Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రానంతర భారతదేశంలో అతి పెద్దది, అత్యంత సుదీర్ఘకాలంపాటు కొనసాగుతున్న రైతాంగ పోరాటంలో 700మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ పోరాటం గురించి అఖిల భారత కిసాన్‌సభ అధ్యక్షులు కామ్రేడ్ అశోక్ ధావలే అభిప్రాయాలు...
భారతీయ రైతుల బలాన్ని, ధైర్యాన్ని, తెగువను వర్ణించడానికి మాటలు చాలవు. రైతుల బాధలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా చాలా పొగరుగా, ప్రతికూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే ఈ పోరాటం ఏకంగా ఒక ఏడాది నుండీ కొనసాగుతోంది. ఈ చారిత్రాత్మక పోరాటానికి ఉన్న తొమ్మిది ప్రత్యేకతలను నేను వివరిస్తాను.
1. 500పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా వేదికపై ఐక్యంగా నిలిచి ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశం నలుమూలల నుండీ లక్షలాది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. వీరిలో వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కొంతమంది ధనిక రైతులు సైతం ఉన్నారు. ఎముకలు కొరికే చలిని, మండే ఎండల్ని, కుండపోతగా కురిసిన వానల్ని తట్టుకుని వారు పోరాడుతున్నారు.
2. కార్మిక-కర్షక ఐక్యతా స్ఫూర్తితో ఈ పోరాటాన్ని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రారంభం నుంచీ పూర్తిగా బలపరుస్తోంది. నిజానికి 2020 నవంబరు 26న కార్మికవర్గం దేశవ్యాప్త సమ్మె నిర్వహించిననాడే ఆ సమ్మెతోబాటు ఈ రైతు పోరాటం కార్మిక-కర్షక ఐక్య పోరాటంగా ప్రారంభం అయింది. గత ఏడాదికాలంలో పలుమార్లు లక్షలాది మంది కార్మికులు, రైతులు దేశవ్యాప్తంగా ఈ పోరాటానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ఆందోళనల్లో పాల్గొన్నారు.
3. ఈ పోరాటాన్ని అణిచివేయడానికి బీజేపీ ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రయత్నించాయి. బాష్పవాయు ప్రయోగాలు, నీటి ఫిరంగులు, కాంక్రీటు బారికేడ్లు, రోడ్ల మీద మేకులు దిగ్గొట్టడం, రోడ్లను తవ్వేయడం, లాఠీ చార్జిలు, విచక్షణారహితంగా అరెస్టులు, ఆఖరికి బీజేపీ కేంద్ర మంత్రికి చెందిన కారుతో తొక్కించి చంపేయడం వంటివి చాలా జరిగాయి. రైతులు తనకు శత్రువులన్నట్టు బీజేపీ వ్యవహరించింది. అయినప్పటికీ రైతులు ఈ నిర్బంధాన్నంతటినీ ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారు.
4. ఈ పోరాటాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ-ఆర్.ఎస్.ఎస్ చాలా ప్రయత్నించాయి. ఈ పోరాటం వెనుక ఖలిస్తాన్ వాదులు, లేదా మావోయిస్టులు, చివరికి పాకిస్థాన్, చైనా ఉన్నాయంటూ బురద జల్లేందుకు పూనుకున్నారు. గోడీ మీడియా ఈ తప్పుడు ప్రచారాన్ని భుజాన వేసుకుని నడిపించింది. ఈ దుష్ప్రచారాన్నంతటినీ ఎదుర్కొని రైతు పోరాటం తిప్పికొట్టింది.
5. ఇటీవల కాలంలో మన దేశం ఎప్పుడూ చూడని ప్రజారోగ్య సమస్య ఈ కాలంలో వచ్చింది. ప్రాణాంతకమైన కోవిడ్-19 రూపంలో వచ్చిన ఆ పెనుముప్పుతో ప్రజలు ఒకపక్క నానా యాతనలూ పడుతుంటే ప్రభుత్వం ఆ సమయంలోనే ఈ వ్యవసాయ చట్టాలను చేసింది. కోవిడ్ కాలంలో తనకు ప్రజల నుండి ఎటువంటి ప్రతిఘటనా ఎదురవదని భావించింది. కానీ రైతులు ఈ మహమ్మారి కాలంలో సైతం ధైర్యంగా పోరాటాన్ని ప్రారంభించడమే గాక రెండో విడత కరోనా ముప్పును సైతం తట్టుకుని నిలబడ్డారు.
6. లక్షలాది మంది రైతులు ఏడాదికి పైగా ఢిల్లీని ముట్టడించినా, ఈ కాలమంతా పోరాటం శాంతియుతంగాను, ప్రజాస్వామ్యయుతంగాను కొనసాగింది. తన పోలీసులను దింపి, అసాంఘిక శక్తులను తెరపైకి తెచ్చి ఈ పోరాటాన్ని హింసాత్మకంగా చిత్రీకరించాలని ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వ కుట్రలు సాగలేదు.
7. ఈ పోరాటం యావత్తూ లౌకిక స్వభావంతో ఉంది. మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా రైతు పోరాటం సాగుతోంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొంటున్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అన్ని తరగతులను, అన్ని ప్రాంతాలను కలుపుకుని ఈ పోరాటం సాగుతున్నందువలనే దీనిని అణచివేయడం ప్రభుత్వానికి సాధ్యం కావడంలేదు.
8. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈ పోరాటం బీజేపీని ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టింది. పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఖంగు తింది.
9. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఈ పోరాటం తన శత్రువులెవరో సరిగ్గా గుర్తించి వారిపై ఎక్కుపెట్టింది. బీజేపీ-ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దేశీయ, విదేశీ కార్పొరేట్ల అవినీతిమయ, అపవిత్ర కూటమి ఆ శత్రువు. ఈ రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రధాన డిమాండ్లు నిజానికి నయా ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్నాయి.
-అశోక్ ధావలే