Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాహుబలి వన్‌లో మహేంద్ర బాహుబలి తన తల్లి అభిషేకం కోసం నీళ్లు మోయడం చూడలేక శివలింగాన్ని తీసుకెళ్లి జలపాతం కింద పెట్టేస్తాడు. అలాగే కాశీ విశ్వనాథుడి చెంతకు గంగానదిని తీసుకొస్తానని ప్రధాని నరేంద్ర(బాహుబలి)మోడీ ప్రకటించారు. ఇందుకోసం వారణాసిలో మహా విశాల విశ్వనాథ ప్రాంగణం తొలిదశను మొదలెట్టారు. దీనివల్ల దర్శనానికి వచ్చే భక్తులకు కూడా అనేక రెట్లు అదనంగా అవకాశం లభిస్తుంది. ఇప్పుడు 2700 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్రాంగణాన్ని ఏకంగా ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో గృహాలు, నిర్మాణాలు మాత్రమే గాక తరతరాలుగా హిందువుల విశ్వాసాలతో ముడిపడివున్న కొన్ని కట్టడాలు కూడా అదృశ్యం కానున్నాయి. దశాబ్దాల అనుబంధాలు గల అనేకమంది శోకతప్తులవుతున్నారు కూడా. అయినా అయోధ్యలో సువిశాల రామమందిర నిర్మాణం కోసం చిన్నచిన్న రామాలయాలు కూడా నిర్మూలించి వాటి మహంతులపై దాడి చేసిన సంఘపరివార్‌కు ఇదో పెద్ద లెక్కలోది కాదు. 2019 ఎన్నికల ముందు అయోధ్య శంకుస్థాపనలోనే మోడీ యోగిలా దర్శనమిచ్చారు. మతం గురించి, ప్రాచీన భారతీయ సంస్కృతి గురించి పొడగాటి ప్రవచనం చేశారు. కేదార్నాథ్ గుహలో తపోభంగిమలోనూ కనిపించారు. ఇప్పుడు ప్రాచీన భారతీయ క్షేత్రమైన కాశీలో గంగాజలకలశంతో అపర యోగిపుంగవుడై అగుపించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్వయంగా గోరఖ్‌పూర్ మఠం యోగి అయినా ఎన్నికలలో గెలవడానికి తన ఆకర్షణ కూడా ప్రధానంగా తోడు చేయాలని మోడీ భావిస్తున్నారు. వారం వారం పర్యటిస్తున్నారు. అందుకే ఆధునికత, వారసత్వం మేళవించి ముందుకు పోవాలని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఎందరో దాడి చేసినా కాశీ తన విశిష్టత నిలబెట్టుకున్నదంటూ, ప్రతి ఔరంగజేబుకూ ఒక శివాజీ ఉంటాడని ప్రకటించారు. వీటన్నిటిలో తొంగిచూసే మత రాజకీయాలను మళ్లీ వేరుగా చెప్పనవసరం లేదు.
రాహుల్ నోట కొత్తమాట
విశేషమేమంటే సరిగ్గా అదే రోజున రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన చెల్లెలు ప్రియాంకతో కలసి ఒక మత క్రతువులో పాల్గొన్నారు. మెడలో రుద్రాక్షమాలతో సహా సకల సంప్రదాయాలంకార భూషితుడైనాడు. తర్వాత తల్లి సోనియాగాంధీ కూడా పాల్గొన్న సభలో మాట్లాడుతూ హిందూత్వ వాదం, హిందూమతం వేర్వేరని చెప్పారు. రాహుల్‌గాంధీ గతంలోనూ ఆమాట చెబుతున్నారు. ఈ దేశాన్ని హిందూత్వ వాదులు పాలిస్తున్నారనీ వాస్తవంలో హిందువులు పాలించాలని కొత్త సూత్రీకరణ చేశారు. హిందూమతం, హిందూత్వం ఒకటి కాదనేది వాస్తవమే గానీ, భిన్నమతాలతో కూడిన ఈ దేశాన్ని హిందువులు పాలించాలని ఆయన అనడం కాంగ్రెస్ వ్యూహంలో మార్పును సూచిస్తున్నదా? గతంలో సుతిమెత్తని హిందూత్వను అనుసరించే పార్టీగా పేరొందిన కాంగ్రెస్ ఇప్పుడు నేరుగా హిందూ మత రాజకీయాలు చేపట్టదలచిందా? ముస్లింలు లేదా మైనార్టీల పట్ల తను బుజ్జగింపు వైఖరి అనుసరిస్తాననే సంఫ్‌ుపరివార్ దాడికి ఇది విరుగుడు వ్యూహంగా తలపోస్తున్నదా? అవన్నీ ఎలా ఉన్నా దేశాన్ని హిందువులు పాలించాలని చెప్పడం లౌకికతత్వంతో ఎలా పొసుగుతుంది? ఆ పార్టీ నాయకత్వంలోని యూపీఏ తరపునే పదేండ్లపాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారే? ముస్లిం, సిక్కు నేతలు రాష్ట్రపతులైనారే? భారత రాజ్యాంగం వయోజన ఓటింగు హక్కు కల్పించేప్పుడు మతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పోటీ చేసే హక్కు ఉన్నవారంతా పాలించే పదవులు అధిష్టించడానికీ అర్హత కలిగివుంటారు. ఆధునిక రాజ్యాంగం మాట అటుంచి ఈ దేశంలో మొదటి మహాసామ్రాట్ అశోకుడే బౌద్ధమతావలంబన చేసి ఇతర దేశాలలోనూ వ్యాపింపచేశారే? హిందువులే పాలించాలని అనడం ఏమిటి? రాహుల్ తన వాదనను సమర్థించుకోవడం కోసం గాంధీజీ హిందువనీ, ఆయనను చంపిన గాడ్సే హిందూత్వవాది అని ఉదాహరణ ఇచ్చారు. గాడ్సేకూ గాంధీకి తేడా చెప్పడం బాగానే ఉంది గాని గాంధీజీ నేను హిందువును, ముస్లిమును, క్రైస్తవుణ్ని, యూదుణ్ని అంటూ ప్రకటించుకోవడం మర్చిపోకూడదు. ఆయన ప్రార్థనలోనే ఈశ్వర్ అల్లా తేరేనామ్ అని పాడతారు. కనుక రాహుల్‌గాంధీ బీజేపీ తప్పుడు ఆలోచనను సవరిస్తానంటూ తను మరొక వాదన తేవడం యాధృచ్చికమేనా? గతంలోనూ ఆయన గుజరాత్ ఎన్నికల సందర్బంలో వీధి మలుపు ఆలయంలో అర్చనలు చేయించడం, ఆ సమయంలో యజ్ఞోపవీత ధారిగా గోత్రానామాదులు చెప్పడం వంటిదేనా ఇది? మోడీ కాశీ కసరత్తు లాగే రాహుల్ హిందూ భాషణం కూడా యూపీ ఎన్నికల కోసమే ఉద్దేశించారా? అక్కడ వారు చిన్న పాత్రధారులు కూడా కాదే!
సావర్కార్ హిందూత్వ- బీజేపీ రాజకీయత్వ!
ఇప్పుడు మళ్లీ హిందూత్వ దగ్గరకు వస్తే హిందూమతం అదీ ఒకటి కాదు. మోడీ రెండు సార్లు విజయం సాధించేసరికి ఈ తేడా మరుగున పడిపోయి రెండూ ఒకటేనన్నట్టు మాట్లాడ్డం జరుగుతున్నది. ప్రాచీన హిందూ మత గ్రంథాల్లో గానీ, ఆధ్యాత్మిక చర్చల్లోగానీ హిందూత్వ అనే మాటే లేదు. ఒక బ్రిటిష్ అధికారి మొదటిసారి వాడినా ఎవరూ పట్టించుకోలేదు. గాడ్సే గురువైన వినాయక దామోదర సావర్కార్ మొదటిసారి 1923లో ఎవరు నిజమైన హిందువు అనే పుస్తకంలో దీన్ని వాడారు. అది కూడా తన జీవితం మలిదశలో మతతత్వం తలకెక్కించుకున్న తర్వాత. ఈ హిందూ హిందూత్వలను కలగాపులగం చేయరాదని ఆయనే హెచ్చరించారు. అంతకుముందు వివేకానందుడు, యోగి అరవిందుడు ఎవరూ ఆ పదాన్ని వాడలేదు. వైవిధ్యానికి భిన్న ఆచారాలకు నిలయం గనకే హిందూ విశ్వాసం ఇస్లాంను క్రైస్తవాన్ని ఎదుర్కొనలేకపోతున్నదని సావర్కార్ భావించారు. అందుకే హిందూత్వ అనే ఈ పదాన్ని ప్రవేశపెట్టారు. భిన్నత్వంలో ఏకత్వంగా పేరొందిన హిందూమతాన్ని ఏకరూపిగా చూపడం, తీవ్రతరహా ఇస్లాంలాగా మలచడం ఆయన ఉద్దేశం. 1909లో సావర్కార్ సిపాయిల పితూరి అన్న బ్రిటిష్ కథనానికి భిన్నంగా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం చరిత్ర రాసినప్పుడు కూడా హిందూత్వ అనే పదం వాడలేదు. ఆలస్యంగానే దాన్ని వినియోగంలోకి తెచ్చారు. తన హిందూ విశ్వాసం, సావర్కార్ వంటివారు చెప్పేది ఒకటి కాదని గాంధీజీ స్వయంగా ప్రకటించారు. జనసంఘం/బీజేపీ కూడా చాలా కాలం పాటు హిందూత్వ భావనను తీసుకోలేదు. జనసంఘం కాలంతో పోలిస్తే బీజేపీ ఆవిర్భావం భిన్నమైనదని చెప్పిన వాజ్‌పేయి అయిదేండ్లలోనే రెండూ ఒకటేనన్నారు. మరో అయిదేండ్లకు సోమనాథ్ దేవాలయం నుంచి రథయాత్ర ప్రారంభించిన అద్వానీ రామమందిర సమస్య కన్నా ముఖ్యమైంది కుహనా లౌకిక వాదంపై హిందూత్వ పోరాటమన్నారు. అయినా సరే 1991 ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ హిందూత్వ పదం వాడలేదు. 1996,1998 ప్రణాళికలనాటికి ఆ మాట వచ్చి చేరింది. ఆఖరుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ వర్మ హిందూత్వ ఒక జీవన విధానమే గాని మతం కాదని సూత్రీకరించారు. మతాన్ని మించిన మతతత్వం అని మోడీ హయాంలో గుజరాత్ నిరూపించినా మీడియా దానికి ఆమోదయోగ్యత కల్పించింది. దాంతోపాటే సావర్కార్నూ పైకి తెచ్చారు. భగత్‌సింగ్ త్యాగం కన్నా సావర్కార్ తక్కువ కాదని వాజ్‌పేయి అన్నారు. 2002 మేలో గుజరాత్లో పోర్ట్ బ్లయిర్ రేవుకు సావర్కార్ పేరు పెట్టిన సమయంలో హోంమంత్రిగా ఉన్న అద్వానీ హిందూత్వ అన్నది చాలా దుష్ప్రచారానికి గురైందని వాకృచ్చారు. రాహుల్‌గాంధీ చెబుతున్న గాడ్సే సావర్కార్ శిష్యుడు గనక బీజేపీ వాజ్‌పేయి హయాంలో గురువును పైకితెచ్చి మోడీ కాలానికి గాడ్సేనే బాహాటంగా సమర్థిస్తున్నది. గాంధీ స్థానాన్ని ఈ గురుశిష్యులకు ఇచ్చాక హిందూత్వ పవిత్రపదమైపోయింది. హిందూమతానికి బదులు ఆ మాటే వాడుకలోకి వచ్చేసింది. ఇది హిందూత్వ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడితే దేశద్రోహమన్న స్థాయికి చేరింది. బొమ్మ బొరుసులా మతతత్వం మార్కెట్ తత్వం జంట సవాళ్లుగా దాపురించాయి. కార్పొరేట్ అనుకూల విధానాలకు, అంతర్జాతీయంగా అమెరికా అనుకూలతకు కూడా బీజేపీ పరాకాష్ట గనక ఆ శక్తుల ప్రోత్సాహం వారికి లభించింది.
అవకాశవాదం హానికరం
ఇందిరాగాంధీ రాజీవ్‌గాంధీలు వివిధ మతాలను వాడుకోవడానికి చేసిన ప్రయత్నం బీజేపీ ఆరెస్సెస్‌లు ఇంతగా విస్తరించడానికి ఒక ప్రధాన కారణమని మర్చిపోరాదు. కాశ్మీర్లో ప్రభుత్వ కూల్చివేతలు, పంజాబ్‌లో సిక్కు ఉగ్రవాదానికీ, అస్సాంలో వేర్పాటు వాదానికీ ప్రోత్సాహం, షాబానూ బిల్లు, వివాదాస్పద అయోధ్యమందిరం తాళాలు తీయడం చెబుతూపోతే ఈ జాబితాకు అంతేలేదు. స్వతహాగా హిందూత్వ చాందస పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్ మార్కు అవకాశవాద వ్యూహాన్ని ఆయుధంగా మార్చుకుని అధికారంలో తిష్టవేసింది. సైద్ధాంతికంగా ఎప్పుడైనా బీజేపీ మతతత్వానికి విరుగుడు, ప్రత్యామ్నాయం లౌకిక తత్వం మాత్రమే. కాంగ్రెస్‌ది అవకాశవాదం కాగా చాలా ప్రాంతీయ పార్టీలకు ఆ సమస్యే పట్టదు. లౌకిక పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ వంటివి కూడా హిందూత్వ అనే పదాన్ని విచక్షణా రహితంగా ఉపయోగించడం మొదలు పెట్టాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞయాగాలు యాదాద్రి నిర్మాణాలు చూస్తూనేవున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తనపై పడిన క్రైస్తవ ముద్ర దృష్ట్యా మత విశ్వాసాలు మరింత బాహాటంగా ప్రదర్శించడానికి తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు నివాసంలో గోరక్షణ శాల కూడా పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో వామపక్షాలు మాత్రమే సమగ్రమైన లౌకిక ప్రజాస్వామ్య సిద్ధాంతం అందిస్తాయి. అందుకే కమ్యూనిస్టులు తన సైద్ధాంతిక శత్రువులని బీజేపీ నిరంతరం ప్రకటిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి అంతనిబద్దత ఆశించలేం గానీ, మరీ హిందువులు రాజ్యమేలాలనే స్థాయికి రాహుల్‌గాంధీ చేరడం మాత్రం కొత్త పరిణామం. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ అవకాశవాదాన్ని, ప్రత్యేకించి రాహుల్ తాజా అభిభాషణలను తీవ్రంగా విమర్శించారు. కేరళలో ఐయుఎంఎల్ మతరాజకీయాలనూ నిరసించారు. మజ్లిస్నాయకుడు అసదుద్దీన్ఒవైసీ కూడా రాహుల్ మాటలను ఖండించినా వారి మతరాజకీయం తక్కువది కాదు. రాహుల్‌కు హిందూమతం హిందూత్వ రెండూ తెలియవని బీజేపీ అపహాస్యం చేసింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అంతకంతకూ హిందూత్వ భాషణం తీవ్రం చేస్తున్న సమయంలో గ్రాండ్ ఓల్డ్‌పార్టీ- (జీవోపీ - అతిపురాతన పార్టీ)గాచెప్పబడే కాంగ్రెస్‌నేత ఇలా మాట్లాడటం విపరీతం. ఈ తరహా అవకాశవాదాలు బీజేపీకే పరోక్షంగా ఉపయోగపడతాయని పదేపదే రుజువైంది. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా ఇదే ప్రశ్నను ఎదుర్కోవలసి ఉంటుంది. తమ పార్టీపై నాయకత్వం కోసం అసమ్మతిని ఎదుర్కొంటున్న రాహుల్ ఆ సవాలును ఎలా అధిగమించాలో ఇంకా తేల్చుకోలేదు గాని ఎన్నికల బలం పెంచుకోవడానికి ఈ తరహా రాజకీయ భాషణలు పనికివస్తాయనుకుంటే పొరబాటే.
- తెలకపల్లి రవి