Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశంలో ''మేజర్'' అని డిక్లేర్ చేయడానికి స్త్రీ, పురుషులకు ఓకే వయస్సు 18ఏళ్ళుగా నిర్థారించినప్పుడు, వివాహం వయస్సులో ఆడపిల్లలకు 18, మగ పిల్లలకు 21 ఏమిటి అనే ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఆడ పిల్లల వివాహ వయస్సు 21గా మార్చుడం సమంజసమే. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో మహిళల వివాహ వయస్సు 18 నుండి 21 వరుకూ పెంచే నిర్ణయం స్వాగతించే అంశమే. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు, యూనివర్సిటీలు, కుటుంబాలను అడిగి, వారి అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ బృందం మహిళల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి వివాహ వయస్సు 21సంవత్సరాలుగా సూచించింది. ఈ సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మంచిదే... 1978లో ఆనాటి పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా 'కుటుంబ నియంత్రణ' కోసం ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18గా నిర్ణయుంచారు. ఇది నేటికీ మన దేశంలో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పద్ధతి వల్ల చాలా మంది ఆడపిల్లల చదువు మధ్యలోనే అటకెక్కుతోంది. శారీరక పెరుగుదల కోణంలోనే చూస్తున్నారు తప్ప, మానసిక పరిమితికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీని మూలంగా, 20లోపే గర్భం ధరించి, పుట్టిన పిల్లలను సంరక్షణ చేసుకోలేక అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మాతా శిశు మరణాలూ సంభవిస్తున్నాయి. ఇది అత్యంత బాధాకరమైన విషయం.
నేటికీ మన దేశంలో ప్రతీ సంవత్సరం 1.5 మిలియన్ల బాల్యవివాహాలు జరుగుతున్నట్లు యునెసెఫ్ తెలియపరిచింది. ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో మూడవవంతు మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్లలు అంటే ''ఆళ్ళ'' పిల్లలే అని దురభిప్రాయం మన కుటుంబాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. అందుచేతనే పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజస్థాన్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా నేటికీ 47శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని ఐక్యరాజ్యసమితి బాలలనిధి తెలియజేస్తున్నది. చదువుకున్న వారు కూడా బాల్యవివాహాలు జరిపించడం బాధాకరమైన విషయం. మగ పిల్లలు ఎక్కువ, ఆడ పిల్లలు తక్కువ అనే భావం నేటికీ అనేక కుటుంబాల్లో కనపడుతోంది. ఈ రకమైన ఆలోచనలు మార్చుకోవాలి. ''లింగ సమానత్వం'' దిశగా ప్రయాణం చేయాలి. మత విశ్వాసాలను, మూఢ విశ్వాసాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశం నిరంతరం మహిళల వేదింపులకు నిలయంగా ఎందుకు ఉంటుందో ఆలోచన చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో గొప్పలుగా చెప్పుకొంటున్న మనం, ఈరోజున మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమి సంజాయిషీ ఇస్తాం...? ఆకలి బాధలు, ఆక్రందనలు, వివక్షత, పేదరికం, అవిద్య, అక్రమ రవాణా, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు, పరువు హత్యలు, వరకట్న వేదింపులు, వ్యభిచార కూపాలు, అవహేళనలు, గృహహింసలు, లైంగిక దోపిడీ, ర్యాగింగ్, రేప్‌లకు నిలయంగా ఉన్న ఈదేశంలో సగౌరవంగా స్త్రీ బతికేది ఎప్పుడు...? ఆలోచన చేయాలి. అందుకే ''ఒక దేశ అభివృద్ధి, ఆ దేశ మహిళా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది'' అంటారు అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. కానీ అంతమాత్రానికే దేశంలో మహిళలకు రక్షణ, భధ్రత, సమానత్వం కలుగుతుందా?. పురుషులుతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారా?. దేశాభివృద్ధికి తిరుగులేని శక్తిగా నిలబడుతారా? దిశ యాప్, షీ టీం, మహిళా పోలీస్ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, అనునిత్యం దేశంలో ఏదో ఒక చోట మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయో గుర్తెరగాలి.
ఇటీవలి కాలంలో దేశంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు, మహిళలు 1020 పైబడి నమోదు కావడం శుభ పరిణామంగా భావించాలి. భ్రూణ హత్యలు తగ్గాయి. అయితే అదే సమయంలో అఘాయిత్యాలు, గృహహింస రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో మరింత ఎక్కువయినాయి. చట్టాలు ఎన్ని ఉన్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు, వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ విషయాలపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. బాలికా విద్యను బలోపేతం చేయాలి. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. ఆరోగ్య సేవలు పథకాలు అమలు చేయాలి. ముఖ్యంగా మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. బి.యమ్.ఐ సూచీలో వెనుకబడిన వారిగా ఉంటున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా చిన్నప్పుడు తల్లిదండ్రుల ఆధీనంలో, వివాహం అనంతరం భర్త ఆధీనంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తిలేని వ్యక్తిగా మహిళ కొనసాగడం శోచినీయం. ఇటువంటి పరిస్థితుల్లో మహిళల వివాహ వయస్సు 21గా చేయటం మాత్రమే కాదు, తద్వారా కనీసం గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి, తమ కాళ్ళపై తాము నిలబడే స్థాయికి చేరి ఆర్థికంగా, సామాజికంగా, సమానత్వాన్ని సాధించేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల చదువు, ఎదుగుదలకు తోడ్పాటును అందించాలి. అంతేగానీ, కేవలం వివాహ వయస్సు పెంపు ఒక్కటే, మహిళాభివృద్ధికి భరోసా ఇవ్వలేదు అని గ్రహించాలి. ''బేటీ బచావో... బేటీ పడావో, విద్యా కానుక, కళ్యాణిలక్ష్మి, సాదీ ముబారక్, సుకన్య సమృద్ధి యోజన పథకం, బాలికా సమృద్ధి యోజన, వంటి పథకాలు కొంతమేరకు ఉపశమనం తప్ప, శాశ్వతంగా మహిళలకు రక్షణ కల్పించలేవు అనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. మహిళలకు చదువు, ఆరోగ్య సేవలు, మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. చిత్తశుద్ధితో ఇప్పటికీ పార్లమెంట్లో ''పెండింగ్‌లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లు''ను ఆమోదించాలి. పాలకులు చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలి. ''పదవిలో ఆమే, పెత్తనం పెనుమిటిది (భర్త)గా ఉండరాదు''. కాబట్టి ప్రస్తుత మహిళల వివాహ వయస్సు పెంపుదల మంచిదే కానీ, ఆమె అభివృద్ధికి ప్రభుత్వాలు, కుటుంబ సభ్యులు, సమాజం సహకరిస్తేనే, ఏ ఉద్దేశంతో ఈ చట్ట సవరణకు సిద్ధ పడుతున్నారో... ఆ ఆశయం సఫలీకృతం అవుతుంది. మహిళా సాధికారతకు సామాజిక మాధ్యమాలు కూడా వెన్నుదన్నుగా నిలవాలి...
సెల్: 9948272919
ఐ.ప్రసాదరావు