Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబేద్కర్ యూనివర్సిటీలో పని చేస్తున్న ఆర్థికవేత్త దీపా సిన్హా 'రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్' భాగస్వామి కూడా. తప్పుడు నిర్ణయాల ఫలితంగా ఏర్పడిన ఆకలి బాధల గురించి 'న్యూస్ క్లిక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
భారతదేశం మొత్తంగా ఆకలి ఎందుకు పెరిగింది ? అందుకు కారణాలేంటి ?
దేశంలోని భయంకరమైన ఆకలి పరిస్థితులకు, ఆహార అభద్రతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో పౌష్టికాహార లోపం పెరిగిందని, ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పిల్లల ఎదుగుదలలు మందగించాయని 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5' 2019 తెలియజేస్తోంది. కరోనా మహమ్మారి అనేక రాష్ట్రాల్లోని పరిస్థితులను దారుణంగా మార్చివేసింది. దురదష్టవశాత్తు, ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే సమాచారం మన వద్ద లేదు. కానీ మహమ్మారి సంక్షోభ పరిస్థితులను సష్టించిన తరువాత... గ్రామీణ వేతనాలను నిలిపివేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్) లాంటి సంక్షేమ పథకాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
ఓవైపు గోడౌన్లన్నీ గోధుమ, బియ్యంతో నిండిపోయి ఉంటే... ఆకలి, ఆకలి బాధలు ఏంటి ?
ఔను. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో మన ఎఫ్.సి.ఐ గోడౌన్లలో ఆహారధాన్యాల నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ధాన్యాలు అందుబాటులో లేకపోవడం సమస్య కాదు. పంపిణీదే సమస్య. ప్రభుత్వం, ఇంత పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉండి, ప్రజలను ఇంత ఆకలికి గురి చేయడం అనైతికం. ఆఖరికి కరోనా కష్ట కాలంలో కూడా ప్రభుత్వం, రేషన్ కార్డులు లేని వారికి సబ్సిడీ లేదా ఉచిత ఆహార ధాన్యాలను ఇవ్వలేదు. అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయలేదు. రేషన్ కార్డ్ జాబితాల నుండి అనేక మంది పేదలను మినహాయించారు. కేటాయింపులు ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటే, ఇప్పుడున్న రేషన్ కార్డుల జాబితాకు 10 కోట్ల మంది ప్రజలను కలపాలి.
ఈ విషయంపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని మీరెందుకు అనుకుంటున్నారు ?
మన దగ్గర 100 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యం ఎఫ్సిఐ గోదాముల్లో ఉన్నాయి. అయినా ప్రజలు ఆకలితో ఉంటున్నారు. ఇది పూర్తిగా ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణలో నెలకొన్న లోపాల కారణంగానే జరుగు తున్నది. ఒకవేళ ప్రభుత్వం ఆహార ధాన్యాలను ఒక ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రజలకు తగ్గించి అమ్మితే కూడా దానిని సబ్సిడీగా పరిగణించవచ్చు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) మొదటి దశలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపం, ఎదుగుదల, అనారోగ్యాలకు సంబంధించిన సమాచారం భయంగొల్పే విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వమేమో పిల్లల పౌష్టికాహార పథకాల్లో కోతలు విధిస్తున్నది. కాబట్టి రాష్ట్రాలు ఆ చర్యలను తీవ్రంగా ఎందుకు నిరసించకూడదు?
2015లో బడ్జెట్లో కోతలు విధించినపుడు నిరసించారు. తరువాత కొన్ని బడ్జెట్లను పునరుద్ధరించారు. ఈ పథకాలకు లక్ష్యాలుగా ఉన్న మహిళలు, పిల్లలకు వారి సమస్యలను వినిపించే గొంతులు లేకపోవడం వల్ల దురదష్టవశాత్తు ప్రభుత్వం దృష్టిలో వారికి ప్రాధాన్యత లేకుండా పోయింది.
నేడు స్థిరంగా పెరుగుతున్న నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి, ఆకలికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కనీస అవసరాలు తీర్చుకోవడంలో పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంబంధాన్ని వివరిస్తారా?
ద్రవ్యోల్బణం అంతటా పెరుగుతోంది. ముఖ్యంగా వంటకు కీలకమైన వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారతదేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువ. ఒకవేళ పని దొరికిన వారు కూడా, చాలా తక్కువ వేతనాలు పొందుతున్నారు. దానితోపాటు ప్రజలకు ఇంతకు ముందు వలె ఎక్కువ పనిదినాలున్న పని దొరకడం లేదు. ఇది ప్రజలు తీసుకొనే ఆహార నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారికి ముందు కూడా, భారతదేశ ఆహార నాణ్యత తగినంతగా లేదు. పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, జంతు మాంసం ద్వారా పొందాల్సిన మాంసకృతులు తగినంతగా అందడం లేదు.
నిరుపేద వర్గాల ప్రజలకు సబ్సిడీల ద్వారా ఆహార ధాన్యాలను సమకూర్చే 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన', 'ఆత్మ నిర్భర్ భారత్ స్కీం' లాంటి పథకాలను ప్రారంభించినట్టు ప్రభుత్వం చెపుతుంది. 2020లో 32.2 మిలియన్ టన్నులు, 2021లో 32.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మొత్తం 80 కోట్ల మంది ప్రజలకు కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆకలిని అదుపు చేయడంలో ఈ చర్యల ప్రభావం ఎంతవరకు వుంటుంది?
ఈ పథకాల ప్రయోజనాలను అందుకునే అవకాశం ఉన్న వారికి ఉపయోగమే. ఈ సంక్షేమ పథకాలకు అవతల ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి, వారు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందలేరు. కానీ అంత పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పుడు, ప్రభుత్వం ప్రజలకు చాలా చేయవచ్చు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు, ఐ.సి.డి.ఎస్ లాంటి పథకాలను... కరోనా మహమ్మారి కాలంలో కూడా అమలు చేయకుండా పిల్లల పౌష్టికాహారానికి కీలకమైన ఈ పథకాలను దూరం చేశారు.
కుటుంబాలు, ముఖ్యంగా చిన్న పిల్లలు... ఈ పరిస్థితులను ఎలాఎదుర్కొన్నారు?
అంగన్వాడీ కేంద్రాలు మూతపడడంతో వృద్ధి పర్యవేక్షణ, తీవ్రమైన పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం లాంటి రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకాల వలన పిల్లల పౌష్టికాహారంలో తీవ్రమైన దీర్ఘకాలిక చిక్కులు ఏర్పడవచ్చు. కాగితాల మీద అదనపు పౌష్టికాహారం (వండని ఆహార పదార్థాలను ఇంటికి తీసుకుని పోయే విధంగా) అందించినట్లు కనిపిస్తుంది. కానీ, కుటుంబాల ఆకలిని తీర్చడానికి వాటి సరఫరా తగినంతగా ఉండడం లేదు. అంగన్వాడీ కేంద్రాలను తెరిచి, వాటి ద్వారా సేవలందించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరువాత, ఇంతకు ముందున్న స్థితికి తిరిగి వెళ్ళడం మాత్రమే సరిపోదు. అంగన్వాడీలలో ఆహార నాణ్యత మెరుగుపరచడం, గుడ్డు, పండ్లను సమకూర్చడంతో పాటు అదనపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. అందుకే వారికి తక్షణ ఉపశమనం కలిగించడంతోపాటు, ప్రభుత్వ సేవలైన ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలి. తగిన వేతనాలతో కూడిన ఉద్యోగ కల్పన వృద్ధికి ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.