Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సింగరేణికి దండాలో! సిరుల తల్లికి దండాలో!! భూమిలో బొగ్గున్నాళ్లు! బువ్వాకు కొదువే లేదు!! సంపాద వెలికితీసి! సక్కంగా బతుకుతాము!!'' అని పాడుకున్నాం. కానీ నేడు ఈ బొగ్గు సంపద ఓపెన్ బిడ్డింగ్ పేర దేశ వ్యాప్తంగా 84 బొగ్గు బ్లాక్‌ల వేలం పాటతో ప్రయివేటు పరం కాబోతున్నది. అందులో తెలంగాణలోని సింగరేణికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయాగూడెం, ఖమ్మంజిల్లా లోని సత్తుపల్లి, మంచిర్యాలజిల్లాలోని శ్రావణ్‌పల్లి, కళ్యాణ్ ఖని బొగ్గు బ్లాక్‌లూ ఉన్నాయి. మన దేశంలో పశ్చిమబెంగాల్ దామోదర నది పరివాహకంలోని రాణిగంజ్‌లో ఈస్టిండియా కంపెనీ అధ్వర్యంలో 1774లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైనాయి. దేశ స్వాతత్య్రానంతరం పరిశ్రమల విస్తరణతో పాటుగా ఇంధన వినియోగం పెరిగింది. ప్రయివేటు బొగ్గు గనుల యాజమానుల దగ్గర తగిన మూలధన పెట్టుబడులు లేనందున బొగ్గు గనుల విస్తరణ కుంటుపడింది. బొగ్గు గనులలో రక్షణ ఏర్పాట్లు కొరవడి జరిగిన ప్రమాదాలు కూడా భయాందోళనలకు గురిచేసేవి. అలాగే బొగ్గు ఉత్పత్తి క్రమంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు సన్నగిల్లాయి. దానితో ప్రభుత్వ రంగంలోనే బొగ్గు ఉత్పత్తిని కొనసాగించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకు మొదటగా అక్టోబర్ 1956లో ''నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్'' ఏర్పాటు చేయడం జరిగింది. ఆపైన ''బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973''ను రూపొందించి మే 1 నుండి అమలులోకి తీసుకువచ్చి బొగ్గు గనుల విస్తరణకు కృషి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా 1975 నవంబర్ 1న ''కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)''ను స్థాపించడం జరిగింది.
తెలంగాణలో బొగ్గు ఉత్పత్తికై 1886లో ''హైదారాబాద్ స్టేట్ దక్కన్ కంపెనీ లిమిటెడ్'' ఏర్పాటు అయింది. 1889 నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. హైదరాబాద్ కంపెనీల చట్టం కింద 1920 డిసెంబర్ 23న ''సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్''గా స్థాపించడం జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1974 జూన్ 10న కేంద్ర ప్రభుత్వం భాగస్వామైంది. 5వ పంచ వర్ష ప్రణాళిక కాలంలో 1977 డిసెంబర్ 13 నుండి కేంద్ర ప్రభుత్వం 49శాతం, రాష్ట్ర ప్రభుత్వం 51శాతం భాగస్వామ్యంతో సింగరేణి కంపెనీ ద్వారా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతున్నది.
1991 జూలై 16న ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల వలన ప్రభుత్వ పరిశ్రమల మనుగడకు ముప్పు మొదలైంది. అందులో భాగంగా బొగ్గు పరిశ్రమలకు అండగా ఉన్న ''బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973''కు సవరణలు చేయడానికి, అలాగే ప్రైవేటీకరించేందుకు చర్యలు మొదలయ్యాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక అవి మరింత వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 8న ''బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973''ను రద్దు చేసింది. పిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఎ) పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గు గనులను ప్రయివేటుకు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 2019 ఆగస్టు 28న కేంద్ర క్యాబినెట్ బొగ్గు రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది. 2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నిటి అయోగ్ వైస్ చైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రయివేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసింది. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020 జూన్ 18న కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికగా బొగ్గు తవ్వకాలకు 44బొగ్గు బ్లాక్‌లను కేటాయించడానికి వేలం పాటను ప్రారంభించాడు. వేలం పాటలో బొగ్గు బ్లాక్‌లను దక్కించుకున్న వారికి మౌలిక సదుపాయాల కల్పనకు 50వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రకటించాడు. 2021 అక్టోబర్ 11న కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ 88 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటనను జారీ చేసింది.
కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లు గడచిన 2020-2021లో ఆర్థిక సంవత్సరంలో 647.017 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసాయి. కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి రాయల్టీ ఇతరత్రా పన్నుల రూపకంగా రూ.44,075.81 కోట్లు చెల్లించింది. ప్రధాన మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన కింద డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌కు రూ.5,800 కోట్లు చెల్లించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ (సి.ఎస్.ఆర్) కింద రూ.449.31 కోట్లు చెల్లించింది.
సింగరేణి కంపెనీ 2014 - 2015 ఆర్థిక సంవత్సరం నుండి 2018 - 2019 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.27,702.17 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌కు 2018 ఏప్రిల్ నుండి 2020 ఆగస్టు వరకు రూ.2,262.85 కోట్లు, సి.ఎస్.ఆర్కు రూ.20 కోట్లు చెల్లించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏవిధమైన బడ్జెట్ సపోర్ట్ గాని, నయాపైసా సహాయం లేకుండానే కోల్ఇండియా, సింగరేణి కంపెనీలు బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో పాలుపంచు కుంటున్నాయి. అయినా వీటిని ఎందుకు ప్రయివేటీకరిస్తున్నట్టు? సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఇఏ)చెప్పిన 2020 నవంబర్ 30నాటి లెక్కల ప్రకారంగా బొగ్గుతో సెంట్రల్ సెక్టార్లో 59,790 మెగావాట్లు, స్టేట్స్ సెక్టార్లో 65,631 మెగావాట్లు, ప్రైవేటు సెక్టార్లో 74,173 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరా చేస్తున్నాయి. కోల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 2013 మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి వ్యయం కంటే తక్కవ ధరకు బొగ్గు సరఫరాను చేస్తున్నాయి. ఇంకా బొగ్గు వనరుల సంరక్షణతో పాటుగా గనుల మూసివేత సమయంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. బొగ్గు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బొగ్గు సరఫరాను కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ఎవరికోసం ప్రయివేటీకరిస్తున్నట్టు?
సింగరేణి కంపెనీ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కోయాగూడెం, సత్తుపల్లి, శ్రావణ్‌పల్లి, కళ్యాణ్ ఖని బొగ్గు బ్లాక్‌ల భూగర్భ పరిశోధనకు రూ.66 కోట్లు ఖర్చు చేసింది. సత్తుపల్లి నుండి కొత్తగూడెం రైల్వే మార్గం నిర్మాణం గురించి రూ.750 కోట్లు ఇండియన్ రైల్వేస్‌కు చెల్లించింది. అటవీ భూముల పరిహారానికి రూ.450 కోట్లు అటవీ శాఖకు చెల్లించింది. నాలుగు బొగ్గు బ్లాక్‌లలో బొగ్గు తవ్వకాలకు అనుమతిని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అర్జీ కూడా పెట్టింది. గత రెండు సంవత్సరాలుగా పర్యావరణ, జీవావరణ అనుమతుల గురించి ఎదురు చూస్తున్నది. ఆ అనుమతులివ్వకపోగా ఇప్పుడు నోటికాడి బుక్కను గుంజుకున్న చందంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లకు డిసెంబర్ 13న వేలం పాటకు పూనుకోవడం దుర్మార్గం. ప్రజా సంపదను ప్రయివేటుకు దోచిపెట్టే ఈ దుర్మార్గానికి నిరసన పెల్లుబుకుతోంది. టీబీజీకేఎస్, ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, సిఐటియు, బిఎంఎస్ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా, అలాగే గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం మరో జేఎసీగా డిసెంబర్ 9, 10, 11 తేదీలలో మూడు రోజులు సమ్మె చేస్తామని నోటీస్‌ను ఇచ్చాయి. ఇప్పటి వరకు రీజనల్ కమిషనర్ సెంట్రల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకునే స్థాయి మాకు లేదని సింగరేణి యాజమాన్యం చేతులెత్తేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా నిరాశే ఎదురయింది. కేరళ రాష్ట్రంలోని ఉత్తర కాసరగోడ్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్)కి సంబంధించిన ఇఎంఎల్ (ఎలక్ట్రికల్ మెషిన్స్ లిమిటెడ్) ప్రైవేటైజేషన్ కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 8న స్వాధీనం చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 బొగ్గు బ్లాకులను సింగరేణి కంపెనీకి కేటాయించడానికి చొరవ చూపుతుందన్న ఆశ నిరాశ అయింది. దానితో సింగరేణిలో డిసెంబర్ 9 నుండి జరిగే 72 గంటల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీలు కూడా బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మికులు కోరుకుంటున్నారు.
సెల్ 9441440791
ఎం. రాజయ్య