Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది. పాలనలో పారదర్శకత పెంచి, అవినీతి నిర్మూలనకు బీజంవేసి, జవాబుదారీ తనం పెంచే ఈ చట్టం అమలులోకి వచ్చి సుమారు పదిహేడు సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం, సమాచార కమిషన్ ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగే సమాచారాన్ని ప్రభుత్వానికి తెలిపిన తరవాతనే ప్రజలకు ఇవ్వాలని అక్టోబర్13న సి.యస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ లా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం హైకోర్టు స్పందించి సర్కార్ అనుమతి తీసుకుని ప్రజలకు సమాచారం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఈ చర్య సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని ప్రభుత్వం నీరు గారుస్తుందనీ, చట్ట వ్యతిరేకంగా సి.యస్ ఎలా ఉత్తర్వులిస్తారని ప్రశ్నించింది. చివరకు సి.యస్ ఉత్తరువులు వాపసు తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది సమాచార హక్కు ఉద్యమకారుల విజయంగా చెప్పవచ్చు. ప్రభుత్వం అవినీతిలేని సమాజాన్ని నిర్మించాలనే తాపత్రయంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి అందుబాటులో ఉండాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తప్పక సమాచార బోర్డ్‌లు ఉండాలి. ప్రజలు వివిధ సమాచారం కోరుతూ అధికారులకు దరఖాస్తు చేస్తే నెల రోజుల లోపు సమాచారం ఇవ్వాలి. కానీ, ఏదొ ఒక వంకతో ధరఖాస్తుదారులకు తిప్పి పంపడం, లేదా సమాచారం లేదని చెప్పడం, సమాచారానికి ఇన్ని పేజీలు అంటూ రుసుం వసూలు చేయడం జరుగుతున్నది. కొన్ని కార్యాలయాలలో రెండు, మూడు నెలలు గడిచినా కూడా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ ఉన్నాయి. మొదటి అప్పీలుకి వెళ్లినా స్పందన లేదు. చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌కి రెండవ అప్పీల్ చేసినా ఆ కమిషన్ నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది. ఇప్పటికి లక్షలాది రెండవ అప్పీల్లు పెండింగులో ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్ర సమాచార కమిషన్ ఇంతవరకు ఒక్క జిల్లాలో కూడా పర్యటించిన దాఖలాలు లేవు. జిల్లా పాలనాధికారులు తమ జిల్లా అధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలలో సమాచార హక్కు చట్టం అమలు తీరు మీద చర్చించిన ఆనవాళ్లు కూడా లేవు. అధికారులకు ఈ చట్టం గూర్చి పూర్తి అవగాహన లేదు. కొన్ని జిల్లాలలో సమాచార హక్కు చట్టం కార్యకర్తలమీద దాడులు చేయడం, భయ భ్రాంతులకు గురిచేయడం కూడా జరుగుతోంది. దేశ వ్యాప్తంగా సమాచార చట్టం ఉద్యమకారుల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి. సమాచారం కోసం దరఖాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇవ్వకుండా ధరఖాస్తుదారులు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టిన సందర్భాలూ చూస్తున్నాం. రాష్ట్ర కమిషన్ కూడా ఇవన్నీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఇకనయినా ప్రభుత్వం, రాష్ట్ర కమిషన్ స్పందించి మన రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. ప్రజలకు చట్టం మీద శిక్షణ ఇవ్వాలి. ప్రజల పన్నులతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వ వలసిన భాధ్యత ప్రభుత్వానిదని గుర్తించాలి. సమాచార హక్కు చట్టాన్ని పకట్బందీగా అమలు చెస్తేనే పాలనలో పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వం కళ్లు తెరిచి సమాచార హక్కు చట్టాన్ని అన్ని కార్యాలయాలలో అమలు చేసి, చట్టం విలువను మరింతగా పెంచాలి.
సెల్:9848445134
కె. సతీష్‌రెడ్డి