Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్జువా లక్షణాలు కలిగిన నాయకులు, వర్ణ వ్యవస్థ యథాతథంగా కొనసాగాలని ఆకాంక్షించే ప్రజా ప్రతినిధులు.. ప్రజలకు మేలు కలుగజేసే అంశాల పట్ల, నిమ్న వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించే అవకాశాల పట్ల వ్యతిరేక ధోరణే ప్రదర్శిస్తారు. వారు సహజంగానే అంబేద్కర్ ఆలోచనల పట్ల సంకుచిత భావన కలిగి ఉంటారు. అయితే.. ఇప్పుడు వీరు మన రాజ్యాంగంలోని మౌలిక అంశాల పట్ల ప్రత్యక్ష దాడికే దిగుతున్నారు. ఫాసిస్టు పోకడలు కలిగిన పాలకులు రాజ్యాంగంలోని కీలక అంశాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ లౌకికవాద భావనకు తూట్లు పొడుస్తున్నారు. నియంతృత్వమే దేశాభివృద్ధికి సరైన మార్గం అని ప్రచారం చేస్తూ సమానత్వపు భావనను తోసిపుచ్చుతున్నారు. తినే తిండి, కట్టే బట్ట, మాట్లాడే మాటలు కూడా తాము నిర్ధారించినవే అయి ఉండాలన్నట్టుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్రవేసే రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారు. నిరసనలు తెలిపేవారిపై నీటి ఫిరంగులు ప్రయోగించడం, రోడ్లకు అడ్డంగా ఇనుప కంచెలు వేసి రహదారులను మూసెయ్యడం, శాంతియుతంగా పోరాడుతున్న వారిని కార్లతో తొక్కించడం, ఎలాంటి తప్పు చేయలేదని తెలిసినా? సరైన ఆధారాలు లేకపోయినా అక్రమంగా నిర్భంధించడం, హింసించడం వంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ ఎన్నో అవకాశాలను కల్పించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపుమాపేందుకు రిజర్వేషన్లు అమలు పరుస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ హక్కుల సాధనలో ఆటంకం కలిగించినప్పుడు తగిన పరిహారం పొందే హక్కును కూడా మన రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఆర్టికల్ గురించి అంబేద్కర్ ప్రస్తావిస్తూ.. ''ఏ ఆర్టికల్ లేకుండా మన రాజ్యాంగం నిష్ప్రయోజనమగునో చెప్పమని నన్ను అడిగితే.. ఆర్టికల్ 32 తప్ప మరి ఏ ఇతర ఆర్టికల్‌ను నేను పేర్కొనను. ఇది మన రాజ్యాంగానికి ఆత్మ వంటిది. మన శరీరానికి గుండెకాయ ఎలానో, మన రాజ్యాంగానికి ఈ ఆర్టికల్ అలాంటిది'' అని అన్నారు. ప్రజలు ఎవరైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురైతే.. కోర్టును ఆశ్రయించి తన హక్కును పరిహారంగా తిరిగి పొందే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. హెబియస్ కార్పస్, మాండమస్, కోవా రెంట్, షెర్షియారీ వంటి రిట్ల రూపంలో ఉత్తర్వులను జారీ చేసి ప్రాథమిక హక్కులు సక్రమంగా అమలు జరిగేటట్లు కోర్టు చర్యలు తీసుకుంటుంది. హక్కులను కోల్పోతున్న ప్రజలు ఈ ఆర్టికల్‌ను విరివిగా ఉపయోగించుకొని తమ హక్కులను సంరక్షించుకోవాలి. అలాగే రాజ్యాంగంలోని మౌలిక అంశాలను మంటగలపడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న కుటిల నీతులను బట్టబయలు చేయాలి. భారత రాజ్యాంగ రక్షణకు ప్రతి పౌరుడు ప్రతినబూనాలి...
రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ను దేవున్ని చేసి పూజించడమో, విగ్రహాలు పెట్టి నివాళులు అర్పించడమో చేయడం అంటే ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా పయనించడమే అవుతుంది. అంబేద్కర్‌ను ఒక కులానికో, ఒక మతానికి పరిమితం చేయడం అంటే ఆయన ఆశించిన సార్వజనీన సమానత్వానికి తిలోదకాలిచ్చినట్లుగానే భావించాలి. కార్మికులు, కర్షకులు, మహిళలు, పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కన్న కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. భారతదేశ ప్రజల స్వయంపాలన కోసం రూపొందించిన రాజ్యాంగం అమలుకోసం పూనుకోవడమే ఆయనకు అందించే ఘన నివాళి. భారత దేశ ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావనను కూల్చడానికి ప్రయత్నిస్తున్న దుష్ట శక్తులను నిలువరించి ఎదురొడ్డి నిలబడటమే ప్రస్తుతం ప్రతీ పౌరుడు చేయాల్సిన ప్రాథమిక విధి.
సెల్: 9493001171
వి. అశోక్