Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబరు నెలలో లాటిన్ అమెరికా వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రజాస్వామ్య చర్యలతో అమెరికా ప్రభుత్వ రాజకీయ ఆకాంక్షలకు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. సెంట్రల్ అమెరికాలో (నికరాగ్వా, హోండూరస్) జరిగిన రెండు ప్రాముఖ్యత కలిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాకు అనుకూలంగా ఉండే, మితవాద పార్టీలు వామపక్షాల చేతుల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత, వెనెజులాలో జరిగిన ప్రాంతీయ, స్థానిక ఎన్నికల్లో పాలక యునైటెడ్ సోషలిస్టు పార్టీ (పిఎస్‌యువి) పలు ప్రావిన్స్‌ల్లో ఐక్య ప్రతిపక్షాన్ని ఓడించింది. మొత్తంగా 23 గవర్నర్ పదవులకు గానూ 19స్థానాలను కైవసం చేసుకుంది. ఇక క్యూబాలో ప్రభుత్వ మార్పు కోసం అమెరికా ప్రయత్నాలను, వారి ప్రణాళికలను ముందుకు సాగనివ్వకుండా విప్లవ శక్తులు అడ్డుకున్నాయి. ఇవి, వామపక్షాలను బలోపేతం చేసిన సంఘటనలే కానీ, ఇవి మాత్రమే సూచనలు కావు.
దక్షిణప్రాంతమైన చిలీ, అర్జెంటీనాల్లో వామపక్షాల వైపు మొగ్గుచూపే శక్తులు ఎన్నికల్లో బలమైన సంకేతాలు చూపుతున్నాయి. చిలీలో మొదటి దఫా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి గాబ్రియెల్ బోరిక్ నేతృత్వంలోని అప్రూవ్ డిగ్నిటీ అలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఫాసిస్ట్ మితవాద అభ్యర్థి జోస్ ఆంటానియో కస్త్ మొదటి స్థానంలో నిలిచారు. మధ్యే వామపక్ష రాజకీయవేత్త అయిన బోరిక్‌కు చిలీ కమ్యూనిస్టు పార్టీ మద్దతిస్తోంది. డిసెంబరు 19న జరగనున్న రెండో దఫా ఎన్నికల నేపథ్యంలో ఫాసిస్ట్‌లకు వ్యతిరేకంగా ఓటర్లు ఉత్సాహం ప్రదర్శిస్తుండటంతో ఈ ఎన్నికల్లో బోరిక్ ముందున్నారు. అ పక్కనే గల అర్జెంటీనాలో అధ్యక్షుడు అల్బర్ట్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని పాలక లెఫ్ట్-ఆఫ్-సెంటర్ అలయన్స్ ఫ్రెంటె డీ టోడోస్ (ఎవ్విరివన్ ఫ్రంట్) బ్యూనస్ ఎయిర్స్, లా పాంపాల్లో తీవ్ర పరాజయాలను మూటగట్టుకుంది. గత 40ఏండ్లలో మొదటిసారిగా సెనెట్‌లో ఓడిపోయింది. అయినా, చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో మెజారిటీని నిలబెట్టుకోగలిగింది. నయా ఉదారవాదానికి పురిటిగడ్డ అయిన చిలీలో బోరిక్ విజయం దక్షిణ అమెరికా పాలక వర్గాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలవనుంది.
హోండూరస్ నుండి చిలీ వరకు ప్రతి దేశంలోనూ మితవాద పార్టీలు, అమెరికా మద్దతిచ్చే పార్టీలు వణికిపోతున్నాయి. మరోవైపు వామపక్షాలు కీలక విజయాలను సాధిస్తున్నాయి. నికరాగ్వాలో డేనియల్ ఓర్టెగా నేతృత్వంలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్ తన సమీప ప్రత్యర్థిని 76-14శాతంతో ఓడించింది. అణచివేతకు సంబంధించి ఆరోపణలు ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి సమయంలో సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ఎఫ్ఎస్ఎల్ఎన్కు కింది స్థాయి మద్దతు లభించింది. ఆ పక్కనే గల హోండూరస్‌లో, జియోమారా కాస్ట్రో నేతృత్వాన, వామపక్ష శక్తులతో కూడిన లిబ్రే సంయుక్త వేదిక ఘన విజయం సాధించింది. 2009 నాటి కుట్ర శక్తులను ఓడించింది. లాటిన్ అమెరికాలో అమెరికా కుట్రలు కుయుక్తులను దెబ్బతీసేలా ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధించిన రెండవ సంఘటన ఇది. మొదటిది ఈ ఏడాది బొలీవియాలో చోటు చేసుకుంది. 2019లో కుట్రతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు. మూవ్మెంట్ టు సోషలిజం ప్రభుత్వానికి తిరిగి ఘనంగా పట్టం గట్టారు.
ఎన్నికల జోక్యం
''ఇతర దేశాల ఎన్నికల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నదని మిగిలిన ప్రపంచం భావిస్తే ఎలా వుంటుంది? అయినా అది ఎలా తెలిసింది?'' అని ఈ ఏడాది జూన్ 16న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ)కి డిజిటల్ లైబ్రరీ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలతో సహా ప్రజాస్వామ్య ప్రక్రియల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని అక్కడి పత్రాలు స్పష్టంగా తెలియచేస్తాయి. ఆ పత్రాలను ఎవరైనా చదువుకోవచ్చు. అమెరికా అర్థగోళంలో అమెరికా కుట్రకు గ్వాటెమాలా (1954), బ్రెజిల్(1964), చిలీ(1973)లు ఉదాహరణలుగా ఉన్నాయి. చిలీ (1964), నికరాగ్వా(1990), ఎల్ సాల్వడార్(1982 నుండి కొనసాగుతునే ఉంది)ల్లో మితవాద శక్తుల ఎన్నికల ప్రచారానికి పెద్ద మొత్తంలో నిధులు గుమ్మరించింది. యుఎస్ఎఐడి (అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ), నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ వంటి అమెరికా ప్రభుత్వ సంస్థలు రాజకీయ రంగంలో మితవాద శక్తులు ముందంజ వేయడానికి సాయపడుతున్నాయి. పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తున్నాయి. ఇటీవలే, ఫేస్బుక్ వేగు ఒకరు మాట్లాడుతూ, బొలీవియా, బ్రెజిల్, హోండూరస్ల్లో మితవాద శక్తుల తరపున ట్రోల్ చేసే ఆర్మీలను తమ వేదిక సవాలు చేయదని చెప్పారు. ఇలా ట్రోల్ చేసే ఆర్మీల్లో కొన్ని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. గత కొన్నేండ్లుగా నికరాగ్వా, వెనెజులాల్లో అమెరికా ప్రభుత్వ సంస్థలు హింసాత్మక చర్యలను నిర్వహిస్తూ, వాటికి డబ్బు కూడా చెల్లించాయి. మరోవైపు హైతీ పాలకవర్గం అక్కడి ప్రజాస్వామ్య క్రమాన్ని దెబ్బతీయడానికి అమెరికా ప్రభుత్వం పచ్చజెండా వూపింది. ఇలా రహస్య చర్యలే కాకుండా, బహిరంగ జోక్యానికి సంబంధించి రికార్డులు కూడా ఉన్నాయి.
నికరాగ్వా అధ్యక్ష ఎన్నికలతో పాటు ఆ దేశాన్ని శిక్షించడానికి ఆంక్షలతో కూడిన రెనెసర్ (ఎన్నికల సంస్కరణల కోసం నికరాగ్వా కట్టుబాటులను బలోపేతం చేయడం) చట్టాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. నికరాగ్వా ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, 2021 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి, అకస్మాత్తుగా రాజకీయ పరివర్తన సాధించేందుకు గానూ రెయిన్ (రెస్పాన్సివ్ అసిస్టెన్స్ టు నికరాగ్వా)తో సహా వివిధ రాజకీయ శక్తులకు అమెరికా నిధులు అందచేసిందని గతేడాది యుఎస్ఎయిడ్ నుండి లీకైన డాక్యుమెంట్ తెలియచేసింది. నికరాగ్వా ఎన్నికల క్రమం స్వేచ్ఛగా, సక్రమంగా పారదర్శకంగా లేదని అమెరికా మద్దతు ఉన్న పలు శక్తులు వ్యాఖ్యానించాయి. నికరాగ్వా ఎన్నికల చట్టబద్ధతను దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. ఇక్కడ వీరి కుయుక్తి తేటతెల్లమవుతోంది. ఎన్నికలు చట్టబద్ధంగా జరగలేదని చెప్పి వాటిని రద్దు చేసి, తర్వాత ఆ దేశంపై తమ పట్టును మరింత పెంచుకోవడానికి ఆంక్షల రూపంలో చర్యలు తీసుకుంటారు. తద్వారా అక్కడి ప్రధాన రాజకీయ శక్తులు అమెరికాకు లొంగిపోయేలా చూడడం వారి ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. నికరాగ్వాలో జరిగింది ఇదే. ఎన్నికల క్రమంలో జోక్యానికి బైడెన్ ఇచ్చే నిర్వచనం పరిధిలోకి ఇదంతా రాదు.
వెనెజులాలో జోక్యం మరింత ప్రస్ఫుటంగా ఉంది. ఆ దేశంపై నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినమైన ఆంక్షలు విధించారు. వాటిని బైడెన్ కొనసాగించారు. ఈ ఆంక్షలు వెనెజులా ప్రజలకు గణనీయమైన సవాళ్ళు సృష్టించాయి. ప్రపంచంలోని చాలా ఇతర దేశాల్లో కన్నా మరింత ప్రజాస్వామ్యమైన రీతిలో వెనెజులా ఎన్నికలను నిర్వహించింది. సుదీర్ఘ క్రమం ద్వారా అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలతో చర్చలు జరిపింది. వారిని కూడా ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అయినా బొలీవియా విప్లవానికి సైద్ధాంతిక పట్టుగా నిలిచిన బలమైన చావెజ్వాదాన్ని ఓడించడం కష్టమైంది. చివరకు అమెరికాకు అత్యంత ఇష్టుడైన వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్ గెయిడో కూడా ఎన్నికల ఫలితాలను ఆమోదించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యమై మరోసారి పోటీ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ''ప్రతిపక్షాల వేధింపులు, మీడియా సెన్సార్షిప్, ఇతర అప్రజాస్వామ్య ఎత్తుగడలు'' అంటూ పలు ఆరోపణలు చేశారు. పైగా ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగలేదనేశారు. వామపక్షాలకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన లాటిన్ అమెరికాలో ఎన్నికల క్రమాలను అవమానించడం అమెరికాకు అత్యంత సాధారణమైన అంశంగా మారిపోయింది.
ఒత్తిడి ప్రచారాలు
పరాజయాన్ని అధిగమించలేనప్పుడు, వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అమెరికా ప్రభుత్వం అక్కడ గల ప్రముఖ వర్గంతో చేతులు కలుపుతుంది. జూన్‌లో జరిగిన పెరూ అధ్యక్ష ఎన్నికల్లో చోటు చేసుకుంది ఇదే. అధ్యక్షుడు పెడ్రో కేస్టిలో ఒత్తిడి ప్రచారం ఉధృతమవడం చూశారు. వెనెజులాపై ఆంక్షలకు మద్దతివ్వడానికి నిరాకరించినందుకు పెరూ విదేశాంగమంత్రి హెక్టార్ బెజార్ను రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ స్థానంలో మోడరేట్ టీమ్‌ను పెట్టారు. ఆ బృందంలో పెరూ ఆర్థిక మంత్రి, మాజీ ప్రపంచ బ్యాంక్ అధికారి పెడ్రో ఫ్రాంకె కూడా ఉన్నారు. ఇక మాజీ సిఐఎ ఏజెంట్ లిసా కెన్నా నేతృత్వంలోని అమెరికా ఎంబసీ ముఖ్యులు కేస్టిలోకి, ఆయన స్వంత పార్టీకి ముఖ్యంగా పార్టీ ప్రముఖనేత వ్లాదిమిర్ కెరాన్కు మధ్య విభేదాలు సృష్టించారు. కేస్టిలో పదవిలోనే ఉన్నారు. కానీ, ఆయన తీసుకువచ్చిన వామపక్ష ఎజెండా ఒత్తిడి తీవ్రతకు నీరుగారిపోయింది. సెంట్రల్ అమెరికాలో అమెరికాకు కీలక స్థావరంగా ఉన్న హోండూరస్‌లో ఇప్పుడు జియోమారా కాస్ట్రో నేతృత్వంలోని లిబ్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఎత్తుగడలే అనుసరించవచ్చు.
సెలాక్ (లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కమ్యూనిటీ) వంటి ప్రాంతీయ సంస్థలతో వామపక్ష శక్తులు సంఘటితమవుతున్నాయి. 2010లో కొన్ని దేశాల సమాహారంగా ఏర్పడిన ఈ సెలాక్ నెమ్మదిగా రాజకీయ ఐక్యతను కూడగట్టుకుంటోంది. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్తో సహా సెలాక్ నేతలు మాట్లాడుతూ, నెమ్మదిగా అమెరికా నేతృత్వంలోని అమెరికాదేశాల సమాఖ్య (ఒఎఎస్) స్థానాన్ని సెలాక్ ఆక్రమించగలదని ప్రకటనలు చేస్తున్నారు. అంతర్రాష్ట స్థాయిలో సెలాక్ పురోగతి గణనీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బొలివారియన్ ఒప్పందం (అల్బా-టిసిపి) విస్తరణలో దీన్ని మనం చూడవచ్చు. 2004లో క్యూబా విప్లవ నేత ఫైడెల్ కాస్ట్రో, వెనెజులా నేత హ్యుగో ఛావెజ్ల చొరవతో అల్బా-టిసిపి ఏర్పడింది. హోండూరస్ ఇందులో తిరిగి చేరుతుందని భావిస్తున్నారు. కుట్రను భగం చేసిన తర్వాత బొలీవియా ఇలాగే తిరిగి చేరింది. హోండూరస్ అధ్యక్షురాలు జియోమారా కాస్ట్రో తమ దేశాన్ని తిరిగి అల్బా-టిసిపిలోకి తీసుకురావడమే కాదు, అధ్యక్షురాలిగా ప్రథమ విదేశీ పర్యటన కూడా అమెరికాలో కాకుండా చైనాలో జరపనున్నారు. లిబ్రే నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాతో సంబంధాలపై ఆధారపడడం కంటే చైనాతో, ఇతర ఆసియా దేశాలతో సన్నిహితంగా వాణిజ్యాన్ని నెరపాలన్నది తమ ఆలోచన అని కూడా వారు స్పష్టం చేశారు.
ఈ ప్రజాస్వామ్య విజయాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. 2022లో బ్రెజిల్, కొలంబియా ఎన్నికల తర్వాత ఇవి మరింత శక్తివంతంగా మారతాయి. ఈ రెండు దేశాల్లో ప్రస్తుతం కరడుగట్టిన మితవాద ప్రభుత్వాలు ఉన్నాయి. వామపక్షాలు గణనీయమైన ప్రయోజనాలు పొందగలవని అంచనా వేస్తున్నారు. బ్రెజిల్లో వీరోచిత యోధుడు, మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా తిరిగి అధికారంలోకి రావడం దాదాపుగా జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పోల్స్‌లో ఇతర మితవాద అభ్యర్ధుల కంటే లూలా ముందంజలో ఉన్నారు. 2018లో లూలాపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డంకొట్టి జైర్ బోల్సనారో ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటువంటి ఎత్తుగడలు ఈసారి పనిచేయవు. కొలంబియాలో, బొగొటా మాజీ వామపక్ష వేయర్ గుస్తావొ ప్రెటో అధ్యక్ష పదవికి పోటీలో ముందు వరసలో ఉన్నారు. అయితే అధ్యక్ష పదవికి కనీసం ఉదారవాది గెలవడానికి కూడా అనుమతించని కొలంబియా ప్రముఖ వర్గం ఆగ్రహానికి ఆయన గురికావాల్సి వస్తుంది. మాజీ గెరిల్లా అయిన ప్రెటో గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్నారు. ఈసారి అధ్యక్షుడు ఇవాన్ దుక్యూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలను అవకాశంగా తీసుకుని, మొత్తంగా వామపక్షాలను ఐక్యం చేయగలిగితే ఈసారి ఎన్నికల్లో ప్రెటో గెలిచే అవకాశం ఉంది. బ్రెజిల్లో లూలా గెలుపొంది, కొలంబియాలో ప్రెటో విజయం సాధిస్తే, దక్షిణ అమెరికాలో అమెరికా బలవంత ఆధికార వేదికలు మొత్తంగా తుడిచిపెట్టుకు పోతాయి.
- విజయ్ ప్రసాద్