Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగాలాండ్‌లోని మోన్‌లో ఇటీవల అస్సాం రైఫిల్స్‌కి చెందిన ప్రత్యేక బలగాల బందం 14 మంది పౌరులను ఊచకోత కోసిన నేపథ్యంలో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ-అఫ్సా) రద్దు చేయాలన్న డిమాండ్ మళ్ళీ తెర పైకి వచ్చింది. భద్రతా బలగాలకు శిక్ష నుంచి రక్షణ కల్పించే ఈ క్రూర చట్టం... కాల్పులకు తెగబడిన అస్సాం రైఫిల్స్‌కు పెద్ద రక్షణ కవచంలా మారింది. ఈ ప్రత్యేక చట్టం, ఈశాన్య ప్రాంతంలో సామాన్య ప్రజానీకంపై దారుణాలు, ఘోరాలకు పాల్పడేందుకు దారి తీస్తోంది. బొగ్గు గని కార్మికులైన 8 మంది యువకులు వ్యాన్‌లో వెళతుండగా, ప్రత్యేక బలగాల బందం వారిని సాయుధ చొరబాటుదారులుగా భావించి, మాటు వేసి కాల్చి చంపింది. ఆరుగురు గని కార్మికుల కాల్చివేత ఘటనపై స్థానికులు తీవ్రంగా నిరసనలు చేపట్టారు. అయితే ఆ ఆందోళనలపై సాయుధ బలగాలు కాల్పులు జరపడంతో మరో 8 మంది మరణించారు.
మాన్లో జరిగిన ఈ దారుణమొక్కటే కాదు. ప్రతీసారీ అఫ్సాను అడ్డు పెట్టుకుని పౌరుల ఊచకోత సాగుతూనే వుంది. సాయుధ తీవ్రవాదులనుకుని కాల్పులు జరిపామని భద్రతా బలగాలు చెబుతూనే వస్తున్నాయి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 నుంచి ఈశాన్య ప్రాంతంలో అమలులో వుంది. ఈ చట్టం పేరుతో అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనల్లో 1984 నాటి హిరాంగ్తాంగ్ ఊచకోత వుంది. మణిపూర్‌లో జరిగిన ఈ దారుణంలో 14 మంది పౌరులను కాల్చి చంపారు. 1995లో రిమ్స్‌లో జరిగిన ఘటనలో 9 మంది పౌరులు చనిపోయారు. 2000 సంవత్సరంలో మణిపూర్ లోని మలోమ్ ఊచకోత ఘటనలో 10 మంది పౌరులు మరణించారు.
అఫ్సాలోని 3వ సెక్షన్ కింద ఒక రాష్ట్రాన్ని లేదా రాష్ట్రంలోని కొంత భాగాన్ని కేంద్రం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించవచ్చు. అఫ్సాను విధించవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే కేంద్రం ఈ చట్టాన్ని రుద్దవచ్చు. ఈ చట్టం కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలు సంక్రమిస్తాయి. చట్టాన్ని ఉల్లంఘించే లేదా ఆయుధాలు, తూటాలను తీసుకెళ్ళే ఏ వ్యక్తిపైనైనా కాల్పులు జరపవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసే అధికారం వారికి వుంది. ఎలాంటి వారంట్లు లేకుండానే ఎవరినైనా సోదా చేయవచ్చు.
1990లో ఒక చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు అఫ్సాను విస్తరిం చారు. ఇప్పటికీ అక్కడ ఈ చట్టం అమలులో వుంది. ఈ చట్టంతో పాటు ప్రజా భద్రతా చట్టం, ఇతర నిరంకుశ చట్టాలన్నీ కలిసి ఎలాంటి శిక్షలు అమలవ్వని ఒక వ్యవస్థను తీసుకువచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌లోని సామాన్య ప్రజానీకంపై దారుణ మైన లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి.
అఫ్సా కింద ఏ భద్రతా సిబ్బందినైనా వారు చేసిన నేరానికి విచారించాలనుకుంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే జమ్మూ కాశ్మీర్ అనుభవాలు చూసి నట్లైతే ఆచరణలో ఇది అసా ధ్యం. 2018 జులై వరకు, అఫ్సా
కింద సాయుధ బలగాలపై దర్యాప్తుకు అనుమతి కోరుతూ వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు 50 కేసులను కేంద్రానికి పంపాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క కేసు దర్యాప్తుకు కూడా అనుమతిని మంజూరు చేయలేదు. అన్ని కేసులను తిరస్కరించింది. అయితే, పతిరిబల్ సంఘటనలో కొంతమంది సైనిక సిబ్బంది జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో ఐదుగురు పౌరులు మరణించారు. కానీ, వారు విదేశీ తీవ్రవాదులని సైనికులు చెబుతున్నారు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. కొంతమంది సైనిక సిబ్బంది నేరానికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. అయినా చివరకు ఆ కేసు సైనిక కోర్టుకు వెళ్ళింది. అక్కడ నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టారు. నిందితులపై పెట్టిన కేసులో ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యం కాలేదన్న కారణంతో వారిని వదిలిపెట్టారు.
అఫ్సా రద్దు కోరుతూ ఇరోమ్ షర్మిల ఏకంగా 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిరాహార దీక్ష నిర్వహించారు. క్రూర చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ నిరంతరంగా వస్తూనే వుంది. 2004లో, అఫ్సా పని తీరుపై యూపీఏ ప్రభుత్వం జస్టిస్ జీవన్ రెడ్డి నేతత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాన్ని రద్దు చేయాలని ఆ కమిటీ 2005లో సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. అయితే, చట్టాన్ని సవరించేందుకు లేదా కొన్ని రాష్ట్రాల నుండి ఉపసంహరించేందుకు జరిగిన ప్రయత్నాలన్నింటినీ సైన్యం, రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకించాయి.
మణిపూర్‌లో, 2004లో తీవ్రవాది అని ఆరోపించ బడిన తంగ్జమ్ మనోరమపై కొంతమంది భద్రతా సిబ్బంది దారుణంగా లైంగికదాడి జరిపి, హత్య చేశారు. ఆ నేపథ్యంలో అఫ్సా రద్దుకై పెద్ద ఉద్యమమే నడిచింది. ఫలితంగా కేవలం ఇంఫాల్ మున్సిపల్ ప్రాంతాన్ని ఆ చట్ట పరిధి నుంచి తొలగించారు. జమ్మూ కాశ్మీర్లో రెండోసారి యూపీఏ ప్రభుత్వ హయాంలో, జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ప్రాంతాలను మినహాయించి, మిగిలిన పట్టణ, ఇతర ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంత ప్రకటనను, అఫ్సా అమలును ఉపసంహ రించాలని... ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం, వామపక్షాలు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు డిమాండ్ చేశాయి. తీవ్రవాదం, హింస బాగా తగ్గిపోయినందున ఈ చర్య తీసుకోవాలని కోరాయి. అప్పటి హౌం మంత్రి కూడా ఈ అభిప్రాయాన్ని సమర్ధించారు. అయినా ఆర్మీ చీఫ్, రక్షణ శాఖలు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ డిమాండ్‌ను ఆమోదించలేదు.
సామాన్య పౌరులపై సాయుధ బలగాలను ఉపయోగించడం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఇన్నాళ్ళుగా ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం కొట్టివేయకపోవడం తీవ్ర విచారకరం. ఓవైపు ప్రజల ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాస్తూ.. జాతీయ భద్రతతో కూడిన దేశాన్ని నిర్మిస్తామంటూ అప్రజాస్వామ్య, నిరంకుశ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంటోంది. చట్టవిరుద్ధ కార్యక లాపాల నిరోధక చట్టం, జాతీయ భద్రతా చట్టం, అఫ్సాతో పాటుగా ఐపీసీలోని దేశద్రోహం క్లాజు వంటివన్నీ నిరంకుశ భద్రతా వ్యవస్థలో భాగమే. పంజాబ్, పశ్చిమ బెంగాల్లో అంతర్జాతీయ సరిహద్దు లోపల వైపునకు... సరిహద్దు భద్రతా బలగాల పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు ఇటీవల పెంచడం కూడా మనం ఈ నేపథ్యంలోనే చూడాల్సి వుంది.
తమ రాష్ట్రాల నుంచీ మొత్తంగా ఈశాన్య ప్రాంతం నుంచీ అఫ్సాను రద్దు చేయాలని నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులు నేటఫియూ రియో, కాన్రాడ్ కె. సంగ్మాలు డిమాండ్ చేయడం మంచి పరిణామం. 2015లో త్రిపురలో వామపక్ష ప్రభుత్వం 'కల్లోలిత ప్రాంతం' ప్రకటనను ఉపసంహరించడం ద్వారా రాష్ట్రంలో అఫ్సాను రద్దు చేసింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో అఫ్సాను రద్దు చేస్తే సరిపోదు. అఫ్సా చట్టాలను మొత్తంగా రద్దు చేయాల్సిన సమయమిది. ప్రజాస్వామ్య, నాగరిక సమాజంలో ఇటువంటి క్రూర చట్టాలకు స్థానం లేదు.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)