Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే నిద్రలేచి పళ్లు తోముదామని బ్రెష్, పేస్ట్ చేతిలోకి తీసుకోగానే వాటిపై కట్టిన టాక్సులతో '(త)ద్దినం' షురూ! ఒంటికి రుద్దుకున్న సబ్బు మొదలు, లోపలేసుకున్న అండర్వేర్, బనియన్, ప్యాంటు, షర్టు, బెల్టు, చెప్పులు, ముఖానికి పూసుకున్న పౌడర్, దువ్వుకున్న దువ్వెన సహా వాటిని కొన్నందుకు కట్టిన టాక్సులు 'హి...హి...హి' అని పళ్లికిలించి సకిలించబట్టే! ఏమోరు టిఫిన్ ఏం చేశావ్ అనగానే... 'ఉప్మా' అంటూ సమాధానం. ఉప్మారవ్వ కొన్నందుకు పన్ను. దానిలో వేసిన జీలకర్ర, ఆవాలు, నూనె చుక్క, ఉప్పు, కరేపాకు, గ్యాసు... వామ్మో వాటన్నింటిపైనా పన్ను. సర్లే.. బయట బండి మీద తిందామంటే 'కొత్త రూపాయిబిళ్లంత' రెండిడ్లీలకు రూ.30 ఖర్చు... ఇదేందయ్యా.. ఇడ్లీలు ఇంత చిన్నగున్నరు అంటే 'కమర్షియల్ గ్యాస్ రేటు మళ్లీ వంద పెరిగింది సార్' అంటూ సమాధానం. 'ఏమోరు...ఆఫీస్‌కు వెళ్లొస్తా.. బై...టాటా...' అని చెప్పగానే... 'టాటావో.. బిర్లావో' కాకపోతివాయే అని అంతరాత్మ సణుగుడు. టూ వీలర్ తీసి ట్యాంకు కదిపితే... లాభం లేదు.. పెట్రోల్ పోయించాల్సిందే... భయం భయంగా బంక్‌కు వెళ్లగానే... లీటర్‌కు ఐదు రూపాయలు పెరిగింది సార్ అనగానే 'దీనయ్య జీవితం' అని తిట్టుకుంటూ, 'పోసి చావు' అని పైకంటే, వాడెక్కడ తిడతాడో అని, 'మళ్లీ పెరిగిందా' అంటూ బిక్కచచ్చిన నవ్వు ముఖం. ఫస్ట్ తేదీ పే స్లిప్ తీసుకొని ప్రొఫెషనల్ టాక్స్ కాలమ్ చూడగానే పనిచేసినా 'పన్ను' కట్టి చావాలా? అంటూ మనసులో తిట్లదండకం. ఇంటికెళ్తూ గుంతల రోడ్లో బ్రేకులు వేసీ, వేసీ... వైర్ తెగితే, స్పేర్ పార్ట్స్‌పై జీఎస్టీ చెల్లించి, మెకానిక్కు అడిగినంత ముట్టజెప్పక తప్పకపాయే! వెళ్తూ వెళ్తూ పిల్లలకో చిప్స్ ప్యాకెట్ కొందామంటే గ్యాస్ నింపిన పే...ద్ద ప్యాకెట్లో అడుగునెక్కడో ఉండే నాలుగు చిప్స్ ముక్కలకు ముఫ్ఫై రూపాయలు చెప్పబట్టే! అహే..ఇదేంది...ఏది ముట్టుకున్నా పైసల్..పైసల్. వచ్చేది చారెడు...పోయేది మూరెడు. పాడు జీవితం...వీళ్లకు పన్నులు కట్టేందుకే పుట్టినట్టుంది బతుకు! చెయ్యెత్తి 'మురదాబాద్' అందామంటే 'కేసులు, బెయిళ్లు' గుర్తొచ్చి, అసంతృప్తిని గొంతులోనే తొక్కేసుకోవడం తప్ప, చేయగలిగిందేం కనిపించట్లే! కాకపోతే ట్రాఫిక్ సిగళ్ల దగ్గర అప్పుడప్పుడు ఎర్రజెండాలోళ్లు 'పెట్రోల్ రేట్లు తగ్గించాలి. ధరలు దించాలి' అని కేకలు పెడుతుంటే, వాళ్లతో కలిసి పెద్దగా కేకలెయ్యాలని ఉన్నా 'ఆఫీస్‌కు లేటైతే, జీతం కోస్తారు...రేపటి ఖర్చుకు పైసలెట్టా' అనే భయం బండి దిగే సాహాసాన్ని చేయనివ్వట్లే! ఎర్రన్నలూ...మీరే మమ్మల్ని జర్రంత అరుసుకోవాలే!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి