Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిట్లర్ నరమేధానికి జాతి విద్వేషం ప్రధాన కారణం. ఇది నేటి భారతంలో కూడా దాపురించింది. కోటలు, యుద్ధభూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ, మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణహౌమాల ప్రదేశాలు చీకటి పర్యాటకానికి గమ్యస్థానాలు. ఒక స్థల యాత్రికుల సందర్శన ఆ కారణాలను అధ్యయనం చేయాలి.
ఆనందవినోదాలకో, వ్యాపారాభివృద్ధికో చేసే యాత్రలే పర్యాటకం. యాత్రికుల ఆకర్షణ, వసతి, వినోదం, వ్యాపారం పర్యాటకంలో భాగం. స్వదేశీ పర్యటనలతో ప్రాంతీయ సంస్థలకు లాభం. అంతర్జాతీయ పర్యాటకం చెల్లింపు సంతులన చిక్కులతో విదేశీ మారక ద్రవ్య నిలువలపై ప్రభావం చూపుతుంది. దుఃఖమరణాలతో చారిత్రక సంబంధాలున్న ప్రదేశాల యాత్రలు చీకటి పర్యాటకం. దీన్ని అనారోగ్య, నల్ల, థానా, విచార పర్యటనలు అని కూడా అంటారు. స్థల ప్రభావ ప్రత్యేక లక్షణాలే యాత్రికులను చీకటి పర్యాటకానికి పురిగొల్పవు. అక్కడి నరమేధాలు, బాధల సంఘటనలతో ఆ స్థలానికి ఉన్న సంబంధాల కంటే ఆ స్థలాల చారిత్రక ప్రాముఖ్యత ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఆసక్తికర రహస్య కుట్రలు తెలుస్తాయని చాలామంది చీకటి ప్రదేశాలకు వెళతారు. కొందరు అవి భయం, బలహీనతల అనాలోచిత సంఘటనల స్థలాలని భావిస్తారు. కొందరు ఆ స్థలాలకు ప్రగాఢ తాత్వికతలను జోడిస్తారు. కొందరు చీకటి పర్యాటకాన్ని గౌరవచర్యగా చూస్తారు. కొందరు అనైతికమంటారు. 16వ శతాబ్దంలో లండన్ బహిరంగ ఉరిశిక్షలను ప్రజలు ఆసక్తిగా చూశారు. 1815లో నెదర్లాండ్-నెపోలియన్ మధ్య బెల్జియంలో వాటర్లూ యుద్ధాన్ని ప్రజలు బండ్లపై నుండి తిలకించేవారు. మృత్యు చర్యలను చూడటం ప్రజల చిరకాల సంప్రదాయ అలవాటు. ఇటీవల ఈ అలవాటును సైద్ధాంతికంగా అధ్యయనం చేశారు. అమెరికా పాత్రికేయ రాజకీయ వ్యంగ్యవాది, పాట్రిక్ జేక్ ఓరూర్కె 1988లో తన వార్సా, మనాగువ, బెల్ఫాస్ట్ యాత్రను 'నరకంలో సెలవు'గా వర్ణించారు. లండన్ సిటి వర్సిటి సామాజికశాస్త్రాల ఆచార్యుడు క్రిస్ రోజేక్ 1993లో 'నల్లమచ్చ పర్యాటకం' అన్నారు. స్కాట్లండ్ గ్లాస్గోలో ఈ అంశంపై మొదటి విద్యా అధ్యయనం జరిగింది. 1996లో గ్లాస్గో కాలెడోనియన్ వర్సిటి 'ఆథిత్యం, పర్యటన, విరామ సమయ నిర్వహణ' విభాగ అధ్యాపకవర్గ సభ్యులు జాన్ లెనన్, మాల్కోల్మ్ ఫోలేలు చీకటి పర్యాటక పదకల్పన చేశారు. 1996లోనే గ్లాస్గో స్ట్రాత్కైడ్ వర్సిటి పర్యాటక మార్కెటింగ్ ఆచార్యుడు ఎవి సీటన్ థానా పర్యాటక పదం వాడారు. 2014 నాటికి ఈ అంశంపై అనేక అధ్యయనాలు జరిగాయి. పర్యాటకాల నిర్వచనలు, వివరణలు విద్యారంగం, బాహ్య ప్రపంచం, పర్యాటక సాహిత్యాలలో ప్రచారంలోకి వచ్చాయి. చీకటి పర్యాటకం మీద అనుభవాధార పరిశోధనలు తక్కువ జరిగాయి.
ఈ రోజు 112 దేశాల్లో 900 చీకటి పర్యాటక స్థలాలున్నాయి. వీటిలో సాధు జంతువులను చంపిన దృశ్యాల ప్రదర్శనశాల రోమ్ కొలోజియం, మత మారణహౌమాల్లో తలలు తెగిన శవాల శ్మశానాలు కాటకూంబ్స్ ఉన్నాయి. బ్రిటన్‌లో లండన్ టవర్, ఎడింబర్ కోట లాంటి అమానవీయ ఘటనా స్థలాలను వారసత్వ కేంద్రాలు చేశారు. పలువురిని బాధితులుగా మార్చిన బెర్లిన్ గోడ ప్రత్యేక ఆకర్షణ స్థలంగా ఉండేది. నేడు కూలిన గోడ పర్యాటక స్థలం. 1688 రక్తరహిత విప్లవంలో రెండవ జేమ్స్‌ను గద్దెదింపారు. ఆయన సమర్థకులను జాకొబైట్స్ అంటారు. 1746 ఏప్రిల్ 16న బ్రిటిష్ సైన్యం జాకొబైట్స్ను ఓడించింది. ఈ కులోడెన్ యుద్ధ స్థలం చీకటి పర్యాటక ప్రదేశం. రొమేనియా జాతీయ స్మారకచిహ్నం బ్రాన్ కోట, పొయెనరి శిధిల కోట, వేల్స్లో బ్యూమరీస్ గావోల్ జైలు, లండన్ చెరసాలలో ఘోర హంతకుడు జాక్ రిప్పన్ ప్రదర్శనశాల, జపాన్ హిరోషిమా శాంతి స్మారకవనం, ఉక్రెయిన్ అణుప్రమాద చెర్నోబిల్, గ్రౌండ్ జీరో (న్యూ యార్క్‌లో 2011 సెప్టెంబర్ 11న ప్రేలుడుకు గురైన ప్రపంచ వాణిజ్య కేంద్రం పాత పేరు), ఆస్చ్విట్జ్ కేంద్రీకరణ శిభిరం (రెండవ ప్రపంచ యుద్ధ నరమేధంలో ఆక్రమిత పోలండ్‌లో నాజీలు నడిపిన 40 వినాశక నిర్మూలన, కేంద్రీకరణ భవన సముదాయం), చైనా పాత రాజధాని నాంజింగ్లో 1937 డిసెంబర్ 13న సామ్రాజ్యవాద జపాన్ సైన్య నరమేధ నాంజింగ్ స్మారక మందిరం, తుయోల్ స్లెంగ్ నరమేధ ప్రదర్శనశాల (కాంబోడియా రాజధాని నాంపెన్ మారణ హౌమంలో 17లక్షల పౌరులను, 17వేల ఖైదీలను చంపారు. జైలుగా మారిన పాఠశాల తుయోల్ స్లెంగ్), దక్షిణ కొరియా జెజు తిరుగుబాటు స్థలాలు (కొరియా విభజనకు వ్యతిరేకంగా జెజు ద్వీపవాసులు 1947 నుండి సమ్మెచేశారు. 1948-49 మధ్య జెజు తిరుగుబాటు జరిగింది), కెనడా క్యూబెక్ రాష్ట్రంలో లా ఫర్మ్ వద్ద స్పిరిట్ సరస్సు నిర్బంధ కేంద్రం, వాషింగ్టన్ హౌలొకాస్ట్ మెమోరియల్ మ్యూజియం, కెనెడీ హత్యాస్థలం జెట్టిస్బర్గ్, అమెరికా అణుపరీక్షాస్థలం బికిని అటాల్, 1936-39 మధ్య అంతర్యుద్ధం జరిగిన స్పెయిన్‌లోని బాల్చైట్, ఐర్లండ్ లీప్ కోట, అలంకరణకు 50వేల కళేబరాలు వాడిన చెచియా, సెడ్లాక్ ఒసువరి క్యాథలిక్ చర్చి, ఇటలీ పాంపోయి శిధిలాలు ప్రపంచ ప్రసిద్ధ చీకటి పర్యాటక ప్రదేశాలు. 1982లో ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ పై దండెత్తింది. తీవ్రవాద బృందం హెజ్బుల్లా ప్రతిఘటించింది. వేల పాలస్తీనియన్ పౌరులు చనిపోయారు. లక్షలమంది దేశం వదిలివెళ్లారు. 2010లో హెజ్బుల్లా సైనికస్థావరం మ్లీట్లో స్మారకచిహ్నం నిర్మించారు. చైనా సిచువాన్ రాష్ట్రంలో 12.05.2008 నాటి భూకంపంలో 5,300 పిల్లలతో సహా 90 వేల మంది చనిపోయారు. 2009లో యింగ్సివు పట్టణంలో స్మారక భవనం కట్టారు. 1994 ఏప్రిల్-జులైలలో తుత్సి మైనారిటీల నిర్మూలనకు రవాండా హుతు మెజారిటీలు 8లక్షల మందిని చంపారు. 2.5లక్షల స్త్రీలను మానభంగం చేశారు. హతుల ఎముకలు, పుర్రెలతో రవాండాలో నరమేధ స్మారకం నిర్మించారు. ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధంచేసి అమెరికా తన బానిస ప్రభుత్వాలను స్థాపించింది. ఇరాన్, సిరియాలపై భౌతిక, ఆర్థిక యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇవి నేటి చీకటి పర్యటన స్థలాలు.
1919 ఏప్రిల్ 13న అమృత్సర్ జలియా వాలాబాగ్‌లో బ్రిటిష్ పాలకులు స్త్రీ శిశువులతో సహా నిరాయుధులైన వేలమందిని కాల్చి చంపారు. నల్లజాతీయుల పాలనలో నేడు జరుగుతున్న పోలీసు దౌర్జన్యాలను ఇది గుర్తుకుతెస్తుంది. అండమాన్ నికోబార్ ద్వీపాలలో కాలాపానీ జైలులో ఆంగ్లేయులు భారత స్వాతంత్య్ర పోరాట యోధులను బంధించేవారు. వారిని రాజకీయంగా, సామాజికంగా దేశం నుండి వెలేసేవారు. సావర్కర్ భీరత్వానికి ఈ జైలు సాక్ష్యం. గాంధీని సంఫ్‌ు సభ్యుడు, హిందుమహాసభ నాయకుడు, బ్రాహ్మణుడు గాడ్సె క్రూరంగా చంపిన స్థలం ఢిల్లీ గాంధీ స్మృతి. హిందుత్వ ముస్లిం ద్వేష ప్రతీక. 1984 డిసెంబర్ 3న భోపాల్ విషవాయు దుర్ఘటనలో అధికార లెక్కల ప్రకారం 3,787 మంది చనిపోయారు. 5 లక్షల మంది రోగాల పాలయ్యారు. 850 నాటిదిగా భావిస్తున్న ఉత్తరాఖండ్ రూపకుంద్ అస్థిపంజరాల సరస్సులో 1942లో అసంఖ్యాక మానవ కళేబరాలు తేలాయి. నేటి భారతంలో తమ అధికార మూలాల చీకటి పర్యాటక కేంద్రాల నిర్మాతలు మోడీ, షాలు. గుజరాత్లో గోధ్రా, అహ్మదాబాద్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర హిందూత్వ ప్రయోగశాలలు. అయోధ్యలో కూల్చిన మసీదు ప్రాంతం, అక్కడ కట్టబోయే రామ మందిర్, అయోధ్య మసీదు కూల్చివేత తర్వాతి అల్లర్ల ముంబయి, మేధావుల అరెస్టులకు కారణమైన భీమాకోరేగావ్, ప్రగతిశీల విద్యార్థుల అణచివేత కేంద్రాలైన యునివర్సిటీలు, పౌరసత్వ ఉద్యమంతో ముస్లింల, వామపక్ష, ప్రగతిశీలభావాల నాయకుల అరెస్టుకు, అక్రమ కేసులకు కారణమైన దిల్లీ షాహీన్ బాగ్, దళిత హత్యలు జరిగిన చుండూరు, కారంచేడు చీకటి పర్యాటక ప్రదేశాలే. ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది లక్షలాది యాత్రికులు క్రూరత్వం, ప్రమాదాల, ప్రకృతి/మానవ విపత్తుల, అపకీర్తిహత్యల స్థలాలను సందర్శిస్తున్నారు. చరిత్రలో చీకటి కోణాల సమాచారం నేటి ప్రపంచ అధోగతికి కారణాలు తెలుపుతుంది. పరిష్కారాల ఆవిష్కరణతో మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడుతుంది.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545