Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా దోస్తు ఒక ఇంటర్వ్యూకు పోయాడు. పెద్ద ఆఫీసులో మంచి పోస్టు అది. ప్రయివేటు ఉద్యోగమైనా మంచి సంస్థ అని చాలా మంది చెప్పారని వాడు కూడా ఇంటర్వ్యూ బాగా చేస్తానని చెప్పి అలాగే చేసి ఉద్యోగం సంపాదించాడు కూడా. ఈ కరోనా కాలంలో ఇంటినుండే ఉద్యోగం కదా అది బాగా కలిసొచ్చింది వాడికి. చేసే ఉద్యోగం మాత్రం ఆఫ్ లైనే అంటే ఆఫీసుకు పోవాలి. ఇంత సోది చెప్పి అసలు ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు, వీడేం చెప్పాడు అనే కదా అందరూ చోస్తోంది. దానికే వస్తున్నా. ఇంటర్వ్యూ చేసే ఆఫీసరు నుదుటిపై బొట్టుతో మస్తు క్రమశిక్షణ కలిగిన వాడిలా కనిపించాడట మా వాడికి. ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగాడట. అదేమంటే ఈ కరోనా సమయంలో ఎం చేసేవాడివి అని. మనోడికి ఒక్కసారి మెదడు చురుగ్గా పని చేసింది. ఒక్కోసారి అంతే వాడి నాడీమండలం మొత్తం పాదరసం ప్రవహించినట్టు ఐడియాలు వస్తుంటాయి వాడికి. అంతే ఇంక ఇలాంటి చాన్సు రాదు, వచ్చినా ఎవరో ఒకరు తన్నుకు పోతారు అనుకోని ఆన్ లైన్ ఉద్యోగంతో పాటు మూడు పూటలా పూజ చేసేవాడిని సార్. అందుకే ఇప్పుడు మీ దగ్గర ఉన్నాను, ఉండగలిగాను అని మనసులో అనుకోని మున్నా భాయి సినిమాలో లాగా వినమ్రముగా కుర్చీలో ఓ పక్కకు కూచొని చెప్పాడు. అంతే, మనోడు సెలెక్ట్ అయిపోయాడు.
అసలు ఒక్క పూట కూడా పూజ చేయనోడివి మూడు పూటలా చేశానని అబద్దం ఆడడం బాగా లేదు అని మా బ్యాచిలో భక్తి గల మిత్రుడు కోప్పడ్డాడు. ఒరే నాయనా నేను మూడు పూటలా పూజ చేసిన మాట వాస్తవం, నేను చేసింది పొట్ట పూజ అని మనోడు తాను అబద్దం ఆడలేదని చెప్పుకొచ్చాడు. అందరినీ కొద్దీ సేపు ఆనందంలో ముంచేశాడు కూడా. వాడికి నౌకరీ దొరికినందుకు మేము సంబురం కూడా చేసుకున్నాం, అది వేరే సంగతి. వెయ్యి అబద్దాలు చెప్పినా సరే ఒక పెళ్లి చేయమన్నారు. అలాంటిది ఒక్క అబద్దం చెప్పి ఉద్యోగం సంపాదించడం పెద్ద తప్పు కాదని మిత్రుల బందం తేల్చేసింది. కోటి విద్యలు కూటికొరకే అని ఊరకే రాలేదు, దాని వెనుక ఎంతో రీసెర్చ్ ఉందని తెలుసుకోవాలి. ఆ లెక్కన పొట్ట పూజ కోసం దొంగ వేషాలు వేయడం, దొంగ మాటలు చెప్పడం లాంటి పనులు చెయ్యమని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. ఆదివారం హాయిగా చదూకోడానికి మాత్రమేనని గుర్తించాలి కూడా. ఇతరులను ఏడిపించడం తప్పు కానీ నలుగురినీ నవ్వించడం మంచి పనే. వారమంతా టీవీ సీరియళ్లు చూసి ఎవరి ఏడుపులు వాళ్ళు ఏడవండి కానీ ఆదివారం కాస్త నవ్వండం మంచిది.
డబ్బుంటే చాలు మన పొట్ట పూజ ఇంకోడు చేసి పోతాడు అని ఈ ప్రపంచీకరణ యుగం నేర్పిస్తోంది. తిండి పార్సిళ్లు పంపే ఒక కంపెనీ ప్రచారం చూస్తే అది బాగా తెలిసి పోతుంది. పండించేది ఎవరో, వండేది ఎవరో మనకు తెలియదు కాని తెచ్చి ఇచ్చేది మాత్రం వాడే. అందుకే వాడు ప్రచారం కూడా బాగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే వాడి పొట్ట నిండాలి కాబట్టి. అది అంత సులభంగా నిండేది కాదు కాబట్టి వాడు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. పార్సెల్ అనిదించే పనిలో ఉంటాడు ఒకబ్బాయి. తాను పోయింది పేద్ద హీరోవిన్ దగ్గరికి అని తెలియదు. సడెన్ గా ఆమె వాకిలి తీస్తుంది. పార్సెల్ ఇస్తాడు. కొద్దిగా తినిపో అని ప్లేటులో పెట్టుకొస్తుంది అదంతా షూటింగులో భాగం కాబట్టి. ఇంతలో కుర్రాడికి ఇంకో పార్సెల్ వాళ్ళు ఫోను చేస్తారు. వెంటనే వెనుకనుండి ఆకాశవాణి లాగ ప్రకటన వినిపిస్తుంది, మాకు తినడం కాదు ముఖ్యం తినే పదార్ధాలు అందించడం ముఖ్యం అని. ఆహా ఎంత మంచి పార్సెల్ కంపెనీ అని మన మనసుల్లో ముద్ర పడిపోతుంది. అసలు మన డబ్బులు ఖర్చుపెట్టించి తమ కడుపులు నింపుకొనే వారి మాయాజాలంలో ఎంత బాగా పడిపోతామో చూడండి.
ఇక పొట్ట పూజలు ఎన్ని రకములు అవి ఏవి అన్న ప్రశ్న వేసుకునే ముందు పొట్టలు ఎన్ని రకములు అని తెలుసుకోవాలి. మండలం పొట్ట, జిల్లా పొట్ట, రాష్ట్రం పొట్ట, దేశం పొట్ట, అంతర్జాతీయ పొట్ట, మల్టీ నేషనల్ అంటే బహుళ జాతి పొట్ట ఇలా ఎన్నో రకాల పొట్టలు మనం చూడొచ్చు. వాటి వాటి స్థాయిల్లో నింపుకోడానికి అంటే పొట్ట పూజలు చేయడానికి ఎన్నో రకాల టెక్నీక్కులు ఉన్నాయనీ తెలుసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచం సంపూర్ణంగా అర్థమవుతుంది. చిన చేపను పెద్ద చేప తినడం ఎంత సహజమో ఒకడి తిండిని మరొకడు నొక్కేసి, కొట్టేసి, తొక్కేసి లాక్కెళ్లి తినే వ్యవస్థలో ఉన్నాం. అందుకే పరిశీలన బాగా అవసరం. ఇంత చెప్పుకున్నాక తినడం ఒక భక్తి పారవశ్యమైనదని తెలుసుకున్నాక నైవేద్యాలు, ప్రసాదాలు ఎందుకు పెడతారో కూడా మనకు వీజీగా అర్థమవుతుంది. చేసే ఏ పూజ అయినా ఎదో ఒకటి నింపుకొవడానికే అన్నది జగమెరిగిన సత్యం. ఏ పాటు లేకున్నా సాపాటు ఉండాలని పెద్దలు చెప్పారు. అది వందకు వంద శాతం నిజం. ఆ నింపడం దేనితో అన్నది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. సమాధానం ఎవరికి వారు ఇచ్చుకోవాలి.
మనందరి పొట్టలు నింపే రైతన్నలు ఎలా ఉన్నారు అని ఒక్కసారి చూడాలి. అసలు కొందరు తినే ముందు దేవుడికి మొక్కుకుంటారు కానీ మొదట రైతన్నకు మొక్కాలి. ఆ తరువాతే ఇతరులకు మొక్కుకోవచ్చు. అలా మొక్కులు అందుకోవాల్సిన రైతన్న పరిస్థితి ఏమిటని ఒక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తాయి కానీ రైతులు పండించిన పంటకు ధరలు నిర్ణయించవు ఎందుకు అని వచ్చిన ఓ వాట్సాప్పు సందేశం చాలా మందిని ఆకట్టుకుంది. రోజూ పొట్ట పూజ చేసే జనాలు రైతన్నల బిల్లులపై కామెంట్ చేస్తూ అవి మంచివేనని, మంచి ప్రభుత్వం మంచి బిల్లులు పెట్టిందని మేధావుల్లాగ సందేశాలు పెడుతున్నారు. అవి రైతులకు నష్టం అని చెప్పేవాళ్ల, రాసే వాళ్ళ మీద భయంకరమైన పదజాలంతో తమ కుత్సిత బుద్ధి ప్రదర్శించుకునే వీలు కలిగింది అన్నట్టు రైతులకు మద్దతు ఇచ్చిన వాళ్ళను తిట్టడం చూశాం . అలా రైతన్న పెట్టె కూడు తిని రైతన్న పైన, రైతన్నకు మద్దతు ఇచ్చే వాళ్ళ పైన కసిగా పచ్చి తిట్లను తిట్టడం చూస్తే నిజంగా వీళ్ళు రైతన్న గురించి ఎప్పుడు తెలుసుకుంటారు, అలా తెలుసుకోకుండా ఉండడానికి, కళ్ళు మూసుకు పోవడానికి భావజాలాలు ఎంతగా పని చేస్తున్నాయి, వాటిని మార్చడానికి మనమేం చేయాలి అని ఆలోచన వస్తుంది. ఏమి తింటే వారికి మంచి బుద్ధి వస్తుంది అని కూడా అనిపిస్తుంది. రైతన్న పెట్టే తిండికి సార్ధకత కల్పించండి అని కూడా అనాలనిపిస్తుంది. మంచివాళ్ళు లేరా అంటే ఉన్నారు. రైతన్న పండిస్తున్న తిండిలో కొంత భాగం గోదాముల్లో పందికొక్కులు తింటున్నాయని ఆమధ్య ఓ న్యాయమూర్తి తన బాధ వ్యక్తం చేసి అలా చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు, అవన్నీ పంచి పెట్టాలన్నారు కూడా.
కాబట్టి పొట్ట పూజ రోజుకు ఎన్నిసార్లు చేస్తారో మీ ఇష్టం, ఐతే వినాయకుడి బొజ్జలా , నాయకుల బొజ్జలా పెంచడం మాని కాస్త అతనికి సహాయం చేసేలా మాట్లాడండి అని మాత్రం మిత్రులకు విన్నవిస్తున్నాను. ఆ తూరువాత వారి ఇష్టం.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298