Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపకశక్తి, తరచుగా మన సమిష్టిబాధల నుండి ఉపశమనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. నోవెల్ కరోనావైరస్ మహమ్మారి ఫలితంగా, మన ప్రజలు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని, ముందు చూపుతో అవసరమైన గుణపాఠాలను తీసుకోవడం మననాయకత్వం యొక్క నైతిక బాధ్యతకావాలి. దీని నుండి తీసుకోవాల్సిన గుణపాఠం ఏమంటే ''అందరికీ ఆరోగ్య హక్కు'' అవసరాన్ని గుర్తించడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయడంగానీ, నేర్చుకో కుండా ఉండడం గానీ చేయలేము.
ఆరోగ్యాన్ని ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటించడం కోసం, రాజ్యాంగంలో అత్యవసరమైన చర్యలతో, అవసరమైన మార్పులు చేయాలని ఈ సంవత్సరం జూన్లో భారత పార్లమెంటును కోరాను. పార్టీ విధానాలకు అతీతంగా, ఈ పిలుపుకు అనుకూలంగా మద్దతు లభించింది. ప్రస్తుతం ఈ అనుకూలతను, మన దేశ ప్రజలకోసం ఆచరణలోకి తేవడానికి సమయం ఆసన్నమైంది. దీని వల్ల మన ప్రజలు గతంలో పడిన బాధలు మరెప్పుడూ పడకూడదు. భారత పౌరులకు రాజ్యాంగపరమైన ఆరోగ్య హక్కు అంటే ఏమిటి? అనే ప్రాధమికమైన ప్రశ్న ఎదురైంది. మూడు రకాల పౌరులను దష్టిలో ఉంచుకొని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. వారిలో రైతులు, అసంఘటిత కార్మికులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు.
మనం జీవించడానికి గల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగిన వారు రైతులు మాత్రమే. అయినా, అత్యధిక శాతం రైతులు, వారి హక్కులు, సంక్షేమం, కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు ఈనాటికీ వెనుక బడే ఉన్నారు. తీవ్రమైన రోగాలతో జబ్బున పడిన సమయంలో, తరాలుగా చిన్న పిల్లలు, భూమి లేని రైతులు, అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, కాలానుగుణంగా పని చేసే కార్మికులు, తమ పరిమితమైన సంపాదన నుండి వైద్య ఖర్చులు భరిస్తూ, భరింపరాని అప్పుల ఊబిలోకి, బానిసత్వంలోకి నెట్టబడ్డారు. ఉపాధి కల్పనా పధకాలు వారి దరికి చేరడంలేదు. చేరినా, అవన్నీ కాగితాలకే పరిమితమవు తున్నాయి. ''ఆరోగ్య హక్కు''ను కల్పించినట్లయితే అలాంటి ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారికి, సాధారణమైన, పార దర్శకమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలువుతుంది.
మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు, అసమానతలవల్ల, స్త్రీలు విపరీతమైన భారాన్ని భరించవలసి వస్తున్నది. వారి ఆరోగ్యం చుట్టూ అలముకొని ఉన్న నిషేధాలు, పరిమితులు, పితృస్వామిక నిబంధనలవల్ల, అధిక మించగల్గిన ఎన్నో ఇబ్బందుల నుండి కూడా బయట పడలేని స్థితిలో ఉన్నారు. దీనితో పాటు, వారికి సమాజికంగా, ఆర్థికంగా ఉన్న సవాళ్లు, స్వేచ్ఛగా తమకు లభ్యమయ్యే పరిమితమైన సంరక్షణలు పొందడంలో కూడా అవరోధం అవుతున్నాయి. ''ఆరోగ్య హక్కు'' అంటే అర్థం, ఎప్పుడైనా ఎక్కడైనా స్త్రీలకు అవసరమైనప్పుడు వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండటమే.
మనదేశంలో అత్యంత పేదలైన .అట్టడుగు వర్గాలకు చెందిన, అధిక సంఖ్యాకులైన పిల్లలు పొలాల్లో, గనులలో, ఇటుక బట్టీలలో, కర్మాగారాలలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేస్తూ పెరుగుతున్నారు. వారు, వత్తిడితో కూడిన కుటుంబ ఆర్థిక అవసరాలరీత్యా, పాఠశాలలలో నమోదు చేసుకోవడంగానీ, హాజరు కావడంగానీ, జరగడంలేదు. తరచుగా వైద్య ఖర్చులకోసం జేబులో నుండి డబ్బులు ఖర్చు చేయవలసి రావడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటున్నది.
మేము నిర్వహించే సంస్థ ద్వారా, అలాంటి బాలకార్మిక వ్యవస్థ నుండి, వెట్టి చాకిరీ నుండి, అక్రమ రవాణా నుండి లక్ష మంది పిల్లలను రక్షించాము. ఆ సమయంలో, ఈ పిల్లలు క్లిష్టమైన పనుల ప్రభావంవల్ల ప్రాధమికంగా క్షయ, చర్మ వ్యాధులు దష్టి లోపం పౌష్ఠికాహార లోపంతో పాటు, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ఈ పిల్లలకు, బాల్యపు ప్రారంభదశలో, అవసరమైన సంరక్షణలు నిరాకరించబడ్డాయి. దీనివలన ఈ సమస్యలను జీవిత కాలం వారు అనుభవించవలసి వస్తున్నది. ఆరోగ్య హక్కును కల్పించినట్లయితే, పిల్లలు దోపిడీ చేయబడే స్థాయి నుండి రక్షణతో కూడిన భవిష్యత్ వైపుగా మార్పు చెందడానికి వీలవుతుంది.
రాజ్యాంగ పరమైన ''ఆరోగ్య హక్కు'' కేవలం మన ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం తోపాటు, మన ప్రజలయొక్క సంక్షేమానికీ, అభివద్ధికర, సత్వర ఆర్థిక పురోభివద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న ఏరకమైన పెట్టుబడులైనా, భారత ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడంలో గానీ, వారు రక్షణ కవచంగా నిలువడంలో గానీ విఫలమయ్యాయి. దీనితో పాటు, ఇప్పటికే సంక్లిష్టంగాఉన్న ఆరోగ్య సంరక్షణలను, అనైతికమైన పద్దతులలో వినియోగించడం వల్ల, ప్రజలకు ఉపశమనం కలగకపోగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యానికి రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించినట్లయితే, ఆయుష్మాన్ భారత్ యొక్క లక్ష్యం బలపడుతుంది. రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కు వల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధిక పెట్టుబడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు, సుదూర భవిష్యత్తులో, ఉద్వేగపూరిత మైన, మానసికపరమైన, సామాజిక పరమైన రక్షణ విషయంలో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించగలం. ప్రపంచంలోని, చిన్న, పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవడానికి, విధాన నిర్ణయాలలో, పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడుతున్నాయి. భారత దేశం ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయకత్వానికి నిజమైన నిదర్శనం. విశ్వాసవ్యక్తీకరణతో మరింత మంచి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, సమయానుకూలంగా సానుభూతిని చూపే నాయకుని ధైర్యమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.రాజ్యాంగ సవరణ ద్వారా, భారతదేశంలో ''ఆరోగ్య హక్కును'' ప్రవేశపెట్టడం ఈ ప్రభుత్వానికి వారసత్వపు ఆస్థిగా ఉంటుంది.
(''దహిందూ'' సౌజన్యంతో)
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
- కైలాష్ సత్యార్థి
సెల్:9490300111