Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) శతవంసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాడు మాట్లాడుతూ.. ఉచితాల పేరుతో ప్రజాధనం వృథా చేయరాదని శెలవిచ్చారు. అభివృద్ధి అవసరాలు - సంక్షేమ బాధ్యతలకు మధ్య సమతుల్యం ఉండాలన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సరియైన రాజకీయ అవగాహన లేని, చదువుకున్న మేథావులమనుకునే కొంతమంది ఉచితాలపై కాంమెట్లు చేస్తూ, ప్రజలను బద్ధకస్తులుగా, సోమరిపోతులుగా తయారుచేసే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వాలను దుయ్యబడుతున్నారు. కానీ వీటన్నిటికీ పెట్టుబడిదారీ విధానమే కారణమనే కనీస రాజకీయ అవగాహన వీరికిలేదు. ఇందుకు ప్రత్యామ్నాయం సోషలిస్టు విధానమని తెలియదు. పెట్టుబడిదారీ విధానంలో ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరవు. ఒకవైపు పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతుంటే, సామాన్య ప్రజల పరిస్థితి నానాటికీ దిగజారిపోవటం అనివార్యం. స్వాతంత్య్రానంతరం మనదేశంలో కమ్యూనిస్టు దేశాల సహకారంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యతనీయబడి, 70వ దశకం చివరినాటికి మౌలిక రంగాల్లో స్వావలంబన సాధించబడింది. లక్షల, కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధులు లభించినవి. తదనంతరం గుత్తపెట్టుబడిదారీ అనుకూల సంస్కరణల ప్రవేశంతో, ఉత్పత్తి రంగాలయిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు బడ్జెట్లు తగ్గించి, సర్వీసురంగాలకు ప్రాధాన్యతనీయటం, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వరంగ పాత్ర తగ్గించటమే పెరుగుతున్న అన్ని అనర్థాలకు మూలం. సంస్కరణల ప్రవేశాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించగా, మిగతా పార్టీలన్నీ సమర్థించి అమలు చేస్తున్నవి. సంస్కరణల ఫలితంగా వ్యవసాయరంగం దెబ్బతినటంతో రైతుల ఆత్మహత్యలు మొదలయినాయి. గ్రామాల్లో పనులు దొరకక గ్రామీణ కూలీలు నగరాలు, పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారుతున్నారు. వృత్తులు దెబ్బతిన్నాయి. విద్య, వైద్యాల ప్రయివేటీకరణలతో లక్షలు ఖర్చుచేయాల్సి వస్తున్నది. కార్మికులకు కనీస వేతనాలు గాలికొదిలేయబడి, ఆదాయాలు తగ్గి, సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది. అన్ని రకాల శ్రమజీవులకు వారానికి కనీసం నాలుగయిదు రోజులు పనిచూపబడి, శాస్త్రీయంగా కనీస వేతనాలు అమలు పరచబడినట్లయితే ఉచితాల కోసం ఆశించవలసిన అగత్యం ఉండదు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.
ఇక రెండవ వైపు చూస్తే ధనిక పెట్టుబడిదార్లు గుత్తపెట్టుబడిదార్లుగా మారుతున్నారు. కరోనాతో దేశంలోని కష్టజీవుల బతుకులన్నీ అతలాకుతలమయితే, గుత్తపెట్టుబడిదార్ల ఆదాయం అప్రతిహతంగా పెరుగుతూ శత, సహస్త్ర, మిలియనీర్లు, బిలియనీర్లు, ట్రిలియనీర్లుగా మారుతున్నారు. ఒక్కశాతం వారి చేతిలోకి 53శాతం ఆదాయం జమ అవుతున్నది. ఇటువంటివారికే ప్రభుత్వాలు దయతలచి అనేక రాయితీలు ఇవ్వటం జరుగుతున్నది. అప్పులను రద్దుచేయటం, రాయితీలతో ఒకేసారి సెటిల్మెంట్లు చేయటం, సబ్సిడీలు ఇవ్వటం, వారి ఉత్పత్తులకు పన్నులు తగ్గించటం, ఆదాయ పన్ను శాతం తగ్గించటం లాంటి అనేక రాయితీలు ఇవ్వటం జరుగుతున్నది. వారేదయినా కంపెనీపెడతామంటే 90శాతం అప్పు ఇవ్వటం, కోట్లు ఖరీదు చేసే భూములను లక్షలకే ఇవ్వటం, సుమారు ఐదు సంవత్సరాలు పన్ను రాయితీలు ఇవ్వటం లాంటివన్నీ ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. ఈ రాయితీలు ఉచితాలు కావా ఉపరాష్ట్రపతిగారూ? ఒకసారి ఎన్నికయిన ఎమ్మెల్యే, ఎంపీలకు లక్షల్లో జీతాలు, ఉచిత ప్రయాణాలు, జీవితాంతం పింఛన్లు, నగరాల్లో కోట్లు ఖరీదు చేసే ఉచిత స్థలాలు, సబ్సిడీ క్యాంటిన్లు లాంటివి అన్నీ ఉచితాలు కావా? నేడు దేశం మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఉచిత పథకాలు, సబ్సిడీల మొత్తం రెండు లక్షల కోట్లు దాటటం లేదు. అదే లక్షల కోట్లకు అధిపతులయిన గుత్తపెట్టుబడిదార్లకిచ్చే రాయితీలు సంవత్సరానికి నాలుగులక్షల కోట్లపైమాటే. ఉపరాష్ట్రపతిగారూ.. ఇవేవీ ఉచితాలు కావా? కనీసావసరాలు కూడా తీరని సామాన్య ప్రజలకిచ్చేవే ఉచితాలా? మీరు నిజంగా దేశాభివృద్ధిని కోరుకుంటే, ఉచితాలు మంచివి కావనుకుంటే, పైనుంచి కింది వరకూ అన్ని వర్గాలవారి ఉచితాలను రద్దుచేసే ప్రయత్నాలు చేయగలరా..? గుత్తపెట్టుబడిదార్ల 53శాతం ఆదాయంలోంచి ఒక 30శాతం ఆదాయం సామాన్యులకు దక్కేటట్టు చేయగలిగితే ఎవరూ ఉచితాల కోసం అర్రులు చాచరు. ఆ విధంగా చేస్తే మీరు దేశ ప్రయోజనాలు కాపాడిన వారవుతారు. మీరన్నట్లు ప్రజాధనం వృధాకాదు.
సెల్: 9908503997
టి. మోహనరావు