Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా కరోనా ముప్పు పూర్తిగా ముగిసిపోలేదు. కాని ఈ ఆర్ధిక సంవత్సరంలో లాక్డౌన్లు గాని, కార్మికులు విధులకు రాలేని పరిస్థితులు గాని ప్రస్తుతానికి లేవు. ఆర్ధిక కార్యకలాపాలకు కరోనా ఆటంకాలు లేవు కనుక ఈ ఏడాది ఆర్ధిక పరిస్థితిలోవచ్చే ఇబ్బందులకు ఆర్ధిక కారణాలే తప్ప కరోనాను సాకుగా చూపించడం కుదరదు.
ఈ ఏడాది ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, రెండంకెల వృద్ధిరేటు ఖాయం అని కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఢంకా బజాయించి చెప్తున్నారు. కాని ఈ ఏడాది రెండంకెల వృద్ధిరేటు ఉంటే మాత్రం ఏమిటి? గతేడాది జీడీపీ నికరంగా పడిపోయింది. ఆ పతనం తక్కిన ప్రపంచ దేశాలన్నింటిలో సంభవించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడా లేనంత కఠినంగా అమలు చేసిన ఆ లాక్డౌన్ కారణంగా 2020లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమాంతం 24 శాతం పడిపోయింది. అంత దిగువకు పడిపోయిన తర్వాత ఏదో ఒకమేరకు అక్కడి నుంచి తిరిగి పైకి పెరుగుతుందని అందరూ ఆశిస్తారు. దానిగురించి గొప్పలు పోడానికి ఏమీ లేదు. 2019-20 ఆర్ధిక సంవత్సరం (అంటే కరోనాకు ముందు సంవత్సరం)తో పోల్చినప్పుడు ఈ ఏడాది ఆర్ధిక పురోగమనం ఏవిధంగా ఉందన్నది అసలైన ప్రశ్న. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఏడాది (అంటే 2021-22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో వచ్చిన వృద్ధి 2019-20 తో పోల్చితే చాలా దిగువన ఉంది. ఇక రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2019-20తో పోల్చితే కేవలం 0.3 శాతం మాత్రం పెరిగింది. 2019-20తో పోల్చినప్పుడు 2020-21లో 7.3శాతం తగ్గింది. 2020-21తో పోల్చినప్పుడు ఈ ఏడాది ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు 10 శాతం వృద్ధి వచ్చినా అది 2019-20తో పోల్చినప్పుడు కేవలం 1.97 శాతం మాత్రమే అధికంగా ఉంటుంది. ఈ కాస్త పెరుగుదలను బట్టి దేశ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల మార్పు వచ్చేసినట్టు అనుకోలేం. నిజానికి ప్రభుత్వం చెప్పుకుంటున్నది 10 శాతం వృద్ధి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 9.5 శాతం మాత్రమే ఉంటుందని చెప్తోంది.
ఈ కాస్త వృద్ధి కూడా నిలకడగా ఉండేటట్టు లేదు. అదీ కీలకమైన విషయం. 2019-20 రెండో త్రైమాసికంలో ఎంత వినిమయం జరిగిందో అంతకన్నా 2021-22 రెండో త్రై మాసికంలో 3.5 శాతం తక్కువగా వినిమయం జరిగింది. మరి వృద్ధి ఎక్కువగా ఎనా సాధ్యం అయింది ? అది పెట్టుబడులలో వచ్చిన పెరుగుదల మాత్రమే. బహుశా ఆ పెట్టుబడులు అంతకుముందే మొదలై మధ్యలో నిలిచిపోయినవి అయివుండొచ్చు. లేదా ఇంతకు ముందే తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టివుండొచ్చు. ఈ పెట్టుబడుల వలన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కలుగుతుంది. ఐతే అది 2019-20 నాటి స్థాయికే ఉంటుంది. వినిమయం తగ్గింది గనుక ఉత్పత్తి సామర్ధ్యం పెరిగినా, వాస్తవ ఉత్పత్తి మాత్రం తగ్గుతుంది. దానివలన మన జీడీపీ తగ్గుతుంది.
అంటే ఇప్పుడు నమోదైన ఈ కాస్త వృద్ధి కూడా నిలబడేది కాదు. అది నిలకడగా ఉండాలంటే వినిమయం పెరగాల్సిందే. మనం వృద్ధి గురించి చర్చించేటప్పుడు ఎగుమతుల విసయం పక్కన పెడదాం. ఆ ఎగుమతుల పాత్ర చాలా స్వల్పం గనుక దాని ప్రభావమూ స్వల్పమే. ఏ దేశ ఆర్ధిక వ్యవస్థలోనైనా జీడీపీ అంటే అది ప్రైవేటు వినిమయం ప్లస్ ప్రైవేటు పెట్టుబడి ప్లస్ ప్రభుత్వ వ్యయంతో సమానంగా ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడి ఎప్పుడూ మార్కెట్ ఎంత పెరుగుతుందనేదానిని బట్టి పెరుగుతుంది. మార్కెట్ సైజు ప్రైవేటు వినిమయం పెరిగేదానిని బట్టి, ప్రభుత్వ వ్యయం పెరిగేదానిని బట్టి పెరుగుతుంది. మౌలిక వసతుల రంగం (ఇన్ఫ్రాస్ట్రక్చర్)లో ప్రభుత్వం పెట్టే పెట్టుబడి పెంచితే మార్కెట్ సైజు పెరుగుతుంది కనుక దాని పర్యవసానంగా ప్రైవేటు పెట్టుబడి కూడా పెరుగుతుంది అని ప్రభుత్వ అధికార ప్రతినిధులు చెప్తూంటారు.
మరి ఆ మౌలిక వసతుల రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్లకు కారుచౌకగా అమ్మేయడం ద్వారా గాని (దీనినే ప్రైవేటైజేషన్ అంటున్నారు) దీర్ఘకాలపు లీజులకు ఇవ్వడం ద్వారా కాని (దీనినే మోనటైజేషన్ అంటున్నారు) కట్టబెడు తున్నప్పుడు ఇక ప్రభుత్వం ఆ రంగంలో అదనంగా పెట్టుబడులు పెట్టేదేముంటుంది? ప్రజాధనంతో నిర్మించబడ్డ భారీ మౌలిక వసతుల రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా మోనటైజేషన్ పేర సమర్పించే విధానాన్ని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది కద !
పైగా మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచడం అంటే తప్పనిసరిగా అందుకోసం భూసేకరణకు పూను కోవాల్సివుంటుంది. భూసేకరణకు ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుంది. పైగా అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం అందాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సహకారం అనేదానికి మోడీ ప్రభుత్వం ఏనాడో చెల్లుచీటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రాల నుంచి సహకారం ఏవిధంగా ఆశించగలదు ?
పై కారణాలరీత్యా మౌలికవసతుల రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగడం అనేది ఆర్ధిక వ్యవస్థను కోలుకునేట్టుగా జరిగే అవకాశం లేదు.
ఇక మిగిలినవి రెండే దారులు. ప్రతీ ఇంటికీ నేరుగా నగదు బదిలీ చేసి తద్వారా ప్రైవేటు వినిమయాన్ని పెంచడం మొదటిది. చాలా కాలం నుంచి ఆర్ధిక వేత్తలు, రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు దీనినే డిమాండ్ చేస్తున్నాయి. మొదట్లో హఠాత్తుగా లాక్డౌన్ విధించడం వలన, పేదలు తమ ఆదాయ వనరులను కోల్పోయి నందువలన కలిగిన తక్షణ దుస్థితి నుంచి ఆదుకోడానికి ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి లేకపోయినా, నగదు చెల్లింపు అవసరం మాత్రం అలానే కొనసాగుతోంది. ఆ కాలంలో పేదలు ప్రాణాలను నిలుపుకోవడం కోసం అప్పులు చేశారు. ఇప్పటికీ ఆ అప్పులు వారి పాలిట గుదిబండలుగానే ఉన్నాయి. ఆ అప్పునుంచి బైటపడడానికి వారు అనివార్యంగా తమ వినిమయాన్ని కుదించుకోవలసివస్తున్నది. వారి వినిమయం మళ్ళీ పూర్వ స్థితికి (కరోనా రాకమునుపు స్ధితికి) రావాలంటే వారికి రుణవిముక్తి కలిగించాలి. నగదు చెల్లింపులు జరిగితేనే అటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆదాయపన్ను చెల్లించే స్థాయికి దిగువను ఉన్న కుటుంబాలకు తలా రు.7500 చొప్పున ప్రతీ నెలా కొంతకాలం వరకూ చెల్లించాలన్నడిమాండ్ ఆ కుటుంబాల వినిమయ స్థితిని మెరుగుపరచడం కోసమే ముందుకొచ్చింది.
ఆ విధంగా నేరుగా నగదు చెల్లింపులు చేయడం వలన ఇంకో ప్రయోజనం కూడా కలుగుతుంది. ఈ పేదలు ఎక్కువగా వినియోగించే వస్తువులు చిన్న తరహా
ఉత్పత్తుల రంగంలోనే తయారౌతాయి. ఈ పేదల వినిమయం పెరిగితే ఆ రంగం పుంజుకోడానికి దోహదప డుతుంది. ఇంతవరకూ ఆ రంగం పెద్దనోట్ల రద్దు కారణంగాను, జీఎస్టీ వ్యవస్థ కారణంగాను నానా ఇబ్బందులూ పడుతోంది. ఇప్పుడు ఆ రంగం గనుక కోలుకుంటే ఆమేరకు ఉపాధి కూడా పెరుగుతుంది. ఆ రంగంలో ఉపాధి పెరిగిన మేరకు తిరిగి వినిమయం మరింత పెరుగుతుంది.
ఈ విధంగా నేరుగా నగదు చెల్లింపు విధానానికి మరో రూపమే ఉపాధిహామీ పథకానికి భారీగా అదనపు కేటాయింపులు పెంచడం. ఐతే ఈ పధకంలో ఇంటికి ఒకరికి మాత్రమే ఉపాధి కల్పిస్తారు. అది కూడా గరిష్టంగా 100 రోజులకు మాత్రమే.
(ఆచరణలో 100 రోజులు ఎక్కడా కల్పిస్తున్నది లేదు) అందుచేత నేరుగా నగదు చెల్లింపు చేయడం వలన ఆ కొరవను పూడ్చవచ్చు. జీడీపీలో వినిమయం 55 శాతం
ఉంటుంది. జీడీపీలో 1 శాతం పెరుగుదల రావాలన్నా రు.2 లక్షల మేరకు వినియోగం పెరగాలి. కాని ఉపాధి హామీ పథకానికి అదనంగా చేసిన కేటాయింపులు (నవంబరు మాసాంతానికి) కేవలం రు.22,000 కోట్లు ! అందుచేత ఉపాధిహామీ పథకానికి అదనంగా కేటాయింపులు పెంచకుండా దానిని ఊరికే విస్తరించడం వలన జీడీపీలో వృద్ధి రాదు.
ఇక రెండో మార్గం : వైద్యం, విద్య తదితర సామాజిక సేవల కోసం ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచడం. ఈ రంగాల్లో ఖర్చు పెంచితే ఎక్కువమంది ప్రజానీకం హర్షిస్తారు. వేరే ఇతర నిర్మాణాలమీద చేసే ఖర్చు కన్నా ఈ సామాజిక సేవలకోసం ఖర్చు చేస్తే ప్రజల సంక్షేమం మెరుగుపడుతుంది. కాని మోడీ ప్రభుత్వం చాలా వేగంగా విద్య, వైద్యం తదితర రంగాలను ప్రైవేటీకరించే పనిలో ఉంది. ఆ విధానాన్ని మార్చకుండా ఇప్పుడు ఆ రంగాల్లో ప్రభుత్వ వ్యయాన్ని ఉన్నట్టుండి పెంచడం కుదిరేపని కాదు.
దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోడానికి అత్యంత అవశ్యమైన నగదు చెల్లింపు పద్ధతి కాని, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కాని ఈ మోడీ ప్రభుత్వం వలన జరిగే పనులు కావు. ఏదో ఎన్నికల జిమ్మిక్కులలో భాగంగా కొద్దిపాటి ఖర్చు చేయవచ్చేమో కాని, ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకునే విధంగా ఖర్చు చేయడం జరగదు.
మరి మోడీ ప్రభుత్వం ఏమనుకుంటోంది? కార్పొరేట్ రంగానికి సబ్సిడీలను, పన్ను రాయితీలను భారీగా కల్పిం చడం ద్వారా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి వారిచేత భారీ పెట్టుబడులను పెట్టించవచ్చునన్న తప్పుడు అభిప్రాయంతో మోడీ ప్రభుత్వం ఉంది. ఆ విధంగా భారీ పెట్టుబడులు వస్తే ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుందని ఆశిస్తోంది. కాని, డిమాండ్ ( వినిమయం) పెరగకుండా ఏ ప్రైవేటు పెట్టుబడిదారుడూ అదనపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రానేరాడు. డిమాండ్లో వృద్ధి ఉండదు ఉనుకుంటే పెట్టుబడిలో కూడా వృద్ధి ఉండదు. అటువంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను, రాయితీలను వాడుకుని ఆ సొమ్మును ఎక్కడో దాచుకుంటాడే తప్ప పెట్టుబడి మాత్రం పెట్టడు. కనుక ప్రభుత్వం ఆ కార్పొరేట్లకు రాయితీలను. సబ్సిడీలను పెంచడం గురించి ఆలోచన మానుకుని ప్రజల వినిమయాన్ని పెంచడానికి అవసరమైన చర్యల గురించి ప్రయత్నించడం మంచిది. ఐతే ఈ వాస్తవాన్ని అర్ధం చేసుకునే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు.
- (స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్