Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? ఎర్రజెండాలు ఇంకా ఉన్నాయా? అన్న చర్చ ఉన్నది. ప్రతికూల పరస్థితులు వెంటాడుతున్నప్పుడు ఇటువంటి దుష్ప్రచారం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎర్రజెండా రెపరెపల స్ఫూర్తి ఎన్నటికీ తగ్గిపోదనే విశ్వాసం పేద ప్రజల్లో నిండుగానే ఉంటుందనేందుకు ఇదో ఉదాహరణ. ఇటీవల నవతెలంగాణ దినపత్రికలో 'అన్నదాతలకు మరణశాసనం రాస్తున్నదెవరు? రైతు ఆత్మహత్యలు ఆగేదెన్నడు' అన్న కథనం ప్రచురితమైంది. అది సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. పొలాల్లోనే కాకుండా వరికుప్పలపై రైతులు మరణించడం ఇతివృత్తంగా ఆ కథనం వచ్చింది. కొంత మంది బాగుంది అనీ, మరికొంత మంది ఇంకా లోతుగా అధ్యయనం చేసి రాయాల్సి ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పరస్పర అభిప్రాయాలలో ఒక విలువైన మంచి మాట నన్ను బాగా ఆకర్షించింది. అదేంటంటే రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు? అన్న ప్రశ్నకు ఓ కమ్యూనిస్టు అభిమాని ఇలా రాశారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే, కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలి. రైతు కోణంలో ఆలోచించే శక్తి వారికి తప్ప మరెవరికీ ఉండదు. లోతైన అవగాహనతో వాటిని నివారించడంతోపాటు రైతు తలెత్తుకునేలా చేయగలిగే దమ్మూ, ధైర్యం వారికే ఉంటుంది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయం చదివిన తర్వాత ఎట్లాగో కమ్యూనిస్టులకు అధికారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇలా అన్నాడా? లేకపోతే హేళన చేశాడా? అని నాకునేనే ప్రశ్నించుకున్నాను. నా ఆలోచన తప్పని తేలింది. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం చూపగలిగేది కమ్యూనిస్టు సిద్ధాంతమే. అనేక దేశాల్లో ఆచరించి చూపిస్తున్నారు. దీనినిబట్టి కమ్యూనిస్టుల... ఎర్రజెండా ప్రజల గుండెల్లో ఎప్పటికీ భద్రంగానే ఉన్నదనేది అర్థమవుతున్నది.
- గుడిర రఘు