయి. ఏ ప్రదేశంలో అయితే కొన్ని సంవత్సరాల క్రితం మతపరమైన మారణహౌమం జరిగిందో, అక్కడే మత సామరస్యాన్ని గూర్చి దఢమైన సందేశాన్నిచ్చాయి. నిరంకుశ బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ మార్గదర్శకత్వాన్నిచ్చాయి. రైతాంగ ఉద్యమం ద్వారా దూసుకొస్తున్న రాజకీయ ఓటమి భయమే, మూడు చట్టాలను ఉపసంహరించుకునే విధంగా నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చింది.
రైతుల నుండి సందేశం స్పష్టంగా ఉంది. ఈ పోరాటం ఆగిపోదు. అన్ని డిమాండ్స్ నెరవేరేవరకు పోరాటం తీవ్రం చేయబడుతుంది. కార్మిక కర్షకుల యొక్క స్పష్టమైన నిర్ణయంమిది. కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు సిద్ధమయ్యాయి. వారితో పాటు రైతాంగం కూడా భుజం భుజం కలిపి పోరాడుతుంది. ఈ చారిత్రక పోరాట క్రమంలో రైతులు, కార్మికులు సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లుగా ''ఒకవేళ ఆకాశం కుంగిపోయినా, మాకు భయంలేదు. మాకు ఎలాంటి భయమూ లేదు'' అని నొక్కి చెప్పారు. పాలకవర్గాల మనసులో భయాన్ని నాటారు. మేము పోరాడుతాం. మేము విజయం సాధిస్తాం. ప్రజానుకూల ప్రత్యామ్నాయం కొరకు జరిపే మా పోరాటం విజయం సాధిస్తుంది. మనసులో ఎలాంటి భయం లేకుండా, తలెత్తుకొని మరెన్నో ఓటములను ప్రజా శత్రువులకు అందిస్తాం అని ప్రకటిస్తున్నారు.
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు,
- విజూ కృష్ణన్
సెల్:9490300111