Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ ఉధతి తగ్గిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని వేగంగా పురోగమిస్తున్నదని ప్రభుత్వం, పాలకపక్ష పార్టీ తెగ ప్రచారం చేస్తున్నాయి. కోవిడ్ ఉపశమించాక ఎంతో కొంత మేరకు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనూహ్యమైనదేమీ కాదు. అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితి మీద వచ్చిన అంచనాలను పరిశీలిస్తే మనం ఇంకా కోవిడ్‌కు పూర్వ స్థితికి చేరుకోలేదని కనపడుతుంది. ఇక ప్రభుత్వం నిర్వహించిన శ్రామిక తరగతుల సర్వే (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) చూస్తే గడిచిన మూడేండ్ల కాలంలో శ్రామికులు వ్యవసాయేతర పనుల నుండి తిరిగి వెనక్కి, అంటే, వ్యవసాయ పనుల వైపు మళ్ళుతున్న ధోరణి కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలోని శ్రామికుల శాతం 2018-19లో 42.5శాతం ఉంటే 2019-20లో అది 45.6శాతానికి పెరిగింది. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో వ్యవసాయరంగం నుండి శ్రామికులు వ్యవసాయేతర రంగాల వైపు చాలా పెద్ద ఎత్తున మరలిపోతూ వచ్చారు. ప్రధానంగా భవన నిర్మాణం, వ్యాపారం, హౌటళ్ళు, కొద్ది మేరకు చిన్న ఉత్పత్తి రంగ పరిశ్రమల రంగాలలోకి వీరు ప్రవేశించారు.
నిర్మాణ రంగంలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెద్దఎత్తున రావడం, ప్రభుత్వ వ్యయం కూడా మౌలిక వసతుల కల్పనలో పెరగడం ఆ రంగంలో వృద్ధికి తోడ్పడింది. అయితే నిర్మాణ రంగంలో జోరు 2011-12 తర్వాత తగ్గిపోయింది. సరళీకరణ వలన వస్తూత్పత్తి రంగం బాగా పెరుగుతుందని, ఎగుమతులు పెరుగుతాయని ఆశించినా, ఆ విధంగా పెరుగుదల రాలేదు. చిల్లర వ్యాపార రంగమే ప్రధానంగా వ్యవసాయేతర ఉపాధికి అవకాశాలు కల్పించింది. కరోనా అనంతర కాలంలో కూడా నిర్మాణరంగం గాని, వస్తూత్పత్తి రంగం కాని, రవాణా రంగం కాని ఇంకా కోలుకోలేదు. అందుచేత ఇప్పుడు కూడా చిల్లర వ్యాపార రంగమే (రిటైల్ ట్రేడ్) వ్యవసాయేతర ఉపాధికి ప్రధాన వనరుగా ఉంది. కోవిడ్‌కు మునుపు వస్తూత్పత్తి రంగంలో దాదాపు 4కోట్ల మందికి పనులు ఉండేవి. కోవిడ్ కాలంలో, అంటే ఏప్రిల్ 2020 నాటికి కేవలం 2.1 కోట్ల మందికి మాత్రమే ఈ రంగంలో పనులు ఉన్నాయి. తిరిగి ఫిబ్రవరి 2021 నాటికి 3కోట్లకు ఈ సంఖ్య పెరిగినా, మళ్ళీ ఆగస్టు 2021 నాటికి 2.8 కోట్లకు పడిపోయింది. ఈ విధంగా అటు నిర్మాణ రంగంలో కాని, వస్తూత్పత్తి రంగంలోకాని ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోవడంతో శ్రామికులు తిరిగి వ్యవసాయ పనులవైపు మరలవలసి వస్తోంది. అందుకే వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతోంది.
అకలవరపెట్టే ఇంకొక అంశం ఏమంటే, స్వయం ఉపాధి చూసుకునేవారి సంఖ్య పెరగడం. గ్రామాల్లో 59,5 శాతం, పట్టణాల్లో 37.8శాతం, మొత్తం మీద సగటున 53.5శాతం శ్రామిక ప్రజలు స్వయం ఉపాధి చేపట్టారు. రకరకాల పనులను చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుని తమ తమ కుటుంబ సభ్యుల సహాయంతో ఆ పనులను చేపట్టేవారు చాలా మంది ఉన్నారు. వీరంతా స్వయం ఉపాధి రంగం కిందకు వస్తారు. మొదటి నుంచీ మన దేశంలో ఈ స్వయం ఉపాధి చూసుకునేవారు ఎక్కువే. అయితే ఇటీవల వీరి శాతం మరింత పెరిగింది.
ఈ విధంగా పెరగడాన్ని చూపించి ప్రభుత్వం ఆ తరగతుల ప్రజల ఆర్థిక స్వయం పోషకత్వం పెరిగిందని ప్రచారం చేసు కుంటున్నది. ఇంతకన్నా బూటకం ఇంకొకటి లేదు. వేతన శ్రామికులకు వచ్చే ఆదాయాల్లో కేవలం 54శాతం మాత్రమే ఈ స్వయం ఉపాధి శ్రామికులకు వస్తున్నట్టు శ్రామిక సర్వే వెల్లడించింది.
నిజానికి మన దేశంలో ఆర్థిక అభివృద్ధి క్షీణిస్తున్నప్పుడు ఈ స్వయం ఉపాధి శ్రామికుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అదే ఆర్థిక వృద్ధి పుంజుకుని ఉద్యోగ అవకాశాలు పెరిగితే స్వయం ఉపాధి శ్రామికుల సంఖ్య తగ్గుతుంది. కొన్ని ఇతర దేశాలలో కూడా స్వయం ఉపాధి మీద బతికేవారి సంఖ్య పెరిగింది. కాని అక్కడ అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వారు స్వయం ఉపాధి కల్పించుకోగలిగారు. తమ ఆదాయాలను కూడా గణనీయంగా పెంచుకోగలిగారు. కాని ఇక్కడ మన దేశంలో పరిస్థితి వేరు. నయా ఉదారవాద శకంలో ఆర్థికవృద్ధి వచ్చినా, దానికి తగిన మోతాదులో ఉపాధి కల్పన జరగలేదు. అందువలన ఉద్యోగాలను కోల్పోయి స్వయం ఉపాధి మీద ఆధారపడేవారు తిరిగి ఉద్యోగాలలోకి చేరే అవకాశాలు దాదాపు మృగ్యమైపోతున్నాయి.
ఇక స్వయంగా చిన్న చిన్న సంస్థలను, పరిశ్రమలను ప్రారంభించిన వారు ఈ కోవిడ్ సంక్షోభకాలంలో చితికిపోయారు. వారిలో చాలామంది తిరిగి కోలుకునే అవకాశాలు ఇప్పుడే కనిపించడంలేదు. ఒకసారి ఈ తరహా చిన్న ఉత్పత్తిదారులు సర్వమూ కోల్పోతే మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి రావడం దాదాపు అసంభవం. మరోవైపు ప్రభుత్వం వీరిని ఆదుకోడానికి ఎటువంటి సంక్షేమ పథకాలనూ చేపట్టలేదు. అందుచేత శ్రామికుల్లో అత్యధిక భాగంగా ఉన్న ఈ స్వయం ఉపాధి శ్రామికులను, చిన్న ఉత్పత్తిదారులను కార్మికోద్యమమే సంఘటితం చేసి ఉమ్మడి ఉద్యమాల వైపు నడిపించాలి. బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం లో ఈ తరగతులు కూడా ముఖ్య పాత్ర పోషించగలవు.
- సంజయ్ రాయ్