Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితి ఉచిత విద్య, వైద్యం ప్రాముఖ్యతను తెలియజేసిన సందర్భంలో నేడున్నాం. ఈ అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించడానికి బదులు పూర్తి విరుద్ధంగా వ్యవరించడలో విద్యపై ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టం అవుతున్నది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12.5లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దీంట్లో ప్రతి ఏటా 7.5లక్షల మంది రెన్యువల్ చేసుకోగా ఐదులక్షల మంది కొత్తగా అప్లయి చేసుకుంటున్నారు. గత రెండేండ్లుగా విద్యార్థులకు రావాల్సిన 3.816 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించడం లేదు. దీనితో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించండంటూ పట్టుపడుతున్నాయి. ఒకవైపు కరోనా ప్రభావంతో ఉపాధి కరువై బతుకీడుస్తున్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలుద్దామని విద్యార్థులు చిన్న చిన్న ప్రయివేటు జాబ్స్‌కి ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అర్హతలో భాగంగా సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. దానితో సర్టిఫికెట్స్ కోసం కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు చుక్కెదురవుతున్నది. ఫలితంగా తల్లిదండ్రులను అడగలేక యాజమాన్యలు అడిగే ఫిజులు చెల్లించలేక రీయంబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్‌పై ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అది ఇంకొంచం ముందుకెళ్లి ఆత్మహత్యల దిశగా ప్రయాణిస్తున్నది.
ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థి లోకం ఇంకో కొత్త, వింత సమస్యను ఎదుర్కొంటున్నది. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించి కన్వీనర్ కోటాలో సీట్ సాధించినా కూడా గవర్నమెంట్ చెల్లించే ఫీజు రీయంబర్స్మెంట్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలీదు. కాబట్టి మీరు ముందే ఫిజు చెల్లించండి అంటూ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అంటున్నాయి. దోస్త్ ద్వారా భర్తీ అయిన విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనితో విద్యార్థులు క్రమంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంటున్నది. మరోవైపు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఎప్పుడో 2008 నాటి మెస్ ఛార్జీలు తప్ప పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల పెంపులేదు. ఫలితంగా నీళ్ల చారు, పప్పులతో అర్థాకలితో నెట్టుకొస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సంక్షేమ హాస్టల్ ఉండాలంటూ నిబంధనలున్నా స్వంత భవనలులేని కారణంగా ఏటేటా హాస్టల్ ప్రాంతం మారుతున్నది. దీనితో విద్యార్థుల కళాశాలలకు హాస్టల్‌కి దూరం పెరుగుతున్నది. రెండు బస్‌లు మారితే తప్ప హాస్టల్‌కు చేరుకోలేని స్థితి. దీంతో ప్రయాణ అలసట తప్ప చదువుకునే తీరిక ఉండడంలేదు. దోస్త్ ద్వారా డిగ్రీ విద్యకోసం వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్‌కి వస్తున్నా పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా ఒక్క హాస్టల్ సంఖ్య పెరగలేదు. విద్యార్థులతో కిక్కిరిసిన రూమ్స్ తప్ప రీడింగ్ హల్, మెస్ హాల్ ఉండదు. అరకొర వసతులతో అస్తవ్యస్తంగా సంక్షేమ హాస్టల్స్ కొనసాగుతున్నాయి. ఇంకో వైపు పాఠశాల స్థాయిలోను అదే హీనస్థితి.
బాలికలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇంకా చాప మీద, చెట్ల కిందనే తరగతి గదుల నిర్వహణ. పూర్తిగా రాని పుస్తకాలు, సరిగ్గా లేని బ్లాక్ బోర్డ్, చాక్ పీస్‌లు, వేధించే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్‌ల కొరత. దీంట్లోనే రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేసే కుట్ర జరుగుతున్నది. మూఢనమ్మకాల కోసం సెక్రటేరియట్‌ను కూల్చి, యాదాద్రి కోసం కోట్ల రూపాయల కుమ్మరిస్తూ, జనాభా ఆధారంగా మద్యం షాప్స్ను పెంచే ప్రభుత్వం విద్యారంగానికి మాత్రం నిధులు ఇవ్వడం లేదు. ఏటేటా న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల టార్గెట్స్ పెంచుకునే సర్కార్‌కు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్స్, పాఠశాలలను పెంచుకోవాలనే సోయిలేకపోవడం దౌర్భాగ్యం. తక్షణమే పెండింగ్ ఫిజు రీయంబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ విడుదలచేెయాలి. సంక్షేమ హాస్టల్, పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలి. మూడు పూటలా పౌష్టికాహారం అందించాలి. ప్రతీ సంక్షేమ హాస్టల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి.
- గడ్డం శ్యామ్
సెల్:9908415381