Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దోచుకునే వాళ్ళకి దోచుకున్నంత, దాచుకున్న కస్టమర్లకు తెలియనంత'' అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్స్‌కి లంచం. లంచం ఇచ్చి డ్రైవింగ్ ఫెయిల్యూర్స్‌తో డ్రైవింగ్ చేయించడంతో పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్న ఎందరో పసిమొగ్గలు నేల రాలడం, ఎన్నో కుటుంబాలు చితికి, ఛిద్రమవుతున్నాయి. అవినీతి లో ఇది ఒక కోణం. అలాగే విదేశాల్లో బినామీ పేర్లతో నల్లధనం మూటలు కుదువతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం. దీంతో పేదరికం విలయతాండవం చేస్తుంది. అలాగే మనకు అన్నం పెట్టే రైతన్న నేడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పులే అన్నదాతలను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయా? పాసుబుక్ కావాలన్నా లంచం, బోర్ వేయాలన్నా లంచం, రైతులు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా లంచం, ఇలా రైతులు ఏ పని చేయాలన్నా డబ్బుతో చెయ్యి తడపందే దరఖాస్తు ముందుకెళ్ళదు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. తిండి పెట్టే రైతుకు ఈ తిప్పలెందుకు?
నింగి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం లాంటి ప్రకృతి వనరులను కూడా నేతలు, అధికారులు లూఠి చేస్తూ అవినీతితో నింపేస్తున్నారు. అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండాల్సిన వారు, పారదర్శకత పాటించాల్సిన వారు డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారు. అందుకే దేశంలో అవినీతి రోగంలా వ్యాపించింది. హస్త గత రోగమైన ఈ అవినీతి దేశంలో అన్ని రంగాలకు పాకింది. నేతలను చూసి ఉన్నతాధికారులు, వారిని చూసి క్రింది స్థాయి ఉద్యోగులు అందరూ ఇలా లంచం రూపంలో తీసుకుంటున్నారు. దీంతో అవినీతి ఆర్జన అనేది అతి సహజమైన వ్యాపకంగా మారిపోయింది.
ప్రజలకు అనుబంధం ఉన్న శాఖల్లోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతుంది. ఎందుకంటే సామాన్య మానవునికి పలానా పని కావాలంటే దానికి సంబంధించిన శాఖకు వెడితే కాని ఆ పని పూర్తి కాదు. దీనిని అవకాశంగా తీసుకుని ఆయా శాఖల వారు మధ్యతరగతి సగటు మనిషి యొక్క బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం వారు వీరికి ప్రజలకు అందించే సేవలకు తగ్గ జీతం ఇస్తున్నారు. అయినా కూడా వీరు దాంతో తృప్తి పడక ఇంకా ఎక్కువ మొత్తంలో ధనార్జనకు ఆశపడుతుంటారు. ఇలా వారికి వచ్చే జీతం కన్నా 'ఎక్కువ కావాలి' అని ఆశించచడమే ''అవినీతి''. అలాగే కొంతమంది ప్రజలు వాళ్ళు అనుకున్న పనులు త్వరగా పూర్తయిపోవాలనే ఆరాటంతో ''నేను డబ్బులు ఇస్తాను, నా పని నాకు చేసి పెట్టండి'' అని అడిగే వాళ్లూ ఉన్నారు. దీంతో ఇది మ్యూచువల్ గా తయారైంది.
భారతదేశంలో అవినీతి ఇందుగలదు, అందు లేదు అన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అవినీతే అన్న చందాన అన్ని రంగాలలో వ్యాపించింది. ఈ అవినీతి, లంచగొండితనం వల్ల కొన్ని కోట్ల రూపాయల నల్లధనం మరుగున పడింది. నల్ల కుబేరులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విదేశీ బ్యాంకుల్లో వ్యాపారాలు, పొలాలు, స్థలాలు ఇలా వివిధ రూపాల్లో బినామీ పేర్లతో నల్లధనాన్ని దాస్తున్నారు. ఇంతటి నల్లధనం ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తే ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎన్నో ఘాతూకాలు జరగకుండా ఉండేవి. ప్రస్తుతం లంచాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. చట్టాలను కఠినంగా అమలు పరుస్తూ మార్పులు తీసుకు రావాల్సిన ప్రభుత్వాలే దీనిని పరోక్షంగా ప్రోత్సహించడం విచారకరం. ఒలింపిక్స్‌లో పథకాలు అధికంగా గెలుచుకొని అగ్రస్థానంలో ఉన్నామంటే అందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ లంచాల్లో భారత్ ముందంజలో ఉందంటే మనమంతా సిగ్గుపడాల్సిన విషయం. మన వ్యవస్థలో మార్పు రావాలి.
ఎన్నికల సమయంలో కూడా నేతలు అధిక మొత్తంలో ధనము, బహుమతుల రూపంలో... ఇలా భారీ స్థాయిలో ఖర్చుపెట్టి ఓటర్లని సొమ్ము చేసుకుంటారు. కానీ ఓటర్లు మాత్రం ఇలా ప్రలోభాలకు లొంగకుండా చక్కని ఆరోగ్యకరమైన సుపరిపాలనని అందించే పెద్దలను, మానవతావాదులను ఎన్నుకుంటే అప్పుడు అవినీతి అనే భూతం తోక ముడవగలదు.
ఇప్పుడు మనకు ఉన్న గొప్ప అవకాశం టెక్నాలజీ అందుబాటులోకి రావడం. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం స్థలాలు, పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గూగుల్‌లో ''జియో ట్యాగింగ్'' వచ్చాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్‌లో జియో ట్యాగింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనం ఆన్లైన్లో ఎలా వస్తువులు కొంటామో, అలానే భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టి ఆన్లైన్ పేమెంట్ చేసి డీల్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వానికి టాక్సు ఇంకో హెడ్డు కింద కట్టవచ్చు. దానికి సంబంధించిన టాక్సులన్నింటికీ విడివిడిగా హెడ్స్ ఉంటాయి. ఈ ప్రకారం ప్రభుత్వానికి టాక్స్ వెళ్ళిపో తుంది. ఇలా తేలికగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్లైన్లో ట్రాన్సక్షన్స్ చేసుకుంటే అవినీతిని చాలావరకూ అరికట్టవచ్చు. ఇంకా వ్యవస్థలో కొత్త చట్టాలు అవసరం అటుంచితే, ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే టెక్నాలజీని విస్తతంగా ఉపయోగించి అధికారులు ఎక్కడ విచక్షణకు తావులేకుండా చూస్తూ కస్టమర్లకు చక్కని సేవలు అందించాలి. 'ఆఫీసుకు వెళితే ఈ సేవ నాకు న్యాయంగా అందుతుందన్న' నమ్మకం సాధారణ పౌరుడికి కలిగించాలి. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో అవినీతి నిర్మూలనకి ఏం చేయబోతున్నారో చెప్పి పాటించాలి. కలిసికట్టుగా అవినీతి రహిత సమాజ నిర్మాణానికి బాటలు వేస్తూ దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించాలి.
సెల్: 9704725609
పి. భాగ్యలక్ష్మి