Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాథులమని
స్థాపించిన సామ్రాజ్యాలూ
నిర్మించిన కృత్రిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేకమేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను...
ఈ వాక్యాలు చారిత్రిక సత్యాలు. చరిత్రకు సంబంధించిన సత్యాలు. ఎప్పుడూ చరిత్ర ఈ సత్యాలకు సాక్ష్యమనుకుంటే రైతు వ్యతిరేక శాసనాలపై తోకముడిచిన మోడీ ప్రభుత్వ తీరు తాజా ఉదాహరణ. ఏడాది పైన పోరాడి విజయవంతంగా విరామ గీతం పాడిన రైతు సంఘాల విజయోత్సవ సంరంభమే సాక్ష్యం. 2015లో భూసేకరణ చట్టాన్ని సవరించి కూడా అమలు చేయకుండా వెనక్కు తీసుకున్న ఉదంతం మొదటిదైతే, అదే భూమికి భూమి బిడ్డలకు సంబంధించిన ఈ అతిపెద్ద వెనకంజ రెండవది. కాకపోతే అప్పటికి ఇప్పటికి పరిస్థితులలో చాలా తేడా. మోడీ ప్రభుత్వ పట్టు, బీజేపీ పాచికలు పారడంపై ఇప్పుడు పుట్టెడు సందేహాలు. వారికీ, వారి గురుతుల్యమైన ఆరెస్సెస్ వారికీ! రాజును మించిన రాజభక్తుల్లా ఇప్పటికీ ఈ శాసనాలను సమర్థించే ఆర్థిక నిపుణులు సరళీకృత మేధావులను అలా ఉంచితే ఏలినవారికి మాత్రం ఒకటే గుబులు. ఏడాది చూసినా ఏమీ పాలుబోక ఈ శాసనాలు వెనక్కు తీసుకున్నాం గానీ, దీనివల్ల నిజంగా మనకు ఫలం దక్కుతుందా? అని. కేంద్రంలో రాష్ట్రాలలో పార్లమెంటులో మీడియాలో రాజకీయ వర్గాలలో ఇదే చర్చ. ఉద్యమాలపై విశ్వాసం పెంచి ఉత్తేజం కలిగించిన ఈ పోరాట భాగం చూడకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం, యూపీ ఎన్నికల కోసం వెనక్కు తీసుకోవడం వరకే మాట్లాడే ప్రబుద్దుల గురించి చెప్పేదేం ఉండదు. ఎందుకంటే ఈ సుదీర్ఘ దీక్షాయుత పోరాటం, ఇన్ని వందల మంది బలిదానం, ఇంత ప్రభావశీల ప్రజా చైతన్యం లేకుంటే కేవలం ఎన్నికల కోసం దిగివచ్చేవారా? ఏదో చిట్కా ప్రయోగించి ప్రహసనం నడిపేవారు కాదా? ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించి ఆనందించలేని వారి ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రశ్నార్థకమే. ఈ విధంగా ఉద్యమాల ఒత్తిడితో ఇంత ''ప్రగతిశీల'' శాసనాలను వెనక్కు తీసుకుంటే ఈ దేశ ఆర్థిక భవిష్యత్తు ఏమైపోతుందని గుండెలు బాదుకునే కుబేర బుద్ధులనూ కుటిల వ్యాఖ్యాతలనూ అస్సలు ఖాతరు చేయనవసరం లేదు. కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన అయిదు అంశాల అమలు తీరును చూసి 2022 జనవరి15న తుదినిర్ణయం తీసుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే ప్రకటించింది గనక ఏమైనా తేడాలొస్తే వారే చూసుకుంటారు. కానీ ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలా పరిణమించనున్నాయనేది కూడా ఇప్పటికే సూచనగా అర్థమవుతున్నది.
సమగ్రంగా చర్చించే ధైర్యమే లేదు!
ఏ ప్రభుత్వమైనా సరే తన నిర్ణయం ప్రజల మెప్పు పొందుతుందనుకుంటే గొప్పగా ప్రకటిస్తుంది. కాని మోడీ సర్కారు వ్యూహాత్మకమని చెప్పే ఈ శాసనాల రద్దు నిర్ణయాన్ని చడీ చప్పుడు లేకుండా ఆమోదింపచేసుకుంది. సభలో సమగ్రంగా చర్చించే సాహసం కూడా చేయలేకపోయింది. మన్‌కీబాత్ వరవడిలో మోడీజీ తనదైన కవరప్తో ప్రకటించి చేతులు దులుపుకున్న తతంగమే పార్లమెంటులోనూ పునరావృతమైంది. ఎందుకంటే అనివార్యమై రద్దు చేసుకున్నా అనేక అపరాధాలకు, అమానుషాలకు, భావిలో వచ్చే అవస్థలకు ఈ ప్రభుత్వం సమాధానమిచ్చుకోవలసి ఉంటుంది. ప్రతిపక్షాలు వాటిని నిలదీస్తే సమర్థించుకోగల సత్తా లేదు. అర్థమనస్కంగా చేసిన నిర్ణయాన్ని ఆత్మవిశ్వాసంతో వాదించగల సందర్భమూ కాదు. అందుకే మమ అనిపించి మరుగుకు తోసేశారు. రాజ్యసభలో అప్రజాస్వామిక సస్పెన్షన్లు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఉద్యమాలను గౌరవిస్తే మరిన్ని వస్తాయి, చేసింది తప్పంటే మొదటికే మోసం. అందుకే గప్‌చుప్‌గా సరిపెట్టేశారు. సర్పయాగంలో తక్షకుడికి ఎక్కుపెడితే ఇంద్రపీఠమే కదిలినట్టు ఈ రైతాంగ పోరాటం రేపు మోనిటైజేషన్ మోతను వెనక్కు కొడుతుందని కేంద్రం భయం. అప్పుడు కార్పొరేట్లు అస్సలస్సలు క్షమించే ప్రసక్తి ఉండదు. ఇప్పటికే వారు మోడీ భజనను పునరాలోచించుకుంటూ అడుగుజారిన ఈ సర్కారు తమకు మాటిచ్చిన మార్పులన్నీ చేయగలదా అని సందేహించడం మొదలెట్టారట. తీగలాగితే డొంక కదిలినట్టు ఎన్నికల సర్వేలు కూడా హెచ్చరికగానే ఉన్నాయి. యూపీలో అరకొరగా బయిటపడతారనీ, పంజాబ్ చేజారి పోతుందని తేల్చేశాయి. ఈశాన్యంలో మణిపూర్ గెలుస్తారన్నా ఈ మధ్య నాగాలాండ్‌లో కాల్చివేత ఉదంతం ఒక కుదుపులా దేశాన్ని కలవరపర్చింది. రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలున్నా పక్కనే ప్రభావం ఎలా ఉంటుందో ఆందోళనకరమే. ఈశాన్యం మొత్తం అత్తెసరు మెజారీటీలు, అతుకుల బొంత కూటములతో అదుపులోకి తెచ్చుకున్నామని గొప్పలు పోయే బీజేపీకి ఇది ప్రతికూల పరిణామం. గతంలో లఖింపూర్ ఖేర్ ఉదంతం నుంచి బయిటకు రావాలని చూస్తున్న ఆ పార్టీ ఇతర చోట్ల మరింత క్రూరంగా జరిగిన ఈ సామూహిక కాల్పుల మరణాలపై సమాధానం చెప్పుకోలేకపోవడం దేశమంతటా కూడా ప్రభావం చూపిస్తున్నది.
యుపీ, పంజాబ్ మాటేంటి?
అందరి నోటా నానుతున్న యూపీ సంగతి తీసుకుందాం. రైతు వ్యతిరేక శాసనాలు వెనక్కు తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తామని రాకేష్ తికాయిత్ గతంలోనే హెచ్చరించారు. ఈ శాసనాల రద్దు తర్వాత కూడా దాన్ని వెనక్కు తీసుకోలేదు. మరింత చర్చించి ముందు ముందు నిర్ణయిస్తామని మాత్రమే అన్నారు. ఏదేమైనా ఇన్ని పరిణామాల తర్వాత బీజేపీ తరపున ప్రచారం చేసే పరిస్థితి మాత్రం ఉండదు. రైతులు హర్షించరు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గెలుపుపైనే 2024లో మోడీ పునరాగమనం ఆధారపడి ఉంటుందని గతంలో చెప్పి నాలుక కర్చుకున్న హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి అదే మాట మననం చేసుకోవలసిందే. యూపీ ఎన్నికలలో అరవై శాతం వరకూ రైతాంగ ఓట్లు నిర్ణయాత్మక పాత్ర వహిస్తాయి. పంజాబ్‌కే రైతు ఆందోళన పరిమితమని తప్పుడు ప్రచారం చేసిన కేంద్రం యూపీ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం గమనించదగింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్, తెరారు ప్రాంతంలో సిక్కులు ఎక్కువ గనక, పంజాబ్‌లో అచ్చంగా వారే గనక ప్రధాని గురుగోవింద్ సింగ్ ఆరాధన దినాన ఇది ప్రకటించారు. పైగా కర్తార్‌పూర్ గురుద్వారా గురించి కూడా మాట్లాడారు. దీనంతటి వెనక రాజకీయ తాపత్రయం, మతపరమైన వ్యూహం సుస్పష్టం. కాని ఇన్ని ఘోరాలు జరిగాక మోడీ గురు స్మరణకే వారు లోబడిపోరని కూడా బీజేపీకి బాగా తెలుసు. అందుకే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో జట్టుకట్టడానికి రంగం సిద్ధం చేసింది. అకాలీదళ్ కూడా తమతో వస్తుందని వారు లోపాయికారిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అకాలీలు ఈ శాసనాలపైనే ఎన్డీఏ నుంచి బయిటకు వచ్చారు గనక అది సంభవమా అనేది ప్రశ్నే. ప్రజలను ప్రత్యర్థులను తికమకపెట్టడానికి ఈ ప్రచారం పనికి వస్తుందని బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ కోలుకోలేకపోవడం పెద్ద లోపమైనా ఈ వాతావరణంలో గట్టెక్కగలదని అధిష్టానం నమ్ముతున్నట్టు చెబుతున్నారు. ఆప్ కూడా అక్కడ బోలెడు ఆశతో ఉంది. ఏమైనా నాలుగు మాసాల తర్వాత ఎన్నికలలో యూపీ పంజాబ్‌లలో ప్రభుత్వ నిర్ణయం మార్పు తేలేకపోతే తక్కిన రాష్ట్రాలలోనూ అంతిమంగా కేంద్రంలోనూ గడ్డు పరిస్థితి తప్పదని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి.
మోడీపై పెదవి విరుపులు
దీనికి తోడు ప్రధాని మోడీ నాయకత్వ పటిమపై అంతర్గతంగా పెదవి విరుపులు పెరిగాయి. కీలక నేతలు సీనియర్లు బాహాటంగానే అపహాస్యాలు మొదలుపెట్టారు. కార్పొరేట్ ఇండియా కూడా ఆయన ఒక్కడిపై ఆధారపడటం సరైందేనా అని ఆలోచనలో పడింది. అమెరికాలోనూ బైడెన్ ప్రభుత్వం ఆయనను ట్రంప్ స్థాయిలో హడావుడి చేయడం లేదు. చైనాతో సరిహద్దు వివాదం ఆధారంగా ఉద్వేగాలు రగిలించే ప్రక్రియ కూడా గతంలో వలె పనిచేయడం లేదు. దఫదఫాలుగా సాగుతున్న ద్వైపాక్షిక చర్చలలో ఉద్రిక్తతల ఉపశమనం ఉంటున్నది. ఆర్థికంగా అమెరికాను తోసిరాజనగలశక్తిగా చైనా ఆవిర్బవించినట్టు నిర్థారణ అయింది. కాగా భారత జీడీపీలో 87శాతం అప్పులో మునిగివున్నట్టు తాజా అంచనాలు చెప్పాయి. అసలు భారతీయులే నిరాశలో జీవితం గడుపుతున్నట్టు నోబుల్ గ్రహీత అభిజిత్ బెనర్జీయే ప్రకటించారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలన్నీ కీలకమైన భారీ డ్యాములతో సహా కేంద్ర గుప్పిట్లోకి తీసుకోవడంతో సమాఖ్య విధానం గురించీ ఆందోళన అందరిలో నెలకొంది. కోట్ల టన్నుల ధాన్యం గోదాముల్లో మగ్గిపోతుంటే రైతుల దగ్గర కొనుగోలు చేయని కేంద్రం విధానంపై కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులు కూడా ధర్నాలు చేయవలసి వస్తోంది. విద్యుత్ మీటర్ల చట్టం, డిస్కంల ప్రయివేటీకరణ కూడా నిరసనకు దారితీస్తున్నాయి. రాష్ట్రాల పట్ల ఈ నిరంకుశ వైఖరి శాసనసభల ఎన్నికల్లో ప్రభావం చూపకుండా ఉండదు. ఎస్పి, బిఎస్పి వంటి ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నచోట ఇది మరింత తీవ్రంగా తాకబోతుంది. ఆ పార్టీలు ఎలాంటి సమర్థవ్యూహాలు అనుసరిస్తాయనే ప్రశ్న ఒకటైతే ప్రజల్లో వైముఖ్యం మాత్రం తీవ్రంగానే ఉండటం బీజేపీని భయపెడుతున్నది. కరోనా గురించిన సందేహాలు గతంలోని చేదు అనుభవాలను వారికి గుర్తు చేసి మరింత భయాందోళనలలో ముంచెత్తుతున్నాయి. మోడీ మాటల మాయాజాలం గతంలో వలె పనిచేయక కొత్త రూపాల కోసం జపాల కోసం వెతుక్కుంటున్నారు. ఈ కుయుక్తుల వేటలో మరే దారుణ వ్యూహాలకు పాల్పడతారో అప్రమత్తంగా ఉండవలసిందే. ఎందుకంటే అధికారం కోసం బీజేపీ ఏదైనా చేయగలదు. అందుకు ఆరెస్సెస్ సహకరించగలదు కూడా!
- తెలకపల్లి రవి