Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి బాలలే రేపటి పౌరులు!
వారిని జాగ్రత్తగా మానవీయ విలువలతో పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఈతరం తల్లిదండ్రుల మీద ఉంది. అనైతిక, అనాగరిక కథలు, కావ్యాలు, పురాణాలు నేటి బాల బాలికలకు, యువతీ యువకులకు అందకుండా, వాటి ప్రభావం వారిమీద పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్త్రీ పురుషుల హుందాతనాన్ని దెబ్బతీసే అక్రమ సంబంధాలు, దేవతల మధ్య, రుషులూ దేవకన్యల మధ్య లెక్కలేనన్ని ఉన్నాయి. అవి గొప్పవి కాబోలు, వాటిని అనుకరించడం గొప్ప కాబోలు అనుకునే యువతీ యువకులున్నారు. ఫలితంగా వారు జీవితంలో ఓడిపోయి అర్థాంతరంగా జీవితాల్ని ముగించుకుంటున్నారు. మరికొందరు సమాజంలో అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులుగా స్థిరపడిపోతున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా ప్రమాదమే కదా? మత రాజకీయాలు, కుల విభజనలు సమకాలీనంలో కాదు, ప్రాచీన భారతదేశంలోనే ప్రారంభ మయ్యాయి. ఆధునికుడికి విచక్షణ పెరిగింది. సంస్కృతీ సాంప్రదాయాల చట్రంలో పడి, గతాన్నంతా నెత్తిన మోయకూడదని అనుకుంటున్నాడు. కానీ, అధికారంలో ఉన్న పెద్దలే గతంలో ఉన్నదంతా మన ఘనకీర్తి అని ఢంకా బజాయిస్తున్నారు. అమాయక జనం ఆ ఉచ్చులోపడి కొట్టుకుంటున్నారు. అందుకే చూడండి సమాజం రోజు రోజుకూ అక్రమ సంబంధాల సమాజంగా, రేప్‌ల సమాజంగా, పరువు హత్యల సమాజంగా విపరీత ధోరణుల వక్ర సమాజంగా రూపుదిద్దుకుంటోంది. అంటే పురాణేతిహాసాల్లోని కల్పిత పాత్రలు ఇప్పుడు వీరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయా? పునస్సమీక్షించుకునే పనిలేదా?
అందుకే చూడండి. దేశంలో రోజుకు వేల వేల రేప్‌లు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. పరువు హత్యలు అతి సామాన్యమైపొయ్యాయి. ఇలాంటి సంఘటనలు సమాజాన్ని అతి భయంకరంగా తయారు చేస్తున్నాయి. 'అమ్మాయిల్ని అదుపులో పెట్టడం కాదు, అమ్మాయిలతో గౌరవంగా ఎలా మసలుకోవాలో మీ అబ్బాయిలకు నేర్పండి' అని అంటున్నారు. అది నిజం! వందశాతం చెయ్యాలిందే!! కానీ ఏం చేస్తున్నాం మనం. ఒకసారి టెలివిజన్‌లో బిగ్‌బాస్ కార్యక్రమం ఓ రెండు నిముషాలు చూడండి. వాంతి చేసుకుని, కళ్ళు తిరిగి పడిపోకపోతే చూడండి. అలా పడిపోకపోతే మీరు గొప్ప సంప్రదాయ పరిరక్షకులన్నమాట! ఏ భారతీయ పురాణ విలువల్ని ప్రతిష్టాపించడానికి ఆ నిర్వాహకులు ఆ కార్యక్రమం ప్రసారం చేస్తున్నారో మరి? ఆధునిక మానవీయ విలువలు, స్త్రీ పురుషుల మధ్య గౌరవ భావమూ, ప్రవర్తనా కనపడదు. నవ్య నాగరికత పేరుతో అర్థనగంగా దుస్తులు వేసుకోవడం, అమ్మాయిలు అబ్బాయిల పక్కన బెడ్లపై పడుకోవడం.. నిముషానికోసారి కౌగిలింత, గంటకో ముద్దూ పెడుతూ సమాజంలో నీచ సంస్కృతిని వ్యాపింపజేస్తున్న ఆ కార్యక్రమ నిర్వాహకులకు శిక్షలుండవా? వారిని చూసి రతీదేవి మన్మధులను ఊహించుకోవాలా? అలాంటి కార్యక్రమాలు చూసి సమాజంలో యువత పెడదారిన పడుతున్న విషయం గూర్చి ప్రభుత్వ పెద్దలు ఆలోచించరా? సెన్సార్ లేని ఇలాంటి కార్యక్రమాలతో ప్రభావితులై బయట సమాజంలో ఎంత మంది బలి అవుతున్నారో లెక్కగట్టగలరా?
బస్సుల్లో, రైళ్ళలో రేప్‌లు చేయడాలు, రేప్ చేసి చంపేయడాలు, చంపేసి శవాన్ని కాల్చేయడాలు.. ఎన్నెన్ని చూస్తున్నాం? ఇలాంటి వాటికి కారణం ఈ చౌకబారు రియాల్టీషోలు కావా? ఆడవాళ్ళు కూడా అక్రమ సంబంధాలకు అలవాటు పడి భర్తల్ని చంపడం, పిల్లల్ని చంపడం చూస్తున్నాం. స్త్రీ పురుష సమానత్వమనేది హుందాగా, గౌరవంగా ఉండాలి. కానీ, ఒసే / ఒరేల కిందికి దిగజారి, చౌకబారు విశృంఖలత్వంగా మారిపోయింది! 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశంలో ఎన్నోచోట్ల ఎన్నోసార్లు పునరావృతమవుతూనే ఉంది. 2021 సెప్టెంబర్ 27న కదులుతున్న బస్సులో కండక్టర్, డ్రైవర్ తెల్లవారే దాకా ఓ అమ్మాయిని రేప్ చేశారు. మరో సంఘటనలో మరో యువతిపై నలుగురు రేప్ చేసి, తమ పేర్లు పలకకుండా ఆ అమ్మాయి నాలుక కత్తిరించి పారిపోయారు... ఇలాంటి సంఘటనల్ని సమర్థించని వారు, మన పురాణాలలో ఉన్న దేవతల / రుషుల అక్రమ సంబంధాల్ని కూడా సమర్థించ గూడదు. ఇవిగానీ, అవిగానీ నేటి నాగరిక మానవ వాద సమాజానికి పనికిరావని చెప్పాల్సిందే! ఏ మాత్రం సంశయించగూడదు!
నల్లగొండలో ఓ పూజారి తన భార్యతో కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. నల్లగొండజిల్లా తిప్పర్తి మండలానికి చెందిన ఇతను పురాణ కాలక్షేపం చేస్తూ, భక్తులకు దేవుడి ఆశీస్సులు అందించే పూజారి అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆయన భార్య ఎంతటి మహాతల్లో.. సాటి ఆడవారిని పడుపు వృత్తిలోకి దించే సాధ్వీమణి. వీరితో ఈ పని చేయించే ఆ దేవదేవుడు మాత్రం తక్కువవాడా? నల్లగొండ శివారులో దేవరకొండ రోడ్డులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, పురాణాల్లో దేవతలు చేసిన పనిని వీరిక్కడ మనుషులతో చేయిస్తున్నారు. అది నచ్చని పోలీసులు రెయిడ్ చేసి, దోషులను పట్టుకుని చట్టానికి అప్పగించారు. ఇది 2021 నవంబర్ 9న జరిగింది.
వందేండ్ల క్రితం కోటయ్య అనే ఒక లింగ బలిజ, ఒక గొల్లపడుచుతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆ విషయం తెలిసి ఆమె భర్త ఆ కోటయ్యను చంపేశాడు. జరిగింది అది - కానీఅతనేదో మహానుభావుడైనట్టు, జనం కోసం ప్రాణత్యాగం చేసినట్టు - మానసిక రోగులు కొందరు అతణ్ణి 'కొండదేవర' అన్నారు. అంతే.. అది ఇప్పుడు కోటప్పకొండగా ప్రసిద్ధిచెందింది. గుంటూరుజిల్లాలోని నర్సరావుపేటకు దగ్గరగా ఉంటుంది. తర్వాత కాలంలో బ్రహ్మశిఖరం, రుద్రశిఖరం, విష్ణుశిఖరం లాంటి పేర్లు, కొన్ని కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. స్థల పురాణాల్ని ప్రచారం చేస్తేనే కదా? ఆ స్థలానికి భక్తులు వచ్చేది? ఆ కోటప్ప (కొండయ్య)ను ఎందుకు దేవుణ్ణి చేశారో ఎవరికీ తెలియదు. అలాగే ఒక ముస్లింను హిందూ దేవుడు సాయిబాబాగా ఎందుకు చేశారో ఎందుకు పూజిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇలా ఊరికో దేవుడు వెలిశాడు. చాలా వరకు మనువాదుల కుట్ర, కొంత ఆనాటి జానపదుల అమాయకత్వం కలగలిసి వెరసి ముప్పయిమూడు వేల దేవీ దేవతలయ్యారని ఒక సర్వే తెలియజేస్తోంది. ఆసక్తి ఉన్నవారు డాక్టర్ వెంకట రమణయ్య గ్రంథం ''దక్షిణభారత దేవాలయాలు'' తిరగేయండి.
అమెరికన్ వైజ్ఞానిక సృజనకారుడు ఐసాక్ అసిమోల్ ఏమన్నాడంటే.. ''ఆధునిక పరిశోధనల ఫలితంగా పెరుగుతున్న విజ్ఞాన శాస్త్రానికి దీటుగా సమాజంలో సగటు మనిషి వివేకం పెరగడం లేదు'' అని! అంటే ఏమిటీ? వైజ్ఞానిక పరిశోధనలకు అనుగుణంగా సైన్స్ పెరుగుతూ ఉంది. కానీ, దాన్ని అందుకుని అందుకు అనుగుణంగా మానవీయ విలువల్ని, నైతికతను పరిరక్షించుకునే పని మనుషులు చేయడం లేదు.. అని! అందుకే కదా? సమాజం భ్రష్టు పట్టిపోతోంది? అన్ని రకాలుగా పతనమవుతూఉంది? అక్కడ జ్ఞానాన్ని పెంచుతూ పోతున్నది కొద్దిమంది పరిశోధకులు. వారూ మనుషులే! దాన్ని పట్టించుకోకుండా, మూర్ఖత్వంలో కూరుకుపోతున్నది ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజలు. అలాంటప్పుడు ఈ సమాజం వైజ్ఞానిక యుగంలోకి ఎలా వెళుతుందీ? అధిక సంఖ్యాకులైన ప్రజలు తమ మూర్ఖత్వాన్ని వదిలించుకోకుండా.. తమ కంటే హీనులైన వారిని నాయకులుగా ఎన్నిక చేసుకుంటున్నప్పుడు మార్పు ఎలా వస్తుంది? తాత్కాలిక సుఖ సంతోషాల కోసం అర్రులు చాస్తున్నప్పుడు ఆ పూట - ఆ క్షణం గడిస్తే చాలుననుకుని, అన్ని విలువల్ని ధ్వంసం చేస్తూ, నైతికంగా దిగజారుతున్నప్పుడు భవిష్యత్తు అంధకారం కాక ఏమవుతుందీ? వక్రీకరణలు, వక్ర భాష్యాలు, అబద్దాలు, కండబలం, అధికార మదం రాజ్యమేలుతున్నప్పుడు మనిషి కుంచించుకుపోక ఎలా వికసిస్తాడు? అయినా కూడా - కింద పడినవాడు లేవక తప్పదు. ఓడినవాడు తిరగబడి గెలవక తప్పదు. తప్పుల తడకల్ని తిరగేసి కొత్త చరిత్రని రాసుకోక తప్పదు. పతనం వినాశనానికి కాదు, ''గెలుపుకోసం ప్రయత్నించడానికి దొరికన మరొక అవకాశం'' అని భావించక తప్పదు. గత కాలపు వచనాన్ని, పాత నిర్వచనాన్ని మార్చుకోక తప్పదు. లేచి నిలబడాల్సిందే! నిలబడి అందుబాటులో ఉన్నది అందుకోవాల్సిందే!! అందుకుని నూతన భవితకు దారులు వేయాల్సిందే..
'భయానికి పుట్టిన రోగమే మతం' అయినప్పుడు... ప్రపంచ మానవాళి ముందు దానిలోంచి బయటపడాలి. నోబెల్ గ్రహీత మేడమ్ మేరీ క్యూరీ అంటారు.. ''జీవితంలో దేనికీ భయపడాల్సిన పనిలేదు. అర్థం చేసుకుంటూ ఉంటే చాలు - భయం తగ్గుతుంది. ఇప్పుడు మరింత లోతుగా, మరింత విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దానివల్ల భయం ఇంకా ఇంకా తగ్గుతుంది.'' మానవుడికి తన విజయాల మీద నమ్మకం పెరుగుతుంది. మనం శాంతియుత ప్రపంచాన్ని గనక కోరుకుంటూ ఉంటే, అందరం కలసి పనిచేయడం నేర్చుకోవాలి. నేటి యువతరం గతకాలపు విశ్వాసాలను, ప్రవర్తనలను అనుసరించకూడదు. ప్రపంచీకరణ, పరస్పరాధీనత లాంటి కొత్త పరిస్థితుల్లో ప్రపంచానికి కొత్త ఆలోచనలు అవసరం. మనం జనాన్ని - 'వాళ్ళు వేరని, మనం వేరని' విడదీయడం మానుకోవాలి. పురాణాల్లో ఉన్నట్టు దేవుళ్ళు, కిన్నెరాలు, కింపురుషులు, గంధర్వులు ఎవరూ లేరు. అవన్నీ ఊహాకల్పితాలు. వృక్షాలు, జంతువులు, మనుషులు మాత్రమే నిజం! మానవజాతి అంతా ఒక్కటే అన్నది వాస్తవం!
శాస్త్రవేత్తల వలె, నిబద్ధత గల కవులు కూడా మానవవాదులే! ''అమృతం కురిసిన రాత్రి''తో ప్రఖ్యాతుడయిన తెలుగు కవి బాలగంగాధర తిలక్ కవితా చరణాలు కొన్ని ఆ సంపుటిలోవే చూడండి. ఆయనకు నిరీశ్వర వాదిగా, హేతువాదిగా గుర్తింపు లేదు. కానీ, ఆయన కవిత్వమే ఆయనను మానవవాదిగా నిలబెట్టింది. ఆయన తన తపనను, ఆర్ద్రతను అక్షరాలలో పొదిగిన తీరును అనుభవిస్తే కళ్ళు చెమర్చాల్సిందే.. ''కృత్రిమ వేషాన్ని అభినయింపలేను / మానవత లేని లోకాన్ని స్తుతింపలేను / మానవునిగా శిరసెత్తుకు తిరగలేను / ఈ నాగరికతా రణ్యవాసం భరించలేను / ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మాలినాశ్రు బిందువొరిగినంత వరకు / ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు / ఒక్క శుష్క స్తస్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంత వరకు / ఒక్క తల్లి నీరవాక్రోశ రవమ్ము విన్నంత వరకు ఒక్క క్షత దుఖిత హృదయ మూరడిల్ల నంత వరకు / నాకు శాంతి కలగదింక నేస్తం, నేను నిగర్వినైనాను / ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను / ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదలినవి, ఈ కనులు వరదలై పారినవి / ఈ కలలు కాగితపు పేలికలైరాలినవి / ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు? ఏ రాజకీయ వేత్త గుండెలను స్పృశించగలదు? / ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? / ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఏ బుద్ద దేవుని జన్మభూమికి గర్వస్మృతి? / ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు?'' ప్రతి వ్యక్తికి ఇంత వేదన కలిగిన నాడు ఈ సమాజం బాగుపడుతుంది.
- వ్యాసకర్త: సుప్రసిద్ద సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు