Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా ప్రభావం మన దేశంపైనా ప్రభావం చూపింది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్థితిగతులపై తీవ్రప్రభావాన్ని చూపింది. ఐద్వా కేంద్రకమిటీ పిలుపులో భాగంగా కరోనా ప్రభావంపై పట్టణాలలో ఆర్థిక స్థితి గతుల ఆధారంగా మహిళల పరిస్థితికి సంబంధించి వివిధ తరగతులలో ఎలా ఉంది అనే అంశంపై తెలంగాణ రాష్ట్రంలోని 25 జిల్లాలలో 100 మందిని కరోనాకు ముందు, కరోనా తరువాత వీరు చేసిన అప్పులు, కట్టిన వడ్డీలు పడ్డ ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం తదితర అంశాలపై విశ్లేషణ చేెయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ప్రభావం మూలంగా మహిళలకు సరైన పని దొరకని పరిస్థితి ఉంది. గతంలో ఉపాధి హామీ స్కీమ్‌లో సంవత్సరానికి వంద రోజుల్లో 75రోజులు సగటున పని దొరికేది. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి 45రోజులకు మించి పని దొరకని పరిస్థితి నెలకొంది. లాక్డౌన్ సమయంలో పట్టణాలలో ఇళ్ళల్లో పని చేసేవారు, అడ్డా మీది కూలీలు, వివిధ దుకాణాలలో, షాపింగ్ మాల్స్‌లలో పని చేసేవారు, చిరు వ్యాపారులు, హౌటల్స్‌లో పని చేసేవారు, అనేకమంది ఉపాధి కోల్పోయారు. ఇందులో చాలామంది వాళ్ల అవసరం కోసం చిట్టీలు కట్టేవారు, తమ అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు తీసుకున్న వారు అవి కట్టలేక, తీర్చలేక, రోజు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా సర్వేలో 90శాతం మంది అప్పులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తెచ్చు కున్నారు. సొంత ఇండ్లు లేని వారు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లించలేక నరక యాతన పడ్డారు. ఇంట్లో కావలసిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయలేక దుర్భర జీవితాన్ని గడిపారు. కొన్ని కుటుంబాలు అప్పులు తెచ్చుకొని కుటుం బాన్ని నెట్టుకు వచ్చాయి. కరోనా ప్రభావం మూలంగా పట్టణ, గ్రామీణ ప్రాంతంలో పనులు లేక విలవిలలాడారు. ఉన్నఫలంగా పని పోవడం వల్ల మహిళలు పిడికెడు మెతు కుల కోసం ఎదురు చూసిన పరిస్థితి. భర్తల సంపాదన మీద ఆధారపడిన మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా తయార యింది. అనేకమంది పనులు దొరకక పట్టణాలకు వలస వచ్చిన వారు ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వారి ఇబ్బందులు వర్ణనాతీతం.
కరోనా వైరస్ తరువాత మహిళల పరిస్థితి
సూర్యాపేట జిల్లా హనుమాన్ నగర్‌కు చెందిన పద్మ ఒంటరి మహిళ. ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవించేది. రోజూ ఖర్చులు పోను 400 నుండి 500లు సంపాదించేది. కరోనా తరువాత రోజు 150 నుండి 200 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నది. నల్గొండ పట్టణానికి చెందిన జ్యోతి కరోనాకు ముందు రోజు నాలుగు బ్లౌజులు కుట్టేది. దానిద్వారా రోజుకు ఎనిమిది వందల రూపాయలు సంపాదించేది. కాని కరోనా తర్వాత రోజు కేవలం రెండు బ్లౌజులు మాత్రమే కుడుతుంది. దాని ద్వారా 300 రూపాయలు ప్రతిరోజు సంపాదిస్తుంది. వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఇల్లు కలగానే మిగిలిపోయిందని బోరున విలపించింది. హైదరాబాద్ సౌత్ జిల్లా రవీంద్ర నాయక్ వాసులు బద్రి బాయి సక్కుబాయి ప్రయివేట్ ఏజెన్సీలో పని చేశారు. ఆ సమయంలో వీరిని తొలగించారు. రోడ్డుమీద వీరు మిర్చి బండి పెట్టుకొని రాత్రి పది గంటల వరకు అమ్ముకుని బతుకుతున్నారు. ఇదే బస్తీలో సుశీల గతంలో ఏడుగురు కార్మికులను పెట్టుకుని టీ స్టాల్, పాన్ షాప్ నడుపుకుంటే అన్ని ఖర్చులు పోను నెలకు 50,000 మిగిలేవి. కరోనా తర్వాత ఆమె ఏడుగురిని పని నుండి తొలగించింది. ఇప్పుడు ఆ రెండూ నడుపుతున్నా కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది.
అధిక ధరలు
కరోనా అనంతరం నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు బహిరంగ మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగితే వెంటనే పౌర సరఫరా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వారు. పెరిగిన ధరలు నుండి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలందరికీ నిత్యవసర వస్తువులను అందించి ఆదుకునేవారు. కాని ప్రభుత్వాలు, అధికారులు ధరల పెరుగుదలపై ఏమాత్రం ఆలోచించక పోవడం మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు ప్రజలకు కావలసిన వస్తువులను బ్లాక్ మార్కెట్లోకి తరలించి ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతున్నారు. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, ఉల్లిగడ్డలు, చింతపండు, పామాయిల్, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరకు అందించేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికీ కరోనా తరువాత ప్రజలకు పనులు దొరకక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ నిత్యావసరాలకుతోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలు
ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ప్రభుత్వాలు... కొన్ని చర్యలను తక్షణమే చేపట్టాలి. ఉపాధి హామీ చట్టాన్ని విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసి ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించి, రోజు కూలీ ఆరు వందలు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంత ప్రజలకు వర్తింప చేయాలి. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్ట పరిచి కేరళ ప్రభుత్వ సలహాలు 17 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించాలి. విద్యాసంస్థల లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. 8,మహిళలకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉచిత వైద్యం అందించాలి.
- మల్లు లక్ష్మి
సెల్:9848481099