Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు చట్టాలు సృష్టించే ఇబ్బందులు తెలిసిన మహిళలు, సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజాహాన్ పూర్, పల్వల్లోని నిరసన ప్రాంతాల్లో ఒక బలమైన శక్తిగా నిలిచారు. సంవత్సర కాలంలో పురుషులతో సమానంగా అనేక కష్టనష్టాలను తట్టుకొని వారి వెన్నంటే ఉన్నారు. ఇంత సుదీర్ఘ పోరాటానికి ఏ మహిళ కూడా సిద్ధపడి రాలేదు. మూడు రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతుల ప్రధాన డిమాండ్ నెరవేరడానికి సంవత్సరకాలం తీసుకుంటుందని మహిళలు ఊహించలేదు. కానీ, కాలం గడిచే కొద్దీ, ఒక కఠినమైన ప్రభుత్వంతో తలపడుతున్నామనే విషయం వారికి అర్థమైంది. వారి భూములను, వారి పిల్లల భవిష్యత్తును రక్షించుకునేందుకు ఎంతకైనా తెగించే బలాన్ని ప్రతికూల పరిస్థితులే కల్పించాయి. వారు ట్రాక్టర్లను నడిపారు, పురుషులతో పాటు వంటశాలలను నిర్వహించారు, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఉద్దేశించి ప్రసంగించారు, ఉద్యమం కొనసాగడానికి అవసరమైన అన్ని పనులను చేశారు.
హరీందర్ బిందు పంజాబ్ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అనుబంధ మహిళా సంఘానికి అధ్యక్షురాలు. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన పోరాటానికి, పంజాబ్ నుంచి మహిళలను తీసుకొనివెళ్ళింది. బీకేయూ, రైతాంగ ఉద్యమం కోసం పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించింది. హరీందర్ బిందు చెప్పిన దాని ప్రకారం, 2000 సంవత్సరం తొలి రోజుల నుంచి బీకేయూ మహిళలను సమీకరించి సమస్యలపై పోరాడుతుంది. ''రైతు చట్టాల ఆర్డినెన్సు తెచ్చినప్పుడు, వాటికి పరిష్కారం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ రైతు చట్టాలు చిన్న రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ప్రతీ ఒక్కరి చావుకు కారణమవుతాయని తెలుసుకున్న తరువాత నిరసనలను తీవ్రం చేయాలని నిర్ణయించామని'' హరిందర్ బిందు తెలిపింది. కోవిడ్-19తో రైతులు బతుకుతారో లేదో ఖచ్చితంగా తెలియదు కానీ, కొత్త రైతు చట్టాలతో మాత్రం రైతుల చావు తప్పదు.
''మహిళలను ఇండ్ల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మేము గ్రామగ్రామాన ప్రదర్శనలు నిర్వహించాం. మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. వారు ఇంటిపని, వ్యవసాయ పని ముగించుకుని మీటింగ్‌కు హాజరయ్యేవారు. ప్రతి రోజు ఉదయం 4గంటలకు లేచి రాత్రి 11గంటలకు పడుకునే వారు. భూమి లేకుంటే, వెలిగించేందుకు పొయ్యి ఉండదని వారు తెలుసుకున్నారు. ఆరు వందల గ్రామాల నుండి 26 వేల మంది మహిళలు ఈ నిరసనలలో పాల్గొన్నారు. ఆనాటికి కేంద్ర మంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ కౌర్‌ను మహిళలు నిరసించడంతో ఆమె 2020 సెప్టెంబర్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారని'' బిందు తెలిపింది.
ఈ పోరాటం కార్పొరేట్ వ్యవస్థకు, ఆ వ్యవస్థను సమర్థించే రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. పెట్రోల్ బంక్‌లు, రిటైల్ షాపులు, కొన్ని గ్రూపులకు చెందిన మల్టీనేషనల్ ఫూడ్ షాపుల ముందు మహిళల నిరసనలు వెల్లువెత్తాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రయివేటు కంపెనీలు నిర్వహించే ''టోల్ ప్లాజా''లు (రైతులు, మహిళల నిరసనల వలన) ఢిల్లీ - పంజాబ్‌ల మధ్య తిరిగే వాహనాల నుండి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా వదిలేసారు.
నవంబర్ 26, 2020న ఢిల్లీ ప్రదర్శనకు అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర అవసరాలకు సంబంధించిన వస్తువులను సమీకరించడం ద్వారా మహిళలు సహాయపడ్డారు. ''ఇంతకు ముందు ఇటువంటి పనులను పురుషులు చేసేవారు. ఈసారి మహిళలే ఆ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. ఈ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగే విషయం వారికి తెలియడం వల్ల, ఆరు నెలలకు సరిపడా అవసరమైన ఆహార పదార్థాలను వారు సమీకరించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం మాత్రమే కాదు, ఇది సామ్రాజ్యవాదానికి కూడా వ్యతిరేకంగా జరిగే పోరాటం అనే విషయం వారికి తెలుసని'' హరీందర్ బిందు చెప్పారు. ఈ సంవత్సరం జూలైలో పంజాబ్‌లో నిరసనకారులను అప్రతిష్ట పాలు చేస్తున్న ఇద్దరు శాసనసభ్యులకు మహిళలు తగిన విధంగా సమాధానం చెప్పి వారి నోర్లు మూయించారు.
నవంబర్ 27, 2020లో పంజాబ్ మహిళలు పోలీస్ బారికేడ్లను నెట్టుకొని హర్యానాలోని దబ్వాలీ, ఖనౌరీలకు వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది హర్యానా మహిళలపై తీవ్రమైన ప్రభావం చూపడంతో వారు వెంటనే సింఘు, టిక్రీ ప్రాంతాల్లోని నిరసనల్లో పాల్గొన్నారు. వారిలో అనేక మంది, పంజాబ్ నుండి వచ్చిన మహిళా నిరసనకారుల అవసరాల కోసం వారి ఇండ్లను ఉపయోగించుకోవడానికి అప్పజెప్పారు. వారు నిరసనకారుల బట్టలు ఉతకడానికి కూడా సిద్ధపడ్డారు.
జనవరి 26న మహిళలు పంజాబ్‌లో ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. ఆ రోజు వారిలో చాలా మంది ఢిల్లీలో జరిగిన కిసాన్ పరేడ్‌లో పాల్గొన్నారు. పురుషులు నిర్వహించాల్సిన బాధ్యతను మహిళలు నిర్వహించిన తీరుకు ఆ ఉద్యమం ఒక సాక్షీభూతంగా నిలిచింది. నిరసన కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలనే పిలుపు మేరకు మహిళలు నిధులు వసూలు చేసి, ఢిల్లీ వెళ్ళేందుకు బస్సులు అద్దెకు తీసుకున్నారు.
సమాన భాగస్వాములుగా
''లాహౌర్ చూడని వ్యక్తి 'జన్మ' నిష్ఫలమైనదని పంజాబ్‌లో ఒక సూక్తి ఉంటే, రైతు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి 'జన్మ' నిష్ఫలమైనదనేది ఇప్పటి కొత్త సూక్తి అని మహిళలు భావిస్తున్నారని'' పంజాబ్ కిసాన్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జస్బీర్ కౌర్ అన్నారు. పంజాబ్‌లో రైళ్ళ పునరుద్ధరణ తరువాత మహిళలు ఢిల్లీ వెళ్ళగలిగారు. నాటి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే మహిళలు, పిల్లలు, వృద్ధులు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళాలని సలహా ఇచ్చినప్పుడు, రైతులుగా ఉద్యమానికి అండగా ఉండాలని మహిళలు భావించారు. ఏదైనా బహిరంగ సభలో మేము ముందు వరుసలో కూర్చుంటే, పోలీసులు పురుషులను బలవంతంగా లాక్కెళ్లాలంటే ముందుగా పోలీసులు మహిళలను అక్కడ లేకుండా చేయాల్సి ఉంటుందని, మహిళలు పురుషులతో అన్నారని, జస్బీర్ కౌర్ చెప్పింది.
జనవరి 18 కార్యక్రమాన్ని 'మహిళా కిసాన్ దివాస్'గా గుర్తించారు. ''మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు, వ్యవసాయ సంబంధిత ప్రక్రియల్లో భాగస్వామ్యం లేదు. కానీ వారు రైతు కుటుంబాలకు చెందిన వారై, అనేక వ్యవసాయ పనుల్లో బాధ్యత ఉంటుంది కాబట్టి, వారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అనుకున్నారని'' కౌర్ చెప్పారు. కొందరు మహిళలు సంవత్సరం పొడవునా ఉద్యమం జరిగిన ప్రాంతంలోనే ఉన్నారు. మహిళలను వంట చేయడానికి తీసుకొని వచ్చారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కౌర్ ఆశ్చర్యపోయి, వంట చేసేది పురుషులేనని (మహిళల సహాయంతో) చెప్పారు. గతంలో పురుషులు నాయకత్వస్థానాల్లో ఉండి బహిరంగ సభలలో ప్రసంగించే వారు. బహిరంగంగా మాట్లాడేందుకు సిగ్గు పడిన మహిళలు ఇప్పుడు ఆ అవరోధాలను బద్దలు కొట్టారు. వారు నిరసన పాటలను కూడా ఆలపిస్తున్నారని కౌర్ చెప్పారు.
ఉద్యమాన్ని కొనసాగించేందుకు పురుషులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటే కొందరు మహిళలు పంటలను, పశువులను చూసుకునేందుకు ఇంటికి తిరిగి వెళ్ళారు. వ్యవసాయ ఉత్పత్తులను కూడా మహిళలే విక్రయించారు. జనవరి 7న ప్రధాన రహదారి చుట్టుపక్కల నిర్వహించిన ప్రదర్శనలో మహిళలు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను నడిపారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, హర్యానా నుండి మహిళలు భారీగా తరలివచ్చారని కౌర్ చెప్పారు. హర్యానా మహిళలంతా ముసుగులు ధరించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక గ్రామంలో, సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంటికొకరిని పంపించాలని మహిళలే ప్రకటించి, సమీకరించే బాధ్యతను వారే తీసుకున్నారు. ఏనాడూ కనీస మద్దతు ధర, ప్రపంచ బ్యాంక్ అనే మాటలు విననివారు ఇప్పుడు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, వారి పిల్లల కోసం మెరుగైన వైద్యం, విద్య గురించి మాట్లాడడం నిజంగా గొప్ప విజయంగా భావించవచ్చు.
జస్బీర్ కౌర్ లాగా, ఐద్వా(అఖిల భారత మహిళా సమాఖ్య) అఖిల భారత మాజీ కార్యదర్శి జగ్మతీ సంగ్వన్ కూడా, దశాబ్దాలుగా వ్యక్తీకరించని తమ దృఢ విశ్వాసాలను బహిరంగంగా వ్యక్తీకరించే విధంగా, రైతు ఉద్యమంలో భాగస్వాములైన మహిళలకు ఇదొక అవకాశమని అభిప్రాయపడింది. వారివారి కుటుంబాల్లోని పెద్దలు వీరిని ఉదాసీనమైన అనుచరులుగా తీసుకొచ్చిన విధంగా కాకుండా చైతన్యవంతమైన భాగస్వాములుగా మహిళలు ఈ ఉద్యమానికి ఆకర్షితులయ్యారని జగ్మతీ చెప్పారు. ప్రజా ఉద్యమాలలో, సామాజిక, మతసంబంధమైన సభల్లో భాగస్వాములైన చరిత్ర పంజాబ్ మహిళలకు ఉండగా, హర్యానా మహిళల భాగస్వామ్యం ఒక అసాధారణమైన కొత్త విషయం.
అసంఖ్యాక ప్రతిబంధకాలు
ఢిల్లీలో వాతావరణ మార్పులు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలు ఒక పెద్ద సవాల్‌గా మారాయి.'' మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అంతా బహిరంగ ప్రదేశమే. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం అతి పెద్ద సవాల్. మహిళల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ మరుగుదొడ్లు లేవు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పంజాబ్ నుండి ప్రారంభమైనపుడు, హర్యానాలోని మేహమ్ సబ్జీ మండీ వద్ద ఆగాం. భయంకరమైన చలి అయినప్పటికీ, మేం మానసికంగా సిద్ధపడే ఉన్నాం. టిక్రీ వద్ద ప్రదర్శన మొదలైనప్పుడు, మాకు అవసరమైన వస్తువులు సమకూర్చారు కానీ, మునుపెన్నడూ ఎవరూ చేయని విధంగా మాకు స్థానిక ప్రజల నుండి మద్ధతు లభించింది. క్రమక్రమంగా తగిన విధంగా టెంట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేసిన తరువాతే మేము ఆ టెంట్లలో నిద్ర పోయామని'' హరీందర్ బిందు చెప్పారు.
డెబ్భై ఏండ్లకు పైబడిన భగత్ సింగ్ మేనకోడలు గుర్జీత్ కౌర్ రైతు నిరసనలలో శాశ్వత భాగస్వామి. ఏ రాజకీయ పార్టీకి చెందని ఆమె, అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో పాల్గొంటారు. ''మనం సాధారణంగా గ్రామీణ మహిళలు నిరక్షరాస్యులని అనుకుంటాం. కానీ రైతు ఉద్యమం ద్వారా వారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ఎలా పోరాడాలో చూపించారు. వారు ఎంతో మానసిక పరిపక్వతతో, ధైర్యసాహసాలతో విప్లవ పోరాట పటిమను చూపించారు. తమ హక్కులను అర్థం చేసుకోవడమే కాదు, వాటి కోసం పోరాటం కూడా చేశారు. నేను హర్యానా నుండి వచ్చిన మహిళలను కలిశాను. వారు పంజాబ్ మహిళలను ఎంతగానో ప్రశంసించారు. వారి గ్రామాలకు వచ్చి, వారి కుటుంబీకులతో మాట్లాడమని మమ్ముల్ని అడిగారు. నేను వస్తానని చెప్పాను. కానీ రెండు మూడు రోజుల్లోనే, నిరసనలలో పాల్గొనేందుకు హర్యానా నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. ముసుగులు తొలగించి, రైతు చట్టాల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపారని'' గుర్జీత్ కౌర్ చెప్పారు.
హర్యానా మహిళలు
జగ్మతీ సంగ్వన్, గుర్జీత్ కౌర్, జస్బీర్ కౌర్, హరీందర్ బిందులు, హర్యానా మహిళలు గడప దాటి రైతు ఉద్యమంలో పాల్గొనడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. మహిళల భాగస్వామ్యం రెండు రూపాల్లో జరిగింది. తమ కుటుంబంలోని పురుషులను పోరాటంలో పాల్గొనమని చెప్పి, వ్యవసాయం, ఇంటి బాధ్యతలను భుజాని కెత్తుకొన్న మహిళలున్నారు. వారి కుటుంబాలను ఎదిరించి రైతు నిరసనలలో పాల్గొన్న మహిళలున్నారు. నిరసన చేసే ప్రాంతాల్లో తమ పిల్లలతో వచ్చిన మహిళలు వారికి ఆన్లైన్ తరగతులలో సహకరించారు, మిగతా సందర్భాల్లో పిల్లలు వేదికకు సంబంధించిన విధుల్లో, భోజనశాలలో వలంటీర్లుగా, ఉద్యమ కొనసాగింపునకు సహాయపడ్డారు.
సంవత్సర కాలంపాటు జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం అనేక మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపింది. రైతుచట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో మహిళల భాగస్వామ్యం, వ్యవసాయిక భారతదేశ మహిళా రైతులకు ఒక పెద్ద విజయం. మహిళా సాధికారత గురించి అర్థంలేని గంభీరమైన ప్రకటనలు చేసిన విధంగా కాక, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక వర్గ పోరాటం ద్వారా సాధించిన ఈ విజయం భిన్నమైనది. (''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్,
- టి.కె. రాజ్యలక్ష్మి
9848412451