Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొంత కాలంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడాబాబులకు కిళ్ళీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. దానిని అమలు చేయటానికి ఆకర్షణీయంగా మెరుగులద్ది రూపొందించిన పథకాలే 'ఆత్మ నిర్భర భారత్' 'నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్'. దేశ ఆర్థిక మంత్రి 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆత్మనిర్భర భారత్ పథకంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటీకరిస్తామని ప్రకటించారు. దానికి అవసరమైన చట్టపరమైన మార్పులను ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించటమే ప్రస్తుత చర్చకు కారణమైంది. ప్రభుత్వ ప్రకటనకు జవాబుగా బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈనెల 16, 17 తేదీలలో సమ్మె ప్రకటించాయి. సంవత్సరకాలానికి పైగా సుదీర్ఘంగా సాగిన రైతాంగ పోరాటం చూశాం. డిఫెన్స్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, బొగ్గు గని కార్మికులు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, అంతా నిరంతర సమ్మె పోరాటాలలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణాలేమిటి?
కార్పొరేట్ల పెత్తనం కోసమే చట్టాలు
ఏ వ్యవస్థలోనైనా సంపద సృష్టికి, ఉత్పత్తి ప్రధాన కారకాలు భూమి, పెట్టుబడి, శ్రమ. గత మూడేండ్ల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన చట్టాలను పరిశీలిస్తే సంపద సృష్టిని కార్పొరేట్లకు అందించడమే దాని ప్రధాన లక్ష్యమని అర్థమవుతుంది. భూమి మీద కార్పొరేట్ల పెత్తనం కోసం వ్యవసాయ చట్టాలు చేసింది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో సహా అనేక నగరాలలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్థలాలను గుర్తించి వేలం వేసే ప్రక్రియ మొదలుపెట్టింది. శ్రమ శక్తిని కార్పొరేట్ ఊడిగానికి గురిచేస్తూ 42 కార్మిక చట్టాలను రద్దు చేసి ఉద్యోగుల కార్మికుల కనీస హక్కులను కూడా హరించివేసింది. పెట్టుబడిమీద పెత్తనం కోసం బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రయివేటీకరణకు సిద్ధం చేస్తున్నది. దేశ ఆర్థిక వనరులను, ఉత్పత్తిని ప్రభుత్వ పథకాలకు సమకూర్చటమే బ్యాంకులు చేసే పని. సరళీకరణ ఆర్థిక విధానాలను మూడు దశాబ్దాల పాటు అమలు చేసిన తరువాత ఇప్పటికి 70శాతం బ్యాంకింగ్ వ్యాపారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వరంగ బ్యాంకులను అదానీలకు, అంబానీలకు హస్తగతం చేయటమే ప్రభుత్వ వ్యూహం. కాబట్టి ప్రభుత్వం చట్టాలన్నీ ఎవరికోసం చేస్తున్నదంటే ఓటేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి కాదు, తన అనుయాయులైన కార్పొరేట్లకు దేశ సంపదను, సంపద సృష్టించే సాధనాలను హస్తగతం చేయటం కోసమే. గతవారం దేశంలో అతి పెద్ద బ్యాంకు, ప్రపంచ స్థాయి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీ కోసం 'అదాని కాపిటల్'తో ఒప్పందం చేసుకోవటమే దీనికి ఉదాహరణ. ఇరవైరెండు వేల శాఖలున్న అత్యధిక గ్రామీణ శాఖలున్న ఎస్బీఐకి అదాని కంపెనీతో జతకట్టి వ్యవసాయ రుణాలు యివ్వాలనే ఒప్పందం ఎంత హాస్యాస్పదం.
కుశ్చితమైన వాదనలు.. కుతంత్రాల విధానాలు
వ్యాపారం చేయటం ప్రభుత్వ బాధ్యతకాదని, ప్రయివేటురంగం సమర్థవంతంగా పనిచేసి సమర్థవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వ వాదన. ఇది ఎంత సత్యదూరం. జాతీయీకరణకు ముందు బ్యాంకులన్నీ కార్పొరేట్ల చేతిలో, వ్యాపారవేత్తల పెత్తనంలోనే ఉండేవి. ప్రజలు దాచుకున్న పొదుపు సొమ్మును స్వంత వ్యాపారాల పెట్టుబడిగా ఉపయోగించుకున్నాయి. వీళ్ల వ్యాపారాలు విఫలమైతే బ్యాంకులు కుప్పకూలాయి. ప్రజల కష్టార్జితం దిగమింగి ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. దేశ స్వాతంత్య్రం నాటి నుండి 1969 వరకు ఐదువందలకు పైగా ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. కాబట్టి ప్రయివేటు బ్యాంకుల నుండి ప్రజల పొదుపును రక్షించటానికి, ప్రజల సంక్షేమానికి, వ్యవసాయ-గ్రామీణాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. జాతీయీకరణ తరువాత కూడా సుమారు 30 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు యాజమాన్యాల అక్రమాలు బట్టబయలయ్యాయి. దివాలా తీసిన ఎక్కువ ప్రయివేటు బ్యాంకులను, వాటిలో ప్రజలు దాచుకున్న సొమ్మును రక్షించింది ప్రభుత్వరంగ బ్యాంకులే. ఇదీ ప్రయివేటు బ్యాంకుల చరిత్ర. మళ్లీ దేశ ఆర్థిక వనరులను వీరికి అప్పగించటం ఈ దేశానికి, ఆర్థిక వ్యవస్థకు, సామాన్య ప్రజలకు ఎంత ప్రమాదకరం?
విజయవంతమైన బ్యాంకుల జాతీయీకరణ
ప్రభుత్వరంగ బ్యాంకులు జాతీయీకరణ లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి సాధించాయి. ప్రభుత్వ పథకాల అమలుకు పట్టుగొమ్మలుగా పనిచేస్తున్నాయి. పొదుపు సంఘాలకు రుణాల ద్వారా మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నాయి. అట్టడుగు వర్గాల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి చేయూతనిస్తున్నాయి. ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, చేతివృత్తులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను అందిస్తున్నాయి. గృహనిర్మాణ రుణాలు, ఎడ్యుకషన్లోన్లు సామాన్యులకు అందిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వారికి జీతాల చెల్లింపు, రైతు బంధు పథకాల వంటి వాటి అమలు ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందించేది కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖలే కదా! విస్తృతమైన సామాన్య ప్రజానీకానికి బ్యాకింగ్ సేవలందిస్తున్నది ప్రభుత్వ బ్యాంకులే. జన్‌ధన్ యోజన ఖాతాల ద్వారా బ్యాకింగ్ రంగం 43కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభిస్తే వాటిలో 97శాతం ఖాతాలు ప్రభుత్వరంగ బ్యాంకులలో ఉన్నాయి. ప్రభుత్వం రేయింబవళ్లు పొగుడుతున్న ప్రయివేటు, విదేశీ బ్యాంకులు 3శాతం జన్‌ధన్ ఖాతాలు మాత్రమే ప్రారంభించాయి.
విస్తృతమైన జనాభాకి సేవలందిస్తున్న బ్యాంకులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే నష్టపోయేది సామాన్యులే. లాభాలొచ్చే ప్రాంతాలలో, లాభాలొచ్చే వ్యాపారమే ప్రయివేటు బ్యాంకుల లక్ష్యం. లాభాలే పరమావధి. ప్రయివేటు బ్యాంకులో ఖాతా తెరవాలంటే కనీసం రూ.పదివేల నుండి ఇరవైవేలు డిపాజిట్ చేయాలి. దేశ జనాభాలో ఎంతమంది అంత పెద్ద మొత్తాలతో ఖాతా పొందగలుగుతారు? ప్రయివేటు బ్యాంకులు వడ్డించే చార్జీల మోత సామాన్యుల తాహతుకు మించినది. బ్యాంకుల ప్రయివేటీకరణ జరిగితే అత్యధిక శాతం జనాభా బ్యాంకింగ్ సేవలకు దూరమవుతారు. 1969 కంటే ముందు పరిస్థితే మళ్ళీ నెలకొంటుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులను
రక్షించుకోవటం మనందరి బాధ్యత
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, చట్టాలను ఓడించటంలో రైతాంగ ఉద్యమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. సంయుక్త కిసాన్ మోర్చా బ్యాంకుల రక్షణకు మద్దతు ప్రకటించింది. కేంద్ర కార్మికసంఘాలు సంఘీ భావం తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సేవల మీద ఆధారపడి ప్రజానీకం, కార్మికవర్గం, రైతాంగం, బ్యాంక్ ఉద్యోగులు అందరూ కలసి రైతు ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వరంగ బ్యాంకులను, ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకోవాలి. దేశ ఆర్థిక స్వావ లంబనను కాపాడుకోవాలి.
- పి. వెంకటరామయ్య
సెల్:9553533815