Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సార్స్-కోవిడ్ 2 వైరస్ నుంచి కొత్తగా పరిణామం చెందిన ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికాలో మొట్టమొదటగా ఈ మధ్యనే గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఒమిక్రాన్‌ను ''ఆందోళన కలిగించే'' వైరస్‌గా ప్రకటించింది. ఇతర దేశాలలో కూడా ఒమిక్రాన్ సోకినట్టు బైటపడింది. కాబట్టి ఈ వైరస్‌ను ఏదో ఒక భౌగోళిక ప్రదేశానికి పరిమితం చేయడం సాధ్యం కాదని స్పష్టమైపోయింది. కరోనా వైరస్లలోకెల్లా డెల్టా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఆ డెల్టాను అధిగమించి ఒమిక్రాన్ అంతకన్నా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. పేద దేశాలలో అత్యధికులకు ఇంతవరకూ కరోనా వ్యాక్సిన్లు అందలేదు. ఇంకోవైపు పచ్చి మితవాద భావాల ప్రభావాలకు లోనైన వారంతా అసలు వ్యాక్సిన్ విధానాన్నే వ్యతిరేకిస్తున్నారు. వెరసి ఇప్పుడిప్పుడే కరోనా తాకిడి నుండి కొద్దికొద్దిగా కోలుకుంటున్న ప్రపంచం ఈ ఒమిక్రాన్ విజృంభణతో మళ్ళీ సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచం మొత్తం మీద అందరికీ వ్యాక్సిన్ అందించగలిగితేనే కోవిడ్ ముప్పు నుండి బైటపడగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి నుండీ చెపుతూనే ఉంది. అందరి రోగనిరోధక శక్తినీ పెంపొందించి కరోనా ముప్పును ఎదుర్కొనేవిధంగా సంసిద్ధం చేసినప్పుడు మాత్రమే కోవిడ్-19 మహమ్మారి నుండి బైటపడి పెద్ద సంఖ్యలో మరణాలు జరగకుండా, ఆర్థికంగా చితికిపోకుండా నివారించడం సాధ్యపడుతుంది.
మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఇన్ఫ్లుయెంజా వైరస్‌తో 5 నుండి 10 కోట్ల మంది చనిపోయారు. వారిలో సగం మంది మన దేశస్థులే. మనకు ప్రకృతి సిద్ధంగా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. నిజమే, కాని అలా పెంపొందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోతాం. అందుకే ఈ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్లను ఉపయోగించాలి. ఆ వ్యాక్సిన్లు ప్రపంచ జనాభా మొత్తానికి అందించాలి. కాని ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు వ్యాక్సిన్లపై పేటెంట్లను సడలించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పేటెంట్ నిబంధనలను సడలించి, వాటిని తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద దేశాలతో పంచుకుంటే ఆ దేశాలు ఈ ప్రాణ రక్షక వ్యాక్సిన్లను చౌకగా తమ దేశాల ప్రజలకు అందించగలుగుతాయి. అమెరికా, ఒకవైపు వ్యాక్సిన్లపై పేటెంట్లను సడలించాలని అంటూనే మరోవైపు తమ దేశంలోని ఫైజర్, మోడర్నా వంటి బడా బహుళజాతి ఔషధ కంపెనీలకు అన్ని విధాలా దన్నుగా నిలబడింది.
'పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్' అనే సంస్థ ప్రచురించిన లెక్కల ప్రకారం ఫైజర్, మోడర్నా ఈ ఏడాది 3400 కోట్ల డాలర్ల లాభాన్ని సంపాదిస్తాయి. రోజుకి 9కోట్ల 35లక్షల డాలర్ల లాభం అన్నమాట (మన కరెన్సీలో రోజుకు సుమారు రూ.700 కోట్లు). ఈ రెండు కంపెనీల ఒక సంవత్సరపు లాభంతో పేద దేశాల జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించవచ్చు!
ఫైజర్, మోడర్నా సంస్థలు తాము ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో వరుసగా ఒక శాతాన్ని, 0.2 శాతాన్ని మాత్రమే పేద దేశాలకు పంపిణీ చేశాయి. కరోనా పేద దేశాలను ఎంత ఇబ్బందికి గురి చేసినా, తమ దేశాల ప్రజలను మాత్రం దాని బారి నుండి రక్షించుకోగలమని సంపన్న దేశాలు భావిస్తున్నాయి. తక్కిన వ్యాక్సిన్ల కన్నా మెరుగైనవిగా పరిగణించబడుతున్న ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్లు తమ జనాభా మొత్తానికి పూర్తి రోగనిరోధక శక్తిని కల్పించగలవని ఈ సంపన్న దేశాలు నమ్ముతున్నాయి. అయితే ఒమిక్రాన్‌తో వస్తున్న అనుభవం బట్టి ఆ వైరస్‌లో మన శరీరంలోని ముక్కు లోపలి భాగానికి, శ్వాసకోశ వ్యవస్థలోని పైభాగానికి గట్టిగా అతుక్కునే భాగం (స్పైక్ ప్రొటీన్) రానురాను ఇంకా బలంగా పరిణామం చెందుతోందని తెలుస్తున్నది. దానివలన ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువగా, మరింత త్వరగా వ్యాప్తి చెందుతుంది. అంతేగాక, వ్యాక్సిన్ కల్పించే రోగ నిరోధక కవచాన్ని తప్పుకుని శరీరంలోకి చొరబడే అవకాశం పెరుగుతుంది. ఈ ఒమిక్రాన్ ఇప్పటికే 30 మ్యుటేషన్లకు లోనైనట్టు తెలుస్తోంది. ఇది చాలా అసాధారణమైన విషయం.
ఇన్ని మ్యుటేషన్లకు ఆ వైరస్ గురి కావడం అనేది కేవలం అది మానవ దేహాలను ఆశ్రయించి ఉంటూనే జరిగిందా, లేక మధ్యలో వేరే ఏ జంతువు శరీరంలోనో చొరబడి మార్పులకు గురై, తిరిగి మళ్ళీ మానవ దేహాలను ఆశ్రయించిందా అన్నది ఇంకా తేలలేదు.
ప్రస్తుతం మనం ఔషధపరంగా రెండు విధాలుగా జోక్యం చేసుకోగలం. ఈ అవకాశం మనకు కరోనా ప్రారంభమైనప్పుడు లేదు. ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్లు ఉన్నాయి. వాటివలన ఈ ఒమిక్రాన్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించలేక పోవచ్చు. కాని మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది గనుక ఎంతో కొంత రక్షణ లభిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞాపకశక్తి ఉంటుంది. గతంలో సోకిన ఇన్ఫెక్షన్లకు సంబంధించి, తీసుకున్న వ్యాక్సిన్లకు సంబంధించిన ఆ జ్ఞాపకం ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇదికాక మన వద్ద ఇప్పుడు మరో రెండు కొత్త యాంటీ వైరల్ ఔషధాలు ఉన్నాయి. తాజా పరీక్షల్లో అవి సమర్థవంతంగా పని చేస్తున్నట్టు రుజువైంది. వాటిలో మోల్నుపిరావర్ అనేది ఒకటి. గతంలో ఇన్ఫ్లుయెంజాను నిరోధించడానికి వాడే ఈ మందును ఇప్పుడు కోవిడ్-19ని కూడా నిరోధించేటట్టుగా తిరిగి రూపొందించారు. దీనిని రిడ్జ్‌బ్యాక్ అనే ఒక చిన్న ఫార్మా కంపెనీ తయారుచేసింది. ఇక రెండవది పాక్స్లోవిడ్. దీనిని ఫైజర్ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ రెండు ఔషధాలూ నోటి ద్వారా సేవించేవి. కోవిడ్ సోకిన తొలి దశలోనే వీటిని సేవించవచ్చు. ఆ తొలి దశలో యాంటీ వైరల్ మందులు శక్తివంతంగా పని చేస్తాయి. ఇప్పటిదాకా ఉన్న యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ ఒక్కటే అది కూడా ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వాలి. పైగా చాలా ఖరీదు. అందుచేత ఎక్కువమంది ఉపయోగించలేరు. కాని ఈ కొత్త ఔషధాలు ఎక్కువమంది ఉపయోగించవచ్చు.
వ్యాక్సిన్లు కోవిడ్ నుండి మనల్ని పూర్తిగా రక్షిస్తాయా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. వ్యాధి ముదరకుండా అడ్డుకోవడంలోను, ఎక్కువ మరణాలు సంభవించకుండా, ఎక్కువమంది ఆస్పత్రులలో చేరవలసిన అవసరం రాకుండా చూడగలవా అన్నదే ప్రశ్న. ఆ విధంగా వ్యాక్సిన్లు ఉపయోగకరం. అదే విధమైన ఉపయోగం యాంటీ వైరల్ ఔషధాల నుండి కూడా ఉంటుంది. ఈ యాంటీ వైరల్ ఔషధాలు మన శరీరంలో చేరిన వైరస్ మళ్ళీ పునరుత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. పునరుత్పత్తి తగ్గితే మ్యుటేషన్ అయ్యే వేగం కూడా తగ్గుతుంది. అందుచేత మనం కోవిడ్ ప్రారంభ దినాల నాటికన్నా ఇప్పుడు ఔషధపరంగా జోక్యం చేసుకోగలిగిన శక్తిని పెంచుకోగలిగాం. అయితే మనకు లేనిదల్లా ఈ మహమ్మారిని నిర్మూలించడానికి కావలసిన రాజకీయ నిశ్చయం. దానికి బదులు మనం వ్యాక్సిన్ జాతీయవాదంతో తిప్పలు పడుతున్నాం. ఇంకోవైపు ఎంత లాభం వచ్చినా సంతృప్తి చెందని, సూపర్ లాభాపేక్షతో వ్యవహరించే ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కన్నా ఈ కంపెనీల లాభాలను కాపాడేందుకే మొగ్గు చూపుతున్న ప్రభుత్వాలూ ఉన్నాయి.
ఇలా తాము సూపర్ లాభాలను సంపాదించే అవకాశమే గనుక లేకపోతే అసలు వ్యాక్సిన్లను తయారు చేయడానికి ప్రేరణే ఉండదని ప్రయివేటు కంపెనీలు వాదిస్తున్నాయి. ఇది పచ్చి అబద్ధం. దాదాపు అన్ని వ్యాక్సిన్లు, ఔషధాలు ప్రభుత్వ పరిధిలో ఉన్న శాస్త్ర పరిశోధనా సంస్థలలోనే రూపం తీసుకున్నాయి. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన కీలక పరిశోధనలే మోడర్నా సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌కు ఆధారం. ఆ వ్యాక్సిన్‌పై పేటెంట్ కోసం మోడర్నాతో నేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కోర్టులో తగువు పడుతోంది. ఇది కాక వ్యాక్సిన్ అభివృద్ధి నిమిత్తం ప్రజాధనం నేరుగా మోడర్నాకు చెల్లించారు. నిజానికి ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్‌గా ప్రపంచం పరిగణిస్తున్నది. ఒరిజినల్‌గా ఒక చిన్న జర్మన్ కంపెనీ తయారు చేసినది. టర్కీలో జన్మించిన ఒక వ్యక్తి, ఆయన భార్య స్థాపించిన ఒక చిన్న జర్మన్ కంపెనీ జర్మన్ ప్రభుత్వ గ్రాంట్‌తో ఆ వ్యాక్సిన్‌ను రూపొందించింది. అదే బయోఎన్‌టెక్ కంపెనీ. ఆ వ్యాక్సిన్‌ను మార్కెటింగ్ చేస్తూ లాభాలు పిండుకుంటున్న ఫైజర్ కంపెనీకి దాన్ని రూపొందించడంలో ఎటువంటి పాత్రా లేదు. యాంటీవైరల్ ఔషధాలను రూపొందిండంలో కూడా ఇలాగే జరిగింది. మోల్నుపిరావర్ను రూపొందించినది ఎమొరీ యూనివర్సిటీ. చాలా యాంటీ వైరల్ ఔషధాల విషయంలో కూడా ఇదేవిధంగా జరిగింది. అలా రూపొందిన ఔషధాల పేటెంట్లను బడా ఔషధ కంపెనీలు చౌకగా కొనుక్కుని వాటి ఉత్పత్తి మీద గుత్తాధిపత్యం సంపాదిస్తాయి.
ఈ వ్యాక్సిన్లు, యాంటీవైరల్ ఔషధాలు చౌకగాను, అవసరానికి తగినంతగాను లభించడం అనేది కీలకం. ఇక్కడే ఫైజర్ కంపెనీ అమెరికన్ ప్రభుత్వ మద్దతుతో పెద్ద ఎత్తున లాభాల వేట సాగించింది. తాను ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు, ఔషధాలు కావాలంటే అడిగిన ధరను చెల్లించడమే కాకుండా ఎటువంటి కోర్టు వివాదాలు తలెత్తినా వాటి నుండి తన సంస్థను కాపాడే బాధ్యత, రక్షణ ఆ ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. పేద దేశాలు అంతంత రేట్లు చెల్లించలేవు. అంతేగాదు, కోర్టు వివాదాల నుండి రక్షణ గ్యారంటీ చేయడం కోసం ఆ దేశాల బంగారం నిల్వలను, రేవు పట్టణాలను పూచీకత్తుగా పెట్టాలని ఫైజర్ కోరుతోంది! ''యుగానికి ఒక్కమారు వచ్చిపడే అపార ధనలాభం'' అన్న శీర్షికతో ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఫైజర్ కథను ప్రచురించింది. తన గుత్తాధిపత్యాన్ని అడ్డు పెట్టుకుని ఫైజర్ ఏవిధంగా దోపిడీకి తెగబడిందో ఆ కథనంలో వివరించింది. పేద దేశాలకు అధిక ధరలకు సరఫరా చేయడానికి ముందు ఒప్పుకున్న సందర్భాలలో సైతం అంతకన్నా ఎక్కువ రేటు ఇవ్వజూపిన సంపన్న దేశాలకు వ్యాక్సిన్లను అమ్మిందో తెలిపింది.
సంపన్న దేశాలు తమ ఔషధ కంపెనీలకు మద్దతుగా నిలిచి ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించి ఉండకపోతే ఇప్పుడు ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు నుండి ప్రపంచం తేలికగా బైటపడి ఉండేది. పేటెంటు నిబంధనలను సడలించి భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి నిర్ణయించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ''వ్యాక్సిన్లను కనుగొన్నాక కూడా వాటిని ప్రజలకు అందించే చర్యలు తీసుకోకుండా 13 నెలలపాటు తాత్సారం చేసి ఈ లోపు ఆ వైరస్‌కి కొత్త లక్షణాలు పుట్టుకొచ్చినందున మళ్ళీ దిక్కుతోచని స్థితిలో ఉండడం అనేది ప్రభుత్వాల విధానాల పర్యవసానమే'' అంటున్నారు అంటువ్యాధుల నిపుణులు శ్రీనివాసమూర్తి. మళ్ళీ లాక్డౌన్లు, ఆర్థిక తిరోగమనం, ఆస్పత్రులలో అడ్మిషన్ల కోసం పరుగులు, ఐసియులు తగినన్ని లేక అవస్థలు - ఇవన్నీ మనం ఆ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా చెల్లించబోయే మూల్యం.
- స్వేచ్ఛానుసరణ
- ప్రబీర్ పురకాయస్థ