Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపథ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్థి గాబ్రియెల్ బోరిక్ ఘనవిజయం సాధించాడు. నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్ సోషల్ ఫ్రంట్ అభ్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ 27.92శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉండగా బోరిక్ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19న పోటీ జరిగింది. బోరిక్ 55.87శాతం, కాస్ట్ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్థి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్ ఒకడు. 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ వడిలో ప్రవేశిస్తాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం- లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్ పినోచెట్ తరువాత పగ్గాలు చేపట్టి నయా ఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు. 1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో వామపక్షాల తరుపున గాబ్రియెల్ బోరిక్ విజయం సాధించాడు.
నయా ఉదారవాద విధానాలు లాటిన్ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్థిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే- సమర్థించే శక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది. గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్థలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్థిగా కమూనిస్టు డేనియల్ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్ నేతగా ఉన్న కన్వర్జన్స్ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ''మర్యాదకు మన్నన'' అనే అర్థం ఉన్న అప్రూవ్ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్థిగా బోరిక్ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.
సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్థానంలో వచ్చిన బోరిక్ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు. ఈ క్రమంలో బోరిక్ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్ధతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు. అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది. 1973లో సాల్వెడోర్ అలెండీ మీద అమెరికా సీఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్లో 155 స్థానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్థానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్న ఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్థానాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవాద విధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.
తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్థితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూ ఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్థానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్ తిప్పి కొడుతూ ప్రత్యర్థుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.
చిలీ ఆర్థిక స్థితి సజావుగా లేదు. బోరిక్ విజయవార్తతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్, తదితర కారణాలతో లాటిన్ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్ ఆర్థిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని బోరిక్ చెప్పాడు. పెన్షన్ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకే ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి. 2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది. అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్ బోరిక్ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి. ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు. తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్ ముందుకు పోవాలని యావత్ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288