Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలుష్య గంగ: యాత్రికులు కాశీ పోషకులే కాదు. కాలుష్యకర్తలు కూడా. సంఫ్‌ు పాలనలో మతమురికి పెరిగింది. హిందువుల పవిత్రగంగ భయంకర కాలుష్య కాసారమయింది. పవిత్ర గంగలో పడేయని పదార్థం లేదు. మురుగు, మలినాలు, వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, సీసాలు, పారిశ్రామిక మలినాలు, మానవ విసర్జితాలు, తోళ్ళ శుద్ధి పరిశ్రమల రసాయనాలు, నిమజ్జనా విగ్రహాలు, గో మలమూత్రాలు, సగం కాలిన శవాలు, పూలమాలలు, మానవ శవావశేషాలు, జంతు కళేబరాలు, కబేళాల చెత్తాచెదారాలు, వస్త్ర పరిశ్రమల రంగులు, రసాయనాలు, భవన నిర్మాణ వ్యర్థాలు అన్నిటికీ అంతిమ స్థానం పవిత్ర గంగా నదే. స్థానికుల, యాత్రికుల మలవిసర్జన స్థలాలు గంగ గట్లే. అపరిశుద్ధమైనా, సర్వరోగ సాగరమైనా గంగ పవిత్రమే. దేశవిదేశ భక్తులు ఈ పవిత్రజలాల్లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగాజలాన్ని సేవిస్తారు. భద్రపరుచుకొని తీసుకెళతారు. ప్రపంచ పెద్ద ప్రజాస్వామ్యంలో విదేశీయుల అతి విచిత్ర పర్యాటక క్షేత్రం వారాణసి. కాశీలోనే గాక గంగా పరివాహక గ్రామాల్లో కూడా స్త్రీల, బాలికల, పిల్లల శవాలు వందల్లో కనిపిస్తాయి. వాటిని కుక్కలు, పక్షులు పీక్కుతింటూ ఉంటాయి. అంత్యక్రియల ఖర్చు భరించలేని నిరుపేదలు బంధువుల శవాల ను గంగాసమాధి చేస్తారు. గంగలో అంతిమ యాత్ర పుణ్యలోక ప్రయాణమని నమ్మేవారి శవాలూ, అనాథ వృద్ధ మృత దేహాలూ గంగలో కలుస్తాయి. అవివాహిత ఆడపిల్లల శవాలను దహనం చేయకుండా నీటిలో తోసేయడం హిందు సంప్రదాయం. కన్యల జలసమాధి అదే కుటుంబంలో వారి పునర్జన్మకు కారణమవుతుందని నమ్మకం. శవాలను బహిరంగంగా నది ఒడ్డున కాల్చి బూడిదను కొనిపోవడం హిందు సంస్కృతి. మిగిలిన బూడిదతో నదీ ప్రాంతం, నది నిండిపోతాయి. అస్తికలను గంగలో కలపడం ఆనవాయితీ. శవాలు కాలుతుండగానే చితిని ఆర్పి సగంకాలిన శవాలను గంగలో తోసి, సగంకాలిన కట్టెలను మరొక శవదహనానికి అమ్ముకునేవారూ ఎక్కువే. హత్యల శవాలూ జలదహనాలుగానే భావించ బడతాయి. అధికారులు వాటిని నేరాలుగా ఎంచి పని పెంచుకోరు. జన్మస్థలం హిమాలయాల నుండి సంగమస్థావరం బంగాళా ఖాతం వరకూ 2,600కిలో మీటర్ల గంగాతీర దుస్థితి ఇది. కాశీ విశ్వనాథ దర్శనానికి చెప్పులు, కెమెరాలు వదిలి వెళ్ళాలి. వీధులన్నీ గోవుల, కోతుల మలమూత్రాలతో నిండి ఉంటాయి. పాలకులకూ అవి పవిత్రాలే. భక్తులూ ఈ అశుద్ధాన్ని ఎత్తిచూపరు. హిందు మనోభావాలను రెచ్చగొట్టి వారాణసిలో నెగ్గిన మోడీ హిందూ జాతీయవాద ప్రభుత్వం గంగాప్రక్షాళనా ప్రమాణాలు చేసింది. మోడీ గంగా హారతిచ్చి పార్లమెంటుకెళ్ళారు. రోజూ గంగాహారతి ఏర్పాట్లుచేశారు. విదేశీ ప్రముఖులకు గంగాహారతి ప్రదర్శిస్తారు. గంగశుద్ధి మాత్రం చేయరు. పర్యావరణం పాడవుతూనే ఉంది. కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఆరోగ్య, సాగు, తాగు నీటి సమస్యలు తీవ్రమవుతూనే ఉన్నాయి.
గంగాశుద్ధి: ఒక సమస్య పరిష్కారానికి అత్యంత అపాయకర అంశాలను ముందుగా ఎంచుకుంటాం. స్వచ్ఛ భారత్‌లో ప్రధాని నియోజకవర్గం వారాణసి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకోలేదు? 2017 మార్చి వరకు రెండేండ్లలో గంగాశుద్ధికి రూ.7,305 కోట్లు ఖర్చుపెట్టారు. అయినా గంగ గంభీర పర్యావరణ సమస్య లేశమైనా తగ్గలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్లు గంగాశుద్ధికి పైసా ఖర్చుపెట్టలేదు. మోడీ నిశ్శబ్దనిఘా పాటించారు. 2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పటి నుండి మూడేండ్లలో భారత ప్రభుత్వం కేవలం ప్రకటనలకే రూ.530 కోట్లు ఖర్చుపెట్టింది. ''మొదటి రెండేండ్లలో 0.5శాతం చొప్పున రూ.16,400 కోట్ల స్వచ్ఛ భారత్ సెస్సు వసూలయింది. ఇందులో రూ.4,100 కోట్లు స్వచ్ఛ భారత్ నిధికి చేరనే లేదు. 2018 మార్చి దాకా స్వచ్ఛ భారత్ కోసం రూ.33,823 కోట్లు ఖర్చయింది. అపరిమిత ఖర్చు. పరిమిత ఫలితం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎత్తిచూపారు. అయినా గంగశుద్ధి జరగలేదు.
అంతర్జాతీయ అవహేళన: కాశీ అవలక్షణ చిత్రాలను చూసి చైనా సకారాత్మక ఆలోచనతో తన వాతావరణాన్ని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకుంది. మతవంచన, ఆధ్యాత్మిక కపటనాటకాలతో పెంచిపోషించబడుతున్న మురికిని, రోతను, కాలుష్యాన్ని ప్రపంచ దేశాలు అసహ్యహించు కున్నాయి. అవహేళనచేశాయి. వారాణసి మురికి చిత్రాలు ప్రపంచ ప్రచారంపొందాయి. ప్రతి విషయంలోనూ మోడీ తప్ప ఇంకెవరు చేస్తారని గొప్పలు చెప్పుకునే ప్రధాని, ఆధ్యాత్మిక బ్రహ్మచారి ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్లు కూడా ఈ దుర్గంధాన్ని ఎందుకు పట్టించుకోలేదని విదేశీయులు విస్తుపోతున్నారు. పలు దేశాలు చెత్తాచెదారాలు, వ్యర్థాలను ఎత్తేసుకునే అధ్వాన్న అలవాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకున్నాయి. ప్రజల సొమ్ముతో విదేశీ యాత్రలు చేసే పాలకులకు అక్కడి శుభ్రత, ఇక్కడి అశుభ్రతలను పోల్చుకునే అవకాశంలేదు. వారి స్థానిక ప్రయాణాలన్నీ కార్లలోనే కాబట్టి. చాలా మంది ప్రజలు దేశవిదేశాలలో తిరిగి వస్తారు. సింగపూర్, కాంబోడియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, స్కాండినేవియన్ దేశాలలో క్రమశిక్షణ పాటిస్తారు. అలా ఇక్కడ ఎందుకు నడుచుకోరు? ఈ మానసిక మార్పును ఎలా తేవాలి?
తాత్వికమార్పుతో పరిష్కారాలు: కొన్నిటికి అధికారం పనిచేస్తుంది. కొందరికి భావజాలమే మంత్రం. రెండూ ఉంటే సంఘటిత, సమన్విత సమాహారమే. మోడీ ఇందులో సవ్యసాచి. ఆ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు. అధికార, భావజాలాలకు బాధ్యత కూడా కలుస్తుంది. ఈ త్రిసంగమం కాశీ మురికిని ఎందుకు వదిలించలేదు? గంగా ప్రక్షాళనాన్ని ఎందుకు ముందుకు నెట్టలేదు? నివారణ కంటే నిరోధం ఉత్తమం. మురికి, మలినాల మూలకారణాలను ముందుగా అరికట్టాలి. ఇందుకు ఆధ్యాత్మిక భావజాలం చక్కగా పనిచేయగలదు. చట్టాలూ ఉన్నాయి. హిందూత్వంతో ప్రజలను సమీకరించిన పాలకులు గంగా ప్రక్షాళనకూ ఈ సాంకేతిక తర్కాలను వినియోగించాలి. అధికారం, అద్భుత ఆధ్యాత్మికం, మతం, జాతివాదం, సాంస్కృతిక ఏకత్వవాదం, దేశభక్తి మంత్రాలు ఇక్కడా పఠించాలి కదా? కేవలం రాజ్యాధికార సంపాదనకేనా? ప్రజారోగ్యానికీ వీటిని వాడరా? అశుభ్రతకు మరో కారణం - అనవసర మానవకల్పితాలు, అశ్రద్ధ, బాధ్యతా రహిత లాభదాయక మానవత్వరహిత దుర్మార్గ ఆచారాలు, దుష్ట సంప్రదాయాలు. వీటిని చట్టాల అమలుతో సరిదిద్దవచ్చు. ఇది బ్రంహవిద్య కాదు. పక్షపాతరహితంగా సంపన్న వర్గాల పక్షం కాకుండా ప్రజాపక్షం వహిస్తే చాలు. భక్తజనా లను, అమాయక ప్రజాగణాలను అపాయకర ఆధ్యాత్మికతల నుండి కాపాడొచ్చు. భౌతికత, ప్రజావసరాలు, ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం పట్ల చైతన్యపరచాలి. ఆధ్యాత్మికతలో ఇమిడి ఉన్న ప్రకృతీ పరిరక్షణాంశాలను బోధించాలి. భక్తి, మత భావాలను భౌతికత్వానికి అనువదించి అనుసంధానించాలి. ఇవి ఏలికల పరిమితిలోని అంశాలే. నోట్లరద్దుతో మభ్యపెట్టిన వాళ్ళకు, ''ఏకత్వ'' వస్తుసేవాపన్ను విధానాన్ని ద్వితీయ స్వాతంత్య్రంగా చిత్రీకరించి అర్థరాత్రి సమావేశాలు నిర్వహించిన వాళ్ళకు, ఆర్థిక బిల్లులను అక్రమంగా ఆమోదింపజేసుకున్న గందరగోళ సభ అవిశ్వాస చర్చకు పనికిరాదని తీర్మానించిన చతురులకు గంగాప్రక్షాళన ఎందుకు సాధ్యం కాదు?
ఆచార చైతన్యం: సంస్కృతి, సంప్రదాయం పేరుతో ప్రచండ మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్నాం, ఆచరిస్తున్నాం. బతుకుదెరువు కోసం అభివృద్ధిచెందిన దేశాలకు పోయినా అనాచారా లను వదలడంలేదు. కాశీ కాలుష్యం ఆ సంప్రదాయాల్లో భాగమే. 50ఏండ్ల క్రితమే గుంటూరు జిల్లా ఒక మారుమూల పల్లె జాతరలో జంతుబలి నిషేధించారు. పోతులను, కోళ్ళను గుడిచుట్టూ తిప్పుకొని ఇంటికి తీసుకుపోయి కోసుకోమన్నారు. ఘననాయకులు ఘనజన సమస్య పరిష్కారం కోసం వారాణసి రోతను వారించలేరా? కాశీ కాలుష్యాన్ని కట్టడిచేయలేరా? భక్తులు, ప్రజలు మత భ్రమలు తొలగించుకొని మనుషులుగా బతికే తీరు నేర్చుకోలేరా?
- ఎస్. హనుమంతరెడ్డి
సెల్: 9490204545