Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం నలు వైపులా ఒకే కరెన్సీని వాడుకునే అవకాశాలు కల్పిస్తోంది క్రిప్టో కరెన్సీ. దీనిపై ఎలాంటి నియంత్రణ గానీ, భద్రత గానీ లేకుండానే కరెన్సీగా చెలామణీ అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ కరెన్సీని నిషేదించాయి, మరి కొన్ని చట్టబద్ధం చేశాయి. ఈ క్రిప్టోకరెన్సీ మన దేశంలోకి కూడా అడుగుపెట్టింది. 19వ శతాబ్దపు కెనడాలో క్లోండిక్ గోల్డ్ రష్ ప్రజల్ని ఎలాంటి పరుగులు పెట్టించిందో ఇప్పుడు కూడా అలాంటి పరుగునే కంప్యూటర్ ప్రారంభించింది. బంగారం కన్నా విలువైన క్రిప్టోకరెన్సీ కోసం నేడు క్రిప్టోమైనింగ్ జరుగుతున్నది. ఈ మైనింగ్ 2009లో వెలుగులోకి వచ్చిన బిట్ కాయిన్ నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5వేలకు పైగా క్రిప్టోకరెన్సీలున్నాయి. వీటి కోసం ఎంతో మంది ఆశాపరులు రాత్రి, పగలనే బేధం లేకుండా నిరంతరం ఆరాటపడుతున్నారు. అసలు ఇంతకు ఏమిటీ క్రిప్టోకరెన్సీ? ఇదొక వర్చువల్ ధనం మాత్రమే తప్ప మామూలు డబ్బులా బయట చలామణి అయ్యేది కాదు. పోనీ అది ఆ దేశ ప్రభుత్వాలు, బ్యాంకుల నియంత్రణలో ఉంటుందా అంటే దానికి ఆమడ దూరంలో ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్ డేటాబేస్ లాంటి వర్చ్యువల్ లెడ్జర్లో ఇది నిల్వ ఉండి బ్లాక్ చెయిన్ పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తుంది. సమాచారాన్ని నమోదు చేసుకునే ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నప్పుడు అంటే బిట్ కాయిన్స్ ఏదైనా కొంటున్నప్పుడు, ఆ లావాదేవీని త్రిప్టోగ్రఫీ ద్వారా నోడ్స్ నెట్వర్క్ ధృవీకరించి, ఇతర లావాదేవీలతో కలిపి కొత్త బ్లాక్ ఏర్పడుతుంది. ఇది డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్లో నమోదయి అప్పటికే ఉన్న బ్లాక్ చెయిన్‌కు కొత్త బ్లాక్‌లు వచ్చి జతకూడతాయి. లావాదేవీ పూర్తవుతుంది. ఇలా వాస్తవ ప్రపంచం లాగానే క్రిప్టోతో వస్తువులు, సేవలు కొనుక్కోవచ్చు. అయితే ఒకసారి బ్లాక్ చెయిన్‌లో నమోదైన విలువను గానీ, తేదీని గానీ, సమయాన్నీ, సమాచారాన్నీ గానీ మార్చటం చాలా కష్టం. ఈ కష్టతరమైన పనే క్రిప్టోకరెన్సీకి ఎల్లలు లేని విశ్వసనీయత తెచ్చిపెట్టి, విలువను సంపాదించి పెడుతోంది. దీనిని ఎ ఆన్లైన్ కరెన్సీ ఎక్స్ఛేంజీలో డబ్బు చెల్లించి కొనుక్కొని తిరిగి అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది ఎవరికీ పూర్తిగా సొంతం కాదు గాబట్టి ఇది ఎవరిదనేది తెలుసుకోవటానికే వీలుండదు. ఇది వాడుకోవటంలో తేలికగా ఉంటూ ఆన్లైన్లో కొనేవారు, అమ్మేవారి మధ్య వెంటనే బదిలీ అవుతుంది. వడ్డీ శాతం పెంచటం, తగ్గించటంతో వివిధ దేశాల కరెన్సీల మాదిరిగా దీని విలువ మారకుండా దాని గిరాకీ, లభ్యతను బట్టే విలువ మారుతుంది. ఇలాంటి బలమైన కారణాలే బిట్ కాయిన్‌ను కొనటానికి దారితీస్తున్నాయి. ఈ బిట్ కాయిన్లను మైనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. ఒక నెట్ వర్క్‌లో ఉన్న కంప్యూటర్లు ఆయా లావాదేవీలను తనిఖీ చేసి, ధృవీకరించినప్పుడే కొత్త బిట్ కాయిన్లు పుట్టుకొస్తాయి. ఇదంతా సంక్లిష్టతతో కూడిన కంప్యూటింగ్ ప్రక్రియ. వీటిలో బ్లాక్ చెయిన్ కొత్తగా జతకలిసే బ్లాక్స్‌తో ముడిపడి ఉంటుంది. ఇలాంటి కొత్త బ్లాక్స్‌ను సృష్టించటం అంత తేలికైన పనేమీ కాదు. ముందు అతి కష్టమైన లెక్కలను పరిష్కరించి విజయవంతంగా సాధించాలి. అలా సాధించిన వారికి రెండు రకాల బహుమతులు లభిస్తాయి. అవి బ్లాక్ రివార్డ్, లావాదేవీ రుసుము. బ్లాక్ రివార్డ్ అనేది బ్లాక్‌ను పబ్లిష్ చేసిన ప్రతి ఒక్కరికీ లభించి ప్రశంసిస్తుంది. లావాదేవీ రుసుము అనేది లావాదేవీలు నిర్వహించేవారు బిట్ కాయిన్లో కొంత భాగాన్ని రుసుముగా చెల్లిస్తారు. ఇది లావాదేవిని నమోదు చేయటానికి చేసే చెల్లింపు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిట్ కాయిన్లు అన్నీ ఇలా సృష్టించినవే. ఇవి పరిమితంగా ఉండటం వల్ల వీటికి విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే బిట్ కాయిన్లను వెలికి తీసే ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, రోజు రోజుకీ వీటి విలువ పెరుగుతుండటం వల్ల వాటిని వెలికి తీయటానికి ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇక్కడొక ప్రమాదకరమైన విషయమేమంటే వాటి మైనింగ్ ద్వారా పర్యావరణానికి తీవ్రమైన హని కలిగే ప్రమాదం ఉంది. బిట్ కాయిన్లను వెలికి తీయాలంటే చాలా విద్యుత్ అవసరం పడుతుంది. ఇది పర్యావరణంపై విపరీతమైన ప్రభావాన్ని చూపక తప్పదు. పర్యావరణానికి ముప్పు ఉన్నదనే కారణంతోనే చైనా దేశం వీటి మైనింగ్, ట్రేడింగ్ రెండింటినీ నిలిపేసింది. ఆ కారణం చేతనే బిట్ కాయిన్ మైనింగ్ ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. ప్రతి దేశానికి ఉండే కేంద్ర బ్యాంక్‌లాగే మన దేశంలో ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ పరంగా ఎన్ని నోట్లు ముద్రించాలి, ముద్రించిన వాటిని ఎలా చెలామణిలోకి తీసుకురావాలన్నది నిర్ణయిస్తుంది. భారత ప్రజల్లోకి వచ్చే ప్రతి నోటుకూ, నాణేనికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరపున గవర్నరే బాధ్యత తీసుకొని, నాది పూచీ అంటూ నోట్ల పైన సంతకం చేసి మరీ యిస్తారు. సాంకేతికంగా దీన్నే ఫియెట్ మనీ అంటారు. ఇక్కడ క్రిప్టోకరెన్సీ విషయంలో ఇలాంటి హామీలంటూ ఏవీ ఉండకపోగా సర్కార్‌తో గానీ, బ్యాంకింగ్ వ్యవస్థతో గానీ దానికి ఎలాంటి సంబంధాలూ ఉండవు. మన భారతదేశంలో క్రిప్టో టెక్ పరిశ్రమ గత ఐదేండ్లలో 40శాతం వృద్ధి చెందింది. రెండు కోట్ల మంది భారతీయ ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీలలో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. 48 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ 2030 నాటికి 500 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దీని వలన మన దేశ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పు సంభవించబోతుంది. క్రిప్టో కరెన్సీలతో జాతీయ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తప్పదు. ఇలాంటి అవ్యవస్థీకృత మారకాల్ని వ్యతిరేకించకపోతే దేశంలో హవాలా లాంటి ఘటనలు తిరిగి పునరావృతమయ్యే ప్రమాదమూ తప్పదు. అందుకే పొద్దస్తమానం దేశభక్తి గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వ పాలకులు వీటన్నింటినీ ఆర్బీఐ, సెబీల నియంత్రణ, పర్యవేక్షణలోకి తీసుకొచ్చే విధంగా చట్టాన్ని యుద్ధ ప్రాతిపదికన రూపొందించాలి. దేశ రక్షణ కోసం కేవలం చట్టాన్ని రూపొందించడమే కాకుండా సమగ్రంగా అమలు జరిపి నిజమైన దేశభక్తిని చాటుకోవాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140