Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా అనంతర కాలంలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలంగా కోలుకుంటోందన్న బూటకపు ప్రకటన దేశ ఆర్థిక మంత్రి డిసెంబరు 11న చేశారు. అదేరోజు వార్తాపత్రికలు అమెరికాలో ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటోందన్న వార్తను కూడా ప్రచురించాయి. 2020 నవంబరుతో పోల్చితే 2021 నవంబరు నాటికి ద్రవ్యోల్బణం రేటు 6.8శాతం పెరిగిందని ఆ వార్త తెలియజేసింది. అమెరికాలో గత నలభై ఏండ్లలో ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఇంత ఎక్కువగా పెరిగింది లేదు. అక్కడ 1980 తర్వాత ఎప్పుడూ పెరగనంత ఎక్కువగా ఒక్క నవంబరు 2021లోనే 58శాతం మేరకు పెట్రోలు ధర పెరిగింది. కాని ఇదేమీ పట్టించుకోకుండా మన ఆర్థిక మంత్రి మన ఆర్థిక వృద్ధి గురించి ఆనందంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. నయా ఉదారవాద వ్యవస్థ ఉచ్చులో మన ఆర్థిక వ్యవస్థ చిక్కుకుని ఉన్నంతకాలం మన ఆర్థిక వృద్ధి పురోగమించే అవకాశాలకు ఈ పరిస్ధితి వలన ముప్పు తప్పదన్న సంగతి గుర్తించినట్టులేదు.
అమెరికాలో కరోనా కాలంలో ఏకంగా 2 కోట్ల 10లక్షలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారిలో అత్యధికులకు ఇంకా ఉద్యోగాలు తిరిగి రాలేదు. ఆ భారీ నిరుద్యోగం దెబ్బనుండి అమెరికా ఇంకా కోలుకోని పరిస్థితిలో ఇంత ఎక్కువగా ద్రవ్యోల్బణం ఉండటం పైకి వింతగానే కనిపిస్తుంది. ప్రజల కొనుగోలుశక్తి పెరిగిపోయి దానిని అందుకునేంతగా ఉత్పత్తి లేనందున సరుకుల ధరలు పెరిగి దాని ఫలితంగా వచ్చిన ద్రవ్యోల్బణం కాదిది. సరుకుల సరఫరాలో ఏర్పడిన తక్షణ చిక్కుముడులకు తోడు స్పెక్యులేషన్ పెరగడం, కృత్రిమంగా ధరలను పెంచడం వలన వచ్చింది. ఈ చిక్కుముడుల నుండి బైటపడడానికి కొంతకాలం పట్టవచ్చు. అందుచేత ఈ ద్రవ్యోల్బణం 2022 నడిమి దాకా కొనసాగే అవకాశాలున్నాయి. అయితే దాని ప్రభావం మనదేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే మన దేశ ప్రజల వినిమయ స్థాయి పడిపోయినందువలన ఆర్థిక వృద్ధి తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. దానికి అమెరికన్ ద్రవ్యోల్బణం తాలూకు ప్రభావం తోడై మన వృద్ధి వేగాన్ని మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
అమెరికన్ ఫెడరల రిజర్వు బోర్డు (మన దేశంలో రిజర్వుబ్యాంకు వంటిది) మార్కెట్లో నగదు లభ్యతను మరింత సరళతరం చేసే దిశగా వ్యవహరిస్తోంది. అందుకుగాను మార్కెట్కు బాండ్లను అమ్మి ధనాన్ని సేకరిస్తోంది. ఆ నగదును మార్కెట్లోకి (ఉద్ద్దీపన పథకాల రూపంలో) పంపుతోంది. దానికి తోడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్లను అతి తక్కువ స్థాయిలో, దాదాపు సున్నా వడ్డీకి అతి సమీపంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు వచ్చిన ద్రవ్యోల్బణం కారణంగా ఈ విధానాన్ని అనుకున్నంతకాలంపాటు కొనసాగించలేకపోవచ్చు. బాండ్ల కొనుగోలును తగ్గించుకుంటూ, ఇంకోవైపు రుణాలపై వడ్డీ రేట్లను కూడా పెంచక తప్పదు. ఇంతవరకూ అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందువలన తమ పెట్టుబడులపై ఎక్కువ వడ్డీ లభించే దేశాలకు అమెరికానుండి పెట్టుబడి తరలిపోతోంది. మనదేశానికి కూడా ఆ కారణంగానే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. అమెరికాతో పోల్చితే ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ. ఇలా వస్తున్న విదేశీ పెట్టుబడులతో మన విదేశీ మారక నిల్వలు పెరిగాయి. విదేశీ వ్యాపారంలో ఏర్పడే లోటును చెల్లించడానికి ఈ నిల్వలు తోడ్పడు తున్నాయి. వాస్తవంగా ఆ చెల్లింపులు పోగా, ఇంకా మన విదేశీ మారకపు నిల్వలు పెరుగుతూనేవున్నాయి.
ధరలు పెరిగితే వాటిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనేది సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సాధారణంగా చేపట్టకూడని చర్యగా పరిగణిస్తారు. అదే విధంగా సరుకుల సరఫరాను పెంచి తద్వారా ధరలను తగ్గించే ప్రయత్నాలను కూడా చేయరు. అందువలన మార్కెట్ శక్తులు (పెట్టుబడిదారీవర్గం) తమంతట తాము అదుపు చేసేవరకూ ద్రవ్యోల్బణం ఉంటుంది. వడ్డీరేట్ల పెంపు కూడా దానితోపాటు ఉంటుంది. ఈ పరిస్థితిలో భారతదేశం నుండి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్ళడం అనివార్యం. అలా వెనక్కి పోయి చివరికి మన విదేశీ మారకపు నిల్వలు హరించుకుపోయే ప్రమాదం ఉంది.
విదేశీ వ్యాపారంలో చేయవలసిన చెల్లింపులకు కావలసిన విదేశీమారకపు ద్రవ్యంలో లోటు ఏర్పడితే అప్పుడు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొందడానికి ఎక్కువ రేటును చెల్లించాల్సివస్తుంది. అంటే డాలరుతో పోల్చితే మన రూపాయి విలువ మరింత ఎక్కువగా తగ్గిపోతుంది. పైగా విదేశీ నిల్వలు తగ్గిపోతున్నా యనగానే విదేశీ మారకపు వ్యాపారంలో మన రూపాయి విలువ మరింత పడిపోతుంది. మరో విధంగా చెప్పాలంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఇండియాలో రూపాయి విలువ పడిపోతుంది.
ఆ విధంగా రూపాయి విలువ పడిపోయిన ప్రతీసారీ, మనం విదేశాలనుండి దిగుమతి చేసుకునే సరుకుల రేట్లు పెరుగుతాయి. అన్నింటికన్నా మనం దిగుమతి చేసుకునే చమురు ఉత్పత్తుల రేట్లు మరీ పెరుగుతాయి. వాటి ధరలు పెరగ్గానే ఇక్కడ దాని ప్రభావం వలన మన నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతాయి. దానివలన మన ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతుంది.
ఆ విధంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలనుండి మనవంటి మూడో ప్రపంచ దేశాలకు ద్రవ్యోల్బణం తరలివస్తుంది. గతంలో ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పెట్టుబడులు రావాలన్నా, పోవాలన్నా ఆ రాకపోకలపై ఆంక్షలు ఉండేవి. నయా ఉదారవాద శకంలో అటువంటి ఆంక్షలేవీ లేవు. అందుచేత ఇప్పుడు చాలా వేగంగా మనదేశం నుండి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోతాయి. వాస్తవానికి అమెరికాలో తలెత్తిన ద్రవ్యోల్బణపు ప్రభావం మన దేశంమీద పడనుంది అన్న అంచనాకు రావడంతోటే, ఇంకా పెట్టుబడులు ఇక్కడినుండి తరలడం మొదలవకమునుపే, విదేశీ చెల్లింపులలో లోటు ఏర్పడనుంది అన్న ముందస్తు అంచనాతో అప్పుడే రూపాయి విలువలో 16పైసలమేరకు తగ్గిపోయింది. నవంబరు నెలలో అమెరికాలో సంభవించిన ద్రవ్యోల్బణం గురించిన వార్త రాగానే జరిగిన ఈ తరుగుదల ఇటీవల కాలంతో పోల్చితే చాలా ఎక్కువ.
ఇప్పుడు విదేశీ వ్యాపారంలో వచ్చే లోటును చెల్లించడానికి కావలసిన విదేశీ మారకపు ద్రవ్యాన్ని మన దేశంలోకి ఆకర్శించాలంటే మన రూపాయి విలువను పడిపోకుండా నిలబెట్టాలంటే, మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి మన సగటు కొనుగోలుశక్తి పడిపోకుండా ఉండాలంటే, మన అధికారులు మన దేశంలో వడ్డీ రేట్లను కూడా పెంచాల్సిందే. నయా ఉదారవాద విధానాల చట్రంలోమనం ఎంచుకోగలిగిన దారి ఇదొక్కటే. అలా వడ్డీ రేట్లు పెంచితే ఇక కోవిడ్ దెబ్బనుండి మన ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడం అనేది మరింత కష్టం అవుతుంది.
మన ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా, లేకున్నా, ఈ నయాఉదారవాద విధానాలను కొనసాగించుతూ వున్నంతకాలం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఇక్కడ కూడా పెంచాల్సిందే. ఆ విధంగా పెంచడాన్ని ఎంతకాలంపాటు వాయిదా వేస్తామో అంతకాలమూ విదేశీ పెట్టుబడులు మన దేశాన్ని వదిలి తిరిగి వెనక్కి ప్రవహిస్తూనే ఉంటాయి. రూపాయి విలువ పడిపోతూనే ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. అందుచేత మన ఆర్థికవృద్ధి బ్రహ్మాండం అని ఆర్థికమంత్రి ప్రదర్శిస్తున్న డాబు నిరాధారమైనది. మొదటి కారణం: ప్రజల కొనుగోలుశక్తి కొరవడినందున వారి వినిమయం తగ్గిపోతోంది. రెండవది: అమెరికాలో తలెత్తిన ద్రవ్యోల్బణం కారణంగా మన ఆర్థిక వ్యవస్థపై వచ్చే బాహ్య వత్తిడులు మన ద్రవ్య విధానాన్ని మరిన్ని ఆంక్షలపాలు చేస్తాయి.
ఒక నయాఉదారవాద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా పని చేస్తుందో ప్రస్తుత పరిస్థితి మనముందు స్పష్టంగా చూపిస్తోంది. నయా ఉదారవాద విధానాలకు పూర్వం ఉన్న వ్యవస్థలో, అంటే ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ అమలు అవుతూవచ్చిన కాలంలో, అమెరికాలో ఏర్పడే ద్రవ్యోల్బణం కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ప్రత్యేమైన ఇబ్బంది ఏదీ ఉండేది కాదు. మహా అయితే, అమెరికాలో ధరలు పెరిగినందువలన, మన దేశం నుండి అక్కడికి ఎగుమతి చేసే సరుకులమీద పరిమితులు ఆ దేశం విధించివుండేది. దానివలన వచ్చే ఇబ్బందులను తట్టుకోడానికి మన దేశం బైటనుండి చేసుకునే దిగుమతులపై కొన్ని పరిమితులను అదనంగా విధించివుండేది. అటు ఎగుమతులు తగ్గినమేరకు ఇటు దిగుమతులు కూడా తగ్గివుండేవి. ఈ తగ్గుదల కారణంగా తగ్గిపోయే ఆర్థిక కార్యకలాపాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచివుండేది.
ప్రభుత్వ నియంత్రణ ఉన్న ఆర్ధిక వ్యవస్థలో ప్రతీ ప్రభుత్వమూ తన ఆర్థిక వ్యవస్థను బాహ్య వత్తిడులనుండి కాపాడుకోగలిగిన శక్తి కలిగివుండేది. సంపన్న దేశాలలో సంభవించే ద్రవ్యోల్బణం నుంచి గాని, మాంద్యం నుంచి గాని తన వ్యవస్థను కాపాడుకుంటూ ఆ దుర్లక్షణాలు తన దేశ తీరాలను తాకకుండా చూసుకోగలిగిన శక్తి మూడవ ప్రపంచ దేశాలకు ఉండేది.
కాని, నయా ఉదారవాద వ్యవస్థలో ద్రవ్య పెట్టుబడి దేశాల ఎల్లలను దాటి యధేచ్ఛగా రాకపోకలను సాగించగలుగుతుంది. దిగుమతులపై ఆంక్షలను విధించడాన్ని నయా ఉదారవాదం ఒప్పుకోదు. కన్నెర్ర చేస్తుంది. ఆ కారణంగా ప్రతీ దేశమూ అంతకుముందున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తిని, తన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రభావాలనుండి కాపాడుకునే శక్తిని కోల్పోతుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సంభవించే ప్రతీ మార్పూ మూడవ ప్రపంచ దేశాలపై బలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. దాని వలన ఆ యా ప్రభుత్వాలకు ఇష్టం ఉన్నా, లేకున్నా, అనివార్యంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలను అవి తీసుకోవలసివస్తుంది.
ఈ వత్తిడి చాలా అసాధారణమైన వేగంతో కలుగుతుంది. ద్రవ్య పెట్టుబడి స్వేచ్ఛగా సంచరించగలడం, దానితోబాటు వస్తువులు, సేవలు కూడా దేశాల ఎల్లలను అధిగమించి సంచరించగలడం వలన ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి దుర్లక్షణాలు కూడా వాటితోబాటు చాలా వేగంగా వ్యాపిస్తాయి. అందుచేత ఇండియా వంటి దేశాలలో ఇక్కడ అంతర్గతంగా ఉన్న కారణాల వల్లనే గాక, అమెరికా వంటి సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో జరిగే పరిణామాలవలన కూడా నిరుద్యోగం అదనంగా మరింతగా పెరుగుతుంది. నయా ఉదారవాద విధానాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలను రానున్న కాలంలో మరిన్ని కష్టాలలోకి నెట్టబోతున్నది.
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్