Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరడుగులకు మించి పొడవుండే ఆ పెద్ద మనిషి మాటల నిండా సెటైర్లే. అది స్వపక్షమైనా, విపక్షమైనా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యంగ్యం, వెటకారం కలగలిపి తడుముకోకుండా చెప్పటం ఆయనకే తెలిసిన విద్య. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన ఆ పెద్దాయనే ఇటీవల కన్నుమూసిన కొణిజేటి రోశయ్య. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హఠాన్మరణానంతరం... ఈ దారిన పోయే దానయ్య (ఇది ఆయన మీద ఆయనే వేసుకునే సెటైర్) సీఎం పీఠమెక్కారు. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక... తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మహిళా మంత్రికి, ఆయనతో విబేధాలు పొడచూపాయి. దీంతో 'ఆ పెద్దాయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నేను ఆయన ముఖం చూడనుగాక చూడను..' అంటూ ఆ ఫైర్ బ్రాండ్ ప్రతిజ్ఞబూనారు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు (ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం తన రాజీనామాను ఒప్పుకోరన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం). కానీ ఆ సీనియర్ మంత్రి రాజీనామాను గవర్నర్‌తో క్షణాల్లో ఆమోదింపజేయటం ద్వారా రోశయ్య ఆమెకు పెద్ద షాక్‌నిచ్చారు. దీంతో ఖంగుతినటం ఆమె వంతైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు పాత విషయాలను మరిచిపోయిన ఆమె... సచివాలయానికి వచ్చి సీఎం ఛాంబర్ దగ్గరకు వెళ్లారు. తాను సీఎంను కలవటానికి వచ్చిన విషయాన్ని అక్కడున్న అటెండర్‌కు చెప్పి కొద్దిసేపు ఎదురు చూశారు. పది నిమిషాల తర్వాత ఆ మాజీ మంత్రికి లోపల్నుంచి పిలుపొచ్చింది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లిన ఆమెకు 'కొండంత' ఆశ్చర్యం కలిగింది. అక్కడ సీఎం కుర్చీలో ఉన్న రోశయ్య గోడవైపు ముఖం పెట్టి, అటు తిరిగి కూర్చున్నారు. ఐదు, పది నిమిషాలైనా ఇటు తిరగటం లేదు. దాంతో ఆమె కలుగజేసుకుని... 'సార్, నేను లోపలికొచ్చాను, మాజీ మంత్రిని, ఇప్పుడ ఎమ్మెల్యేని, ఇటు ఒక్కసారి తిరగండి సార్..' అంటూ వేడుకుంది. దానికి రోశయ్య... 'నేను సీఎంగా ఉన్నంతకాలం నా ముఖం చూడనంటూ నువ్వే భీష్మ ప్రతిజ్ఞ చేశావు గదమ్మా... అందుకే నీ ప్రతిజ్ఞ నిలబెడదామనే నేను గోడవైపుకు తిరిగా...' అంటూ పెద్ద సెటైర్‌ను వదిలేసరికి ఆమెకు నోటమాట రాలేదు. ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భాల్లో ఇలాంటి వ్యంగ్య వీచికలు ఎన్నో, ఎన్నెన్నో. దటీజ్ రోశయ్య...
-బి.వి.యన్.పద్మరాజు