Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్యవాదం (సోషలిస్ట్) అనే పదం భారత అభివృద్ధికి ఆటంకంగా మారిందా? లేకా సోషలిస్ట్ అనే పదం కలవర పెడుతున్నదా? సోషలిస్ట్ అనే పదమంటే ఎందుకంత భయం. పేరుకు తగ్గట్టు ప్రవర్తించకపోతున్నారు కాబట్టి... ఆ పేరు ఎందుకు...? అనుకున్నారేమో ఆ నామమాత్రమైన పేరును కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సామ్యవాదమనే పేరు భారత రాజ్యాంగానికే ప్రపంచ స్థాయిలో ఒక గౌరవ ప్రదమైనది. సామ్యవాదమనే పేరు రాజ్యాంగ పీటికలో ఉన్నందున ఈ దేశంలో సామ్యవాద వ్యవస్థ వైపు ప్రయత్నాలు పెద్దగా జరిగిందేమీ లేదు. అయినప్పటికీ కనీసం ఆ పేరున్నందుకైనా అడగటానికి నిస్వార్థపు అభ్యుదయ వాదులకు అవకాశం ఉంటుంది. అలాంటి పదాన్ని తొలగించడానికి రహస్య పద్ధతులనెన్ను కోవడం కుట్రపూరితం. ఎంతటి కుటిలత్వం లేకుంటే రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే ఒక బిల్లును రాజ్యసభలో ప్రయివేటు బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ప్రయత్నం చేస్తారు? బీజేపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు కె.జె ఆల్ఫాన్స్ రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కొన్ని పదాలను మార్చే విధంగా ఒక ప్రయివేటు బిల్లును డిసెంబర్ మూడున రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులైన రాష్ట్రీయ జనతా దల్ ఎంపి ప్రొఫెసర్ మనోజ్ ఝా, ఎండిఎంకె ఎంపి వైకొలు సమయస్ఫూర్తితో దానిని అడ్డుకోక పోయివుంటే అది ప్రవేశపెట్టబడేదే! ప్రస్తుతానికి దానిని రిజర్వు చేసి ఉంచారు. రాజ్యాంగ అములిక స్వభావాన్ని మార్చే ఇలాంటి ప్రతిపాదనకు రాష్ట్రపతి ముందస్తు ఆమోదం తప్పనిసరి అని ఆర్టికల్ 117 నిర్దేశిస్తుంది. సభ్యులకూ, ప్రతిపక్ష పార్టీలకూ ముందస్తు నోటీసులతో పాటు బిల్లు ప్రతులనూ ఇవ్వాలి, ప్రవేశపెట్టే తేదీలను సమయాన్నీ తెలపాలి. అలాంటి విధ్యుక్త పద్ధతులను సైతం పక్కనబెట్టి బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రయత్నించడం దురుద్దేశమే! ఈ బిల్లు ద్వారా సామ్యవాదం (సోషలిస్టిక్) అనే పదాన్ని తొలగించి ''సమానత్వం'' (ఈక్విటబుల్) అనే పదాన్ని చేర్చాలి అనుకుంటున్నారు. భారతదేశం అసమానతలకు చిరునామా. అసమానతలను భావ వాదంతో, భక్తి వాదంతో, కర్మ సిద్ధాంతంతో సమాధి చేసే ఆలోచనాపరులకు కనీసం సామ్యవాద భావన సహజంగానే రుచించదు. సామ్యవాదమంటే ''సమాన పనికి సమాన వేతనం లేదా పనికి తగిన ప్రతిఫలం'' సామ్యవాదపు స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ద్వేశపూరితంగా ఇలాంటి ప్రయత్నం చేయడం గర్హనీయం.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ ప్రియాంబుల్‌ను సవరిస్తూ ''సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక రాజ్యంగా'' రూపొందించారు. దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరించకుండా దొడ్డిదారిన సవరణలు ప్రతిపాదించడం అర్థరహితం. స్వాతంత్రానంతరం నిర్మితమవుతున్న భారత దేశంలోనూ అసమానతలు అలాగే కొనసాగు తుండటం నాటి పాలకులకు సవాలుగా మారింది. ఆంగ్లేయుల పాలనలో అసమానతలకు ప్రధాన కారణమైన భూస్వామ్య వ్యవస్థ, పేదలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఉన్న ఉపాధికి సరైన ప్రతిఫలం ఇవ్వకపోవడం వంటివన్నీ రూపుమాపాలి అనుకున్న అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదిశగా సఫలం కాలేక పోయింది. ఆ సందర్భంగా పెట్టుబడిదారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ స్థానాన్ని ఆక్రమించుకుంటూ అసమానతలు మరింత పెంచుతున్నది అనే నిర్థారణకు నాటి నిపుణులు వచ్చారు. అందుచేతనే భారతదేశ అభివృద్ధి జరగాలంటే వ్యక్తులకు సమాన ఉపాధి కల్పించాలి, కల్పించబడిన ఉపాధికి సరితూగే వేతనం ఇవ్వాలి. అందుకోసం కావలసిన వాగ్దానాన్ని చట్టాలలో కాదు రాజ్యాంగంలోనే పొందుపరచాలి అన్న ఆలోచన నుండి పుట్టినదే ''సామ్యవాద'' వ్యవస్థ ప్రయత్నానికి పునాది. 42వ రాజ్యాంగ సవరణ తర్వాతనే 1976లో సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఏర్పాటు చేయబడింది. అంతకు ముందు ఒకే పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు వేరువేరు వేతనాలు ఇవ్వడం, ఒకే పనిచేస్తున్న స్త్రీపురుషులకు వేరువేరు వేతనాలు ఇవ్వడం, ఒకే కంపెనీలో పనిచేస్తున్న వివిధరకాల వ్యక్తులకు వివిధ రకాల వేతనాలు ఇవ్వడం, వంటివి అమలులో ఉండేది. సంఘటిత రంగాల్లోనూ స్త్రీ పురుషులకు సమాన వేతనాలు అమలులో ఉండేవి కావు. ఈ చట్టం అట్టి విధానాలకు చెక్ పెట్టింది. మనుషుల శరీర సౌష్టవాలను బట్టి కూడా వేతనాలు చెలించబడిన సందర్భాలూ ఉన్న రోజులవి. పనిని గుర్తించాలి తప్ప దానిని చేస్తున్న వ్యక్తుల వ్యక్తిగతాలను కాదని చెప్పేదే సామ్యవాదం. అందుకే అలాంటి పద చేరికతో రాజ్యాంగ పీఠిక పరిపుష్టమైంది. కానీ ఈ రోజుల్లో ఒకే రకమైన పని అనే ఈ కాన్సెప్ట్‌కు చరమగీతం పాడారు. ఒకే రకమైన క్యాడర్ అనే కాన్సెప్ట్కూ చరమ గీతం పాడారు. అందుచేతనే ఒకే సంస్థలోని ఉద్యోగులకు వందల రకాల పే స్కేళ్ళు అమలవుతున్నాయి. వివిధ రకాల వేతనాల పద్ధతులు అమలవుతున్నాయి. అందుకే అలాంటి సంస్థల్లో పని చేసే ఉద్యోగులు సంఘటితమై తమ హక్కుల కోసం నినధించే అవకాశం ఉండదు. ఉత్పాదకతకు కాకుండా అందచందాలకూ ఆహార్యానికీ వేతనల్లో తేడాలు అమలు పరచడం నేటి ఉపాధి సమాజంలోనూ చాపకింద నీరులా వ్యాపించింది. ప్రయివేటు రంగం పెరిగి పెద్దదవుతూ బాగా బలపడిన తరువాత దోపిడీనీ, దాష్టీకాలనూ, ఏకపక్షాన్నీ, నియంతృత్వాన్నీ ప్రశ్నించే కార్మిక చట్టాలను రద్దు పరిచి వాటి రూపంలో కొత్త కోడ్ల కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండు పుట్టడానికి రాజ్యాంగ పీఠికనే అవకాశం కల్పిస్తున్నందున పౌరులకు ఆ అవకాశం లేకుండా చేసేందుకే ఈ రకమైన ఆలోచన నేటి ప్రభుత్వాలు చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఇలాంటి మార్పుల వల్ల మహిళలు, బలహీనులూ, విద్యాపరంగా కాస్త వెనుకబడిన వారు బలవుతారు.
మంత్రుల ద్వారా ఏదైనా బిల్లును ప్రవేశ పెడితే అది ప్రభుత్వ బిల్లు అవుతుంది. పార్లమెంటు సభ్యుల ద్వారా ప్రతిపాదించబడే బిల్లులన్నీ ప్రయివేటు బిల్లులవుతాయి. అల్ఫాన్స్ ప్రతిపాదించి నప్పుడు డిప్యూటీ స్పీకర్ దానిని అనుమతించిన తీరూ అక్షేపణీయాంగానే ఉన్నది. సదరు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారే సభలో ఎక్కువగా ఉన్నప్పటికీ కనీసం తల ఎత్తి కూడా చూడకుండా డిప్యూటీ స్పీకర్ ''అయెస్ హావ్ ఇట్'' (సమర్థించే వారే ఎక్కువ) అని ముందుకు వెళ్ళజూడటం లోపాయికార ఒప్పందంగా కనబడింది. రాజ్యాంగ మౌలిక స్వాభావాన్నే మార్చే ఇలాంటి ప్రతిపాదనలకు ఎంచుకున్న సమయ సందర్భం, ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుని బ్యాక్‌గ్రౌండ్.. అన్నీ అనుమానాలకు తావిచ్చేవే. ఇలాంటి అనవసర, అసంబద్ద, ఏకపక్ష ప్రతిపాదనలకు అవకాశమిస్తే రానున్న రోజుల్లో మరిన్ని దారుణాలకు వీరు తెగబడటం ఖాయం. సామ్యవాదం తరువాత ''లౌకికత్వం'' వారి కత్తి కాటుకు బలి కావటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే వాట్సప్ యూనివర్సిటీ ద్వారా లౌకికత్వమంటే (సెక్యులర్) తప్పుడు అర్థాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడానికి ప్రయాత్నాలు జరుగుతూనే ఉన్నవి. లౌకిక వాదులంటే హిందూ మత వ్యతిరేకులనీ లేదా మైనారిటీ మద్దతుదారులనీ తప్పుడు ప్రచారం జరుపు తున్నారు. లౌకికత్వమంటే ''రాజ్యపు పరిపాలనలో మతం జోక్యం చేసుకోకూడదనీ, మతాచారాలలో పాలకులు తల దూర్చరాదనీ, సర్వమత సమభావన'' అని ఉన్న పవిత్రమైన అర్థాన్ని ఖూనీ చేసి మత చిచ్చు రేపేందుకు లౌకికత్వ భావనను కించపరుస్తున్నారు. ఇలాంటి మార్పులను ప్రోత్స హిస్తే వివేకానందుడు చెప్పిన విశాల ధృక్పదం అను విధానం నుండి సంకుచిత దశకు చేరుకోవడమే.
- జి. తిరుపతయ్య
సెల్:9951300016