Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ హక్కులు మనదేశంలో యదేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయనడానికి తాజా ఉదంతం నాగాలాండ్ దురంతం. తీవ్రవాదుల పేరుతో సైన్యం ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 15మంది అమాయక పౌరుల ప్రాణాలను బలితీసుకున్నది.
తొలుత తీవ్రవాదులని ఆరుగురిని, ఆ తర్వాత తమపైకి ఆగ్రహావేశాలతో వస్తున్న జనాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆత్మరక్షణ పేరుతో మరో ఏడుగురిని సైన్యం కాల్చి చంపింది. మధ్యలో ఓ జవాను గాయపడి మరణించాడు.
సరిహద్దు భద్రతా దళాలకు కల విశేషాధికారాలే ఈ మారణకాండకు కారణమని వేరుగా చెప్పక్కర్లేదు. పౌరుల ప్రాథమిక హక్కైన జీవించే హక్కుకు అంతం పలకడమనేది అంతిమ సత్యం.
ఈ పొరపాటుకు చింతిస్తున్నామని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా పార్లమెంట్లో ప్రకటించారు. 'పిల్లికి చెలగాటం - ఎలుకకి ప్రాణసంకటం' అంటే ఇదే. ఇలాంటి పొరపాట్లు, దుర్ఘటనలు (అమాయకుల ప్రాణాలను బలికొనే) మళ్ళీ జరగకుండా చూస్తామనే పాలకుల భరోసా నేడు ఓ బ్రహ్మపదార్థంగా మారింది. ఎందుకంటే తగు చర్యలు నిజాయితీగా చేపట్టిన దాఖలాలు కన్పించవు గనుక.
తీవ్రవాదుల్ని అదుపు చేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడం పాలకుల కర్తవ్యం. నిజమే. ఆ మిషతో సైనికులకు విశేషాధికారాలు కల్పించడం, వారు ఏ దురాగతానికి పాల్పడినా న్యాయపరిధిలోకి రాకపోవడం, ప్రజాస్వామ్య కోణంతో ఎవరు ఏమాత్రం విమర్శించినా, సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వాపోవడం - చివరకు రాజ్యం యొక్క బలాన్ని, పరిధిని అతిగా చేయడమే అవుతుంది. అందుకే రాజ్యాంగ సూత్రాలను కించపరిచేలా సైన్యానికి విశేషాధికారాలు కల్పించడం సరికాదని రాజనీతిజ్ఞులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
అయినా ఈశాన్య భారతంలోనే కాదు, నిత్యం అనేకచోట్ల ఈ దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటి నాగాలాండ్ ఘటన ఇదే మొదలు కాదు, ఇదే తుది కాదు. ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల వాదులు మరింతగా మేల్కొనవలసిన సమయమొచ్చింది.
అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలు, అత్యాచారాలు, మనుషులు మాయవడం (మిస్సింగ్స్), బూటకపు ఎన్కౌంటర్లు, తాజాగా పొరపాటు కాల్పులు - మరి ఈ 'విశేషాధికారాలు' చెలరేగిపోవడం వలన ప్రజల ప్రాణరక్షణకు, జీవించే హక్కును కనీస భద్రత ఏది?
ఇరవైఏండ్ల క్రితం ఇలాగే ఓ బస్‌కోసం వేచిచూస్తున్న పదిమంది అమాయకులను కాల్చి చంపేసిన ఘటనకు వ్యతిరేకంగా మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల, సైన్యం విశేషాధికారాల చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ, పదహారేండ్లపాటు సుదీర్ఘ నిరాహారదీక్ష చేసిన విషయం జగద్విధితం.
అలాగే మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై విచారణ జరిపిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్, ఈ సాయుధ బలగాల విశేషాధికారాల చట్టమే సాంఘిక అశాంతికి మూలకారణమని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.పి.జీవన్‌రెడ్డి కమిటీ అసలు ఆ చట్టాన్ని సమూలంగా రద్దు చేయమని అంతకుముందే కోరింది. నిర్భయ ఉదంతంతో నిర్మించిన వర్మకమిషన్ సైతం ఈ చట్టం రద్దు చేయమని కోరింది.
అంటే ఆ చట్టం ప్రజల జీవన హక్కులకు ఎంతటి ప్రమాదమో ఎలాంటి విఘాతం కలిగిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కాగా, వ్యక్తి జీవన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి విల్లేదని భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ధృవీకరిస్తున్నది. ఈ రెంటికీ ఎంతటి వ్యత్యాసం..? మరి అలాంటప్పుడు ఈ సైనిక చట్టం (విశేషాధికారం) ఏమిటి? ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
అందుకే ప్రజలకు లభించే హక్కులను బట్టే ఏ రాజ్యాంగం గొప్పతనాన్నైనా తెలుసుకోవచ్చు. ప్రభుత్వాలు ప్రజలకు అనేక హక్కులు ఇచ్చినట్టు ప్రకటించినా అవి అమలై ఫలితాలు అందినప్పుడే కదా నిజమైన విజయం సాధించినట్టు అవుతుంది.
పౌరుల హక్కుల సాధనకు పోరాడాలని కూడా మన భారత రాజ్యాంగం ఆశిస్తూ అనేక సౌకర్యాలు కల్పించింది. అదే మన భారత రాజ్యాంగం యొక్క సిసలైన స్ఫూర్తి. అందుకే మనం మన రాజ్యాంగాన్ని హక్కుల పత్రంగా పేర్కొంటాము.
ఏ మనిషికైనా హక్కులు ఉండటం ఎంత ముఖ్యమో, వాటిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో కులమతాలతో నలుగుతున్న నిచ్చెనమెట్ల సమాజం ఉన్నది. అంతే కాదు పురుషాధిక్యతలో బంధించబడి ఉన్నది. ఆధిప్యతం, పెత్తనం అనేవి ఎక్కడో పై అంతస్తుల్లో ఉండేవి కావు. అడుగడుగున అన్నిచోట్లా ఉంటుంది. ఎక్కువ మంది ఏదోస్థాయిలో నిత్యం అనుభవిస్తూనే ఉంటారు. మనవాళ్ళుగా అధికులమని భావించేవాళ్ళు తమ కుటుంబ స్త్రీలపైనే కాకుండా ఇతర స్త్రీలపై కూడా ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటారు. నిర్భయ, దిశ అత్యాచార హత్యల కేసుల్లో ఇది రూఢ అయింది కూడా.
అలాగే ఆధిపత్య భావన ఉన్నవారు ఇతరులను చాలా చులకనగా చూస్తారు. వారికి ప్రజాస్వామ్యం అన్నా, పౌర హక్కులు అన్నా రుచించవు. రాజ్యంలోను, సైన్యంలోనూ, అధికార పోలీసు యంత్రాంగంలోనూ ఈ ఆధిపత్య వ్యత్యాసం వ్యవస్థీకృతమై కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పైవారు క్రిందిస్థాయికి పోతున్న కొద్దీ క్రిందివారిని అసలు మనిషిని మనిషిగా చూసే మానవీయ సంస్కృతి కొరవడుతుంది. నరనరాన హింస, ద్వేషమే మిగులుతుంది. రాజ్యాధికారంలో ఇలాంటి ఫాసిస్టు చర్యలు బుసలు కొట్టినంత కాలం తీవ్రమైన అసమానతలే కాదు హింసోన్మాదాలు, మారణహౌమాలు చెలరేగుతాయి. మానవ హక్కులు మృగ్యమవుతాయి. ఇప్పుడు జరుగుతున్నదదే.
'ఎదుటివారు నీ హక్కులను ఏరకంగా గౌరవించాలని ఆశిస్తారో, ఆ రకంగా వారి హక్కులను నీవు మనస్ఫూర్తిగా గౌరవించాలి' అదే నిజమైన పౌర స్పృహ. ఈ రకమైన మానవ హక్కుల చైతన్యము మన విద్యావిధానంలో చిన్నప్పటి నుండే భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఫ్యూడల్ పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ అవకాశం కల్పించదు. విద్యాధికులను కేవలం వ్యక్తివాదులగాను, అవకాశవాదులగాను, డబ్బు సంపాయించే యంత్రాలుగాను తయారు చేస్తుంది. పౌరహక్కుకు ప్రాధాన్యతనీయదు. ప్రజాస్వామ్య సమాజనిర్మాణంలో భాగస్వామ్యం చేయదు. అందుకే మన దైనందిన జీవితంలో మనం మానవహక్కుల స్ప్పహతో ప్రవర్తించడమే కాక, మొత్తంగా సమాజ నిర్మాణంలో మానవ హక్కుల అభివృద్ధి కోసం పని చేయడం నేడు ఓ అవసరంగా ముందుకు వచ్చింది.
చట్టసభల స్థానాల కోసం పోటీపడేది రాజకీయ పార్టీలు గనుక, ఆ రాజకీయ పార్టీలకు ఈ సంకల్పం కలిగించడం పౌర సమాజ బాధ్యత అయింది. మానవ హక్కుల భావన సమాజంలో జీర్ణమయేంతవరకు హక్కుల ఉద్యమాలు నిరంతరం జరగవలసిందే.
ఏదేని ఓ శాస్త్రీయ సామాజిక అవగాహనను మనం ప్రజా ఉద్యమం యొక్క అంతర్భాగంగానే చూడాలి. అప్పుడే రాజ్యం పరిధిలో మార్పును సాధించడం వీలవుతుంది. సమాజంలోని అణచివేతలను, ఆధిపత్యాన్ని అసమానతలను నిర్మూలించడంతో పాటు రాజ్య నిరంకుశత్వాన్ని సమూలంగా రూపుమాపాలనే సంకల్పంతోనే హక్కుల ఉద్యమం ఉనికిలోకి వచ్చింది. మరో విధంగా పౌరహక్కుల పట్ల ప్రభుత్వ పాలకులు చేయవలసిన కనీస విధులను ఎప్పటికప్పుడు చెపుతుంది, నిద్రపోయేవాళ్ళను, నిద్ర నటించేవాళ్ళను తట్టి లేపుతుంది. పౌరహక్కుల ఉద్యమం మూగబోతే పీడిత గొంతు మూగబోయినట్లే. ప్రజాస్వామ్య నావకు చిల్లులుబడినట్లే.
1948 డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన విడుదలైన తర్వాత దేశ దేశాల్లో నాగరిక ప్రపంచంలో విస్తృత చర్చ జరిగింది. 'మానవులంతా భావప్రకటనా స్వేచ్ఛ, నమ్మకం భయాలకు అతీతమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్న కొత్త ప్రపంచంలో జీవించాలి' అన్న సత్యం ఆ ప్రకటనలో నిబిడీకృతమై ఉన్నది. ఏ ఖండంలోని, ఏ దేశంలోని ఎలాంటి మనిషైనా మనిషే. వర్ణం, జాతి, తెగ, కులం, మతం, లింగం, ప్రాంతం, సకల వివక్షతలకు అతీతంగా మనిషిని మనిషిగా గుర్తించాలి, గౌరవించాలి. ఇదే నిజమైన ఆధునిక మానవీయ భావన. ఈ పురోగమనాన్ని ఆటంకపరచే ఎవరినైనా వ్యక్తులు, శక్తులు, చివరికి రాజ్యమైనా సరే ప్రతిఘటించి తీరాల్సిందే. అందుకే మానవ హక్కులు అనేవి మనం అప్పుడప్పుడు వల్లించుకునే చిలకపలుకులు కావు, అత్యంత సంపన్నుడి దగ్గర నుండి కడు పేద వరకు, రాజ్యాధినేత నుండి సామాన్యుడి వరకు అందరూ దైనందిన జీవితంలో నిత్యం పాటించవలసిన జీవన నియమాలు, మానవత, శాస్త్రీయత కలబోసిన ఆధునిక ధర్మాలు.
(డిసెంబర్ 10, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం)
- కె శాంతారావు
సెల్: 9959745723