Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల్లో పేదరికంతో పాటు అధిక జనాభా, నిరుద్యోగం, అనారోగ్యం, ఆహార అభద్రత లాంటివి అనాదిగా వెంటాడుతూనే ఉంటున్నాయి. భారతానికే సవాలుగా నిలిచిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, లింగ అసమానతలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. మన దేశ జనాభా అనుభవిస్తున్న ప్రధాన సమస్యగా 'ఆదాయ అసమానతలు (ఇన్కమ్ ఇనీక్వాలిటీస్)' గుర్తించబడినవి. వ్యక్తుల మధ్య సంపద, ఆదాయాల్లో అపారమైన తేడాలు ఉండడాన్ని ఆదాయ అసమానతలుగా గుర్తిస్తారు. ఆదాయ, సంపదల వ్యత్యాసాలు ఉన్న సమాజంలో అసంతృప్తులు, అశాంతి పెరుగుతాయి. 2020 ప్రపంచ సంపదలో 82శాతం ఒక శాతం జనాభా చెంతనే ఉండగా, దాదాపు సగం జనాభా (370 కోట్లు) పేదరికంలో మగ్గుతున్నారని తేలింది.
భారతదేశ సంపద:
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఇండియా 3వ స్థానంలో (అమెరికా, చైనా తరువాత) ఉన్నది. అయినప్పటికీ భారత్‌లో కోవిడ్-19 కారణంగా 75 మిలియన్ల పేదలు అదనంగా పెరిగారు. కరోనా విజృంభణతో తక్కువ వేతనం పొందే ఉద్యోగుల ఆదాయం పడిపోవడం జరిగింది. అల్పాదాయ వర్గాలు నర్సింగ్, పోలీస్, టీచింగ్, క్లీనింగ్, స్టోర్ అటెండెంట్, హౌటల్స్, మునిసిపల్/గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది, రెస్టారెంట్లు, టూరిజం లాంటి ఉద్యోగులు అతి తక్కువ వేతనం పొందినా, వైరస్‌కు సమీపంగా నిర్భయంగా పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా 689 మిలియన్ల కడుపేదలు ఉండగా, ఇండియాలో వారి సంఖ్య 139 మిలియన్లు (20శాతం) ఉన్నది. ప్రపంచ జనాభాలో 17.8శాతం ఇండియన్లు ఉన్న విషయం మనకు తెలుసు. ఇండియాలో 2019 ఏడాదిలో 102మంది బిలియనీర్లు ఉండగా, 2020లో వారి సంఖ్య 140కి పెరిగి, వారి సంపద దాదాపు రెట్టింపు (596 బిలియన్ డాలర్లు) అయ్యింది. భారత దేశంలో 73శాతం సంపద ఒకశాతం జనాభా వద్దనే ఉన్నదని, 67కోట్ల భారతీయులు (దాదాపు 50శాతం) పేదరికంలో మగ్గుతున్నారని సర్వే ఫలితాలు వివరిస్తున్నాయి. ప్రపంచ ఇనీక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్-2020 ప్రకారం 1980ల్లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం అనంతరం అత్యధిక జనాభా కలిగిన ఇండియా, చైనాల్లో ఆదాయ అసమానతలు క్రమంగా పెరిగాయని విశ్లేషించారు. 1980ల్లో ధనికుల ఆదాయం 30శాతం, 2019లో 56శాతం వృద్ధి కావడం గమనించారు.
ఆదాయ అసమానతలకు కారణాలు:
ఆదాయ అసమానతలు మొగ్గ తొడగడానికి ముఖ్య కారణంగా నిరుద్యోగం, అండర్ ఎంప్లారుమెంట్ సమస్యలను తొలుత గుర్తించారు. అర్హతకు తగ్గ ఉద్యోగం లభిస్తేనే ఆదాయాలు పెరుగుతూ, అసమానతలు తగ్గుతూ, క్రియాశీలతలు/ ఉత్పత్తులు/ సాఫల్యతలు పెరుగుతాయి. శ్రమ దోపిడీతో ఆదాయాలు, నిరుపేదల శరీరాలు కుంచించుకు పోవడం చూస్తున్నాం. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉద్యోగాల కల్పన, పనికి తగ్గ వేతనాలు దొరికితేనే ఆదాయ అసమానతలు తగ్గుతాయని గమనించాలి. పారిశ్రామిక, వ్యవసాయక లాభాలు/ ఆదాయాలు పెరిగినా ఉద్యోగులు/శ్రామిక వర్గాల వేతనాలు పెరగడంలేదు. కుబేరులు ఆదాయాలకు తగిన పన్నులు కట్టకుండా, దొడ్డి దారిన పన్నులను ఎగవేయడం పరిపాటిగా కనిపించడంతో ప్రభుత్వ ఆదాయాలకు గండి పడడం, పేదలకు అభివృద్ధి ఫలాలు అందకపోవడం జరుగుతోంది.
ఆదాయ అసమానతల దుష్పరిణామాలు:
రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక సమానత్వం, సమాన అవకాశాల కల్పన, సంపద సమానంగా పంపిణీ కావడం లాంటి హక్కులు నేటికీ కాగితాల్లోనే దాగి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలతో పాటు అవకాశాల్లో అసమానతలు దేశ సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక సమానత్వ సాధనకు భూసంస్కరణలు, సామాజిక భద్రత, పెన్షన్లు, నైపుణ్య శిక్షణల వంటి తగు పటిష్ట చర్యలను తీసుకోవాలి. అత్యంత కుబేరుల(సూపర్ రిచ్)కు కొమ్ముకాయకుండా, వారి సంపద నుంచి అధిక అనువంశిక పన్నులను విధించాలి. పారిశ్రామిక కుబేరుల చేతుల్లో ప్రభుత్వాలు కీలు బొమ్మలు కావడం అసమానతల పోషణకు ఆజ్యం పోస్తూనే, ఆదాయాలు పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడం, లాభాలు పొందడం సర్వసాధారణం అవుతున్నది.
ప్రభుత్వాలు తమ పాలసీలను అమలు పరచడంతో పాటు కుబేరుల నుంచి ఆదాయ పన్ను చట్టాల ప్రకారం పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించాలి. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడెడ్లలా సమన్వయంతో పని చేయాలేగాని, రైలు పట్టాల్లా సమాంతరంగా పని చేయకూడదని తెలుసుకోవాలి. ఆదాయ అసమానతలను రూపుమాపడానికి అన్ని వర్గాల ప్రజలకు కావలసిన పాలసీలను తీసుకు రావడానికి చొరవ చూపాల్సి ఉంది. నిరుపేద వర్గాలకు పని కల్పన, పనికి తగిన ఆకర్షణీయ వేతనాలు, అన్నివర్గాల సమాంతర సుస్థిరాభివృద్ధి సత్వరమే జరగాలి. ఆర్థిక, ఆదాయ సమానత్వ సాధనలో దేశ ప్రజలందరూ తమ తమ హక్కులతో పాటు బాధ్యతలనూ నిర్వహించాలి. ఆదాయ అసమానతలు భరతజాతికి పట్టిన చీడపీడలని, వాటి నిర్మూలనకు బహుముఖీన కోణాల్లో పని చేయాల్సి ఉందని గుర్తుంచుకోవాలి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి,9949700037