Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పత్రికల్లో వార్త వచ్చినప్పటి నుండి రాజన్న ఆనందానికి హద్దులు లేవు. గత కొద్ది కాలంగా రాజన్న ఉత్సాహం పెరుగుతూనే ఉంది. ఈ రోజు ప్రకటన చూశాక మరింత పెరిగింది. ఇంతకాలం మొహం చాటేసిన రాజన్న ఇప్పుడు తానే స్వయంగా వెళ్ళి అందర్ని పలకరిస్తున్నాడు. మంచి, చెడ్డా అర్సుకుంటున్నాడు. పొరుగింటి ఎంకన్న ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రాజన్న ఎందుకింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాడో తెలుసుకుందామని అనుకుంటున్నాడు. ఈలోగా రాజన్నే ఎదురొచ్చి ఎంకన్నను అదే ఉత్సాహతో పలకరించాడు.
''ఏం రాజన్నా! ఈ మద్య చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనబడుతున్నావు! ఏంటి సంగతులు?'' అడిగాడు ఎంకన్న.
''మాకు మళ్ళీ పాతరోజులు వచ్చాయి! అందుకే ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను!'' అన్నాడు రాజన్న.
''అదేంది, పాతరోజులు వచ్చుడేంది? నాకేమీ అర్థంకాలేదు?'' అన్నాడు ఎంకన్న అయోమయంగా.
''ఈరోజు పేపర్ చూశావా! పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం!'' అని మా గులాబి పార్టీ చిన్నబాస్ ''స్టేట్ మెంట్ ఇచ్చిండు!'' అంటూ పేపర్ చూపాడు రాజన్న.
''ఆఁ అయితే ఏమిటి?'' అడిగాడు ఎంకన్న.
''అయితే ఏమిటి అని మెల్లిగా అడుగుతావేమిటి ఎంకన్నా! మొన్నటిదాక వరిపై పోరు అని మా పెద్దబాస్ కల్లం నుండి కాపిటల్ దాకా రాజీలేని పోరాటం చేశాడు. నిన్న సింగరేణి బొగ్గు బాయిలు హరాజ్ పెట్టొద్దని, మోడీకి లెటర్ పంపిండు. బొగ్గుబాయిలు హరాజ్ పెట్టి ప్రయివేటు వాళ్ళకిస్తే ఒప్పుకునేది లేదని ఆ లెటర్లో గట్టిగ రాసిండు! ఇక ఇయ్యాల మా చిన్నబాస్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవ్వన్నీ చూస్తుంటే నీకు ఏమీ సమజైతలేదా?'' అని ఆశ్చర్యంగా ఎంకన్న మొఖం చూసిండు రాజన్న.
''లేదు! నాకేమీ అర్థమైత లేదు!'' అంటూ అంతే ఆశ్చర్యంగా రాజన్న వైపు చూసిండు ఎంకన్న.
''అయ్యో, అయ్యోయ్యో! ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉద్యమాలు! మాది ఉద్యమ పార్టీ!'' అన్నాడు రాజన్న మళ్ళీ ఉత్సాహపడుతూ...
''నిజమా! గా నడుమ, ఎప్పుడో మాది ఫక్తు రాజకీయపార్టీ అని మీ పెద్దబాస్ చెప్పినప్పటి నుండీ, నేను ఇంకా మిగిలిన వారూ అంతా అదే ఫిక్సయిపోయినం. మళ్ళా ఇప్పుడు ఉద్యమ పార్టీ అని నీవొక్కడవు అంటే ఎట్లా రాజన్నా!'' అన్నాడు ఎంకన్న.
''మాది మాటల పార్టీ కాదు! చేతల పార్టీ! సచ్చుడో బతుకుడో అని కొట్లాడి తెలంగాణ తెచ్చినం. ఇప్పుడు కూడా కొట్లాడుడే. మేము ఎప్పుడూ కొట్లాడుతనే ఉంటాం. కొంచెం గ్యాప్ ఇచ్చినం అంతే... తగ్గేదేలే!'' అన్నాడు రాజన్న ఉత్సాహంగానే.
''మీరు తగ్గేదేలే అంటున్నారు! కాని మాకు నమ్మకం కుదురుత లేదు! మిమ్మల్ని నమ్మబుద్ధి అయిత లేదు!'' అన్నాడు ఎంకన్న.
''అరే ఎందుకు నమ్మబుద్ధి అయితలేదో చెప్పు!'' అన్నాడు రాజన్న.
''వరి మీద పోరు! ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఢిల్లీ దాకా పొయొచ్చుడే గానీ, నిజంగా పోరాటం చేస్తున్న రైతులను సింఘూదాకెళ్ళి మీ పెదబాసో, చినబాసో ఏడాది కాలంలో ఏనాడైనా పలకరించి వచ్చిండ్రా! రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రా?'' ప్రశ్నించాడు ఎంకన్న.
లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు రాజన్న.
''అప్పుడెప్పుడో తెలంగాణ వచ్చిన కొత్తల్ల, మోటార్ వెహికల్ యాక్టు మార్చొద్దని, దేశమంతా సమ్మెచేస్తే, మీరు సపోర్టుచేస్తిరి, కాని ఆ చట్టంలోని అనేక అంశాలు మీరే దేశంలో ముందుగా అమలు చేయవడ్తిరి!'' అన్నాడు.
అవునన్నట్టు తల ఊపాడు రాజన్న
బొగ్గ బాయిల సంగతి! హరాజ్ పెట్టొదని, ప్రయివేటుకివ్వొద్దని లెటర్ రాయటం మంచిదే కాని, 2019లో ఆర్టీసీని ప్రయివేటుపరం చెయ్యొద్దని ఆర్టీసీ కార్మికులు ఏకంగా 55రోజులు సమ్మె చేశారు. సమ్మె విరమించకపోతే సంస్థను ప్రయివేటు చేస్తామని స్వయంగా పెద్దబాసే ప్రకటించారు. అంతేకాక దాదాపు 1500 బస్సులు అద్దెకు తీసుకున్నారు. అంటే అప్పుడు గట్ల, ఇప్పుడు గిల్ల... ఇట్లా డబుల్ యాక్షన్ చేస్తే ఎట్లా నమ్ముతారు!'' అని ప్రశ్నించాడు ఎంకన్న.
ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రాజన్న.
''దీంట్లో ఆలోచించటానికేముంది రాజన్న! మీ పెద్దబాస్ డబుల్ యాక్షన్ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ వచ్చినంక ఇక ధర్నా అవసరమే లేదంటూ, ధర్నా చౌక్ రద్దు చేసినట్టు ప్రకటించి, అక్కడ ధర్నాలకు పర్మిషన్ ఇయ్యకపోతిరి! అయినా ఎవరైనా ధర్నాలు చేస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తిరి! చివరికి మొన్న గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులంతా గా ధర్నా చౌకులోనే పెద్ద ధర్నా చేస్తిరి! ఇంకా ఎట్లా నమ్మాలి రాజన్నా!'' మళ్ళీ అడిగాడు ఎంకన్న.
''మా పెద్దబాస్ చిత్తశుద్ధిని శంకించొద్దు!'' అన్నాడు రాజన్న.
''చిత్తశుద్ధి! దాని అర్థం తెలిసే మాట్లాడుతున్నావా! ఈ రోజు మోడీని తిట్టడం, రెపొద్దున్నే ఢిల్లీ వెళ్ళి శాలువా కప్పి రావటం! ఈ రోజు కేంద్రం అంతు తేలుస్తామని, పోరాటం చేస్తామని భీకర ప్రకటనలు, రేపు ప్రధాని దర్శనం కోసం పడిగాపులు కాయటం. ఇదేనా చిత్తశుద్ధి?'' మళ్ళీ ప్రశ్నించాడు ఎంకన్న.
''మా గులాబి ఎంపీలు పార్లమెంటులో సస్పెండయ్యేదాకా పోరాడారు తెలుసా?'' అన్నాడు రాజన్న.
''అంతా అయిపోయాక షో పుటప్పులు ఎందుకు? రైతు వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు మీ పోరాటాలు ఏమయ్యాయి? దేశంలోని 40కోట్ల మంది కార్మికులకు సంబంధించిన 44 కార్మిక చట్టాలు మార్చి, 4 లేబర్ కోడ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు కిమ్మనకుండా ఎందుకు ఆమోదించారు? నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైను అంటూ ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకి ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసినప్పుడు, పోరాటాలు చేయాలన్న సోయి ఎక్కడపోయిది? బీజేపీని ఆగం చేస్తా! ప్రతిపక్షాలను ఏకం చేస్తామని బీరాలు పలికి, ఇప్పుడు నోరెత్తటం లేదెందుకు?'' అని ప్రశ్నించాడు ఎంకన్న.
రాజన్న దిక్కులు చూస్తున్నాడు.
''మీరు నిజంగా పోరాటాలు చేయదల్చుకుంటే, ప్రజలను నమ్మించండి! మీరు గతంలో చేసిన తప్పులు దిద్దుకుని, నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడండి! పక్కన స్టాలిన్‌ను చూసి నేర్చుకోండి! అంతేగాని డబుల్ యాక్షన్ చేయకండి!'' అంటూ వెళ్ళిపోయాడు ఎంకన్న.
- ఉషాకిరణ్, సెల్:9490403545